Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
తనకి అవ్యక్తంగా ఆదర్శంగా ఉంటూన్న చౌదరి ఇలాంటివాడని తెలియగానే తనమీద తనకే రోతపుట్టింది వీరయ్యకి. ఏమైనా బాబు చెప్పినట్టే చేసి యీ గండం దాటాలని సంకల్పించుకున్నాడు. బాబుకి అలాగే చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. బాబు భోంచేసి వెళ్ళమన్నా ఆగలేదు. సత్తెమ్మ వండిన కూడు తినకూడ దనుకున్నాడు. ఎండలోనే బయలుదేరి సాయంత్రానికల్లా తన పల్లె చేరుకున్నాడు వీరయ్య. చీకటి పడుతూ పడుతూ వుంది. గుడిసెముందు నూకయ్య కూర్చుని ఏడుస్తున్నాడు. అలసటతో వున్న వీరన్న కోపంతో అడిగాడు. "ఎందుకురా యేడుత్తావ్? ఎవరు సచ్చినార్రా?
"సౌదరీ ఆళ్ళూ ఒచ్చి సేవలు తీసుకుపోనారు" అన్నాడు నూకయ్య ఏడుస్తూనే.
వీరాకి గుండె ఆగినట్టయింది. మూడురోజుల నుంచి పట్టిన చేపలు జాగ్రత్తచేసి వుంచారు. రేపే వర్తకులు వస్తారు. మూడురోజులు తిండైనా తినకుండా ఎండలో సముద్రంలో వెతికి వెతికి పట్టారు. చాలా ఖరీదుచేసే చేపలు. వీరా రక్తం వేడెక్కింది. కళ్ళ చివర ఎర్రజీర నాట్యమాడింది. "ఇదేంటో తేల్చుకుని వత్తానుండు" అంటూ గుడిసెలోకి అడుగు పెట్టకుండానే వెనక్కి తిరిగాడు.
"ఓ అప్పీ కల్లోత్తావా?" అన్నాడు వీరయ్య.
అప్పలమ్మ తెల్లబోయింది. కాని నవ్వుతూ ముంత తీసుకువచ్చి ఇచ్చింది. సగంతాగి వికారపెట్టి ముంత నేలకేసి కొట్టాడు వీరయ్య..... "పో యెదవముండా -యెదవ కల్లూ నువ్వూ" అంటూ చరచరా వెళ్ళిపోయాడు. బలిష్టమైన అతని వొళ్ళు వణకడం చూసి ఏదో ఉపద్రవం రాబోతోందని గ్రహించి నవ్వింది ముసలమ్మ.
తుమ్మచేలు దాటగానే చౌదరీ, వెనకాల గుమాస్తా కనపడ్డారు. వీరయ్య ఒక తుమ్మకర్ర విరిచాడు. వెనకాలే వెళ్ళి "నా చేపలు తీసుకుపోయావురా దొంగనాకొడకా" అంటూ చౌదరి తలమీద కొట్టాడు 'అమ్మో' అంటూ చౌదరి నేలమీద కొరిగాడు. 'చచ్చిపోయాడు మునసబు' అంటూ పేరిశాస్త్రి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు.
వీరయ్య పరుగెత్తుకొని అప్పలమ్మ ఇంటికి వచ్చాడు. "అప్పీ -సౌదరిని తల పగలకొట్టా" అంటూ చతికిలబడ్డాడు. భయ విహ్వలతతో "ఇప్పుడేంటి సెయ్యడం" అన్నాడు ఆయాసపడుతూ.
"నీకే భయంలేదు నేనున్నానుగా ఇటురా" అంటూ అప్పలమ్మ ఏమాత్రం కంగారు పడకుండా ఒకమూల గదిలోకి తీసుకువెళ్ళింది. వీరయ్యని. వీరయ్య వణికిపోతున్నాడు "పోలీసులొత్తారేమో అప్పీ" అని వెర్రిగా చూస్తున్నాడు.
"నేను సూత్తానంటినిగా. భయపడమాకు. ఈ సుక్కతాగి పడుకో. బలం వస్తుంది"
అప్పి తలుపు గొళ్ళెం పెట్టి ఇవతలికి వచ్చింది. ముంత ఖాళీచేసి వీరయ్య క్రమంగా మైకంలోనికి, నిద్రలోనికి జారిపోయాడు. అప్పలమ్మ ఓ గంట పోయాక గదిలోకి వచ్చింది. వీరా మొల తడిమి కట్టువిప్పి నోట్లకట్టని సంగ్రహించి మళ్ళీ తలుపు గొళ్ళెంపెట్టి తిన్నగా చౌదరి ఇంటికి బయల్దేరి వెళ్ళింది.
చౌదరి పడుకుని ఉన్నాడు. తలమీద కట్టువుంది. "ఏంటి జరిగింది చౌదరీ" అంది నిజంగా ప్రమాదం ఏమీలేదు. కర్ర దూసుకుపోయి భుజానికి తగిలింది. తలమీద పక్కగా చర్మంలేచింది. భుజం మాత్రం నొప్పిగా ఉంది.
"పోలీసుల్ని పిలిపించి వాణ్ణి చతకతన్నిస్తాను. పదేళ్ళు శిక్ష పడేటట్టు చూడకపోతే నా పేరు చౌదరి కాదు" అన్నాడు చౌదరి.
ఉద్రేకాలవలనకన్న తెలివివల్ల లాభం ఎక్కువవుతుందని అప్పలమ్మ చౌదరికి బోధించింది. ఏ సమస్యలోనుంచైనా డబ్బుని ఉత్పన్నం చేయడం. ప్రయోజకుల లక్షణం. పోలీసు కేసువల్ల మరికాస్త డబ్బు ఖర్చవుతుంది. అంతకన్న ఓ వందరూపాయలు నష్టపరిహారం తీసుకుంటే? వీరయ్యా లొంగిపడి ఉంటాడు. ధనలాభమూ ఉంటుంది. "పాతికో పరకో నీకు తోచింది నాకు ముట్టచెప్పు,నాకేం ఆశలేదు" అంది అప్పలమ్మ - తన నిస్వార్ధాన్ని రుజువుచేస్తూ.
చౌదరి నవ్వాడు. తనలాంటి ఉత్తమ ఆలోచనలూ, తెలివితేటలూ ఉన్నవాళ్ళని గుర్తుపట్టి మెచ్చుకోగల సహృదయుడు తను. "సరే నీ యిష్టం" అన్నాడు. అప్పలమ్మ తిరిగి తనింటికివచ్చి గది గొళ్ళెం తీసింది. చచ్చిన దూడలా కాళ్ళూ చేతులూ పడేసుకుని నిద్రపోతున్నాడు వీరయ్య.
తెల్లవారగానే వీరయ్యకు మెలకువ వచ్చింది. భయంతో లేచాడు. చౌదరి శవం కళ్ళముందు కనపడింది.'బాబోయ్' అని కేకపెట్టాడు. గబుక్కున వీరయ్యకి మొలనుకట్టిన డబ్బు జ్ఞాపకం వచ్చింది. చూచుకున్నాడు. లేదు. అతని ప్రాణం పోయినట్లయింది. 'ఓ అప్పలమ్మ' అంటూ కేకలు వేస్తూ తలుపులు దబదబ బాదాడు. గుంజాడు. అప్పలమ్మ వచ్చి తలుపు తీసింది.
"అప్పీ, నా డబ్బు నా డబ్బు....." వెర్రిగా అరుస్తున్నాడు వీరయ్య.
"పోతే పోయిందిలే బుద్దిలేనోడా. ముందు నీ బతుకు చూసుకో సౌదరి సావుబతుకులమద్దె ఉన్నాడు."
అలాగే చూస్తూ నిలబడ్డాడు వీరయ్య.
"పోలీసు లొత్తారు. నిన్ను ఉరితీస్తారు."
అప్పలమ్మ రెండు కాళ్ళమీద పడ్డాడు వీరయ్య. "నన్ను రచ్చించు అప్పలమ్మా! నాకు సావొద్దు. సావొద్దు" దీనంగా ఏడ్చాడు వీరయ్య.
"భయపడకు యెర్రోడా. నేనంతా మాట్లాడి వుంచినానులే ఓ వంద రూపాయలు తీసుకురా. నీమీద కేసు తీయించేత్తాను" అంది అప్పలమ్మ.
"వందరూపాయలే"



