Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    చీకటిరాత్రులు కాబట్టి చంద్రి రోజూ రావడంలేదు. ఎప్పుడైనా వచ్చినా చీకటిపడకుండా వెళ్ళిపోతుంది. అప్పలమ్మ వీరయ్య ఇంటికి రోజూ వస్తూ పోతూ  ఉంది. వీరయ్యను మంచి చేసుకుంటోంది. సెనగచ్చులు తెచ్చి పెడుతుంది డబ్బిచ్చినా తీసుకోలేదు.

     తనంటే విరోధంగా ఉన్న పల్లెవాళ్ళంటే అసహ్యంతో మరీ దూరంగా  వుంటున్నాడు వీరయ్య. గవరయ్యమామ చచ్చిపోయాడు. అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు దహనానికి, తంతుకీ అయే ఖర్చంతా వీరయ్యే భరించాడు. సీతాలుని తన ఇంటికి వచ్చి ఉండమన్నాడు. కానీ సీతాలు ఎవరితో చెప్పకుండా పల్లెవిడిచి వెళ్ళిపోయింది. వీరయ్య కొన్నాళ్ళు వరుసగా వెళ్ళి మామ గుడిసెలో దీపం పెట్టి వచ్చేవాడు. ఇప్పుడు కొన్ని పందులూ, పందికొక్కులూ ఆ గుడిసెని విశ్రాంతి భవనంగా వాడుకుంటున్నాయి.
 
    వీరయ్య పట్టుదల ఆనాటి కానాడు ఎక్కువయింది. దేహశ్రమని లెక్క పెట్టకుండా సముద్రాన్ని గాలించేస్తున్నాడు. ఎన్నో రోజులు ఫలితం లేకుండా పోయేవి. బాధతో వొంటి నొప్పులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కో రోజున చేపలు కొల్లలుగా పడుతున్నాయి.  ప్రతీ చేపకీ లెక్కకట్టి నిలువచేస్తన్నాడు. ప్రతీ రోజూ తనదగ్గరున్న సొమ్ము లెక్క పెట్టుకుంటున్నాడు. డబ్బుని తన మొలలోనే పెట్టి చుట్టూ గుడ్డని చుట్టబెట్టుతున్నాడు. అడవిలో తన ఆహారాన్ని జాగ్రత్త పెట్టుకునే ఖడ్గమృగం లేక ఎలుగుబంటి వంటి ప్రవృత్తి అతనిలో బలంగా వ్యాపించింది. నూకయ్యకి ఇజార్లు కుట్టించలేదు.బాబుకి దుప్పటీ కొనలేదు. చంద్రికి చీర కొనిపెట్టలేదు. "అన్నంతా సేసి తీర్తాను. అప్పుడుగాని దమ్మిడీ ఖర్చుపెట్టను" అని చెప్పాడు చంద్రితో.

    ఆ సముద్రం వంటిదే దరిద్రం కూడా. అవతలవొడ్డు కనపడదు. కాని వీరయ్య మొండిగా ముందుకు సాగిపోతున్నాడు.

                                          7

    కన్ను కనపడని చీకట్లో పల్లె భయంకరంగా వుంది. సముద్రపు హోరు క్షయరోగంతో బాధపడుతున్న రాక్షసుడి శ్వాసలాగా వుంది. చిరిగిన పాత కంబళి చిరువెచ్చని మడతల్లో వీరా, నూకయ్యా గాఢంగా నిద్రపోతున్నారు. చలిగాలి చూరుని కొట్టుకుని వెనక్కి మళ్ళుతోంది.

    ఎవరో గుడిసె, తలుపు దబదబ బాదుతూన్నట్టు చప్పుడయింది. 'యారది' అంటూ వీరయ్య లేచి తలుపు తీశాడు. చౌదరి పెద్ద చుట్ట కాలుస్తూ బండమీద కూర్చున్నాడు. పక్కనే గుమాస్తా., నౌకరూ చేతులు కట్టుకుని వున్నారు. నౌకరు చేతిలో లాంతరు వుంది. వెంకన్న చేతిలో మరో లాంతరు వుంది.

    "రేతిరేల వచ్చారు బాబుగారు" అన్నాడు వీరయ్య కంగారుగా నిద్రని దులుపుకుని.

    వెంకన్న దీపం మొహంమీద పెట్టి " నీకోసమే" అన్నాడు.

    "సర్కారువారికి నీమీద చాలా కోపంగా వుంది" అన్నాడు చౌదరి తాపీగా.

    "ఏం బాబూ?"

    "క్రితం ఏడాది పన్నంతా బకాయీ ఉంది. వృత్తిపన్నూ, గుడిసె పన్నూకూడా, జుల్మానాతో ఇచ్చుకోవాలిక" అన్నాడు చౌదరి.

    "మా బాబు పన్ను కట్టేసినాడండి. నాను యీ ఏడాది సొంతంగా చూసుకుంటున్నాను" అన్నాడు వీరయ్య.

    "మీ బాబు ఎప్పుడూ రాగి పైసా కట్టలేదు. నాకు తెలుసు" అన్నాడు వెంకన్న.

    "జుల్మానాతో ఇరవై ఆరు రూపాయలయింది" అన్నాడు చౌదరి.

    "అన్నాయం బాబూ. మా బాబు పన్ను కట్టేశానని నాతో చెప్పాడండి"

    "అయితే నే నబద్ద మాడానంటావా?" గద్దించాడు చౌదరి.

    "మా బాబు కూడా నిజాయితీ మనిసేనండి" తొణక్కుండా అన్నాడు వీరయ్య.
 
    చౌదరి గుమాస్తా పేరిశాస్త్రి కేసి చూశాడు. పేరిశాస్త్రి "అయితే రసీదులేవీ?" అని అడిగాడు.

    వీరయ్య తెల్లబోయాడు. రసీదులు తీసుకునే అలవాటు ఎప్పుడూ లేదు. చౌదరి లేచి ఇలా అన్నాడు. "నువ్వు ఉదయమే వచ్చి పన్ను జుల్మానాతో కట్టెయ్యాలి. లేకపోతే వీలులేదు. తరువాత ఏం జరిగినా విచారిస్తావు."
 
    గుమాస్తా దాన్ని వ్యాఖ్యానించాడు. "సర్కారువారు నీ గుడిసెనీ, నీ కున్న యావదాస్తినీ స్వాధీనం చేసుకుంటారు."

    చౌదరి వెళ్ళిపోయాడు. వెంకన్న కొంతదూరం వెళ్ళి తిరిగివచ్చాడు.

    "ఇదిగో యీరయ్యా నా మాటవిను. ఓ పదిరూపాయలు నాకియ్యి సౌదరిబాబుతో చెప్పి  రైటుచేస్తాను" అన్నాడు మీసం తిప్పుతూ.

    "నిన్నూ ఆ సౌదరినీ సేవలకూరలా తరిగేత్తాను" అన్నాడు వీరయ్య మండిపడుతూ. అతని గొంతులోని కాఠిన్యానికి జంకి  వెనక్కి తిరిగాడు వెంకన్న.

    తర్వాత రోజున ఉదయమే బయలుదేరి వీరా, బాబు ఉంటూన్న ఊరికి వెళ్ళాడు. అక్కడకు చేరేప్పటికి నడినెత్తిమీదకు సూర్యుడొచ్చాడు. కీళ్ళ నొప్పులతో బాధలతో శల్యావశిష్టుడైన బాబు ఇలాగ అన్నాడు. "పన్ను కట్టేసానురా అబ్బీ. కాని ఆ సౌదరి మా పెమాదం మనిషి. సాటుగాపోయి ఓ పదిరూపాయలు ఇచ్చుకుని రచ్చించమని అడుగు. లేకపోతే పాం పగ పట్టి నిన్ను బతకనివ్వడు"




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.