Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    క్రమంగా సంబరం మజా ఎక్కువయింది. ముంతలతో కల్లును కాళీచేస్తున్నారు. పైటజారిన నరసమ్మ కేకలు వేస్తోంది. పసుపు రాసుకున్న ఆడమనిషి వీరంగం తొక్కుతోంది. ముత్యాలు మొగ్గలు వేస్తున్నాడు, వెంకన్న కొరడా ఝళిపిస్తూ హెచ్చరిస్తూ గుడివైపు దారితీశాడు.

    చంద్రి ఒక పదం అందుకుంది. చంద్రి గొంతు కీచుగా రేగి డప్పుల మోతని దాటి, ఎర్రని వెల్తురుతో కలిసిపోతోంది. పదిమంది ఆమె చుట్టూ మూగి వంతపాడుతున్నారు. వెంకన్న వచ్చి చంద్రికి ఎదురుగా నిలబడి "వహవ్వా సక్కని సుక్కా మరో పదం పాడు" అన్నాడు. ఒకడొక చచ్చిన పాముని తీసుకువచ్చి విసిరాడు, జనం  'బాబోయ్' అంటూ చెల్లాచెదురైపోయారు. వెంకన్న వాణ్ని పట్టుకొని చావగొట్టాడు. చంద్రి పక్కనే చేరి ముత్యాలుకూడా పాడుతున్నాడు. ఇద్దరూ చేతులు కలిపి ఊపుతూ పాడుతున్నారు. వెంకన్న దగ్గరికెళ్ళి "సెంద్రీ మరోటిపాడు" అంటున్నాడు. ఎవడో వెనకనుంచి చంద్రి పైటలాగాడు. గంగడు కత్తి తిప్పుతూ. నాట్యం చేస్తూ ఆమెమీద తీలిపడ్డాడు. ఇద్దరూ నేలమీద ఒకరి మీద ఒకరు పడ్డారు. జనం యీలలతో చప్పట్లతో తమ ఆనందాన్ని తెలిపారు.

    అంతకుముందే వచ్చిన వీరయ్య యిదంతా చూశాడు. అసలు చంద్రి సంబరానికి వెళ్ళడమే వీరయ్యకి ఇష్టంలేదు. అందుకే నిద్రలో ఉలిక్కిపడిలేచి యిలాగ వచ్చాడు. ఈ దృశ్యం అతనికి బాధనీ అసహ్యాన్నీ కలిగించింది. తనకీ, తన వాళ్ళకీ ఏదో ప్రత్యేకత క్లపించుకోవాలని అతని ఆశ. తనదైన చంద్రి వీళ్ళల్లో గంతులు వేయడం సహించలేకపోయాడు. చౌదరి భార్య యిలా ప్రవర్తించదని అతనికి దృఢంగా తెలుసును.

    "సెంద్రీ ఇలాగరాయే" అని గట్టిగా కంఠమెత్తి పిలిచాడు.

    "నాను రాను" అంది చంద్రి, ఉత్సవపు ఉత్సాహంలో.

    "సంపేత్తా రాకపోతే" అంటూ ఆమె చెయ్యిపట్టుకులాగాడు.

    "ఒదులొదులు యీరయ్యబావా! నొప్పి పెడుద్ది" అంది చంద్రి. అందరూ చప్పట్లు కొట్టారు. చంద్రికి అభిమానం వేసింది. కదలనంది. మొరాయించింది. వీరయ్య ఆమెను జుట్టుపట్టుకుని బరబర లాక్కుపోయాడు. "గ్యానంలేదు నీకు? జుత్తువొదులు" అంది కోపంతో చంద్రి. వీరా కళ్ళు కోపంతో మండుతున్నాయి.  "నా మాటినకపోతే జాగర్త ఎదవ్వేసాలెయ్యక" అన్నాడు.

    "నేయినను" అంది చంద్రి.

    "పో -ఆ వెంకన్నతో పో" అన్నాడు వీరయ్య కోపంగా.

    "ఆడికేం, ఎంకన్న మంచివాడు" అంది చంద్రి కొంటెగా.

    వీరయ్య ఆమె మీదికి దుమికాడు. చంద్రి పరుగెత్తింది. వీరయ్య వెంబడించాడు. సముద్రం వొడ్డుకి వచ్చారు. చంద్రి ఫక్కున నవ్వింది.

    "ఏంటి నవ్వుతావ్" అన్నాడు వీరయ్య.

    చంద్రి యిసుకమీద కూర్చుని పాదాల్ని కెరటాలలో పెట్టింది. ఓరగా వీరయ్య కేసి చూసి "వెంకన్న పెద్దమడిసి. అందమైమోడు" అంది. ఆమె పిక్కలు నురుగుతో నవ్వుతూన్నట్టున్నాయి. వీరయ్య ఆమెని నీళ్ళల్లోకి తోశాడు. చంద్రి గల్లున నవ్వుతూ నీళ్ళల్లో పడింది.

    "రా పైకి రాయే పిల్లా" అన్నాడు వీరా.

    తడిసిన చీరతో పైకి వచ్చింది చంద్రి. స్ఫుటంగా ఉన్న అవయవాల పొంకంచూసి ఆమెను కౌగిలించుకోబోయాడు వీరయ్య. ఆమె తప్పించుకుని మళ్ళీ నీళ్ళల్లోకి దుమికింది. నీరు గలగలమంది. వీరా గొంతు నిండా నవ్వాడు. చంద్రి తిరిగి ఒడ్డుమీదకు వచ్చింది.

    "ఒళ్ళు గడ్డయిపోతుంది. ఉహు చలి చలి" అంది వణుకుతూ. వీరయ్య తలగుడ్డతీసి ఆమె మీదకు విసిరాడు! "కట్టుకో" అన్నాడు.

    "మరుగేది యీరయ్య బావా? నాను సిగ్గులేని నర్సమ్మనేంటి" అంది చంద్రి. వీరా పక్కకి తిరిగి కళ్ళు మూసుకున్నాడు. చంద్రి ఆ గుడ్డని చుట్టబెట్టుకుని సరీసరిపడని పైట వేసుకుంది. తడిసిన జుట్టు చివరల్ని సాచి ఆరబెట్టుకుంటోంది.
 
    వెన్నెలలో అర్ధనగ్నంగా ఉన్న ఆమె దేహమూ రూపమూ మోహనంగా ఉన్నాయి. వీరయ్య రెప్పవెయ్యకుండా ఆమెకేసి చూశాడు. ఆమెను పట్టుకోబోయాడు. ఆమె పరుగెత్తింది. అలసిపోయి యిసుకలో వాలింది. వీరయ్య ఆమెని రెండు చేతుల్లోకి తీసుకుంటూ "నువ్వు నా దేవతవు సెందిరీ" అన్నాడు.

    సముద్రపు కెరటాల హోరు చిత్రంగా మిస్టిక్ గా ఉంది. దూరంగా సంబరం డప్పులమోత వినబడుతోంది.

                                                                            6

    పల్లె పల్ల అంతా వీరాకి వ్యతిరేకంగా ఉంది. వీరా దగ్గర సొమ్ము నిలవవున్నట్టు అందరికీ తెలిసింది. చౌదరి జనాన్ని వెంట బెట్టుకుని నూకాలమ్మగుడి కట్టించడానికి యిరవై రూపాయలు చందా యిమ్మన్నాడు. ఇవ్వనన్నాడు వీరయ్య. ఎన్నో విధాల చెప్పిచూశారు చౌదరీ, తక్కినవాళ్ళూ. చచ్చినా యివ్వనన్నాడు. వీరయ్య. "నువ్వు దేవతని కాదంటున్నావు, నాశనమైపోతావ్" అన్నాడొక భక్తుడు. వీరయ్య చలించలేదు. చౌదరి ఎర్రగా ముఖాన గంటు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఊరంతా అనేక విధాల చెప్పుకున్నారు. వీరయ్యని తిట్టుకున్నారు. దరిద్రం తన పక్కన -తనలో ధనచిహ్నాల్ని ఉండనివ్వదు. బానిసలైన అమాయకులైన అవిద్యాపరులైన ప్రజలు తమ దరిద్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.