Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    చంద్రి కూడువండి చీకటిపడే వేళకి బండిమీద కూర్చుని పాటలు పాడుతూ వీరాకోసం నిరీక్షిస్తోంది. అటూ ఇటూ వెళ్ళేవాళ్ళు పలకరించిపోతున్నారు.   కొందరు పరాచికాలాడుతున్నారు. మీసాల వెంకన్న కన్ను గీటాడు. "పోరా యెదవ కొడక, కళ్ళల్లో యిసుకోత్తాను" అంది. మరి కొందరు కవ్వించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

    వీరయ్య నూకయ్యతో తిరిగి వచ్చాడు. ఈవేళ కూడా చేపలు బాగానే పడ్డాయి. చంద్రి వేణ్ణీళ్ళు కాచి పెట్టింది. ఇద్దరూ స్నానం చేశారు. చంద్రి నవ్వుతూ కబుర్లు చెబుతూ వేడివేడి కూడు పెడుతూంటే వీరయ్యకి మగతనం ఆనందం ఏదో కలిగింది. తను రోజంతా పడిన శ్రమని ఎవరో మంత్రం వేసి తీసేసినట్టయింది. చంద్రి ఇంక ఇంటికి వెళ్ళనంది. ఇక్కడ ఈ పల్లెలో సంబరం జరుగుతుంది. చూస్తానంది. సరేనన్నాడు వీరయ్య.

    మూతి తుడుచుకుంటూ వీరయ్య యివతలికి రాగానే ఎవరోవచ్చి "మీ మాఁవకి పానంమీదకొచ్చింది" అని చెప్పాడు. వీరయ్యకి వొళ్ళు జలదరించి నట్టయింది. సరాసరి మేనమామ ఇంటికి వెళ్ళాడు. గుడిసె గుమ్మం మీద సీతాలు ఏడుస్తూ కూర్చుంది. మేనమామ గవరయ్య, పిల్లలు లేరని దీన్నిచేరదీసి పెంచాడు. పన్నెండు పదమూడేళ్ళుంటాయి.  "ఏఁవేసీతీ! ఏడుత్తావేం ఎట్టాగున్నాడు మాఁవ?" అన్నాడు వీరయ్య.

    "ఆకలేత్తంది" అంటూ బావురుమంది సీత.

    గవర్యకి జబ్బు చెయ్యడంతో సీతాలికీ రోజంతా ఉపవాసమైంది. ఇంట్లో బియ్యపుగింజలు కూడా లేకుండా చూసి యిదే సమయం అన్నట్లు మంచంపట్టాడు ముసిలాడు. వీరయ్య లోపలికెళ్ళాడు. గవరయ్య ఒక కుక్కి మంచంలో స్పృహలేకుండా పడివున్నాడు. ఆయాసంతో గుండెలెగిరి ఎగిరి పడుతున్నాయి. బలవంతంగాతీసి విడిచే శ్వాస. గురక బరుకు బరుకు మంటోంది. నెరసిన కనుబొమ్మల క్రింద రెప్పలు సగం మూసుకుని ఉన్నాయి. వీరయ్యకి బాధ కలిగింది. జాలివేసింది. ఓపిక ఉన్నన్నాళ్ళు సముద్రంలో గెడవేసి బ్రతికాడు. చివరిరోజుల్లో ఇక్కడా అక్కడా అడుక్కు తీసుకువస్తున్నాడు. ఇప్పుడింక ఈ ప్రాణావశిష్టుణ్ణి ఎవరుచూస్తారు? కొన్నిరోజులక్రితం అత్త పిలుస్తోందని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడా? అక్కడ ఆ లోకంలో అత్త యితనికోసం కనిపెట్టుకుని వుంటుందా? అక్కడ తిండి ఉంటుందా? అక్కడ సముద్రం వుండదా? ఇలాగ అయోమయంగా ఆలోచిస్తూ పరుగెత్తుకువెళ్లి మంగలిస్వామిని తీసుకొచ్చాడు. స్వామి మంచి వైద్యుడని ప్రతీతి. గవరయ్యని పరీక్షించి నోట్లో ఏదో రసం పిండాడు. ఉదయానికల్లా తెలివొస్తుందనీ నయమౌతుందనీ ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు.

    "నీకు నేను కూడు పంపిత్తాను. ఏడవమాకు సీతీ, మాఁవని జాగ్రత్తగా సూత్తూవుండు" అని చెప్పి వీరయ్య యింటికి వచ్చేశాడు. చంద్రి అన్నం ముంతలో పెట్టుకుని సీతాలు దగ్గరికి వెళ్ళింది.

    వీరయ్య గుండెలో బాధ ఎక్కువయింది.

    ఈ పల్లె వదిలితేకాని తన బాధ తగ్గదనుకున్నాడు. ఎన్నాళ్ళయినా తాను కష్టపడి డబ్బు కూడబెడతాడు. అవసరమైతే చంద్రి జీతంకూడా తనే తీసుకుంటాడు. దూరంగా అక్కడ ఒక యిల్లు కట్టుకుని చిన్న వర్తకమో మరొకటో చేసుకుంటాడు. తను చొక్కాలుకూడా తొడుగుతాడు. కాళ్ళకి జోడు లేకుండా నడవడు. చంద్రీ, నూకయ్య తనతో వుంటారు. చంద్రికి తనకీ పిల్లలు పుడతారు. వాళ్ళకి చంద్రిలాగా పెద్ద కళ్ళూ, తనలాగ బలమైన దేహమూ ఉంటాయి. వాళ్ళు పలకా పుస్తకాలుచ్చుకుని బడికి వెళ్ళి చదువుకుంటారు. తను పెద్దమనిషి అవుతాడు. గౌరవంగా హాయిగా బతుకుతాడు. కొందరేనా తన్ని వీరయ్యగారంటారు.

    ఈ దరిద్రపు నీచపు మోసపు సముద్రంతో తనకింక పనిలేదు. మీసాల వెంకన్న తిండిలేక దిక్కులేక పడివుంటాడు. నరసమ్మ ఆకలితో జబ్బులతో ముసలిదై వంగిపోతుంది. ఈ పల్లెవాళ్ళందరూ ఆకలితో, రేపటిని గూర్చిన భయంతో క్రమంగా కృశించి నశించిపోతారు. అప్పలమ్మని ఖైదులో పెడతారు. తనుమాత్రం దూరంగా సుఖంగా...

    అంత కసిలోనూ ఏడుపు వచ్చింది వీరయ్యకి. ఆ పల్లెనీ అందులో ప్రతీ మనిషినీ తానెరుగును. తరతరాలుగా వీళ్ళందరూ యిక్కడ పుట్టారు. పెరిగారు. తనవంటి వీళ్ళందరూ నశించిపోతారు. ఈ వందల కొలదీ జనానికి ఏ ఆశా సౌఖ్యమూ ఇంక జీవితంలో కలగవా? బాబు కూడా యిలాగే చెప్పాడు. 'నాను యీ సముద్రం దేవుడనుకున్నానురా అబ్బీ! మన తాత ముత్తాతలు యిక్కడే పుట్టారు. పెద్దోళ్ళయ్యారు. కాని గుడిసె ఏనాడూ కాస్త పెద్దది అవలేదురా బుల్లోడా! ఈ సముద్రం మనకి కూంత తిండిపెట్టి మన సత్తువనంతా -మనపానాల్నే బలికోరుద్ది'

    అక్కడే యిసకమీద పడుకున్నాడు వీరయ్య, మాగన్నుగా నిద్రపట్టే వేళకి చంద్రి తిరిగి వచ్చింది.

                                                                           5   


    దూరంగా డప్పులు మోగాయి. కాగడాల కాంతి ఎర్రగా కనిపిస్తోంది. జనం కలకలం వినవస్తూంది. చంద్రి వీరాని లేపింది. "నువ్వెళ్ళు నేను ఎనకాల వొత్తాను" అన్నాడు వీరయ్య, బద్దకంతో, చంద్రి నూకయ్యని తీసుకుని వెళ్ళింది. ఇదివరకెప్పుడో చౌదరి కొనియిచ్చిన చమ్కీచీర కట్టుకుని వచ్చింది నరసమ్మ. వెంకన్న ఒక చేతిలో కల్లు ముంతతోను మరో చేతిలో కొరడాతోనూ తిరుగుతూ తిరుగుతూ జనాన్ని అదలిస్తున్నాడు. గంగడు తుప్పుపట్టిన కత్తి నొకదాన్ని తిప్పుతూ ఖడ్గవిద్యని ప్రదర్శిస్తున్నాడు. ఒక ఆడది మొహం అంతా పసుపురాసుకుని చేత్తో ఆకులు పట్టుకుని జుట్టువిరబోసుకుని గుడ్లుతేలేసి యిటూ అటూ వూగుతోంది. ఇద్దరు ఒంటికి రంగులు పూసుకుని పెద్దపులి ఆట ఆడుతున్నారు. కాగడాల  కదిలే వెలుతురులో అందరూ తెరమీద బొమ్మల్లా మిద్యగా వింతగా వికృతంగా ఉన్నారు. చంద్రి ఉత్సాహంతో గుంపులో చేరి ఒకటైపోయింది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.