Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
చంద్రి గుడిసె తలుపు గొళ్ళెం పెట్టి అప్పలమ్మ గుడిసె దగ్గరకు వెళ్ళింది. అక్కడ చౌదరి అప్పలమ్మతో ఏదో గుసగుసలాడుతున్నాడు. చంద్రిని చూసి " పిల్ల వీరయ్యకోసం వస్తూంటుంది కదూ!" అని పరీక్షగా చూశాడు. చంద్రికి ఏదో సిగ్గువేసి కుంచించుకుపోయింది. పన్నులు వసూలుచేసే చౌదరి యిక్కడెందుకున్నాడా అనుకుంది. అప్పలమ్మ ఆప్యాయంగా చంద్రిని పిలిచి కూర్చోమంది, చౌదరి వెళ్ళిపోయాడు.
"లచ్చిమి లాంటి పిల్లవు నీ రేక మంచిదిలే" అంది అప్పలమ్మ, సన్నని వంకర చేతులతో చంద్రి చుబుకాన్ని పుణుకుతూ. "మరి మా యీరయ్యని పెళ్ళెప్పుడు చేసుకుంటావో కోడలా?" అంది.
చంద్రి సిగ్గుగా అంది "నాకేం తెలుస్తది"
"యీరయ్య సెప్పుకోదగ్గ మడిసి. అందరిలాంటోడుకాడు" అంది అప్పలమ్మ.
"ఇక్కణ్నుంచి యెల్లిపోదాం. ఊళ్ళో ఇల్లు కట్టుకుందామంటాడు. నా జీతంకూడా ఆడికే యిచ్చేస్తాను" అంది చంద్రి.
"ఏ మాత్రం నిల్వవేశాడు నీవోడు" అడిగింది అప్పలమ్మ.
"నాకు తెల్దు"
"ముసిల్దాన్ని, నాతో ఆ మాత్రం సెప్పకూడదేంటే?"
"నాకు తెల్దు. నిజంగా నీమీద వొట్టు."
"అది సర్లేగాని నువ్వుకూడా ఈడకే వచ్చి ఉండరాదూ పిల్లదానా. ఒకర్తెనీ నువ్వు దూరంగా ఎందుకూ?"
"కామందులదగ్గర పనికి కుదిరానుగా."
"ఆఁ పని! పని! ఇక్కడుంటే ఆ మాత్రం సొమ్ము సెయ్యమా ఏంటీ."
"నా కెవరిత్తారిక్కడ?"
"నా దగ్గరుందువుగాని, నా యాపారం చేసి పెడుతూందువుగాని."
"నా కిటువంటివి సేతగాదప్పలమ్మత్తా" అంది అమాయకంగా చంద్రి.
అప్పలమ్మ చాలా చిత్రమైన మనిషి. దగ్గరగా యేభైయేల్ళుంటాయి. చాటుగుండా కల్లునీ ముండల్నీ సప్లయ్ చేసే పెద్ద పర్తకురాలు. కాని ఆమె బహిరంగంగా మాత్రం పుణుకులు, మామిడి తాండ్ర, బెల్లపు సెనగచ్చులూ అమ్ముతూంటుంది. పొరగూళ్ళనుంచి చాటుగా ఎవరికీ తెలియకుండా ఒక్కొక్కరసికుడు ఒక్కొక్క పిల్లని ఎగరేసు కొస్తుంటాడు. వాళ్ళకి గదులద్దెకిస్తుంది అప్పలమ్మ. ఈ వ్యవహారంలో చౌదరికి కూడా వాటా వుంది. పోలీసుల చెడు దృష్టి ఇటుపడకుండా చౌదరి చూసుకుంటూ వుంటాడు. కాని చంద్రికి పాపం యివేమీ తెలియవు. అప్పలమ్మ పెద్దకాలపుదనీ సత్తెకాలపుదనీ ఆమె నమ్మకం.
"పోనీ మా సౌదరిబాబు దగ్గర పనికి కుదురరాదు పిల్లా. నీకో బస్తా ఎక్కువ ముట్టచెపుతాడు. యీరయ్యకి దగ్గరగా వుంటావు. రోజు కోశెడు దూరం నడిచి వస్తుండావాయె" అంజి అప్పలమ్మ.
"మూడు నాలుగు నెలల్లో ఈ యేడాదయిపోతాదిగా అప్పుడు సూద్దాంలే" అంది చంద్రి. అప్పలన్న సలహా కూడా బాగానే వుందనుకుంటూ.
ఇంతలో ఒక గదిలోంచి పెద్ద అరుపులు కేకలూ వినపడ్డాయి. ఒక ఆడగొంతు 'అమ్మో అమ్మో' అంటోంది. దబదబా గుద్దులు వినిపించాయి. చంద్రి భయంతో "ఏంటదీ" అంది.
గది తలుపులు తెరుచుకున్నాయి. ఒక ఆడదాన్ని జుట్టుపట్టుకుని పూడిన గోచీతో తూలుతూ లాక్కువస్తున్నాడు. మధ్య మధ్య కోపంగా విలాసంగా డొక్కలో తన్నుతున్నాడు. ఆమె తిడుతోంది. "సచ్చినోడా, నీ జిమ్మడిపోను, నీ శార్ధం పెట్ట....?"
అప్పలమ్మ ఏమీ ఎరగనట్టుచేపల్ని తరుగుతోంది. చంద్రి సహించలేకపోయింది. "ఏంట్రా సచ్చినోడా, ఆడమనిషి నట్టా కొడతావ్?" అంది.
"నాయిష్టం" అన్నాడు వాడు.
"అయ్యో అదేం తప్పుచేసిందీ?" అంది చంద్రి.
"నాకు కొట్టాలని సరదా. నీ కెందుకే నావూసు." ఇంతలోకే ఆడమనిషి జుట్టు విడిపించుకునీ అతని చెయ్యి కరవబోయింది. అతడు తప్పించుకుని ఆమెని ఎడాపెడా తన్నాడు. చంద్రి అప్రయత్నంగా అంది. "అలా కొడతావేంటి పొగరుబొతుకొడకా"
"నీ కెందుకే ముండా, నీక్కూడా రెండు తగలాలా" అన్నాడు ఆ వీరుడు. ఆడమనిషి విదిలించుకుని పారిపోయింది. అతడు తూలుతూ ఆమెని వెంబడించాడు. చంద్రికి వికార పెట్టినట్టయింది. కంగారుగా "ఇదంతా యేంటి అప్పలమ్మా!" అంది. అప్పలమ్మ నవ్వింది. ఆ నవ్వు తాపీగా చిత్రంగా వుంది. అమాయకంగా పరచుకున్న ఎండుటాకుల్ని కాల్చివేసే మంటలో నిర్దయ, నీచత్వమూ ఆ నవ్వులో ఉన్నాయి. నైతికపు విలువలూ , అంతరాత్మ, జాలీ మొదలైనవన్నీ ఎప్పుడో వదిలేసి అవసరంయొక్క ప్రాముఖ్యానికి లొంగిన మనుష్యులలోని ఒక స్వార్ధం, గారపట్టి నల్లపడిన ఆమె పళ్ళసందులోంచి పొడుచుకువచ్చిన నవ్వులో అసహ్యంగా పేరుకుని వుంది. చంద్రికి ఆ నవ్వు భయంకరంగా తోచింది. ఎందుకో అక్కడ ఉంటే ప్రమాదం అనుకుంది. "నే వెళ్ళొత్తాను. యీరయ్యబావకి కూడువండాలి" అంటూ అప్పలమ్మ పిలుస్తున్నా వినక చరచరా వెళ్ళిపోయింది.



