Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
వీరయ్య సముద్రం దగ్గరికి వెళ్ళాడు. నూకయ్య పడవని సిద్దంచేస్తున్నాడు. పక్కనే ఆకుపచ్చ చీరకొంగు గాలికి ఎగురుతూంటే నవ్వుతూన్న చంద్రి కనబడింది. వీరా "ఓహోయ్" అని పిలిచాడు. ఆమె కువకువలాడే గొంతుతో "ఓహోయ్" అని పలికింది.
చంద్రి నలుపైనా అందంగా వుంది. పెద్ద కళ్ళూ, కోటేరేసి ముక్కూ, బలంగా వంపులు తీరిన దేహము -అన్నటికన్నా ఆమె స్వచ్చమైన నవ్వు, సముద్రకెరటాల నురుగు సూర్యకాంతిలో మెరిసినట్టుగా అకల్మషంగా హాయిగా నిండుగా ఉంటుంది. చంద్రి పరుగున వెళ్ళి వీరా వొళ్ళో వాలింది. వీరయ్య రెండు చేతులతోనూ చంద్రిని పైకెత్తి గిర్రున తప్పి మెల్లగా యిసుకమీద పడుకోబెట్టాడు. ఎండలో ఆమె చెక్కిన రాతిశిల్పంలా నిగనిగలాడింది. ఈమె తనదేనన్న గర్వమూ తృప్తి అవ్యక్తంగా. వీరయ్యలో కలిగాయి. నవ్వుతూ అడిగాడు "నిన్న రాలేదేం పిల్లా?"
"నిన్న సేతినిండా పనివుంది బావా."
"మరి యియ్యాల ఎలా గొచ్చినావ్ సిలకా?"
"నాకు కడుపునొప్పి అని ఏడ్చాను"
వీరయ్య గుండెనిండా నవ్వాడు. తన చేపల్నిగురించీ, వచ్చిన సొమ్మును గురించీ చెప్పాడు. చంద్రి కళ్ళు పెద్దవి చేసుకుని వింది. వాళ్ళల్లో సుప్తమైన కలలూ ఆశలూ రేగాయి. ఇద్దరూ దూరంగా భూమిమీద ఇల్లు కట్టుకుని కులాసాగా ఆ చౌదరిలాగా......
వీరయ్య పట్టుదలతో అన్నాడు "సెంద్రీ సూడు. నెల తిరిగేటప్పటికి మూడొందలు సంపాదిత్తాను. ఇంకా ఇంకా సంపాదిత్తాను. ఈ యెదవ పల్లివొదిలిపోదాం.
"నాకూ సొక్కాలూ" సాగదీశాడు నూకయ్య.
"సర్లే యెదవా. కుట్టిత్తాలే" వీరయ్య చంద్రి చెయ్యిపట్టి లేవదీశాడు. "నీకు ఓ సీర కొంటాను."
"నాకెందుకు బావా యిపుడూ"
"మనువు సేసుకోవద్దూ పిల్లా."
చంద్రి ఆనందంగా అతనికేసి చూసింది. గబుక్కున సిగ్గుతో తలదింపి "సాలాఖరుకు నా జీతం వత్తది కదా అది కూడా నువ్వే తీసుకో" అంది.
"నీ డబ్బెందుకు నాకు పిల్లా! యారయ్యంటే ఏంటనుకున్నావ్!"
"మరి యిల్లు కట్టుకోవద్దా ఏంటి పిల్లోడా. ఇల్లు కడితే శానా డబ్బవుద్ది."
వీరయ్య మౌనంగా అంచనా వేస్తున్నాడు. ఆకలీ , రేపటిని గూర్చిన భయమూ లేకుండా గౌరవంగా బతకాలని కోరనివారుండరు. కాని ఆ పేదరికం పొలిమేర దాటడం కష్టం అని వీరయ్యకి తెలియదు. ఆ పొలిమేర దగ్గర నీచత్వమూ, నిరాశా , రోగమూలాంటి పెద్ద పెద్ద అగడ్తలుంటాయి. పై అంతస్తులోనికి ఎగరడానికి చేసే ప్రయత్నం అతి కష్టమైనదీ అపాయకరమైనదీ కూడా. కాని వీరయ్య ధనం దేనికైనా మూలం అని గుర్తించాడు. కేవలం తన కష్టంవల్లనే తప్ప మరో మార్గం సంపాదనకి లేదనీ తెలుసుకున్నాడు. ఆ వచ్చిన ధనం తన్ని అంటిపెట్టుకుని ఉండాలి. కాని ఈ చంచల పదార్ధం ఉన్నచోటికే వెళ్ళే దుర్గుణం కలిగి ఉందని అతనికి తెలియదు. ఏమైనా దారిపొడుగునా జయించుకుపోవాలనే పట్టుదల అతనిలో వుంది. అందుకోసమే తక్కిన తన వాళ్ళల్లో ఉన్న అలసటనీ అవినీతినీ తనలోంచి తుడిచిపెట్టి నియమబద్దంగా బతకాలనుకున్నాడు. అందుకోసమే నరసమ్మ నెత్తురులేని వలపుకి దూరంగా తొలగాడు.
పడవ సముద్రంలో వూగింది. రెండు కుండలలో గంజీ కూడూపెట్టి పడవలో ఉంచారు. తెరచాప గాలికి వయ్యారంగా ఆడింది. ెండ ముదిరిన వేడికిరణాలు చల్లని సముద్రాన్ని తాకుతున్నాయి. "నాను కూడువొండి ఎదురు చూపులు చూత్తూంటాను" అంది చంద్రి.
"ఇయ్యాల నా సామిరంగా యింకా ఎక్కువ సేవలు పట్టుతాను" అన్నాడు వీరయ్య.
"తొరగా రాయేం!" అంది చంద్రి.
పడవ పడుచుపిల్లలాగా కెరటాలమీద సాగింది. చంద్రి చూసి చూసి వెనక్కి తిరిగింది.
4
చంద్రికేమీ తోచలేదు. ఒకత్తె వీరయ్య గుడిసెలో కూర్చుంది. తన కామందులయింట్లో అయితే, ఇటువంటప్పుడు విధవకూతురు సుబ్బమ్మ గచ్చకాయ లాడటానికి పిల్చేది. పాపం ఆవిడ చాలా మంచిది. ఏం చేసుకున్నా తీసుకొచ్చి తనకి పెడుతుంది. తనతో ఎన్నో చెపుతుంది. సుబ్బమ్మ మొగుడితో కొన్నాళ్ళు కాపురం చేసింది. ఎప్పుడూ ఆ కాపరం గొడవలే చెప్పేది. ఇప్పటికి తాను అయిదేళ్ళనుంచీ అక్కడే పనిచేస్తోంది. ఏడాదికి ఇన్ని బస్తాలని ఒకేసారి కొలుస్తారు. ఇదివరకు తన తల్లి బతికివున్నప్పుడు ఆమె జీతం తెచ్చుకునేది. అన్నగారినికూడా ఇంట్లో పెట్టుకుని పోషిస్తూ ఉండేది. కాని తల్లి ఏడాది క్రితమే మారకం వచ్చి చచ్చిపోయింది. తల్లిపోవడంతో చంద్రికి సర్వం శూన్య మనిపించింది. మేనమామ వేళకి తిని తత్వాలు పాడుతూ కూర్చుంటాడు. ఇంటి గొడవ పట్టించుకోడు. తనకీ చచ్చిపోవాలనిపించింది. కాని వీరయ్య తన కోసం పల్లెనుంచి మూడు మైళ్ళూ నడిచి వచ్చేవాడు. ధైర్యం చేప్పేవాడు. నవ్వించేవాడు. అల్లరి చేసేవాడు చీకటి పడగానే వెళ్ళిపోయేవాడు. వీరయ్యనీ, వీరయ్య కబుర్లనీ తలుచుకుంటూనే నిద్రపోయేది. చంద్రి మామూలు మనిషైంది. ఉత్సాహంతో , ఆశతో భవిష్యత్తులోకి చూసింది.



