Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    వీరా లేచి చదర తీసుకుని "ఛీ! నా గుమ్మంకాడనుండిపో, నిన్ను సూత్తేనే పాపం" అంటూ గబగబా గుడిసెలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

    బిత్తరపోయిన నరసమ్మ దగ్గరికి యెంకన్న చాటునుంచి వొచ్చాడు.

    "ఏంటన్నాడూ!" అని అడిగాడు.

    "ఇయ్యనేదు దొంగనాకొడుకు. కాని ఆడివొళ్ళు బలేగా వుంది."
               
                                       3

    తెల్లవారగానే పట్నంనుంచి వర్తకులు వచ్చారు. వీళ్ళు చేపల్ని బేరంచేసి కొనుక్కుపోయి లాభాని కమ్ముకుంటారు. పెద్దసంత నరసింహులు, వీరయ్య గుడిసె దగ్గరికి వచ్చాడు. అతనితోపాటు వెంకన్నా యింకా కొందరు కూడా వున్నారు. వర్తకులకి దగ్గరుండి బేరంలో సహాయంచేసి పెద్దరికం వెలిగించి పావలా అర్ధా సంపాదించుకుంటాడు. వెంకన్న -అసలు వెంకన్న ఏ గొడవొచ్చినా అక్కడుండి పూనుకుంటాడు, పూనుకుంటాడు. పన్నుల చౌదరితో మంతనాలు సాగిస్తాడు. అందుకే వెంకన్న అంటే అందరికీ కొంచెం భయంకూడా వుంది.

    నూకయ్య గుడిసె యివతలే కూర్చొని పల్దోముకుంటున్నాడు. తెల్లని సూర్యకాంతి యిసుకమీద వెండిరేకులా మెరుస్తూవుంది. పల్లెవాళ్ళ నల్లని శరీరాలు మరికాస్త నల్లగా నిగనిగలాడుతున్నాయి.

    నరసింహులు వెంకన్నవైపు రెండు పొగాకు కాడలు విసిరాడు.

    "తీసుకోరా యెంకా. ఈ వీరన్న ఏదైనా సబబుగా యిస్తాడా?" అన్నాడు.

    "మా లోబం మడిసండి బాబూ. ఆడికి డబ్బు పోగుసేసి, పోగుసేసి మీలాగ అయిపోవాలని ఉందండి" అన్నాడు వెంకన్న పోగాకు పాయ తుంపుతూ.

    "నీకుమాత్రం లేదట్రా?"

    వెంకన్న గర్వంగా అందరికేసి చూసి యిలాగ అన్నాడు. "మనకెందుకురా పోగుచేసుకోవడం. ఏరోజు కారోజుదే. ఎదవడబ్బు. మన దగ్గరుండదు -అలాటి పెబువులకి కాని"

    నరసింహం వెంకన్నని దగ్గరగా పిల్చి చెవిలో ఏదో చెప్పాడు.

    వెంకన్న వికటంగా నవ్వి గుడిసెలోకి వెళ్ళాడు. కాసేపట్లో వీరాతో యివతలకి వచ్చాడు.

    "దండం బాబూ" అన్నాడు వీరయ్య. నూకయ్య చేపల బుట్టలు ఒక్కొక్కటే యివతల పెట్టాడు. పాతిక రూపాయల్నుంచి బేరం సాగింది. వీరయ్య ఆఖరికి యాభై కావాలన్నాడు. దమ్మిడీ తగ్గితే యివ్వనన్నాడు. యాభై అంటే నూర్లో సగం. ఇంకో యాభై సంపాదిస్తే నూరవుతుంది. అదీ వీరయ్య లెక్క. మొదట డెబ్బై చెప్పినా వీరయ్య కెందుకో యాభై అన్న అంకెమీదనే మోజువుంది. ఆ ఆఅంకెనుంచి ఎంత చెప్పినా దిగలేదు. ఇక లాభంలేదని నరసింహం, సొమ్మిచ్చి బుట్టలు పట్టించుకు వెళ్ళాడు. వీరా మెరిసే కళ్ళతో అయిదు పదినోట్లనీ మొలకి కట్టాడు. రెండుమూడు రోజుల శ్రమకి ఏ పల్లెవాడూ ఈ మధ్య ఇంత సంపాదించలేదు. వీరయ్యలాగ పట్టుదలగా వాళ్ళు సముద్రాన్ని గాలించనూలేదు. ఆ పూట గడిస్తే చాలనుకుంటారు. మిగిలితే తాగుతారు. వాళ్ళలో కష్టపడే బలమూ ఓపికా ఇచ్ఛా ఏనాడో లుప్తమైపోయాయి.

    "ఓ రెండు రూపాయలు నా కియ్యి. మళ్ళీ ఇచ్చేత్తా" అన్నాడు వెంకన్న చెయ్యిజూపుతూ.

    "నీ కెందు కివ్వాలి?"

    "నాను బేరంచేసి పెట్టాను" అన్నాడు వెంకన్న.

    "ఆడితో వొచ్చినావు. ఆడి దగ్గిరే పోయి పుచ్చుకో"

    వెంకన్న కోపంగా చూశాడు. వీరా లక్ష్యం చెయ్యక నూకయ్యని పడవచెక్క లమర్చమని పంపించాడు. వెంకన్న వీరా దగ్గిరగా వెళ్ళాడు.

    "మద్దెవర్తికి మామూలుంది తెల్సా?" అని కోపంగా అడిగాడు.

    "అవసరమైనోడు నా దగ్గరికి ఒత్తాడు. మద్దె నీ ఊసేంటి?

    "సూసుకో నీ పని సెప్తా" మీసం దువ్వాడు వెంకన్న.

    "పోరా తాగుమోతు కొడుకా."   

    వెంకన్న కళ్ళు ఎర్రబడ్డాయి హుంకరించాడు. "మామూలిత్తావా సెంపదరగొట్టనా" అంటూ వీరయ్య మీదకు వెళ్లాడు. కలియబడ్డాడు. కుస్తీ ప్రారంభమయింది. తక్కిన జనం అందరూ వింతగా సరదాగా చూస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. చుట్టుపక్కల గుడిసెల్లోంచి ఆడవాళ్ళు కూడా -కొందరు పిల్లల్ని చంకన వేసుకుని మరీ వచ్చారు. ఈ కలహానికి కారణమేమిటో ఆతురతతో వాకబు చేస్తున్నారు.

    వీరా బలంగా వెంకన్నని తన్నాడు. వెంకన్న గిర్రున తిరిగి ఇసుకలో పడ్డాడు. మళ్ళీ లేవలేకపోయాడు. నోట్లోంచి నురగ వస్తోంటే తుడుచుకుంటూ బూతులు తిడుతున్నాడు. జుట్టునెరిసిన ఒక ముసలాడు యింకా మీదకు లంఘించే వీరయ్యని ఆపి "ఇంక సాల్లే. నువ్వెళ్లు యీరయ్యా" అన్నాడు. వీరయ్య వొళ్ళు దులుపుకొని సముద్రంవైపు వెళ్ళిపోయాడు. వెంకన్న లేచి గాలిలో పిడికిలి కొట్టుతూ బూతులు తిడుతూ తూలుతూ వెళ్ళాడు. నల్లగా మాసిన గుడ్డలతో చింపిరి తలలతో కళలేని కళ్ళతో, నీరసంగా వెకిలిగా నవ్వుకుంటూ తక్కినవాళ్ళు విడిపోయారు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.