Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
2
వెన్నెల మరికాస్త వచ్చింది. నీడలు చిన్నవయాయి. పల్లె అంతా నిశ్శబ్దంగా ఉంది. కొందరు మాత్రం ఇళ్ళ కివతల ఇసుకలో పడుకున్నారు. అర్ధంలేకుండా అంతటా వ్యాపించిన ఆకాశాన్నీ చుక్కల్నీ చూస్తో పడుకున్న వీరయ్యకి క్రమంగా నిద్రపట్టింది.
నిద్రా మాయ మసక మడతల్లో జడమైన వీరా మనస్సుకి ఏదో తగిలినట్టయింది. కళ్ళు తెరిచాడు.
"అస్సె- ఏంటదీ" అన్నాడు బద్దకంగా. కిలకిల నవ్వింది నరసమ్మ. "అపుడే నిదరేంటీ" అంది.
వీరా దూరంగా ఒత్తిగిల్లాడు. చెవులు దాటి జుట్టు పడుతూంటే, వెనకాల ముడిచుట్టుకుని రవిక లేకుండా పైట కప్పుకున్న నరసమ్మని చూశాడు. తన కోసమని ఒక్కతే యిలా రావడం కొంచెం గర్వం కలిగించింది వీరయ్యకి.
"ఏం ఇలాగొచ్చినావ్?"
"రాకూడదేంటీ!"
"పైట సరిగ్గా యేసుకో. సిగ్గులేదూ!"
"నీ దగ్గరేనా యీరయ్య మాఁవా"
నరసమ్మ దగ్గరగా జరిగింది. ఆమె చనువు వీరాని కంగారు పెట్టింది. కానీ అతనికి మీసాల వెంకన్న జ్ఞాపకం వచ్చాడు. ఏదో చీదరగా అనిపించింది.
"ఇయ్యాల మాంచిలాబం వత్తదేంటీ" అంది నరసమ్మ గోముగా.
"ఎంతలే -ఓ యాభైరూపాయలు" గర్వంగా అన్నాడు వీరయ్య.
"యెన్నెల బాగుందీరయ్యమాఁవా."
వీరా మాట్లాడలేదు.
"ఇక్కడ నీ పక్కనే కూంతసేపు నడుం వాలుత్తా -ఏం?"
వీరా తటపటాయించాడు. నరసమ్మ నవ్వింది. దగ్గరగా వెల్లకిత్తలా పడుకుంది.
వీరా తన చిక్కని నల్లని మీసం సవరించుకున్నాడు. బిగువైన ఆమె రొమ్ము గుండ్రని పిక్కలూ వీరా మనస్సుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వెన్నెలరాత్రీ, స్త్రీ సామీప్యమూ, దృఢమైన అతని ఆరోగ్యమూ మనిషి హేతువును మించిన హేతువుకి ఉద్దీపకాలుగా ఉన్నాయి. ఇటూ అటూ చూశాడు, నిద్రలో నిశ్శబ్దంలో మునిగివుంది పల్లె అంతా. దూరాన గుడిసెలోంచి ఏదో సన్నని ఏడుపు వినవస్తోంది.
"కిందనే తొంగున్నావు నరసమ్మా! నా సదర తీసుకో" అన్నాడు వీరయ్య.
"ఒద్దులే"
వీరయ్య అతి ప్రయత్నం మీద మరొకపక్కకు తిరిగి "సాల్లే నీ యేసాలు నాను లొంగేవాణ్ణికాను" అన్నాడు. నరసమ్మ ఫక్కున నవ్వింది. ఆ నవ్వులో గొప్ప నేర్పూ ధీమా వున్నాయి. అతనిమీద వొరిగి కావలించుకుంది "ఎంత కమ్మగున్న వ్వీరయ్యవాఁవా" అంది.
"లేకపోతే యెదవ యెంకన్న నేంటే" అన్నాడు వీరయ్య. ఆమెను పొదవి పట్టుకొని గుండెలకు హత్తుకున్నాడు.
"ఈ మద్దె మహసిక్కయింది" అంది నరసమ్మ.
"ఏంటే...."
"నానున్న గుడిసె అద్దెకి నిక్కిచ్చిసేత్తన్నాడు సిల్లిగవ్వనేదు."
"ఎంకన్న ఉన్నాడుగా."
"రోజూ కల్లొయిత్తాడుగా. ఇంకేం మిగులుద్ది ఆడిదగ్గిర?"
నరసమ్మ కౌగిలి విడిపించుకుని పక్కకి జరిగింది. వీరయ్య రమ్మంటూ చేతులు చాచాడు.
"అద్దెమాట ఏం సొప్పావు మాఁవా?" అంది నరసమ్మ.
"రారా" అన్నాడు వీరయ్య.
"అయిదు రూపాయ లిప్పిత్తావా?"
"నా దగ్గర నేదు"
"అదేంటి మాఁవా, నీదాన్ని కాదా?"
"నా దగ్గరనేదు"
"పోనీ మూడు రూపాయలియ్యి కట్టం గడుపు."
"నా దగ్గర నేదు."
నరసమ్మ చివాలున లేచింది. "అయితే నేరాను" అంది విసురుగా. వీరాకి కోపం వచ్చింది, సిగ్గువేసింది, అసహ్యం వేసింది. వెన్నెలలాంటి చంద్రి నవ్వు, స్నేహమూ కళ్ళముందు నిలిచాయి. "పో పో ముండా. డబ్బుకోసం వొచ్చినావ్ పింజారిముండా. ఛీ! ఛీ!" అని అరిచాడు.
"ఉత్తనే అన్నాను మాఁవా" అంది నరసమ్మ, పరిస్థితి చెయ్యిదాటుతోందని గ్రహించి.



