Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


       
    కొంచెం కొంచెం వెన్నెల వస్తోంది. వెళ్ళిపోయే నరసమ్మనీ, వెంకన్ననీ చూస్తూ ఉండిపోయాడు వీరయ్య. తమ్ముడు గుడిసెలోంచి పిల్చాడు. వొళ్ళు విరుచుకొని నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు.

    వీరయ్యకి వడ్డించి నూకయ్య కుండ పెంకులో తనకి అన్నం పెట్టుకున్నాడు. బుడ్డి దీపపు వెలుగులో ఇద్దరూ వికృతంగా ఉన్నారు.

    "ఎన్ని రూపాయ లొత్తయ్ నిజం సొప్పు" అన్నాడు నూకయ్య.

    "యాభై."

    "అమ్మో అమ్మో" నూకయ్య నోట్లో ముద్ద ముద్దలాగే వుండిపోయింది.

    "ఆడు -ఆ యెంకన్న కళ్ళొడొసుకుంటున్నాడు" అన్నాడు వీరయ్య.

    "ఏం సేత్తవ్ అంత డబ్బు?" అన్నాడు నూకయ్య. వాడి దృష్టి డబ్బుమీదే వుంది.
    "నీకో లాగూ సొక్కా కుట్టిత్తాలే."

    నూకయ్య గబుక్కున చప్పట్లు కొట్టాడు. ఎడం చెయ్యికూడా పులుసుతో తడి అయింది. తొందరగా కాళ్ళకి రాసేశాడు. ఇంక తన్ని పంచబూతాలూ చులాగ్గా స్వంతం లాగా స్పృశించలేవు. తను వాటిని తొడుక్కుని తిరణాల కెళ్ళితే....!

    "సెందిరికో సీర కొంటాను" అన్నాడు వీరయ్య.

    "అమ్మో అమ్మో!"

    "బాబుకో దుప్పటి కొంటాను."

    "అమ్మో, అమ్మో!"

    "పాపం! బాబు ఏం సేత్తుండాడో ముసిలోడు."

    నూకయ్య దిగులుపడ్డాడు. బాబుని చూడాలనే కోరిక వాడిలో చాలాకాలం నుంచి గూడుకట్టుకుని వుంది.

    "మరి డబ్బంతా అయిపోయినాక ఏంటి సేసేది?" అన్నాడు నూకయ్య కాస్సేపు ఆలోచించి.

    వీరా మొహం నల్లబడింది. డబ్బుతో ఇదీ అదీ కొంటే ఇంక మిగిలేది ఏమీ వుండదనే జ్ఞానం చురుక్కున గుండెకి తగిలింది. తిరిగి డబ్బులేక ఆ సముద్రపు నీళ్ళల్లో గెడవేసుకుంటూ పోవాలి. అలాగే బతికినన్నాళ్ళూ పోతూవుండాలి. వీరయ్యకు కోపం వచ్చింది. కంచం ఓ పక్కకు విసురుగా తోసి ఇలా అన్నాడు.

    "ఏంచ్పా నూరాస నీక్కూడెట్టాలి. ముసిలోడికి డబ్బివ్వాలి. ఎవడు సేత్తాడిదంతా! తెచ్చిన కూంతా మీకే అయిపోతది. పో. నువ్వు వేరేపోయి నీ బతుకు నువ్వు చూసుకో. నాకెందుకు మీ అందరి వూసూ."

    అన్న హఠాత్ కోపం నూకయ్యకి అర్ధం కాలేదు. ఏడుపు వచ్చింది. వీరయ్య ఇవతలకి వచ్చి బండమీద కూర్చుని చుట్ట ముట్టించాడు. తిన్న అన్నమంతా కడుపులో విరిగిపోయినట్టయింది. ఆ చౌదరిలాగ ఖర్చుపెట్టినా తరగని డబ్బు ఎలాగ సంపాదించడం? తన సెందిరిని మనువుసేసుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం ఎలాగ? ఈ సమస్యకి తుదీ మొదలూ తేల్చుకోలేక వీరయ్య నిస్సహాయంగా ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు.

    గుడ్డివెన్నెల అంతటా ఆవరించుకుంది. పల్లెవాళ్ళ గుడిసెల నీడలు పొడుగ్గా సాచుకుని వున్నాయి. ఇసుకనేల తరంగాలులేని సముద్రుడిలాగ వుంది.ఓ ముసలివాడు కర్రని చప్పుడుచేస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వీరయ్య దగ్గరకే వచ్చాడు.
 
    "ఓస్ గవరయ్య మాఁవా, రా. రా" అంటూ లేచి ముసలాణ్ణి జాగ్రత్తగా బండమీద కూర్చోబెట్టాడు. గురవయ్యకి కళ్ళు కనపడవు. బాగా వంగిపోయాడు. ముసలివాడైపోయాడు.  "ఏరా యీరా, బాగా సేపలు పడ్డాయిటగా" అన్నాడు.

    "ఏదోలే మాఁవా"

    "సరిసర్లే అందరూ ఇదే మాట. జాగర్త్తరో అబ్బీ, పదిలంగా వుండు. అందరికీ శానా కష్టంగా వుంది."

    "ఆళ్ళదేం తిన్నానా?"

    "ఈ మాట సొప్పటానికే వొచ్చాన్రా, పోతా పోతా" అంటూ ముసలాడు లేచాడు.

    "మళ్ళీ అంతదూరం యెల్లలేవు. ఇక్కడే తొంగో మాఁవా" అన్నాడు వీరయ్య.

    "రోజూ మీ అత్త కల్లోకి వత్తందిరా. నన్ను కూడా రమ్మంటందిరా" అని ఆగి గవరయ్య "బాబూ యిలారా" అన్నాడు. వీరయ్య దగ్గర కెళ్ళాడు. వీరయ్య వొళ్ళునిమురుతూ.  "ఇంక ఎప్పుడో జీవుడు లేచిపోతాడ్రా అబ్బీ. సత్తే నా గుమ్మందగ్గరే సత్తాను. అక్కడే మీ అత్తా పానం వదిలింది . ఓ మారు నిన్ను సూద్దామని బుద్దయింది. మనోళ్ళల్లో మీరే గదరా మిగిలిందీ. ఏడీ నూకడు? నిదరోనియ్యి. లేపమాకు" అంటూ వణకుతూ కర్రతో దారి చూసుకుంటూ గవరయ్య వెళ్ళిపోయాడు. వీరయ్య గుండెల్లో తెలీని బాధ కలిగింది. గవరయ్య చెల్లెలే తన తల్లి. మామ చెప్పినట్లు మూడు నాలుగు కుటుంబాలు బందరు వదలి ఎప్పుడో ఈ వూరు వచ్చేశారు. ఇక్కడ ఒక్కొక్కళ్ళే సముద్రానికీ, ఆకలికీ, రోగాలకీ ఆహుతి అయిపోయారు. తనే మిగిలాడు. గవరయ్య మావకూడా చచ్చిపోతాడు. బాబుకూడా చచ్చిపోతాడు. గవరయ్య మావకి అత్తంటే ప్రాణంలో ప్రాణం. ఆమె పోవడంతో మతిలేనివాడయిపోయాడు. అత్త తనకి చేగోడీలు చేసి పెట్టేది. అత్త చచ్చిపోయింది. అందరూ చచ్చిపోయారు. తన కెవరున్నారు? బావురుమని ఏడవాలనిపించింది. కాని చంద్రి జ్ఞాపకం వచ్చింది. తమ్ముడు  నూకడు జ్ఞాపకం వచ్చాడు. గబగబా గుడిసెలోకి వెళ్ళాడు. నూకడు నేల మీద పడుకుని నిద్రపోతున్నాడు. వాడి కళ్ళమ్మట కారిన నీటిచార బుడ్డిదీపపు వెలుగులో నల్లగా కనపడుతోంది. వీరయ్య పరీక్షదా చూశాడు. వాడి వళ్ళంతా ప్రేమగా తడిమాడు. అక్కడున్న నులకమంచం వాల్చి, తముణ్ణి రెండు చేతులతో ఎత్తి దానిమీద పడుకోబెట్టాడు. తానొక చదర తీసుకొని బయటికి వచ్చి. ఇసుకమీద పరిచాడు.

    "చెంద్రి రాలేదేం ఇయ్యేల" అనుకున్నాడు గట్టిగా. ఇంకా ఆశతో ఆమెకోసమే అన్నట్టు చూస్తూ చదరమీద కూర్చున్నాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.