Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


           
                                  సముద్రపు అంచులు
    మసక మసక చీకట్లో పల్లెవాళ్ళ గుడిసెలన్నీ చిన్న చిన్న పడవల్లా వున్నాయి. ఇక్కడా అక్కడా యిసుక నేలమీద కూర్చుని పొడుగాటి చుట్టలు కాల్చుకుంటూ పల్లెవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. దూరంగా సముద్రపుహోరు వినబడుతోంది. సముద్రం మీదనుంచి వచ్చే చల్లని ఉప్పన గాలికి గుడిసెలమీద ఆకులు కదలి చప్పుడు చేస్తున్నాయి. చూరులోంచి నల్లనల్లని పొగా, చేపల కూరవాసనా రుచి రుచిగా వెగటు వెగటుగా వస్తున్నాయి.

    ఈ మధ్య వీరయ్య వాళ్ళందరితోనూ కలవడంలేదు. తన గుడిసెముందు ఒక పెద్ద బండరాయిమీద కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తమ్ముడు నూకయ్య ఆరేసిన చేప లన్నిటినీ యీతాకు బుట్టలోకి ఎత్తుతున్నాడు. అక్కడికి కొంచెం దూరంలో మీసాల వెంకన్న నవ్వు బొంగురుగా గోదురుకప్ప అరచినట్లు వినవస్తోంది.

    "ఓ మాఁవా నా వొల్లు నీ వొల్లుకి తగిల్తే జబ్బు ఒదల్తది" అన్న నరసమ్మ ఆడగొంతు సన్నగా విభిన్నంగా వినబడుతోంది. ఆ గుంపుకాని, వాళ్ళు కులాసాగాని వీరయ్యని ఆకర్షించలేదు.

    "అన్ని చేపలు లోపలెట్టాను. మరేంటి సేసేదీ?" అన్నాడు నూకయ్య చేతులు దులుపుకుంటూ.

    "ఏంటీ లేదు." వీరయ్య తమ్ముడి కేసి చూసి అన్నాడు. "ఎల్లి గంజార్సు నాకాకలేత్తంది"

    నూకయ్య గుడిసెలోకి వెళ్ళిపోయాడు. వీరయ్య తన ఆలోచనలో ఆగినచోటు కనుక్కుని ముందుకు సాగాడు.

    వీరయ్య అదృష్టం యీవాళ పండింది. తన జీవితంలో అన్ని చేపలు ఎన్నడూ తను చూడలేదు. పెద్దవీ, చిన్నవీ రంగురంగులవీ బలిష్టమైనవీ, తన గుడిసె పట్టనన్ని చేపలు దొరికాయి. రోజూ ఏడుపుగా వెళ్ళిపోయే తన బ్రతుకులో ఏదో ఆశ కదలి మిలమిల లాడింది. పెద్దచేపకు రెండు రూపాయలు తక్కువరావు. తనకున్న చిల్లర అప్పులూ, బాకీలు అన్నీ తీర్చుకోవచ్చును. పైగా పొరుగూళ్ళో దగ్గుతో బాధపడే ముసలి తండ్రికి ఓ దుప్పటీ, తమ్ముడికి రెండు యీజార్లూ కొంటాడు. చంద్రికి -తక్కువలో వస్తే ఎర్రంచుల ఆకుపచ్చచీర ఒకటి కొంటాడు.

    ఈవేళ బాబు దగ్గరుంటే ఎంత సంతోషించును! పుట్టినప్పుట్నుంచీ యిక్కడే వుండి ఈ చేపల నమ్ముకుంటూ తింటానికి తిండిలేక - పాపం చివరికి కీళ్ళజబ్బు వచ్చి ఊరుకాని వూళ్ళో ఒక్కడూ వుంటున్నాడు. సత్తెమ్మ మాత్రం ఏదో యింత కాచిపోస్తోంది.
 
    ఊరు విడిచి వెళ్ళిపోతూ యిలా అన్నాడు బాబు "అబ్బీ! ఈ సముద్రం నా పానాలు మింగేసింది. ఈ మమ్మారిని వదిలి కూలిపనిచేసుకో కుర్రాడా"

    నిజంగా యీ సముద్రం అంటే తనకీ ఎంతో భయం. చిన్నప్పట్నుంచీ ఈ సముద్రాన్ని తానెరుగును -ఆ యిసుకవొడ్డుని, బలంగా కోపంగా వస్తూ ఠక్కున విరిగిపోయే కెరటాల్నీ, లోతులకి చొచ్చుకుపోయే నీలాల్నీ, లోతు లోతుల్నీ మెరకల్నీ అతనెరుగుదును. ఇంకా సూరీడు దూరంగా సముద్రంలోంచి ఎర్రగా పైకి లేవకముందే పడవ చెక్కలమర్చుకుని, నూకయ్యను కూర్చోబెట్టుకుని నీళ్ళల్లోకి వెళ్ళిపోతాడు. కొండ అంచులు తడిసిపోయే చివరికంటా వెళతాడు. వలవేస్తూ తీస్తూ, సంజెవేళ్ళకి ఒళ్ళంతా నొప్పులతో కొత్తగా భయంగా భూమ్మీద అడుగుపెడతాడు. శ్రమ తప్ప ఏమీ లాభం కనపడలేదు. ఏమైనా ఉన్నట్టయితే పన్నులు వసూలు చేసే చౌదరి ఆ కాస్తా కాజేస్తాడు.

    అటువైపంతా భూమి? అంతులేని భూమి. పచ్చగా నల్లగా గట్టిగా ఎక్కడికో ఎక్కడికో పరచుకొని కోట్లకొలది జనానికి తల్లిలాగ ఆధారంగా వుంది. ఆ భూమ్మీద వుండే వాళ్ళకి ఎందుకో బలమూ, నవ్వూ, కులాసా ఉంటాయి. తనూ, చంద్రీ యిటికలతో కట్టుకున్న ఓ చిన్న యింట్లో వుంటే -

    మరి తను ఎందుకు భూమి అంతమయిందని తెలిసే ఇక్కడ......ఈ జాలి లేని సుఖం లేని సముద్రపు ఉప్పని నీళ్ళల్లో, తన తిండిని వెతుక్కుంటున్నాడు ఆ సముద్రంలో వుండే చేపలలాగా. తానుకూడా భూమ్మీదకి వెళ్ళి బ్రతకలేడా? ఇలాగ శ్రమపడి తనూ బాబులాగ అయిపోతాడా? మొన్న మొన్న రంగణ్ణి చూశాడు! తనలాగే మాంచి వయస్సులో ఉన్నవాడైనా, పెదవుల దగ్గర ఏడుపులాంటి నవ్వూ, కళ్ళ చుట్టూ నల్లని ముసలితనం వేలాడుతూండడం చూస్తే తనకి బెంగా, దిగులూ కలిగాయి. చౌదరి మొన్న పెళ్ళాంతో పిల్లతో షికారువచ్చాడు. నిండుగా పచ్చగా గుమ్మడి తీగలలాగా ఉన్నారు. దేబరితనం విసుగూ రోతా వాళ్ళ మొహాల్లో లేవు. తనకీ అలా వుండాలనిపించింది. మీసాల వెంకన్నలాగ పెళ్ళిచేసుకోక, ఒళ్ళు పాడైపోయిన నీతిలేని నరసమ్మ చుట్టూ తిరుగుతూ అసహ్యంగా మోటుగా అయిపోతే, ఛీ ఆ నరసమ్మలో ఏముంది? పెద్ద పెద్ద రొమ్ములేసుకు తిరిగితే తనను లోబడతాననుకుంది కాబోలు, చంద్రి తనకి వుండగా యిలాంటి ముండల్ని తన దగ్గరకు రానిస్తాడా? సత్తెమ్మని చూస్తే తెలియడంలేదూ, బాబు పెద్ద పెద్ద కండల్నీ గుండెల్నీ తినేసింది.

    వీరయ్య గుండెలో రూపాయలు చప్పుడయాయి. గట్టిగా నవ్వాడు. నవ్వు గాలిహోరులో మడతలు పడిపోయింది. గుడిసెలోంచి చేపలకూర వాసన వస్తోంది. ఇంతలో వెంకన్న వీరా యింటివైపు వస్తున్నాడు. వెనకాల ముగ్గురు నలుగురు బెస్తవాళ్ళున్నారు. నరసమ్మ ముందుగా నడుస్తూ ఏదో పాడుతోంది. -చేతులు తిప్పుతూ.

    "ఇయ్యాలే రేతిరికొత్తాను యీరయ్యమాఁవా" అంది నరసమ్మ. అందరూ నవ్వారు. వీరయ్య యేవగింపుతో  "పోయేముండా" అన్నాడు. వెంకన్న ముందుకొచ్చి "ఏం నీ సెందిరికన్న బాగూనేదూ?" అన్నాడు.

    "దానితో సాటేంటి థూ!" అన్నాడు దూరంగా జరిగి వీరయ్య.

    "ఈపు సెక్కెగుర్తది జాగ్రత్త" అన్నాడు వెంకన్న.

    "ముందు నీ ఈపు సూసుకో" నిర్లక్ష్యంగా అన్నాడు వీరయ్య. నరసమ్మ కొప్పు సవరించుకుంది. గహాజులు గలగలలాడేటట్టు చెయ్యివూపుతూ  "సూత్తాంగా నీ సెంద్రమ్మ గుణం. నీకు తెలీకుండా అ...ది" అంటూ ముందుకు సాగిపోయింది.
 
    వెంకన్న భళ్ళున నవ్వుతూ ఆమె వెనకాలే వెళ్ళాడు. "అబ్బో! మాలావు పెద్దమడిసే యీడు" అన్నాడు. అందరూ మరింత పెద్దగా నవ్వి అక్కణ్ణుంచి కదలి పోయారు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.