Home » D Kameshwari » D Kameswari Kathalu
ఫోటో - ఫ్రేమ్
'నమస్తే దాదిమా, పవిత్ర వుందా-' లోపలికొచ్చి రాజ్యలక్ష్మి కాళ్లకి దండం పెడ్తూ వినయంగా అడిగాడు విశ్వాస్.
'నీవా బాబూ, దా, కూర్చో. స్నానం చేస్తున్నట్లుంది, పిలుస్తా... రా నాయనా, ఇలా వచ్చి కూర్చో' ఆప్యాయంగా పక్కన కూర్చోమని ఆహ్వానించింది.
"ఇంకా స్నానంలోనే వుందా - శ్రవణ్ ని తీసుకు స్కూలుకి వెళ్లాలని రమ్మంది-'
'నీలమ్మా - చిన్నమ్మగారికెళ్లి చెప్పు, విశ్వాస్ బాబు వచ్చారని-' పనిమనిషికి చెప్పి.
'చాలా రోజులయింది బాబూ వచ్చి, కనపడడమే మానేశావు-' అంది అభిమానంగా.
'ఎక్కడ దాదీమా - పదిరోజులు బొంబాయి వెళ్లాను - ఆఫీసునించి వచ్చేసరికే తొమ్మిది, ఆదివారాలు పై వూర్లకి వెళ్లడం, శ్రవణ్ ని చూడడానికైనా కుదరడం లేదు.
'అంతేలే నాయనా, ఒక ఇంట్లో వుంటూనే మొగుడు పెళ్లాలు రాత్రిపూటే మొహాలు చూసుకునే రోజులు ఇవి. ఏం పాడు ఉద్యోగాలో, ఆడ మగ ఇద్దరికిద్దరు ఎవరి దారి వారిదయిపోయింది." మాటలు విని లోపల్నించి వచ్చిన కళ్యాణి విశ్వాస్ ని చూసి పలకరింపుగా నవ్వి 'విశ్వాస్, చాలా రోజులయింది వచ్చి' అంది - విశ్వాస్ ఆవిడ కాళ్లకీ దండం పెట్టి 'మాజీ, ఎలా వున్నారు - కాలేజీకి ఇంకా సెలవులు ఇవ్వలేదా-' అంటూ పలకరించాడు. 'పరీక్షలయినా మాకు పనులు ఇంకా వుంటాయిగా రిజల్స్ ఎనౌన్స్ చేసేవరకు. వెళ్లిపోకు, ఫలహారం చేసి వెడుదుగాని దోశెలు వేస్తున్నాను' అంది. 'ష్యూర్, మీ చేతి దోశె తినడం ఒక ఆనందం. శ్రవణ్ ఏడి కనపడలేదు-' ఆరా తీశాడు. - 'శ్రవణ్' కళ్యాణి గట్టిగా పిలిచింది - తాతగారితో మేడమీద కూర్చుని టీవీలో కార్టూన్ చూస్తున్న శ్రవణ్ మేడ మీదనించి విశ్వాస్ ని చూసి 'డాడీ' అంటూ పరిగెత్తి కిందికి వచ్చాడు - విశ్వాస్ కొడుకుని ఎగరేసి ఎత్తుకుని గుండెలకి హత్తుకుని, బుగ్గమీద ముద్దు పెట్టాడు - 'ఏయ్, ఏం చేస్తున్నావు-' మురిపెంగా అడిగాడు.
'కార్టూన్ చూస్తున్నాను - డాడీ, పో, నీతో మాట్లాడను - లాస్ట్ సండే రాలేదు నీవు.'
'వూర్లో లేనురా, బొంబాయి వెళ్లాను - సారీ, వెరీ సారీ....' అన్నాడు విశ్వాస్ కొడుకు జుత్తు ప్రేమగా పైకి తోస్తూ - రెండు వేళ్లు మడిచి 'రెండు సండేలు ఆబ్సెంట్' అంటూ 'రెండు ఐస్ క్రీములు బాకీ నాకు' ముద్దుగా చూపిస్తూ అన్నాడు. విశ్వాస్ నవ్వి 'ఓకే, గ్రాంటెడ్' అన్నాడు. మేడ మీద నించి దిగివస్తూ 'సారీ, వెయిట్ చేయించాను' అంటూ పవిత్ర ఎంతో ఫ్రెష్ గా తాజా పువ్వులా చక్కని సువాసనలు వెదజల్లుతూ వచ్చిన ఆమెని ఒక్క క్షణం మైమరుపుతో చూస్తుండిపోయాడు - పసుపు రంగు హాండ్ లూమ్ కుర్తా, నల్లరంగు సల్వార్, పైన నిర్లక్ష్యంగా వేసుకున్న పువ్వుల ఆరెంజ్ చున్ని, జుత్తుకు పెట్టిన క్లిప్, పల్చగా వేసుకున్న లిప్ స్టిక్ భుజాన పెద్ద హ్యాండ్ లూమ్ హేండ్ బ్యాగ్, చాలా క్యాజువల్ గా, సింపుల్ గా అలంకరించుకున్న పవిత్రలో ప్రత్యేకత అదే - నిర్లక్ష్యంగా ఏదో ఒక డ్రస్సు వేసుకొని హడావిడిగా తయారయినా దిద్దినట్టుండే కనుబొమలు, వత్తయిన నల్ల జుత్తు, తెలుపు ఎరుపు కల్సిన దేహచ్ఛాయ, కొద్దిగా కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా ఎర్రబడిపోయే ముక్కు చివర... హడావిడిగా పరిగెడ్తున్నట్టుండే నడక, కనిపించిన వారందరితో చేతులూపుతూ పలకరించే స్నేహపూరిత చూపులు.. చెప్పదలచింది దాపరికం లేకుండా సూటిగా చెప్పేసే నిజాయితీ, ఏ సమస్య అయినా తెలివిగా పరిష్కరించగలిగే విజ్ఞానం పెద్ద కళ్లలో ప్రతిఫలిస్తూంటుంది - అలాంటి పవిత్రని చూసే ఆమె పట్ల ఆకర్షితుడైంది. అతని చూపు గుర్తించి కాస్తంత ఇబ్బంది పడ్తూ - 'వెడదామా... తొమ్మిది గంటలకి అపాయింట్ మెంట్ ఇచ్చింది ప్రిన్సిపల్' అంది. 'ఉండవే, టిఫిను తిని వెళ్లండి' - దోసెలు పట్టుకొస్తూ అంది కళ్యాణి - 'టైము లేదమ్మా - తొమ్మిదికక్కడ వుండాలి - ఓ అరటిపండు వలుచుకుని తిని, జ్యూస్ గ్లాసులో పోసుకుని తాగింది. 'నీకక్కరలేకపోతే మానేయ్ విశ్వాస్ తింటాడు - 'ఆ అబ్బాయికి దోసెలిష్టం - కూర్చో విశ్వాస్' 'అబ్బ టైములేదు అమ్మా!' "జస్ట్ టూ మినిట్స్ - మమ్మీజీ బాధపడ్డారు తినకపోతే' విశ్వాస్ గబగబ తినడం మొదలుపెట్టాడు. 'మమ్మీవంక ఎందుకు దోసెలంటే టెంప్టేషన్ అని చెప్పకూడదూ-' పవిత్ర అంది నవ్వుతూ.
'ఏమిటి హడావిడి, విశ్వాస్, నీవెప్పుడు వచ్చావు నాకెవరూ చెప్పలేదే - 'మేడమీద నించి కిందికి దిగివస్తూ అన్నారు రంగారావు - గబగబ ఫలహారం చేస్తూనే కాస్త వంగి ఆయన పాదాలు అంటీ అంటనట్టు నమస్కారం చేస్తూ 'సారీ, మీరు రాకుండానే టిఫిను తినేస్తున్నాను. శ్రవణ్ స్కూలు అడ్మిషన్ కోసం వెళ్లాలంటే వచ్చాను. మరోసారి కలుద్దాం... బై.... కాఫీ వద్దు మాజీ...' గబగబ వాష్ బేసిన్ దగ్గిర చేయి కడుక్కుని పవిత్ర వెనకాతలే బయటికి నడిచాడు శ్రవణ్ ని ఎత్తుకుని -
కారులో ఎక్కాక 'ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకొంటున్నావు - నాకేం చెప్పనే లేదు -' 'ఎక్కడ రెండుసార్లు ఫోను చేశాను, దొరకలేదు నీవు - రెండు స్కూల్సుకి అప్లై చేశాను. మొన్న ఒకదానికి వెళ్ళొస్తే పేరెంట్స్ ఇద్దరూ రావాలంది ప్రిన్సిపల్ - స్టుపిడ్ ఉమన్ 'డైవొర్సి' అన్నా, పేరెంట్స్ ఇద్దరూ వుండాలంటుంది. నాకు ఒళ్లు మండి ఏ మొగుడ్ని తీసుకురాను' అన్నా - ఆవిడగారి వాదన ఏమిటంటే సింగిల్ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లల సైకాలజీ కాస్త సరిగా వుండదుట..."
'మే బి. షి ఈజ్ రైట్.... కాని ఆ కారణంగా స్కూలు అడ్మిషన్ ఇవ్వననడానికి లేదుగా, తల్లి గాడ్డియన్ గా వుండచ్చుగా..."
'ఏమో ఆ స్కూలు రూల్సు నాకు తెలియవు - ఇప్పుడు మనం వెళ్లేది 'లిటల్ బడ్స్' స్కూలుకి - అక్కడ మనం డైవోర్సు విషయం చెప్పకపోవడం మంచిదేమో, అవసరం అయితే పేరెంట్స్ మీటింగుకి దానికి రావడానికి నీకేం అభ్యంతరం వుండదుగదా. పిల్లాడు ఎక్కడ వున్నాడన్న ప్రశ్నకి తావు లేదుగదా డైవోర్సు తీసుకున్నాం అని చెప్పకపోతే ఏం."
'ఐ థింక్ యూ ఆర్ రైట్ - బాబు విషయంలో బాధ్యత మనిద్దరిది అని ముందే అనుకున్నాం గదా - ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాడికి నేనుంటాను- ఒళ్లో శ్రవణ్ ని ముద్దుపెట్టుకుంటూ అన్నాడు. పవిత్ర తండ్రి కొడుకులని తృప్తిగా చూసింది -
'నర్సరీలో అడ్మిషన్ కింత తతంగం - పేరెంట్స్ కి ఇంటర్వ్యూలు.. డొనేషన్లు.. టూమచ్....' అంది పవిత్ర - 'సారీ ఈ పూట ఆఫీసుకి లేటవుతావు. సారీ ఫర్ దట్. ఈ రోజు నేను సెలవు తీసుకొన్నాను."
"సరే ఎలాగూ లేటవుతాను - నేనూ ఆఫ్ తీసుకుంటాను. శ్రవణ్ ని తీసుకుని ఎటన్నా వెళ్లి హోటల్లో భోంచేసి వద్దాం - చాలా రోజులయింది వాడితో గడిపి -' విశ్వాస్ అన్నాడు.
'డాడీ... ఐ లవ్ యూ డాడీ' శ్రవణ్ సంతోషంగా తండ్రి మెడ కావలించుకున్నాడు.
* * * * *





