Home » D Kameshwari » D Kameswari Kathalu
'లేచావా, టీ పెట్టనా, చాలాసేపు పడుకుండిపోయావు - ఆఫీసుకి శెలవు పెట్టావా?
"ఎండలో తిరిగి వచ్చేసరికి మత్తు నిద్ర వచ్చేసింది. - ఎలాగో ఆలస్యం అయిందని విశ్వాస్, నేను సెలవు పెట్టి మార్నింగ్ షోకి శ్రవణ్ ని తీసుకువెళ్లి, హోటల్లో భోంచేసి వచ్చాం... ప్లీజ్ నాకూ టీ ఇవ్వవా, మామ్మా' ఆవులిస్తూ అంది పవిత్ర.
'చేస్తున్నాను, తీసుకొస్తానుండు -' ఆవిడ లోపలికెళ్లి రెండు కప్పుల్లో టీ తెచ్చి డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చుంది రాజ్యలక్ష్మి - టీ తాగుతున్న మనవరాలిని ఏదో అడగాలన్న ఆరాటం కనిపించింది.
'శ్రవణ్ కి సీటిచ్చారా-' ఒకటి అడగబోయి మరోటి అడిగింది - 'విశ్వాస్ నెందుకు తీసికెళ్లావు-' ఏం తెలీనట్టే అడిగింది.
"నర్సరీ క్లాసు సీటుకి పెద్ద హడావిడి... పేరెంట్స్ ఇద్దరూ రావాలిట ఇంటర్వ్యూకి. అందుకే రమ్మన్నాను."
"అంటే, తండ్రి లేకపోతే పిల్లలకి స్కూలులో సీటివ్వరా-" అమాయకత నటించింది.
"స్టుపిడ్ రాల్సు వాళ్లూనూ - నేనడగలేదు - అడగాలంటే, అడిగి, వాదన పెట్టుకుని వాళ్లని దబాయించి సాధించుకోగలను - సరే, విశ్వాస్ ఎలాగూ బాబుని కలుస్తూనే వున్నాడు, రమ్మంటే రాననడు, ఎందుకొచ్చిన గొడవ, నాకు ఓపిక లేదు ప్రతివాళ్లకి చెప్పి వాళ్లని ఒప్పించడానికి' విసుగ్గా అంది పవిత్ర.
'అంటే వాళ్ల ఉద్దేశంలో పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరి అవసరం వుంటుంది. కుటుంబ వాతావరణం బాగుండాలి పిల్లలు బాగా చదవాలంటే అనేమో-' గడుసుగా అంది ఆవిడ.
'ఏం, సింగిల్ పేరెంట్స్ దగ్గర ఎంతమంది పిల్లలు లేరు - వాళ్లంతా చదవడం లేదేమిటి. ఏవో వాళ్ల రూల్సు, రెగ్యులేషన్స్ మన నెత్తిన రుద్దుతారు."
రాజ్యలక్ష్మి మనవరాలి వంక ఓ క్షణం చూసి 'పవిత్రా, నిన్ను, విశ్వాస్ ని చూస్తుంటే నాకెంత ఆశ్చర్యంగా వుందో. మీరిద్దరూ ఇంత చక్కగా మాట్లాడుకుంటారు, తిరుగుతారు, నవ్వుతారు - మిమ్మల్ని చూస్తే డైవోర్సు అయిన జంటలాగే అనిపించదు - ఇంత చక్కగా కల్సిపోయిన మీరు విడిపోవడం ఏమిటో నాకర్థం కాదు - విశ్వాస్ ఎంత మంచివాడు - ఎంత అణకువ, నమ్రత, గౌరవం, మనం అంటే ఎంత అభిమానం..."
'అవునవును, కనపడగానే వంగి కాళ్లకి దండాలు పెడ్తుంటాడు గదా. దాదీమా అంటూంటాడుగా - అందుకే నీకిష్టం... ఇంతకీ అతను మంచివాడు కాదని నేననలేదుగా' - నవ్వుతూ అంది.
"మరి అయితే విడాకులెందుకు తీసుకున్నట్టు, నిక్షేపంగా కాపురం చేసుకోకుండా -"
"మొగుడిగా నాకు నచ్చలేదు, ఫ్రెండ్ గా ఓకే, భర్తగా నాకు కావాల్సిన విధంగా లేడు కనుక విదిపోయాను... భర్తగా నన్ను సపోర్ట్ చేయాలి గదా, చేశాడా' ఎదురుప్రశ్న వేసింది.
'ఏమిటోనమ్మా, నీ మాటలు నాకర్థంకావు - మంచివాడే అంటావు - చక్కగా మాట్లాడుకుంటున్నారు - మరి ఏం వచ్చిందే కల్సి వుండడానికి - మరీ వింతగా వున్నాయి తల్లీ నీ మాటలు - ఏం పిల్లలో, ఈ కాలంలో అంటే - డైవోర్సులు, ఆ-అంటే విడిపోవడాలు - సంపాదన చూసుకుని అమ్మాయిలూ మరీ మిడిసిపడుతున్నారు - లోపాలు లేని మనిషి వుంటాడా లోకంలో. శ్రీరామచంద్రుడంతటి వాడిని చాకలి మాటలు విని పెళ్లాన్ని వదిలేశాడు అనలేదూ.'
'మామ్మా నీకు తెలీదు, ఈ మగాళ్లు పెళ్లి కానంత వరకు చక్కగా ఫ్రెండ్లీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తూ తిరుగుతారు - పెళ్లి, మొగుడు అనగానే ఒక ఫ్రేంలో గిరి గీసుకుని ఆ చట్రంలో బిగిసిపోయి 'ఇగోలు' పుట్టుకొస్తాయి - ఇప్పుడు నేను ఇంక పెళ్లాన్ని గాదుగా అంచేత చక్కగా వుంటాడిప్పుడు-పెళ్లాం అనగానే ఎక్కడా లేని ఎక్స్ పెక్టేషన్స్ వుంటాయి మగాళ్లకి....
"ఏం, మీకు లేవా మొగుడు గీసిన గీటు దాటకుండా చెప్పినట్టుండాలి అని... మొగుడు నించి పెళ్ళాం, భార్య నించి మగాడు తమ స్వంతం అనుకునేసరికి యిలా వుండాలనుకోడం తప్పలేదు - స్వంతం అనుకుంటే గదా అనే హక్కు వస్తుంది - వూర్లో వాళ్లు ఇలా వుండాలనుకుంటారా - వాళ్లనంటామా - అనిపించుకుంటామా -'
'నీకేం తెలీదు మామ్మా -' విసుగ్గా అంది పవిత్ర.
'నాకన్నీ తెలుసు అమ్మడూ - కాస్తో కూస్తో చదువు ప్రపంచ జ్ఞానం వున్నదాన్నే - మీలా ఉద్యోగాలు చెయ్యలేదుగాని, మా కాలంలో ఇంటర్ చదవాలంటే, ఇప్పుడు మీ బోడి ఎమ్మేలు పనికి వస్తారా మా ముందు - అదలా వుంచు, ఇందాక ఏదో ఫ్రేమ్, పరిధి అన్నావు చూడు - 'పెళ్లి' అనే పటానికి ఫ్రేమ్ లో బిగించి అద్దం కట్టించాలే అమ్మా. అద్దంలేని, ఫ్రేమ్ లేని ఫోటో నాలుగు రోజులలో వెలసి, మాసి, దుమ్ముకొట్టి, ముడతలు పడి రూపురేఖలు కోల్పోతుంది. పెళ్లి అనేది నాలుగు కాలాల పాటు నిలవాలంటే ఫోటోని భద్రంగా అద్దం కట్టించి కాపాడుకున్నట్టు భార్యా భర్త ఫ్రేమ్ అనే సంసార చట్రంలో యిమిడిపోవడానికి 'అహాన్ని' అద్దానికింద దాచేస్తే భార్య భర్తల సంబంధం నిలుస్తుందే అమ్మా..."
పవిత్ర మామ్మ వంక విస్మయంగా చూసి 'భలే పోలిక చెప్పావులే. వెల్ సెడ్... యూ ఆర్ గ్రేట్.. ఓహో కాలికి మెడకి ముడిపెట్టడం ఇదే గాబోలు-, చట్రం...అన్న మాటకి డెఫినిషన్ బలే ఇచ్చావులే, గుడ్, థాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ థింకింగ్.. విశ్వాకి చెపుతాలే...' నవ్వుతూ అంది.
'నీ పొగడ్తల కోసం కాదులే చెప్పింది - కాస్త ఆలోచిస్తావని - విశ్వాస్ లాంటి మంచి అబ్బాయి నీకెక్కడ దొరుకుతాడే - దొరికినా కొత్తో వింతలాగ నాలుగు రోజులే ఆ ముచ్చట, మళ్లీ నామీద శ్రద్ధలేదు, ప్రేమ లేదు అంటూ మొదలెట్టవా-'
'ఉండు మామ్మా, గోల ఆపు... ఎన్నిసార్లు జరిగాయి ఈ చర్చలు ఇంట్లో-' విసుగ్గా అంది-
'ఎన్నిసార్లు జరిగినా.. నీ మనసు మార్చగలిగామా- అసలు నీవిక్కడ ఉన్నన్ని రోజులూ నీకు ఇబ్బంది తెల్సిరాదు - వేరే ఇల్లు తీసుకుని కొడుకుని పెట్టుకు వుంటే తప్ప వంటరిగా వుండే ఇబ్బందులు అర్థంకావు - ఇంట్లో ఏ బాధ్యత లేకుండా అమ్మా నాన్న చూస్తుంటే దర్జాగా ఉద్యోగం వెలగబెడుతూ ముద్దుగా చూసుకునే తాత అమ్మమ్మల సంరక్షణలో వుంచినన్నాళ్లు నీకేం లోటు కనిపించదు- వేరే వుంటే మొగుడి అవసరం ఈపాటికెప్పుడో అర్థం అయ్యేది-' దెప్పిపొడిచింది.
"మరింకేం నీ కొడుకుతో చెప్పు నన్నింట్లోంచి పంపించేయమని-" తేలిగ్గా నవ్వి అంది.





