Home » D Kameshwari » D Kameswari Kathalu
"అన్నపూర్ణా, పూర్ణా' నారాయణ చేతిలో ఉత్తరంతో వగర్చుకుంటూ వచ్చాడు' అమ్మాయి బావగారి ఉత్తరం.. ఉత్తరం వచ్చిందే' అన్నాడు వగరుస్తూ ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు.
"బావగారి ఉత్తరం ఏమిటిరా.. ఆయన పోయి ఏడాది అయితే" అన్నపూర్ణమ్మ తెల్లపోయింది.
"ఏమో కావాలంటే చూడండి - రిజిష్టర్ ఉత్తరం - ఫ్రమ్ అడ్రసు బావగారి పేరున వుంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకుని చింపి తల్లి పేర వుండడంతో తల్లికి అందించాడు.
'అన్నపూర్ణా - ఈ ఉత్తరం ఇప్పుడెక్కడనించా అని ఆశ్చర్యపడకు - చాలాకాలం కిందటే రాశాను అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణా ఆడదానికి తోడయినా నీడయినా కట్టుకున్నవాడేగాని కన్నవాళ్ళు గాదన్న సత్యం నీవు ఈపాటికి గ్రహించి వుంటావు. నలభై ఏళ్ళలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నీవనుకున్నావు. పిల్లలతో - మీ నాన్న ఇలా, అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను. కాని అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెపితే నీవు నమ్మవు. అనుభవం వస్తేగాని నిజం అర్థం కాదు అని వూరుకున్నాను. కష్టమో, నష్టమో, సుఖమో ఆడదానికి మగాడితోనే వుంటుంది అని నీవు నీ అంతట నీవే తెల్సుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడూ తాపత్రయ పడలేదు. పూర్ణా! మగాడి ప్రేమ నూతి నీరులా నిశ్చలంగా లోతు తెలియనంత వుంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చితో తోడితే అదే దక్కుతుంది. పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నీవు ఒక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు నీకు సరిగా దక్కలేదని వాపోవడం సబబా - తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి ధక్కా మోక్కీలు తినవచ్చు. అంత మాత్రాన బాల్చి దెబ్బ తింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు! నీ విషయంలో అదే జరిగింది. మగాడ్ని, మొగుడ్ని ఆకట్టుకునే తెలివి ఆడదానికుండాలి అది నీకు లేక నా మీదే నిష్టూరాలు వేశావు. కార్యేషు దాసి.. అన్న నానుడిలా తోడయి, నీడయి, తల్లయి ఆడది నిలిస్తే తను గొడుగయి ఆడదానికి చోటివ్వని మగాడెవడు! నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణా పిల్లలెప్పుడో నీడిచ్చే చోటుకి చేరుతారు తప్ప నీడివ్వరు. గొడుగయినా, నీడయినా భర్తే భార్యకి అన్నది చెప్పడానికి నీకీ ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లలని గూటినించి తరిమేసే పశు పక్ష్యాదుల జీవన రీతేసరి అయింది అని నాకనిపిస్తుంది. అందులోనే అందరికి సుఖం వుంది. అని ఎన్నో కేసులు చూపిన లాయరుగా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు, నీ సుఖ జీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో వుంటావో అమ్ముకుంటావో, ఆదుకుంటావో ఏం చేసినా సర్వ హక్కులూ నీవే మిగతాదే పిల్లలకి ఈ ఇల్లు నీదికాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయటపెట్టమని నా మిత్రుడిని ఆదేశించాను. నా అంచనాలు తప్పయి నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం వుండదు. కాని అలా నూటికో కోటికో గాని జరగదని తెలిసే విల్లు రాశాను. నా జీవితానుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి వుంటుంది.
"ఏమ్మా.. ఉత్తరం అందిందా. ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా, పక్కింటివాడ్ని ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్నపూర్ణమ్మా. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవతీతం అది కరగడానికి చిన్నపాటి సెగచాలమ్మా.' అది ఉత్తి అమాయకురాలురా తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది గాని అందులో నీళ్ళున్నాయి అని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా వప్పుకోరురా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం వుంచుకుని చూపించకపోతే ఏం లాభంరా. ఇనప్పెట్టిలో డబ్బుంచుకుని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం. ఎదుటివారికి నీ కస్సు బస్సులే అర్థం అవుతాయిగాని అభిమానం' చూపందే ఎలా అర్థం అవుతుంది అని వాదించేవాడిని. వాడు నవేవాడు ఇనప్పెట్టెలో డబ్బుంది అన్న తృప్తి, అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకి తెలియాలి గాని నేను చెప్పకూడదురా నీవంటే ఇంత ప్రేమ అంత ప్రాణం అని కబుర్లు చెప్పేవాడెప్పుడూ కార్యాచరణలో పెట్టడు. ఐయామ్ మాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొణకని నీటికుండమ్మా. అదిప్పుడు చేసి చూపెట్టాడు చూశావా అమ్మా - ఈ ఇల్లు నీది. ఈ డబ్బు నీది. ఇదిగో నెలకింత అని నీపేర వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు రాఘవయ్యగారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం రకరకాల భావాలతో ఎర్రబడింది.
భర్తపోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ... ఈ రోజు సంవత్సరం తరువాత ఆనాడే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు.
"ప్రభాకర్ ఈ ఫస్టులోగా మీరెక్కడయినా అద్దె ఇల్లు చూసుకుని ఇది ఖాళీ చెయ్యండి బాబూ, ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లపోయాడు. పద్మ మొహం అవమానంతో ఎర్రబడింది.
"ఏమిటి మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా అద్దె ఇల్లు చూడమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు.
"అవును నాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు, నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్నవాళ్ళు నా వాళ్ళు కాదని అర్థం అయ్యాక ఇహనైనా పరలోక చింతతో గడపాలనుకుంటున్నాను శేష జీవితం. ఆస్థినంతా నాపేర వున్నా మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్నచూపు - చూసి ఎన్ని మాటలన్నారో మీకు తెలుసు అలాంటిది, నాలాంటి ఎందరో ముసలివారు ఆస్థి పాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నాకు అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గిర నికృష్ఠ జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరిని ఓ చోట చేర్చి ఒకరికొకరం తోడయి నీడయి కష్టాలలో కష్టాలు పంచుకుంటూ, నా చాతనయిన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరుచుకోవాలని వుంది అందుకు మీనాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికి రెక్కలొచ్చాయి. ఎవరిగూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడయి ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదలి మరో గూడు వెతుక్కోండి బాబూ.. నా బతుక్కి నన్ను వదలండి చేతులు జోడించి అన్న అన్నపూర్ణమ్మని నల్లబడ్డ మొహంతో చూశారు ప్రభాకర్ - పద్మ.
(ఆంధ్రజ్యోతి - 10/04/87)
* * * * *





