Home » D Kameshwari » Kadedi Kadhaku Anarham


 

                                                 బల్ల చెక్క
    
    కోటేశ్వరరావు కోటికి పడగలెత్తిన వాడు. ఆయనకి అందమైన భార్య వుంది. ఆరు ఫ్యాక్టరీ లున్నాయి, ఆరు భవంతులున్నాయి . ఆరు కంపెనీలలో షేర్లున్నాయి. ఆరు బ్యాంకుల్లో ఎకౌంట్లున్నాయి, అరవై లక్షలున్నాయి, ఆరు కార్లు , అరవై మంది నౌకర్లు, ఆరువేల మంది పనివాళ్ళు అయన చేతి కింద వున్నారు. ఆయనింట్లో ఆరు ఎయిర్ కండిషన్లు బెడ్ రూములు , ఆరు రంగుల ఫోన్లు, ఆరు టెలివిజన్లు , ఆరు టేపు రికార్డులు..... ఆరు రకాల సోఫాసెట్లు ఇలా చెప్పాలంటే ఎన్నో వున్నాయి. ఆయనకి.....యిన్ని వున్నాయనకి , యిన్ని రకాల ఆస్థి నంతటినీ అనుభవించటానికి వారసుడు లేడు. కనీసం ఓ కూతురయినా లేదు. నలబై అయిదేళ్ళ కోటేశ్వరరావు , ముప్పై ఐదేళ్ళ విమలాదేవి పదిహేనేళ్ళ నించీ చూడని డాక్టరు లేడు. దర్శించని దేముడు లేడు. డాక్టర్లు ఏం లోపం లేదు పొమ్మన్నారు. దేముడు చుట్టూ ఎంత తిరిగినా యింకా టైము రాలేదన్నట్లు మౌనం వహించి, ఆఖరికి యిన్ని సార్లు తిరిగారు, యిన్ని ముడుపు కట్టారు. పోనీలే పాపం అన్నట్టు ఆఖరికి  ఓ వంశకురాన్ని ప్రసాదించాడు. ఆ సంబరాన్ని ఆ సంతోషాన్ని ఆ వేడుకని ఓ యాభై వేలు మాత్రం ఖర్చు పెట్టి నలుగురికీ గర్వంగా చాటుకున్నారు ఆ దంపతులు.
    ఆ వంశోద్దారకుడు ఆ ఏకైక వారసుడు, ఆ ముద్దులు మూతకట్టే బాబుకి పాలు పట్టేందుకు ఓ నర్సు, స్నానానికి మరో ఆయా, ఆడించడానికి ఓ నర్సు, గుడ్డలుతకతానికో పనిమనిషి, షికారు తిప్పటానికో ఆయా, గుర్రమవడానికో నౌకరు -- యిలా అరడజను మంది నౌకర్లు బాబుని కింద కాలు పెట్టకుండా చేతుల మీద పెంచుతున్నారు. బాబు నోరిప్పి ఏడవకుండా అరడజను మంది హాజరు. ముద్దులు మూతకట్టే ఆ బాబుని చూసి ముద్దులు ఆడుతూ పరవశిస్తారు ఆ తల్లితండ్రులు. ఆ కొడుక్కి, అపురూపంగా పుట్టిన ఆఏకైక బిడ్డ కోసం ఏం చెయ్యనా, ఇంకేం చేసి ఈ ఆస్తిని పదింతలు చెయ్యనా, యింకెన్ని షేర్లు కొననా, యింకెన్ని ఫ్యాక్టరీలు కట్టించనా, ఏం చేసి తన పితృ ప్రేమ నిరూపించుకోనా, అందరు తండ్రుల్లా కాక తన ప్రత్యేకత ఏం చేసి నిరూపించుకోనా అని మధనపడి పడి షాజహాను తాజ్ మహల్ కట్టి ముంతాజ్ మీద ప్రేమ నిరూపించుకున్నట్లు కొడుక్కోసం అతి ప్రత్యేకమైన అపురూపమైన భవంతి కట్టించాలని నిర్ణయించాడు.
    ఆరుగురు అర్కిటేక్చర్స్ అరవై ప్లాన్లు గీశాక అరవై ఒకటో ప్లాను అంగీకరించి అత్యాదినికంగా, అద్భుతంగా , అందంగా పాతిక లక్షలతో భవనం నిర్మాణం ఆరంభించాడు. కొడుకు కూర్చోతానికో గది, మూజిక్కో గది, తాగుడు కో గది, డాన్సుకో గది, అడుకోతానికో హాలు, స్వీమింగ్ పూల్ - యిన్ని గదులకి కొడుకు నాలుగడులు పడకుండా అన్నింటికి ఎటాచ్ బాత్ రూములు, కాలు కదపకుండా కూర్చున్న చోట మీట నొక్కితే తలుపులు మూసుకుంటాయి, మీట నొక్కితే మ్యుజిక్కు , మరో మీట నొక్కితే బారు ఎదుట హాజరు, ఇంకో మీట నొక్కితే పరదాలు తీసుకుంటాయి, మరో మీట నొక్కితే లైట్లారిపోయేట్లు - కాలు కదపకుండా, పెదవి విప్పకుండా ప్రతి గదిలో కూర్చొన్న చోటల్లా మీటలు ఏర్పాటు చేయించాడు. ఇంటికో కాంట్రాక్టరు, లైట్లకో కాంట్రాక్టరు, శానిటరీ ఫిట్టింగ్స్ కో కాంట్రాక్టరు, ఫాన్సు సీలింగుకి ఒక కాంట్రాక్టరు, మొజాయిక్ ఫ్లోరింగ్ కో కాంట్రాక్టు, బారుకో కాంట్రాక్టరు ఇంటీరియర్ డెకరేషన్ కో కాంట్రాక్టర్లు, డజను మంది కాంట్రాక్టర్లు, అరవై మంది మేస్త్రీలు అరవై మంది వడ్రంగి నిపుణులు, ఆరువందల మంది కూలీలతో హుటాహిటిన ఆయనుంటున్న యింటి పక్క రెండెకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభమైంది - లారీల కొద్ది సిమెంటు , ఇసక, లారీల కొద్ది టేకు కలప , ఇటుకలు , ప్రత్యేకం నున్నగా చెక్కించిన కొండరాళ్ళు , మొజాయిక్ పాలరాళ్ళు - సిమెంటు- మిషన్ నిర్విరామంగా పనిచేస్తుంది - టేకు దూలాలు తెగిపడుతున్నాయి. చూస్తుండగా రాత్రికి రాత్రి కుక్క గొడుగు లేచినట్లు భవంతి లేపటం మొదలు పెట్టింది. మరో ఐదు నెలల్లో రాబోయే కొడుకు పుట్టినరోజు కనీవినీ ఏరుగనంత గ్రాండ్ గా , ఎవరూ కనని ఆ భవంతిలో జరపాలని కోటేశ్వరరావు గారి కోరిక - రాత్రింబవళ్ళు పనిచేయించి ఆవేళకి భవన నిర్మాణం పూర్తి అవాలని అయన ఆకాంక్ష. స్వయంగా రోజుకి రెండుసార్లు వెళ్ళి భావన నిర్మాణాన్ని పర్యవేక్షించి రావటం అలవాటయింది.
    ఆరోజు రాత్రి పదిగంటల వరకు బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగు, ఫ్యాక్టరీ లో వర్కర్స్ చేయబోయే స్ట్రయికుని గురించిన సమాలోచనలు, ఇన్ కంటాక్స్ కమీషనర్ తో మీటింగు -- వగైరా వగైరా ఊపిరి సలపని పనులతో సతమతమయి కూడా ఇల్లు చేరగానే అలవాటుగా బిల్డింగు దగ్గరకు వెళ్ళాడు. అప్పటివరకూ పెట్రోమాక్సు సాయంతో సీలింగ్ వేశారు. కాంక్రీటు పని మధ్యలో అపడం కుదరదు గనుక ప్లానింగ్ పూర్తయ్యాక పని ఆపి మేస్త్రీ లు, కూలీలు అప్పుడే యిళ్ళకు వెళ్ళారు. జరిగిన పని చూసి సంతృప్తిగా తల ఆడించి వెనుదిరగబోయిన కోటేశ్వరరావు గారు వెనక నించో, ఎడమ నించో, కుడి నించో ఎటు నించో చీకట్లో వినవచ్చిన రెండు గొంతులు గుర్తు పట్టి సర్ప ద్రస్టలా ఆగిపోయారు. ఆ గొంతుల్లో వొకటి అయన ఇల్లాలు, సతీమణి విమలా దేవిది - రెండోది అయన కార్ల కున్న ఆరడజను డ్రైవర్ల లో ఒకడైన అమ్మగారి స్పెషల్ డ్రైవర్ జేమ్సుది. జేమ్స్ ఆంగ్లో ఇండియన్ అయినా 'ఆంగ్లో' కలర్ తో, అరడుగులతో అందంగా, హుందాగా వేసుకున్న తెల్ల యూనిఫారం కనక తీసేసి కోటేశ్వరరావు గారి సూటేసుకుంటే నల్లగా, పొట్టిగా బట్టతలతో వుండే కోటేశ్వరరావే డ్రైవర్ గా, జేమ్సే యజమానిగా కనిపించే అందమైన కారు డ్రైవరు జేమ్సు. ఆ గొంతులు మాట్లాడుకొనే మాటలు వింటుంటే అయన మెదడు పనిచెయ్యడం మానేసి కేవలం చెవులు మాత్రం పనిచెయసాగాయి.
    "జేమ్స్ నీ కేన్నిసార్లు చెప్పినా ఎందుకు నాతొ ఇలా ఆటలాడుతావు, నేనిలా రావటం , మనిద్దరిని ఈ స్థితిలో నా భర్త గనక చూస్తె నా గతి నీ గతి ఏమవుతాయో తెలియదా?"
    'అవును, నీ అవసరం తీరేవరకు మీ అయన చూస్తారన్న భయం లేకపోయింది. పాపం. నన్ను కవ్వించి, రెచ్చగొట్టి, నీ అంతస్తుకి భయపడి దగ్గరికి చేరడానికి సందేహించే నన్ను మచ్చిక చేసుకుని వల్లో వేసుకుని నీ అవసరం తీర్చుకోడానికి మీ అయన అడ్డు రాలేదు అప్పుడు. వికటంగా నవ్వాడు జేమ్సు - "అవసరం తీరాక - చూడు, యిదిగో ఈ ఇల్లు చూడు - ఇది నిలబడాలంటే కాంక్రీటు ప్లానింగు కావాలి. ఆ స్లాబ్ నిలబడటానికి కింద రాట , పైన బల్ల చెక్కల సపోర్టు కావాలి. స్లాబ్ వేశాక బల్ల చెక్క అవసరం తీరిపోయాక పీకి పారేస్తారు. నీవూ అంతే . నీ యిల్లు నిలబెట్టుకోడానికి నన్ను వాడుకున్నావు. నీ యిల్లు నిలబడింది. నీ అవసరం తీరిపోయింది. ఆ బల్ల చెక్క మాదిరి పీకి పారేశావు దూరంగా" హేళనగా ఎత్తి పొడిచాడు.
    "ఎందుకలా నిష్టూర మాడతావు. నీకెప్పుడు కావలిస్తే అప్పుడు డబ్బు ఇస్తున్నాను......ఇదివరకులా వుండాలంటే ఎలా కుదురుతుంది.... మా ఆయనకి తెలిస్తే....'
    "హు డబ్బు.....అవును, డబ్బు మనుష్యులు మీరు. డబ్బు.....అంతకంటే నీ నించి ఇంకా ఏదో ఆశించి వెర్రి వెధవ నయ్యాను. బెంగపడకు....బల్ల చెక్కకి యిల్లు నిలబెట్టటమే తెల్సు, కానీ కూల్చటం తెలియదు. నీ కోసం కాకపోయినా నా స్వార్ధం కోసమన్నా నీ యిల్లు నిలుపుతాను." విసురుగా వెళ్ళిపోయాడు జేమ్సు. ఆ వెనకే విమలాదేవి వెళ్ళింది.
    కోటేశ్వరరావుగారి మెదడు మరో ఐదు నిమిషాలకి గాని పనిచేయడం ఆరంభించలేదు. అరంభించాక అయన స్థితి వర్ణనాతీతం. బల్లచెక్క....బల్లచెక్క. హు....బల్ల చెక్క. యిల్లు నిలబెడుతుంది.....బల్ల చెక్క...బల్ల చెక్కలతో అయన తల మోదినట్టు దిమ్మెరపోయింది అయన మెదడు.... ఆ భవంతి నిలువునా అయన కళ్ళ ముందే మీదే కూలిపోయింది....ఆషాక్ తట్టుకోడం అయన వశంలో లేకపోయింది. కలలో మాదిరి తాగిన వాడిలా , బాహ్యస్మృతి కోల్పోయి నిర్జీవంగా , నీరసంగా యింటి వైపు నడిచాడు కోటేశ్వరరావు. బల్ల చెక్క .....హు ....బల్లచెక్క తన యిల్లు నిలబెట్టింది! అక్కరలేదు .....తనకీ బల్ల చెక్క అవసరం లేదు. ఇల్లూ అవసరం లేదు. పిచ్చివాడిలా గొణిగాడు అయన.

                                                                                  *    *    *    *

    తెల్లవారేసరికి కోటేశ్వరరావు గారి ఆత్మహత్య వార్త పట్టణమంతా గుప్పుమంది. జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు అయన రాసిన ఉత్తరం చూశాక - లక్షలున్న కోటేశ్వరరావుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందో, చుక్కలాంటి భార్య, ముత్యం లాంటి కొడుకు ఉన్న కోటేశ్వరరావుకి జీవితం మీద విరక్తి ఎందుకు పుట్టిందో అర్ధం కాక ఊరంతా ఆశ్చర్యపోయింది.
    అంతకంటే ఎక్కువగా అయన యావదాస్తి, లక్షలు, ఫ్యాక్టరీలు, షేర్లు , ఇళ్ళు, కార్లు, నగలు , నాణ్యాలు, సమస్త ఆస్థి చారిటీ కింద, ఆస్పత్రులకి, స్కూళ్ళకి, అనాధశ్రమాలకి, కుష్టురోగుల నిలయానికి, అనాధబిడ్డల చదువులకి సత్రాలకి - రకరకాలుగా చెందేట్టు విల్లు రాసి కట్టుకున్న భార్యకి, అపురూపంగా పుట్టిన ఏకైక వంశోద్ధారకుడికి దమ్మిడీ మిగల్చలేదని అయన రాసిన విల్లు తెలిశాక - ఊరంతా మరోసారి ఆశ్చర్యపోయింది. 




Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.