Home » D Kameshwari » Kadedi Kadhaku Anarham



    వీర్రాజు  వీరత్వం యింకో దాన్లో వున్నా మానినా పిల్లలని కనడంలో కనపరిచాడు. ఏడుగురు సంతానం - పదిహేనేళ్ళ నించి ఏడాది వరకు వున్న వేరుశనగ కాయల్లాంటి పిల్లలు, బాలింత చూలింత తప్ప మాములుగా ఎప్పుడూ కనపడని పెళ్ళాం. ముసలి తల్లి వీళ్ళందరికీ వీర్రాజు కిళ్ళీ కొట్టే ఆధారంగా వుండేది - రోజుకి పదిరూపాయలు కళ్ళ చూసేవాడు - ఖర్చులు పోగా నాలుగో ఐదో మిగిలితే తిని తిననట్టు గుట్టుగా సంసారం లాక్కొచ్చాడు యిన్నాళ్ళు.
    యిప్పుడు - అంటే నాలుగు నెలల నించి , కోటమ్మకిళ్ళీ కొట్టు ఎక్కాక వీర్రాజు పని డౌన్ అయిపొయింది. బేరాలు లేక , సరుకు చెల్లక రోజుకి రెండు రూపాయలు కూడా కళ్ళబడకుండా పోయింది. బేరాలు పడిపోవడానికి కారణం కోటమ్మ అన్నది అర్ధం కావడానికి రెండు నెలలు పట్టింది వీర్రాజుకి. అర్ధం చేసుకున్నాక పళ్ళు కొరుక్కుని కోటమ్మని పచ్చి బూతులు మనసులో తిట్టడం మినహా మరేం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు పస్తులుంటున్నారు. అంతమందిని ఏం పెట్టి ఎలా పోషించాలో అర్ధం కాక వీర్రాజు కిందామీదా పడుతున్నాడు. ఇంట్లో అమ్మదగ్గ బిందె, చెంబులు నడిచి వెళ్ళాయి. కొట్లో షోడామిషన్ , నిలువుటద్దం , బెంచీలు , ఒక్కొక్కటే వచ్చిన ధరకి తెగనమ్మడం మినహా మరే దారి లేక పోయింది. వీర్రాజు మొహం చూసి అప్పిచ్చే తల మాసినవాడు ఎవడూ కనపడలేదు. కొట్టు తాకట్టు పెట్టి ఏభై తెచ్చి ఓ నెల తిన్నారు. పిల్లల మొహాలు పీక్కుపోయాయి - ఆకలి చూపులతో ఏం దొరుకుతుందా ఎగరేసుకు పోదామా అని చూడడం తప్ప మరో పని లేకుండా పోయింది వాళ్లకి -- ఆకలితో నీరసంగా నాలుగు బేరాలు రావా అన్నట్టు కొట్టు మీద కూర్చుంటాడు వీర్రాజు -- అర్ధశేరు నూకలన్నా కొనడానికి డబ్బు దొరకదా దాంతో గంజి పోస్తాను అనుకుంటూ ఆశగా గుమ్మంలో కూర్చునేది పెళ్ళాం -- ఆశ నిరాశ అయిపోగా , పిల్లలు ఆస్థిపంజరాలుగా తయారవుతుంటే చూడలేక పెళ్ళాం పాచిపనికి కుదిరింది - పెద్దవాడు కాఫీ హోటల్లో కుదిరి వాడి తిండి ఏర్పాటు వాడు చూసుకున్నాడు. చాతకాని వాడిలా చేతులు ముడుచు కూర్చుని పెళ్ళాం యీ యింట ఆ యింట పని చేసి తెచ్చే చల్లి మెతుకులు తినడానికి అభిమానం అడ్డు వచ్చేది వీర్రాజుకి. చాతకాని తనంతో ఉక్రోషం ముంచుకొచ్చి ఎదురుగా కోటమ్మ కులుకులు తళుకులు చూస్తూ ఉడికిపోయేవాడు! కొట్టు మీద నుంచి లాగి నడి రోడ్డు మీద నిలబెట్టి మొహాన పేడనీళ్ళు కొట్టాలన్నంత కసిగా వుంది. కోటమ్మని కిళ్ళీ కొట్టు ఎందుకు పెట్టావు అనడగడానికి హక్కు లేదు కనుక కోపం దిగమింగుకుని కసి పెంచుకుని కనిపించినపుడల్లా తుపుక్కున ఉమ్మి - నోట్లో దుమ్ము కొట్టింది దీని సిగతరగ అంటూ మెటికలు విరిచి పిల్లి మీద పెట్టి తిట్టి సంతృప్తి పడేవాడు.
    నాలుగు నెలలు గడుచేసరికి మరి మంచి రోజులు వస్తాయన్న ఆశ నిరాశగా మారిపోయింది వీర్రాజుకి. అతని సంసారం కుక్కలు చింపిన విస్తరి అయింది. అతని పిల్లలు వీధిన పడ్డారు.
    ఆరోజు ....గత రెండు రోజులుగా పిల్లలకి గంజినీళ్ళు తలా గ్లాసుడు తప్ప ఘనపదార్ధం కడుపులో పడలేదు. ఆ గంజినీళ్ళు పడి ఇరవై గంటలయింది. బిక్క మొహాలతో , ఆకలి చూపులతో తండ్రి కొట్టు దగ్గిరకొచ్చి నిలబడ్డారు. పిల్లలకి పెట్టేందుకుచివాట్లు తప్ప ఏమి లేవు వీర్రాజు దగ్గిర. తన అశక్తత కళ్ళ ముందు నిలుస్తుంటే చికాకు కోపం ముంచుకు వచ్చి "వెధవల్లారా - ఏడుపు గొట్టు వెధవల్లారా , ఇక్కడ మీకేం పనిరా పొండి..... ఎల్లండి యింటికాడ కెల్లండి -- ఎదవ మొగాలు , ఎప్పుడూ సూసినా ఆకలి తప్ప మరేటి నేదు - పాండేహే-" అని తిట్టితరిమాడు, అసలే ఆకలి మీద బక్కచిక్కిన వీర్రాజు కోపంగా . పిల్లలు భయపడి పారిపోయారు. పారిపోయింది ఇంటికి కాదు - తండ్రి కన్ను చాటు చేసి, తమ కడుపు కొట్టిన కోటమ్మ కిళ్ళీ బడ్డి దగ్గర కెళ్ళి నిలబడ్డారు. కోటమ్మని తల్లి తండ్రి తిట్టే తిట్లు పిల్లలకీ తెల్సు - ఆ కోటమ్మ ని ఎందుకు తండ్రి తిడ్తాడో అదీ తెలుసు - ఆ కోటమ్మ వల్లే గంజి నీళ్ళకయినా గతి లేకుండా వీధిన పడాల్సి వచ్చిందనీ తెల్సు - తెల్సినా కోటమ్మ కిళ్ళీ బడ్డీ దగ్గిర నిలబాడడానికి కారణం అరటిపండ్లు! కుళ్ళిపోయిన అరటిపండ్లు, పిల్లలు అటుపక్కగా పెడ్తుంటే కోటమ్మ వేలాడదీసిన గెలల్లోంచి తిట్టుకుంటూ మాగిపోయి నల్లబడి అమ్మకానికి పనికి రాణి అరర్తిపండ్లు తీసి పడేస్తుంది. వచ్చిన నష్టాన్ని తలుచుకుని ఉసూరుమంటూ - పిల్లల ఆకలి కళ్ళకి ఆ కుళ్ళి పోయిన అరటిపళ్ళు పంచ భక్ష్య పరమాన్నాలయ్యాయి. నల్గురూ గమ్మునురికి మహాదానదంగా , ఆబగా తొక్కలు వల్చుకుని మాగిపోయిన పళ్ళు తిన్నారు. ఆకలి కడుపులకి కాస్త ఆహారం పడగానే ఆకలి మరింత విజ్రుంభించింది- కుళ్ళిపోయిన అరటిపళ్ళు దగ్గిరే కొట్టుకొచ్చిన వీళ్ళూ వాళ్ళూ తిని పడేసిన అరటిపళ్ళ తొక్కలు - పచ్చగా నిగనిగలాడుతూ కనిపించాయి. ఆ తొక్కలు తీసుకుని ఆబగా అని నాక్కుంటూ గుజ్జు తినసాగారు. తింటున్న వాళ్ళు కోటమ్మ కళ్ళబడ్డారు. ఆ కుచేల సంతానం వీర్రాజుదని తెలుసు. వీర్రాజు తనని ఎలా దుమ్మెత్తి పోస్తున్నదీ తెల్సు - తెల్సినా ఎదురుదెబ్బ కొట్టడానికి సమయం కోసం చూసింది. ఆ సమయం దొరికిందిప్పుడు . "ఛీ.....ఛీ వీళ్ళ జిమ్మడ - దిక్కుమాలిన సంత - మేకల్లా అరటి తోక్కలలో ఎగబడ్డారు. గుంటేధవలు - తిండేట్టుకోలేని వాళ్ళు, పందుల్లా యింతమందిని ఎవరు కనమన్నాడు - కని పారేసి రోడ్ల మీదకి తరుముతారు - మాయదారి సంత పాండేహే - మీ బాబుగాడి సొమ్ము  యిక్కడనేదేహే-గుంటేదవలకి సిగ్గు నేకపోతే పెద్దోళ్ళ కుండాలి - కళ్ళల్లో నిప్పు లేసుకునే ఎదవకి నా అరటి తొక్కలే కావాల్సివచ్చినాయి గామోసు - ' వ్యంగ్యంగా , హేళనగా, కసిగా, కోపంగా ద్వేషంగా వీర్రాజు వంక హేళనగా చూస్తూ గట్టిగా అరిచింది. కోటమ్మ అరిచాక ఆ తిట్లకి గురి అవుతున్నది తను, తన పిల్లలు అని తెలిశాక చరచర వచ్చి పిల్లల్ని చితక పొడిచాడు. - బూతులు తిట్టాడు. - "సిగ్గు లేని ఏదవల్లారా - ఆ నంజికూతురి అరటి తొక్కలే గతిరా మీకు, ఎల్లండిరా దాని పెరట్లో యింత అశుద్ధం తినండిరా .... సావకూడదట్రా యింతకంటే -' కోపం, ఉక్రోషం , అవమానం ముంచెత్తగా పిల్లల్ని, కోటమ్మని కలిపి తిట్టాడు - పిల్లలు బిక్కచచ్చి నిలబడ్డారు. - కోటమ్మ తక్కువ తినలేదు - అన్నాళ్ళ కసీ తీర్చుకుంది - చిలికి చిలికి గాలివాన అయింది- జనం మూగారు - "అదీ బాబు ..... పిల్లెదవలు ఆకలి గాకనేక కక్కుర్తిపడి ఆ అరటి తొక్కలు తిన్నారు ..... దానికి బాబూ యింత రాద్దాంతం - మా కడుపులు కొట్టింది - యీ మాతల్లి . ధర్మమాని పిల్లలు రోడ్డంట పడ్డారు." వీర్రాజు బాధగా, ఆవేదనగా చెప్పాడు- అంతా కోటమ్మ వంక చూసారు. అందరి సానుభూతి వీర్రాజు మీదకి తిరిగిందని గ్రహించలేని వెర్రిది కాదు కోటమ్మ - క్షణంలో ప్లేటు ఫిరాయించింది. "అది కాదు బాబూ - యింటి కాడ మేకల్ని పెంచుతున్నాను - యీ తొక్క లట్టి కెళ్ళి అటికి పడేయాలని.....'
    "అబద్దాలు బాబూ - మేకలేక్కడనించి నొచ్చినాయి - నాకు తెల్దూ ' - వీర్రాజు గయ్ మన్నాడు. కోటమ్మ మళ్ళీ అందుకుంది. - యిద్దరి దెబ్బలాటలో సారాంశం వినేశాక చుట్టూ జనానికి కుతూహలం పోయింది. మెల్లగా కదిలారు - "సాల్లెండేహే అరటి తొక్కల కోసం సిగలట్టు కున్నారు యిద్దరూ - ఎల్లండి ..... ఎల్లండి మరి ఊరుకోండి" అని సర్ది చెప్పేశారు నలుగురైదుగురు-
    
                                                  *    *    *    *

    తెల్లారి ఆరు గంటలకి కిళ్ళీ కొట్టు తీయడానికి వచ్చిన కోటమ్మ ముందురోజు కిళ్ళీ బడ్డి ముందు పారేసిన కుళ్ళు అరటి పండు మీద కాలేసి జర్రున జారి డబ్బున పడి నడుం విరగొట్టుకుంది - ఆస్పత్రి పాలయింది.
    అపకారమే కాదు అవసరం అయితే ఉపకారం చేయగలదని ఎందుకు పనికి రాని అరటి తొక్క తనకింత ఉపకారం చేసినందుకు వీర్రాజు సంతోషం చెప్పనలవి కాదు. 'కనీసం మూడు నెలలు తన బేరాలకి డోకా లేదు -' నమ్మకంగా అనుకున్నాడు.

                                                                                     ('స్పందన వాణి సౌజన్యంతో )***




Related Novels


Bhava Bandhalu

Neti Kaalapu Meti Kathakulu

Chikati Podduna Velugu Rekha

Agni Pariksha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.