Home » D Kameshwari » Kadedi Kadhaku Anarham
హారతి పళ్ళెం
రెండు రోజుల ముసురు తరువాత ఊర్లో సూర్యడుదయించాడు. తెల్లారి సూర్యుడ్ని చూడగానే జనం సంతోషించారు. సంతోషించని దేవరన్నా వుంటే పూజారి మాధవయ్య ఒక్కడే. తెల్లరకుండా వుంటే ! సూర్యు డుదయించకుండా వుంటే! ఆ ముసురు ప్రళయంగా మారి యీ వూరు వాడ, యీ జగత్తుని ముంచేత్తేస్తే .....ఏ బాధ వుండదు. డబ్బు సంపాదించాలి - దినుసులు కొనాలి - వండాలి కడుపు నింపుకోవాలి , మానం కప్పుకోవాలి, పెళ్ళాడాలి, పిల్లల్ని కనాలి , వాళ్ళకి చదువు సంధ్యలు చెప్పించాలి. పెళ్ళిళ్ళు చెయ్యాలి, కట్నాలు పొయ్యాలి, అల్లుళ్ళని గౌరవించాలి , పురుళ్ళు పోయాలి, బారసాలలు చెయ్యాలి, ఏది వదలకుండా సంప్రదాయం ప్రకారం ముద్దు ముచ్చట్లు జరిపించాలి - వీటన్నింటికి డబ్బుండాలి ఆ డబ్బు లేకపోతే ఆ పాట్లు - యీ బాధలు ఏవి లేకుండా - తెల్లారకపోతే - యీ ముసురు తగ్గకపోతే - వరదలు వచ్చి యీ వూరు వాడ ముంచెత్తితే తనకే సమస్యలు మిగలవు. మంచం మీద ముసుగులోంచి బయటపడకుండా ఆ ముసుగులోనే ఊపిరి ఆగిపోతే ఎంత బాగుండు ననిపించిందాయనకి.
"యీ దిక్కుమాలిన సంసారం చెయ్యడం నావల్ల కాదు మహాప్రభో - పొయ్యిలోకి కర్రలు లేవు - పొయ్యి మీదకి గింజలు లేవు - కర్రలు లేవు, బొగ్గులయి పోయాయని మొన్నననగా చెప్పాను, తెల్లారేసరికి గొంతులో కాఫీలు దిగాలి - పంచదార నిండుకుంది. ఆ పాలదాని ధర్మమా అని మానకుండా ఏ నీళ్ళో ఆ నీళ్ళు పోస్తుంది. యీ పూటకి రెండు చెంచాలు కాఫీపొడి పిన్ని గారింటి నించి తెచ్చాను. బెల్లం ముక్క మరో యింట్లో ముష్టి - దిక్కుమాలిన ముష్టి బతుకు అయిపొయింది. యీ సంసారం ఎప్పటికి తెల్లారుతుందో , దిక్కుమాలిన తడి కర్రలు ఊదలేక ప్రాణం కడగడ్తుంది. వాగి వాగి చస్తుంది. అదే వూరుకుంటుంది అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. అయ్యో - ఇల్లాలే - ఎంతపని కష్ట పెడ్తుంది. ఎంత కని అప్పులు తెస్తుంది. యీ సంసారం దాని దొక్కరిదేనా అన్న జ్ఞానం వున్న మనిషయితే అలా దిమ్మచెక్కలా కూర్చుంటారా - పెళ్ళాం బిడ్డల్ని పోషించలేని వాజమ్మలకి పెళ్లెందుకు, పిల్లలెందుకు.... ఛీ....మనిషి జన్మ ఎత్తినందుకు పౌరుషం వుండాలి ...." యింతకీ నా ఖర్మ ఎవరిననీ ఏం లాభం .....' తాయారమ్మ యీ స్త్రోత్రం మాధవయ్యకి సుప్రభాతంలా రోజూ వినిపించేదే కనక అయన చలించలేదు - కాఫీ వాసన తగలగానే కుక్కిమంచం లోంచి లేచి చూరు లోంచి పందుంపుల్ల లాగి నమలడం ఆరంభించాడు - అన్ని మాటాలంటున్నా చీమ కుట్టినట్లయినా లేకుండా సావకాశంగా పళ్ళు తోముకుంటున్న మొగుడ్ని చూసేసరికి తాయారమ్మ కి తిక్క రేగింది.
"తిండికి తిమ్మరాజు - పనికి పోతురాజు - నాలుగు రాళ్ళు సంపాదించడం చాతకాదు కాని వేళవేళలకి కాఫీలకి, భోజనాలకి తయారు. పెళ్ళాం అప్పడాలు వత్తి , వడియాలు పట్టి, నీళ్ళ బిందెలు మోసి, పిళ్ళు విసిరి మేపుతుంటే తినడానికి సిగ్గేలా లేదో ......నరయ్ వాసు వెధవా లేరా. వసే కామాక్షి లేవవే. బారెడు పొద్దెక్కినా మంచం దిగవు ఆడదానివి కావుటే. నీ బుద్ది ఇలా తగలబడబట్టే ఆ కాపురం అలా తగలడింది. అయ్యకి తగ్గ కూతురివి. కన్నకూతురు కాపురం చక్కదిద్దాలన్న యావ తండ్రికి లేదు. అయ్యని నిలబెట్టి ఆ డబ్బు తెప్పించి కాపురంకి పోవాలన్న ఆరాటం కూతురికి లేదు - అంతా ఒక్కలాంటి సంతే - యీ పాడు సంసారం యీదడం నావల్ల కాదింక - నల్గురిలో తలెత్తుకోలేక చచ్చిపోతున్నాను. అమ్మాఎందుకు కాపురానికి వెళ్ళదు అని అందరూ అరా తీసేవారే - నా కూతురెందుకు కాపురానికి వెళ్లలేదో వూర్లో వాళ్ళకి కావాలి. యీ అడిగే వెధవలందరూ తలో పది యిచ్చి సాయం చెయ్యరాదూ - హు నా నోరు నొప్పి గాని యీ యింట్లో ఎవరికీ చీమ కుట్టినటట్లుందా- రావే తల్లీ రా - మొహం కడుక్కుని కాఫీ సేవించు . పోయిన మొగుడు పొతే పోయాడన్నట్టు ....పీడా వదిలిందని యీవిడగారు ఉద్యోగం వెలగబెడ్తుందిట. కూతురిని కాపురానికి పంపే సత్తాలేని యీ తండ్రిగారి వత్తాసు దానికి. వరేయ్ వాసు గాడిదా లేవరా, దున్నపోతులా పడుకోడం కాదు - రెండు రోజులు ముసురు అంటూ స్కూలు ఎగాగోట్టావు. పుస్తకాల దుమ్ము దులుపు.....ఆ తండ్రికి తగ్గ తనయుడివి - పొట్టకోసినా అక్షరం ముక్క లేదు ...... అటు వేదం లేదు , యిటు చదువు లేదు, రామరామ ఏనాడు ఏం పాపం చేసుకున్నానో యీ మొగుడు , పిల్లలు యింకేన్నాల్లో యీ పాడుబతుకు - ఆ దేముడు నన్నెందుకు తీసుకుపోడో ...."తండ్రి , పిల్లలు ఎవరూ ఆ మాటలు విననట్టే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు - మాధవయ్య లో ఏనాడో చీము నెత్తురు హరించుకుపోయాయి. అన్ని తిట్టినా కోపం రాదాయనకి. పాపం తనని కట్టుకుని ఏం సుఖపడింది నిజానికి! నల్గురు ఆడపిల్లల్ని, యిద్దరు మగపిల్లల్ని ఈ లోకంలోకి తేవడం తప్ప తను ఏం చెయ్యగలిగాడు. ఏం సుఖ పెట్టాడు. పేద పురోహితుడింట్లో పుట్టి పేద పూజారిని కట్టుకుని పిల్లలు, రోగాలు, చాకిరి తప్ప ఏం సుఖపడింది - ఏదో జమీందారు గారు బతికున్నన్ని రోజులు తిండికి యిబ్బంది పడకుండా రోజులు గడిచిపోయాయి. ఆయనే వేణుగోపాలస్వామి మందిరం కట్టించి పూజారిని చేశాడు. దివాణం నించి ఏడాది గ్రాసం వచ్చేది. పండుగలు, పబ్బాలకి కొత్త బట్టలు పంపేవారు. పర్వదినాలకు పురాణ శ్రవణం చెప్పించి, ఘనంగా సత్కరించేవారు - దేవాలయంలో భక్తుల దక్షిణలుండేవి. రెండు గదుల కొంప కట్టించి రెండెకరాల పొలం రాసిచ్చి బీద బ్రాహ్మణుడి బాధ్యత తీర్చుకున్నాడు. ఆ మహారాజున్న రోజుల్లో భుక్తికి లోటు లేకుండా గడిచిపోయేది . అదిగో అయన పోయారు , జమీందారీలు పోయారు - జమీలు మంట గలిశాయి - వాళ్ళకే గతిలేదు. తమని ఆదుకునేదేవరు? ఆయనుండగా యిద్దరి కూతుళ్ళకి బాగానే పెళ్ళి చేశాడు- ఆ తర్వాతే కష్టాలు ప్రారంభం - మూడో కూతురికి ఎకరం పొలం అమ్మి చేశాకే దరిద్రం పట్టుకుంది. తిండి గింజలకే కరువొచ్చింది. కొడుకు రెక్కలు వచ్చి తన దారి తను వెతుక్కున్నాడు. తను తన సంసారం - వాడి పాట్లు వాడివి - తండ్రి గోల పట్టదు. పట్టించుకునే శక్తి లేదు. నాలుగో కూతురు ఎదిగి వచ్చింది. ఆదాయం లేదు - అప్పులు ఆరంభం అయ్యాయి. ఆఖరిదే అందరి లోకి చురుకైంది - ఆడపిల్లలకి నాలుగక్షరం ముక్కలు రావాలి. అనుకునే రోజులు వచ్చాయి. ఉచిత వేతనం , ఊర్లో స్కూలుంది. కనక మెట్రిక్ వరకు చదివించాడు. చూపులకి బాగుంటుంది. అంత మాత్రాన మొగుడు దొరుకుతాడా! ఇరవై మూడేళ్ళు దాటిపోతుంటే పెళ్ళాం పోరు భరించలేక ఆ కాసిని తిండి గింజ లోచ్చే ఎకరం అమ్మి ఇంటి మీద తాకట్టు పెళ్ళి చెయ్యక తప్పలేదు. అప్పటినించే బొత్తిగా తిండికీ మొహం వాచే గతికి దిగజారారు. పోనీ పిల్లయినా సుఖ పడిందా అంటే అదీ లేదు ఇస్తామన్న కట్నానికి ఐదొందలు పెళ్ళి వేళకి జతపడక యివ్వలేదని, లాంచనాలు జరపలేదని, సారే తీసుకురాలేదని - మొగుడో త్రాష్టుడు , అత్త గయ్యాళి , మామ చవట అయి దాన్కి తిండన్నా పెట్టకుండా రాపాడించారు. డబ్బుతే అని వాతలు పెట్టి హింసిస్తే పారిపోయి పుట్టింటికి వచ్చింది కూతురు. వియ్యంకుడి కాళ్ళు పట్టుకున్నాడు. డబ్బు నెమ్మదిగా సర్దుతానన్నాడు. ససేమిరా డబ్బు లేకుండా గుమ్మం తొక్కద్దని తిట్టిపోశారు. ఆరోజు నించి యీ ఏడాది - ఎంత ప్రయత్నించినా పట్టుమని పది రూపాయలు కూడ బెత్తలేకపోయాడు. తిండికి గతి లేకపోతే ఐదొందలు కూడబెట్టడం ఎలాగ- ఇల్లు తాకట్టు విడిపించుకోలేదు. మళ్ళీ అప్పు ఇమ్మంటే ఇల్లు జప్తు చేసుకు డబ్బుస్తానన్నాడు షావుకారు. తల దాచుకోడానికి ఆ నీడన్నా లేకపోతే తమ గతి ఏమవుతుంది, తను అసమర్ధుడు, పెళ్ళాం తిట్టిందంటే తప్పు లేదు. చావలేని వెధవలకు - పెళ్ళాం పిల్లలకి తిండి పెట్టలేని బతుకు - అన్నారంటే అంటారు. యీ దరిద్రం నించి విముక్తి పొందాలంటే మరణం తప్ప అన్యదా శరణం నాస్తి ...... కానీ .....కూతురు కాపురం చక్కపెట్టి -- కొడుకు మెట్రిక్ అయ్యాక ఎవడి కాళ్ళో పట్టుకుని వాడికేదో తోవ చూపించాక తను తోవ చూసుకోవాలి. కన్నందుకు తన కనీస కర్తవ్యం అది - కూతురు కాపురం చక్కపడాలంటే డబ్బు కావాలి. ఐదొందలు కావాలి - ఎక్కడ నించి తేవాలి - ఎవరిస్తారు? అయన ప్రశ్న అది. అయన ఆరాటం అది, గత కొద్ది రోజులుగా అయన తీవ్రంగా అలోచించి అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు --- అందుకే యీ రోజు భార్య తిట్లు అంత బాధించలేదు.
* * * *
వేణుగోపాలస్వామి గుడిలో గంటలు మోగాయి . భక్తులు కొందరు హారతి కోసం నిల్చున్నారు.
జమీందారు కాలంలో వేణుగోపాలస్వామి ఆలయం కళకళలాడేది- చీనీ చీనాంబరాలతో , నిలువెత్తు మాలలతో ధూపదీపాలతో రోజూ అర్చన జరిగేది. దద్దోజనం, చక్రపొంగలి , పులిహోర, రోజుకొకటి చొప్పున భోగం జరిగేది - పర్వదినాలలో ప్రత్యేక అలంకారాలు పురాణ పఠనం జరిగేది.





