Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
'రామానుజవర్యా! దాశరథి మహా విద్వాంసుడు. నాతో తలపడగల సామర్ధ్యం గలవాడు వారిని వంటపనికి పంపుటయ్యా?' అడిగాడు.
"పండితవర్యా! పనులలో ఏదీ తక్కువది కాదు. జడ భరతుడు పల్లకి మోశాడు అతని జ్ఞానప్రకాశం వసి వాడలేదు.
విద్యకు వినయం భూషణం, గర్వం సర్పం, కాటు వేయక మానదు' అన్నారు.
వాటి నుంచే మూర్తి ఆలోచనలు మలుపు తిరగడం ప్రారంభం.
దాశరథి అతుల్యాక్షిని తీసుకుని ఆమె అత్తింటికి చేరాడు. పూర్తి పరిచారకుడు అయినాడు. అతుల్యకు ఇంటిపనులు - వంట నేర్పసాగాడు. అది కొనసాగుతున్నది.
ఒకనాడు ఆ ఇంట కొందరు విద్వాంసులు కలిశారు. ఏవేవో చర్చించుకున్నారు. నాటి చర్చ గాయత్రి మంత్రం వైపు మరలింది. వివిధ రీతుల మీమాంసలు జరుగుతున్నాయి.
దాశరథి వంటింట్లో ఉన్నారు. వంటచేస్తున్నారు. వింటున్నారు. గాయత్రి చర్చలో అస్పష్టత వినిపించింది. వారు వంట ముగించారు. బయటికి వచ్చారు.
దాశరథి గాయత్రిని గురించి అనర్గళంగా ప్రసంగించారు. అంతా అవాక్కయినారు. శ్రద్దగా వినసాగారు! చీమ చిటుక్కుమనలేదు.
ప్రసంగం ముగిసింది. అప్పుడు గాలి ఆడింది.
పాచకుడేమి! ఇంత పాండిత్యమేమి అని లోలోన మెసల సాగారు.
"వీరు మా అన్నయ్య' అతుల్యాక్షి అన్నది. వారి చేయి పట్టింది. సగర్వంగా నిలిచింది. 'దాశరథిగారు శ్రీమద్రామానుజ ముని ప్రథమ శిష్యులు నిరుపమాన పాండిత్యం గలవారు. వినయ భూషణులు'.
ఆమె సంగ్రహంగా కథ చెప్పింది.
అంతా 'ఎంత అపచారం! ఎంత అపచారం!' అని దాశరథి పాదాలు పట్టుకోవచ్చారు. 'నేను పరిచారకుడిని నాకంత అర్హతలేదు' అని దాశరథి వెనక్కు జరిగారు.
"పదండి శ్రీరంగం పంపిస్తాం' అన్నారు.
'నేను ఆచార్య దాసుణ్ణి. నాకు అంత స్వాతంత్ర్యం లేదు. అతుల్యాక్షి సంసారం చక్కదిద్దాలనిఆచార్యాజ్ఞ' అన్నారు దాశరథి.
అంతటి మహాపురుషుడు - అఖండ పండితుడు - వినయశీలుడు - రాతిని, రత్నాన్ని సమభావంతో చూచేవాడు దాశరథి.
దాశరథి మాకు మూలపురుషుడు
రామానుజ యతీంద్రియులు కాకతీయుల కాలంలో వరంగల్లు ప్రాంతంలో పర్యటించారు. అందుకు సంబంధించిన కమనీయ గాథ ఉన్నది!
రామానుజులవారు శ్రీరంగం వెళుతూ దాశరథిని ఈ ప్రాంతంలో వుంచి వదలివెళ్ళారు.
దాశరథి నాడు చేసిన విశిష్టాద్వైతం ఆంద్రదేశంలో నేటికీ ప్రస్ఫుటంగా దర్శనం ఇస్తున్నది!
ధనుర్మాసం తెలుగువారి నెల పండుగ కావటం అందుకు నిదర్శనం.
దాశరథి - మా వంశపువారు, భద్రాద్రిని తావరం చేసుకున్నారు.
కంచర్ల గోపన్న అనే రామదాసు గురువు దాశరథి రఘునాథ భట్టాచార్యులవారు. వారి ఆదేశం మేరకే రామదాసు భద్రాద్రి రామచంద్రస్వామికి ఆలయాలు, ఆభరణాలు సమకూర్చారు.
రామదాసు కథ తెలుగువారికి తెలిసిందే. పూర్వం నాగయ్య, ఈ మధ్య రామదాసు సినిమాలు తీశారు.
భద్రాద్రి సీతారామచంద్రప్రభువు తెలుగువారి ఇలవేల్పు.
బాపు సృజించిన 'అందాలరాముడు' బొమ్మ ఇందుకు నిదర్శనం.
రామదాసు దాశరథి సతకం రచించి మొదటి పద్యంలోనే గురువులను స్మరించుకున్నారు. "దాశరతీ కరుణాపయోనిధీ" దీని మకుటం. దాశరథి వారి గురువు అగును. శ్రీరామచంద్ర ప్రభువును అగుదురు.
విశిష్టాద్వైతమున ఆచార్యులదే ప్రథమస్థానం.
శ్రీ శంకరభగవాత్పాదులు భజగోవిందం ప్రసిద్ధం. శంకరుల గురువు గోవిందుల వారు.
అది ఆచార్యులు స్వామిని తలంచి వ్రాసినది 'భజగోవిందం'.
ఆచార్యత్రయంలో శంకరులే సత్కవి-సహజకవి-సులభకవి.
రామదాసు శంకరులను అనుసరించినారు.
నాటినుండి మా వరకు దాశరథులందరు కవులు- విద్వాంసులు- వైద్యులు - తార్కికులు.
మా తండ్రిగారు వేంకటాచార్యుల వారిది అఖండ పాండిత్యం వారి ఉపన్యాసం శ్రోతలను కట్టిపడేస్తుంది. మా అమ్మ వేంకటమ్మ విదుషీమణి.
మా పితామహులు లక్ష్మణాచార్యులు సాహిత్య విద్వాంసులే కాక వైద్య విద్వాంసులు చెన్నపట్నం - చెన్నైలో వైద్యం చేసిన శిఖామణి.
మా ప్రపితామహులు వేంకటాచార్యుల వారు తర్కంలో అఖండ పాండిత్యం కలవారు. నిరాడంబరి. భద్రాద్రి రామచంద్రుని ఉపాసకులు. వారి గురించి మా పితామహులు చెప్పిన వృత్తాంతం:
ఒకసారి గద్వాల సంస్థానంలో తర్క పండితుల సభ జరిగింది. వేంకటాచార్యులవారిని ఆహ్వానించలేదు. అయినా వెళ్ళారు. వారు సభలో చిట్టచివరన చెప్పుల దగ్గర కూర్చున్నారు. వేదిక మీద తర్కం జరుగుతున్నది.
"తర్కం తెలిసినవారే లేరా! తడకల చర్చ జరుగుతున్నది?" అన్నారు మా ప్రపితామహులు.
అందరూ ఆ మాటలు అన్నవారిని చూచారు. వారిని వేదికమీది కాహ్వానించారు. వెంకటాచార్యులవారు తర్కం అంటూ ఇది అన్నట్లు వాదించి, ఆంధ్రదేశపు పండితుల నందరిని పరాజుతులను చేశారు.
మహారాజావారు వేంకటాచార్యుల వారిని ఘనంగా సత్కరించారు.
"వర చేలంబులో, మాడలో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథంబు, తోవిమృష్టాన్నంబులో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో గ్రామంబులో భూములో, ధరణీఖండమో కాక యేమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా!'
శ్రీమద్భాగవతములో బలిచక్రవర్తి వామనుని అడిగినట్లు మహారాజావారు ఏది కావాలన్నా ఇస్తామన్నారు. అంత ప్రసన్నులయినారు మహారాజావారు.
వేంకటాచార్యులవారు ఆశలు ఎరుగనివారు.
"మహారాజా! మేము భద్రాద్రి రాముని చత్రచ్చాయలో జీవించువారము. వారు మాకు క్షీణించని వాక్సంపద ప్రసాదించినారు. మీరు అన్నవి ఏమియు మాకు అక్కరకు వచ్చునని కావు. నిధి కన్న రాముని సన్నిధియే సుఖకరము. నువ్వులు - బెల్లము పెట్టి మమ్ము పంపించుడు" అన్నారు.
వేంకటాచార్యులవారి మాటలకు మహారాజావారు చకితులయినారు. వస్తువాహనములు ఇచ్చి, మా ముత్తాతగారిని భటులను ఇచ్చి పల్లకిలో భద్రాచలం పంపారు.
వేంకటాచార్యులవారు వస్తువాహనాలను రామునకే సమర్పించారు!
దాశరథి వారికి కూనవరంలో అనేక ఇనాం భూములుండేవి. భద్రాచలం దండకారణ్యం కీకారణ్య ప్రాంతం. సింహాలు - పులులు వంటి జంతువులు తిరగడం సర్వసాధారణం! మార్గంలో దొంగలబెడద!!
వేంకటాచార్యులవారు కౌలు డబ్బుకోసం కాలిబాటన కూనవరం వెళ్ళారు. డబ్బు అందింది మూటకట్టుకున్నారు. అప్పుడు రూపాయినాణాలే నోట్లులేవు. మహారణ్యం పాపిట లాంటి కాలిబాటలో నడిచి భద్రాచలం వస్తున్నారు. మార్గమధ్యంలో దొంగలు వెంటపడ్డారు. వారికి అందకుండా పరిగెత్తారు. ఒక చేను కనిపించింది. మంచెమీద మనుషులు కనిపించారు. వారిని చేరుకోవాలి. దొంగలు అందుబాటులో ఉన్నారు. వేంకటాచార్యులవారు చేతికర్ర ఊతంతో కంచెమీద నుండి ఎగిరి చేలో దూకారు. కాని తుమ్మముల్లు చీరుకుని కనుగ్రుడ్లు ఊడిపడింది! అప్పటినుంచి వారిని గ్రుడ్డి వేంకటా చార్యులు అన్నారు. అందుకు "మనమంతా గ్రుడ్డివాళ్ళమే! చూపుకోసం ఆరాటపడుతున్న వాళ్ళం" అనేవారట!
మా అమ్మకు మేము ఇద్దరం అన్నదమ్ములం - ముగ్గురు చెల్లెళ్ళు శకుంతల, రమాదేవి. అరుణ.