Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
రాతి రంభ:
విశ్వామిత్రుడు అతి కఠిన నియమములతో మరొకవేయి సంవత్సరములు తపస్సు చేసెను. అతని తపస్సునకు దేవతలు వణికిపోయింది. ఇంద్రుడు ఆ మహర్షి తపోభంగము చేయదలచెను. రంభను పిలిపించెను. విశ్వామిత్రుని తపోభంగము చేయమనెను. ఆ మాటలు విని పెనుగాలికి గడ్డిపోచవలె రంభ వడకిపోయెను. ఇంద్రుడు తాను స్వయముగా కోకిలనయి మన్మధసహితముగా వత్తునని ప్రోత్సహించెను. రంభ ఇంద్రుని మాట కాదనలేక పోయెను. అందమునకు కాళ్ళు వచ్చినట్లు రంభ విశ్వామిత్రుని ముందు వయ్యారముగ నిలుచుండెను. కోకిల కూసెను. మన్మథుడు ఉద్రిక్తుడయ్యెను. విశ్వామిత్రుడు కళ్ళు తెరచెను. స్వర్ణ రేఖవలె రంభ కనిపించెను. మహర్షి గ్రహించెను కోపించెను.
"దశవర్ష సహస్రాణి శైలీస్థాస్యతి దుర్భగే"
"ఓసీ దుష్టురాలా! పదివేల సంవత్సరములు రాయివై పడి యుండుము" అని శపించెను. కాని ఇంద్రియముల జయించలేక కోపము నొంది నందులకు విశ్వామిత్రుడు మిగుల చింతించెను. నిద్రాహ్రములు, ఉచ్చ్వాస నిశ్వాసములు మాని ఘోరమైన తపస్సు చేయుటకు నిశ్చయించెను. అట్లు నిశ్చయించుకొని తూర్పునకు పోయి తపస్సు ప్రారంభించెను.
బ్రహ్మర్షి:
అట్లు వేయి సంవత్సరములు గడచెను. అప్పుడతను భోజనము చేయుటకు కూర్చొనెను. ఇంద్రుడు బ్రాహ్మణుడై వచ్చి అన్నము పెట్టవలసినదిగా కోరెను. నిశ్చలుడై విశ్వామిత్రుడు తన ముందు ఉన్న అన్నమునంతయు బ్రాహ్మణునకు ఇచ్చివేసెను.
ఆ రీతిగ జితేంద్రియుడైన మహర్షి నిట్టూర్పు విడువక వేయి సంవత్సరములు తపస్సు చేసెను. అప్పుడతని బ్రహ్మరంధ్రము నుండి బ్రహ్మాండమైన పొగపుట్టెను. పర్వతములు కదలెను. భూమి వడకెను. గాలి స్తంభించెను సూర్యుడు నిస్తేజుడయ్యెను. దేవతలు గడగడలాడిరి. బ్రహ్మ దేవతలతో కూడి ప్రత్యక్షమయ్యెను. వారెల్లరును.
"బ్రహ్మర్షీ స్వాగతం తే2 స్తు తపసా స్మ సుతోషితాః
'బ్రహ్మర్షీ నీకు స్వాగతము. నీ తపస్సు వల్ల మేము సంతుష్టులమైతిమి' అనిరి.
విశ్వామిత్రుడు మిక్కిలి సంతసించెను. కాని వశిష్ఠుడు తనను బ్రహ్మర్షి అనవలెనని కోరెను. వశిష్ఠుడును అక్కడికి వచ్చి
"తః ప్రసాదితో దేవై ర్వసిష్ఠో జపతాం పరః
సఖ్యం చకార బ్రహ్మర్షి రేవమస్త్వితి చా బ్రవీత్"
'దేవతలు చెప్పినట్లే యగుగాక' అని విశ్వామిత్రునితో స్నేహము చేసుకొనెను.
జన్మతః మానవునకు కొన్ని సహజగుణములు అబ్బును. అది అతని ప్రకృతి. మానవుడేనాటికైనను ప్రకృతికి విరుద్ధముగ నడువలేడు. అతడు ప్రకృతి సిద్దాంతముల వాడుకొని వానిని వినియోగించుకొనగలడు. అయిన అట్లు ప్రకృతిని సాధించు వారలును కొందరు కలరు. వారు మహాత్ములు. సహజముగ ముక్కోపి అయినవాడు నిష్కోపి కాలేడు. కాని మహాత్ములట్లు కాగలరు. విశ్వామిత్రుడు రాజస ప్రకృతి కలవాడు. అతడు ఘోర తపస్సుచేసి తన ప్రకృతిని సాత్విక ప్రవృత్తిగా మార్చుకొనెను. ఆ మార్పు సాధారణముగా సాధ్యమగునది కాదు. విశ్వామిత్రుని సహజప్రకృతి అతడు సాత్వికుడగుటలో అడుగడుగున అడ్డుపడినది. అయినను ప్రకృతిని జయించినాడు. అందుకే అయినాడు బ్రహ్మర్షి!
ఒక విషయము, రామాయణమున వాల్మీకి ఈ చరిత్రనంతయు ఒకచోట చెప్పలేడు. పైగా ఎక్కువ కథాభాగము విశ్వామిత్రుడు చెప్పినది కాదు. అట్లు విశ్వామిత్రుడు చెప్పిన, విశ్వామిత్రుడు ఆత్మస్తుతి చేసుకొన్నట్లగును. అందులకే ఈ కథను వాల్మీకి మహర్షి శతానందునితో చెప్పించినాడు. పాఠకుల సౌకర్యమునకుగాను నేను ఈ కథనంతయు ఒకేచోట కూర్చినాను.
వశిష్ఠుని వంశమున పుట్టుటయే వ్యాసుని పున్నెములపంట.
వశిష్ఠుని కొడుకు శక్తి. శక్తి పుత్రుడు పరాశరుడు. పరాశరుని పుత్రుడు వ్యాసుడు. వ్యాసపుత్రుడు శ్రీశుకుడు.
వశిష్ఠుడు, వ్యాసుడు, శ్రీశుకుడు మాత్రమే ప్రఖ్యాతులు!
వంశానుగమున గుణములు అన్నియు సంక్రమించనక్కరలేదు. తండ్రి తాతల మంచి చెడులను భరించవలసినవారు పుత్రులు. అందుకే వారికి ఆస్తిపాస్తులపై హక్కు.
హక్కు హక్ అనే ఉర్దూపదం
"మా తాతలనాడు లేదు, తండ్రుల నాడు లేదు. ఏంది ఈ పోరడు ఇట్టయితాండు" అనే సాధారణం మాట. వారి జ్ఞానానికి నిదర్శనం!
జ్ఞానాన్ని మన రుషులు అతి సామాన్యుని దగ్గరకు చేర్చటం వారి ఆరాటానికి నిదర్శనం.
'జ్ఞానం అందరికీ అందాలి'. ఇది నా లక్ష్యం అక్షరం నా సాధనం.
మా వంశం ఇంత గొప్పది అని చెప్పుకోవటం కూడా సహజం.
మా వంశం
శ్రీమద్రామానుజ యతీంద్రులు విశిష్టాద్వైత సిద్దాంత ప్రవక్తలు. వారి ప్రథమ ప్రధాన శిష్యులు దాశరథి.
దాశరథి మహా విద్వాంసుడు అట్లయ్యు వినయము, సాత్వికం, సేవాభావం, సమానత గలవారు.
యజ్ఞమూర్తి అద్వైతమూర్తి అతడు తర్కంలో రామానుజులను ఓడించటానికి వచ్చాడు. ఆ సందర్భంలోని ఒక వృత్తాంతం.
వినయ సంపన్న విద్య
యజ్ఞమూర్తి రామానుజులను దర్శించిన తొలినాటి వృత్తాంతం-
రామానుజుని ఆచార్యులలో పెరియనంబి ఒకరు. వారికి ఒక కూతురు అతుల్యాక్షి. ఆమెకు వివాహము అయింది. అత్తవారింట ఉంటున్నది.
ఆనాడు అతుల్యాక్షి రామానుజుని దర్శించింది. ప్రణమిల్లింది. నిలిచింది. ఉదయవరులు ఆమెను ఆలస్యంగా చూశారు.
'సోదరీ అతుల్యా! ఇది సమయ సందర్భం కాదుగదమ్మా! పుట్టింటికి ఎందుకు వచ్చినావమ్మా?"
'అన్నయ్యా! మా అత్తగారు నన్ను పుట్టింటికి పంపించింది'.
'నీవు మా గురువర్యులు పెరియనంబి గారి కూతురువమ్మా అంత అకార్యం ఏం చేశావు తల్లీ?'
'నాకు ఇంటిపనులు, వంటపనులు సరిగా రావట. తాను ఇల్లెడు చాకిరి చేసుకొనలేదట. మళ్ళీ అత్తవారింటికి వస్తే వంట మనిషిని తెచ్చుకొమ్మన్నది'.
'మా గురువుగారు ఏమన్నారు?'
'అన్నయ్య దగ్గరకు వెళ్ళమన్నారు'.
'అమ్మా! నీవు ఇంటికి వెళ్ళు అత్తగారింటికి వెళుతున్నట్లు తండ్రిగారి వద్ద శలవు తీసుకో ప్రయాణమై రావమ్మా' అన్నారు పంపించారు.
అతుల్యాక్షి ఉడయవరులు చెప్పినట్లు చేసింది. ప్రయాణమై వచ్చింది.
యతిరాజు దాశరథిని పిలిపించారు. కథ సాంతం వివరించారు. 'అతుల్యాక్షి కాపురం కాపాడటం మన ధర్మం నీవు ఆమె వెంట వెళ్ళు' అన్నారు.
యజ్ఞమూర్తి చకితుడై చూస్తున్నాడు.
దాశరథి వదనం విలక్షణంగా ఉంది. ఇసుమంత మార్పులేదు. మాటలేదు. అతుల్యాక్షిని వెంట పెట్టుకున్నాడు సాగిపోయాడు.
యజ్ఞమూర్తి నమ్మలేకపోయాడు. పంపటం - పోవటం అబ్బురం అనిపించింది.