Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
'క్షత్రియో యజకోయస్య చండాలస్య విశేషతః
రధం సదపి భోక్తారో హవిస్తస్య సురర్షయం?'
యజ్ఞము చేయించువాడు క్షత్రియుడు చేయువాడు చండాలుడు దేవతలు, ఋషులు హనిస్సులెట్లు అందుకొందురు?' అనియు వారనిరి.
ఆ మాటలు విని ఉగ్రుడైనాడు విశ్వామిత్రుడు.
'యే దూషయం త్యదుష్టం మాం తవ ఉగ్రసమాస్తితమ్
భస్మీభూతా దురాత్మానోభవిష్యంతి న సంశయః'
'నేను ఎట్టి దుష్టత్వమును ఎరుగను, ఉగ్రమైన తపస్సులో ఉన్నాను. అట్టి నన్ను నిందించినవాడు భస్మీభూతులగుదురు గాక'.
'ఆద్యంతే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్
సప్తజాతి శతాన్యేవ మృతపాస్సంతు సర్వశః'
'ఇప్పుడు వారు కాలునివాత పడిన తుదపరి ఏడువందల జన్మల వరకు పీనుగులను తినుచుందురు గాక'.
అని శపించెను. అట్లు శపించిన యజ్ఞము ప్ర్రారంభించినాడు విశ్వామిత్రుడు హవిస్సులు యథాశాస్త్రముగ అర్పించి దేవతలనందరిని ఆవాహన చేసెను. కాని దేవతలు రాలేదు. విశ్వామిత్రుడు కోపావిష్టుడై స్రువము చేతబట్టి "రాజా! ఇదే నిన్ను స్వర్గమునకు పంపుచున్నాను. నా తపశ్శక్తి చూడుము" అనెను. మునులు చూచుచుండగా త్రిశంకుడు సశీరుడుడై స్వర్గమునకు వెళ్ళెను. కాని దేవతలు "గురుశాపహతో మూఢపత భూమి మవాక్చిరాః' 'గురుశాపహతుడవైన నీవు తల క్రిందులుగా భూమిపై పడిపొమ్ము' అనిరి. అది విని త్రిశంకుడు 'రక్షింపుము' అని కేక వేసెను. విశ్వామిత్రుడది విని 'రోషమా హారయత్తీవ్రం తిష్ఠ తిష్టేతి చాబ్రవీత్' (తీవ్రమగు కోపముతో 'నిలు నిలు' అనెను) అతడు వెంటనే కొత్త నక్షత్రములను సృష్టించెను. 'అన్యమింద్రం కరిష్యామి లోకోవాస్యా దనింద్రకః' (ఇంకొక ఇంద్రుని సృష్టింతును లేదా లోకము ఇంద్రుడు లేకనే ఉండుగాక) అని రోషతామ్రాక్షుడై గర్జించెను. అతని గర్జనకు దేవత లెల్లరు వణికిపోయిరి విశ్వామిత్రుని శాంతించవలసి. నదిగ పలు విధముల బ్రతిమిలాడిరి. కాని విశ్వామిత్రుడు త్రిశంకునకు సశీరముగా స్వర్గమిత్తునని చేసిన వాగ్ధానమునకు ఈషణ్యాత్రము చలించడయ్యె. దేవతలు అతని శక్తికి వెరచి 'అనుయాస్యంతి చైతాని జ్యోతీంషి నృపసత్తమకు
కృతార్ధం కీర్తిమంతం చ స్వర్గలోక గతం యధా'
'ఈ నక్షత్రములను, కృతార్దుడును కీర్తి శాలియునగు త్రిశంకువును స్వర్గమును పొందిన వారివలె నుందురు' అనిరి.
అట్లొక కొత్త శకమునకు కర్త అయ్యెను విశ్వామిత్రుడు.
శునశ్శేపుడు:
ఒకప్పుడు అంబరీషుడను రాజు అయోధ్యను పాలించెను. అతడొకసారి ఒక యజ్ఞమును ప్రారంభించెను. యజ్ఞము జరుగు చుండ ఇంద్రుడు వచ్చి పశువును దొంగిలించెను. ఆ పశువు దొరకని యెడల నరపశువే కావలెననిరి ఋత్విక్కులు. అంబరీషుడు నరపశువునకై వెదకుచు బయలుదేరెను. ఎన్ని లక్షల గోవు లిత్తునన్నను ఎవరును నరుని అమ్మినవారు కారు.
చివరకు 'ఋచీకుడు' అను ఒక ఋషి కనిపించెను. అంబరీషుడు అతనికి ఒక లక్ష ఆవులిత్తుననెను. ఒక కుమారుని ఇవ్వవలసినదిగా ప్ర్రార్ధించెను. ఋచీకునకు మువ్వురు పుత్రులు.
'అవిక్రేయం సుతం జ్యేష్ఠం భగవానాహ భార్గమ
మమాపి దయితం విద్ధి కనిష్ఠం శునకం నృప
'ఋచీకుడు జ్యేష్ఠ పుత్రుని అమ్మనని చెప్పెను. నాకు శునకుడను కనిష్ఠపుత్రుడు ప్రియుడు' అని ఋచీకుని పత్నియనెను.
అప్పుడు మధ్యవాడైన శునశ్శేపుడు తాను ఇరువురకును అవసరము లేని వానినని గ్రహించి అంబరీషునకు ఆ తమ్ముడుబోవుటకు కంగీకరించెను. అంబరీషుడు ఋచీకునకు క్రయధనము ఇచ్చి శునశ్శేపుని తోడ్కొనిపోయెను. అట్లు బయలుదేరిన అంబరీషుడు మధ్యాహ్నమునకు పుష్కర తీర్ధమునకు చేరెను. శునశ్శేపునకు మేనమామ విశ్వామిత్రుడు. అతడు పుష్కరతీర్ధము దగ్గరనే తపస్సు చేయుచున్నాడని శునశ్శేపునకు తెలిసెను. వెంటనే అతడు మేనమామ దగ్గరికి వెళ్ళెను. ఒడిలోపడి ఏడ్చెను. జరిగినదంతయు చెప్పి అంబరీషునకు యజ్ఞఫలము లభించునట్లును, తనకు దీర్ఘాయువు కలుగునట్లును చూడవలసినదిగా ప్రార్దించెను. విశ్వామిత్రుని హృదయము ద్రవించెను. అతడు తన కుమారులను పిలిపించి శునశ్శేపుని స్థానమున యజ్ఞపశువుగ అంబరీషుని వద్దకు వెళ్ళవలసినదని కోరెను. కాని విశ్వామిత్ర పుత్రులెవరును బలియగుటకు అంగీకరించలేదు.
'శ్వమాంస భోజినస్సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు
పూర్ణం వర్షసహస్రంతు పృధివ్యా మనువత్స్యథ'.
'వసిష్ఠుని కొడుకులు వలెనే మీరును కుక్క మాంసము తినుచు వెయ్యేండ్లు భూమిపై వసింతు రుగాక' అని శపించెను.
అహో! త్యాగము! ఒకరిని రక్షించుటకై తన స్వంత కొమరుల బలిచేయువాడు లోకమున గలడే!
తదుపరి శునశ్శేపుని రక్షించు మార్గమునకై విశ్వామిత్రుడు వెదుకసాగెను. తుదకు విశ్వామిత్రుడు ఇంద్రునకు సంబంధించిన రెండు గాథలను శునశ్శేపునకు బోధించెను. శునశ్శేపుని యూపమునకు కట్టినప్పుడు వానిని చదువుమనెను. అట్లు చదివిన ఉభయఫలసిద్ది జరుగునని చెప్పెను. అట్లేయని శునశ్శేపుదు వెడలిపోయెను. యజ్ఞమునందు శునశ్శేపూని యూపమునకు కట్టినపుడు విశ్వామిత్రుడు బోధించిన రెండు గాథలను చదివెను. ఇంద్రుడు ప్రీతుడై అంబరీషునకు యజ్ఞఫలమును, శునశ్శేపునకు దీర్ఘాయువును కలుగునట్లు వరములిచ్చెను.
అట్లు నరబలిని మాన్పించినవాడు విశ్వామిత్రుడు.
మేనక:
పుష్కరతీర్ధమున ఉండి వెయ్యి సంవత్సరములు విశ్వామిత్రుడు తపస్సు చేసెను. బ్రహ్మ ప్రత్యక్షమై 'నీవు చేసిన శుభ కర్మములవలన ఋషివి అయితివి' అని అంతర్ధానుడాయెను. అంతటితో విశ్వామిత్రునకు తృప్తి కలుగలేదు. మరల తపస్సు ప్రారంభించెను. అట్లు కొంతకాలము గడిచెను. పుష్కరతీర్ధమున స్నానము చేయుచున్న మేనక విశ్వామిత్రునకు మెరుపువలె కనిపించెను. అతని మనసు చలించెను. ఆమెను వరించెను. మేనకతో పది సంవత్సరములు గడపెను. తనకు నిగ్రహము లేకపోయి నందులకు విశ్వామిత్రుడు సిగ్గుపడెను. దుఃఖించెను. మధుర వచనములతో లాలించి మేనకను పంపివేసెను. మరల దృఢనిశ్చయమున తపస్సు ప్రారంభించెను. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై 'నీవు మహర్షివి అయితివి' అనెను. అందుకు విశ్వామిత్రుడు 'భగవాన్! మీరు మహర్షి, అనిన నేను జితేంద్రియుడను అయినట్లేనా?' అని అడిగెను. "అందుకు ఎన్ని వికారములు కలిగినను చలించకుండునట్లుండుటకు ప్రయత్నించవలెను" అని బ్రహ్మవెళ్ళిపోయెను.