Home » D Kameshwari » Madhupam
సశేషం
ఈరోజు వేలెంటైన్స్ డే. ప్రేమికుల దినంట. డిస్కోలు, పబ్ లు, హోటళ్ళు బోకేల వాళ్ళు డబ్బులు చేసుకునే రోజు. ప్రేమికులన్న వాళ్ళకి ప్రత్యేకం. ఒరోజేందుకో. అంటే, ఆ రోజోక్కరోకే ప్రేమించుకుంటారటనా! కొత్తగా విదేశాల నుంచి దిగిన ఆచారాలతో ఇదొకటి. పేరెంట్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే..... విదేశాలలో అంటే ఎవరికి వారే యమునా తీరే గనుక ఏడాదికి ఈ వంకనైనా ఓరోజు కల్సుకోడానికి వచ్చి వుంటాయి. మన దేశంలో మనకెందుకివి -
యింకా కాస్తో కూస్తో మానవ సంబంధాలు మిగిలే వున్నాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి అంతా కలిసి ఉండే కుటుంబ సంస్కృతీ మిగిలి వుందిగా. ఈ వాలంటైన్స్ డే అంటే బారులు నిండా బీరులు పారుతాయి. డిస్కోలు హోరేత్తడం అర్ధరాత్రుళ్ళు వరకు తాగి, డాన్సులు చేసి, అడ మగ తేడా మరిచే రోజు.
ఒంటిగంటన్నర అయింది. ఇంకా ఇల్లు చేరని కూతురు గురించి అరాటపడ్తూ నిద్రపట్టక దొర్లుతోంది రమ. స్నేహితులతో హోటల్లో పార్టీకి వెళతానన్న కూతుర్నీ ఏవిధంగానూ అపలేనని తెల్సు కనుక, పన్నెండు లోపల ఇల్లు చేరమని గంభీరత నటిస్తూ అజ్నాపిస్తున్నట్లు అంది. కూతురు నిర్లక్ష్యపు నవ్వు విసిరి, జుట్టు పైకి తోసుకుంటూ , హైహీల్స్ టకటక లాడించుకుంటూ బయటికి వెళ్ళింది. కూతురు ఏనాడూ రాత్రి పన్నెండు లోగా ఇల్లు చేరలేదు. తెల్సినా, తల్లిగా తనేదో కట్టడి చేస్తున్నాననుకుని చెప్తుంటుంది రమ. అలా బయటికి వెళ్ళిన రోజు తల్లికి శివరాత్రే. ఎంత పట్టించుకోకూడదు , అదెలాగో రాదు అని తెల్సినా, కూతురు వచ్చే వరకు నిద్రపోకుండా , వచ్చాక తలుపు తీసి, ఓ తీక్షణపు చూపు విసిరి, తనకి కోపం వచ్చిందన్నట్లు తలుపు కాస్త విసురుగా వేసి, విసవిస గదిలోకి వేడ్తుంది రమ. చాలాసార్లే జరిగింది. లెక్క అనవసరం అనుకుంటుంది రమ.
ఇవాళ వేలంటైన్స్ డే . రెండు దాటి పది నిమిషాలు అయినా కూతురు ఇల్లు చేరలేదు. నిద్రపట్టక అటు ఇటు పక్క మీద దొర్లుతుంటే భర్తకి ఎక్కడ మెలకువ వస్తుందోననుకొని కూతురి గదిలోకి వెళ్ళి పడుకుంది గంటక్రితమే. రానీ, ఇంటికి రానీ. దాని పని చెప్తా. ఏం చెయ్యలేని నిస్సహాయతతో పళ్ళు కొరుక్కుంది. వచ్చాక ఏం చేస్తుంది. తను నోరిప్పి ఒకటి అనే సరికే పది మాటల తూటాలు కూతురి దగ్గర సిద్దంగా వుంటాయి. "డోంట్ బీ సిల్లీ అమ్మా. ఫ్రెండ్స్ తో తిరగక పొతే నీతో తిరుగుతానా, నీకన్నీ అనుమానాలే, కూతురినే నమ్మవు. చూడు, చుట్టూ చూడు,మ్ ప్రపంచం ఎలా మారిందో .... అమ్మా నేను ఉద్యోగం చేస్తున్న పాతికేళ్ళ అమ్మాయిని. నన్నింకా టీనేజ్ గార్ల్ లా ట్రీట్ చేసి కంట్రోలు చెయ్యాలని చూడకు. బాయ్ ఫ్రెండ్స్ తో సరదాగా తిరగటం అంటే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం అనా. అమ్మా గో అప్" అంటూ కడిగి పారేస్తుంది.
ఆలోచనలని చెదరగోడ్తూ సెల్ మోగింది. 'కూతురే అయి వుంటుంది. ఇంకా రానంటుందా, ఆలస్యం అవుతుందంటుందా' అనుకుంటూ కోపంగా ఫోను తీసింది. ఏదో కొత్త నెంబరు.
"హలో" అంది రమ.
"ఈజిట్ మిసెస్ రమాదేవి"
"ఆ .... అవును. మీరు .... మీరెవరు?" అర్ధరాత్రి కొత్త వ్యక్తి నుంచి ఫోను గాబరాపడింది.
"జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్. ఐ . జనార్ధన్ మ్ట్లాడుతున్నాను" రమ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. గొంతు తదారిపోగా.
"పోలీస్ స్టేషన్ ....? ఏమిటి? ఎందుకు?" మాట తడబడింది ఆమెకి.
"భావన మీ కుతురేనా?"
"ఆ...ఆ.... అవును ఏమయింది భావనకి?" గాబరాగా అరిచినట్టే అడిగింది.
"మీరు మీవారు ఒకసారి పోలీస్ స్టేషన్ కి రావాలి?"
"ఎందుకు? ఏం జరిగింది. ఏం చేసింది మా అమ్మాయి. ప్లీజ్ దయచేసి చెప్పండి."
'చూడండీ! మీ అమ్మాయి మగ పిల్లలతో కలిసి ఇక్కడ పబ్ లో తాగి తందనాలు ఆడుతుంటే , రైడ్ చేస్తే దొరికిపోయిన వారిలో మీ అమ్మాయి ఉంది. దయచేసి మీరు వెంటనే రండి" ఫోను పెట్టేశాడు ఇన్స్పెక్టర్.
రమ చేతిలో ఫోను జారిపోయింది. ఒళ్ళంతా చెమట పట్టింది. పరుగెడుతున్నట్టే ప్రసాద్ ని లేపడానికి వెళ్ళింది. మంచి నిద్రలోంచి హటాత్తుగా లేచిన ప్రసాద్ కి భార్య చెప్తున్నది అర్ధం కావడానికి చాలా టైము పట్టింది. అర్ధమయ్యాక పాలిపోయిన మొహంతో లేచి బట్టలు మార్చుకున్నాడు.
* * * *
"సారీ సార్, ఈరోజు వేలంటైన్స్ డే అని పిల్లలు కాస్త ఓవర్ చేసినట్లున్నారు. ప్లీజ్ కేసు రిజిస్టర్ చేసి కస్టడిలో కి తీసుకుంటే ..... వాళ్ళ భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ప్లీజ్" ప్రసాద్ చాలా ఉద్వేగంగా ఇన్స్పెక్టర్ కి ఐదు నిమిషాల నుంచి చెప్పిందే చెపుతూ అన్నాడు. అతని లాంటి తండ్రులు ఇంకా నలుగురైదుగురు ఇదే విషయం చెపుతూ బతిమిలాడుతున్నారు.
"చూడండి సార్! ఈరోజు పోలీసులు సీన్ లోకి వచ్చేవరకు మీ పిల్లలని అందులో ఆడపిల్లలని, కాస్త కట్టడిలో పెట్టుకోవాలని తెలీయదా..... అర్ధరాత్రి రెండు గంటల వరకు ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా తాగి డాన్సులు చేస్తూ ఏ అర్ధరాత్రో ఇల్లు చేరితే మందలించి ఎలా అదుపులో పెట్టుకొవాలో తెలియదా... ఏదన్నా జరగరానిది జరిగితే అప్పుడు మేం గుర్తుకోస్తాం. పోలీసులు సరిగా డ్యూటీ చేయలేదంటారు. మా డ్యూటీ మమ్మల్నీ చెయ్యనివ్వండి. తల్లిదండ్రులుగా ముందు మీకు తెలియజేయడం మా ధర్మం కనుక తెలియజేశాం. ఇప్పుడింకా మా చేతిలో ఏం లేదు. రేపు ఆదివారం. సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మీరు అప్పుడు బెయిలు ప్రయత్నం చేసుకోండి" గంభీరంగా అన్నాడు ఇన్ స్పెక్టర్.
"ఇన్ స్పెక్టరు గారూ, ఏదో మొదటిసారి, పిల్లలు వేలెంటైన్స్ డే సరదాలో గీత దాటారు. ఈ ఒక్కసారికి క్షమించండి" బతిమాలసాగారు తల్లిదండ్రులు.
"మొదటిసారా?" తలవంచుకుని నిల్చున్న నాలుగైదు జంటల వంక చూస్తూ "ఇది మొదటిసారేమో వాళ్లనే అడగండి" అన్నాడు హేళనగా. అందరూ తల్లిదండ్రులు వైపు చూసి తలలు దిన్చుకున్నారు. ప్రసాద్ నిర్ఘాంతపోతూ రమ వైపు చూశాడు. రమా తెల్లాపోతూ కూతురి వంక అనుమానంగా చూసింది. భావన తలదించుకుంది.





