Home » D Kameshwari » Madhupam
"ఊ... చెప్పమనండి. ఇది మొదటిసారని. ఇదివరకు ఓసారి నేనే రైడ్ చేశాను. అప్పుడున్న వాళ్ళూ ఇప్పుడు ఉన్నారు. మొదటిసారి వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని వార్నింగ్ ఇచ్చి వదిలేశాం. పబ్ యజమానికి వార్నింగ్ ఇచ్చాం. అయినా ఎంత ధైర్యం వీళ్ళకి. టైమెంత ఇప్పుడు, రెండున్నర . ఇప్పటివరకు పిల్లలు ఇంటికి రాలేదన్న ధ్యాస లేదా మీకు. ఇలా విచ్చలవిడిగా వదిలేసి, ఇప్పుడొచ్చి పరువు- ప్రతిష్టల గురించి మాకు నీతులు బోధిస్తున్నారు' తలవాచేట్లు చివాట్లు పెడుతున్న ఇన్ స్పెక్టరు మొహం చూడలేక పెద్ద, చిన్న అంతా తలలు దించుకున్నారు.
"పిల్లలు పార్టీ అంటే ఏదో హోటలుకి వెడతారు అనుకున్నాం. రాత్రి పన్నెండు నుంచి, నేను మా అమ్మాయి సెల్ కి ఫోను చేస్తూనే ఉన్నాను. సెల్ అన్సర్ చేయలేదు. తరువాత ఆఫ్ చేసి వుంది. తల్లిదండ్రులం పిల్లలు ఇంటికి రాలేదని అరాటపడ్తూ నిద్రపోకుండా కూర్చున్నాను" రమ సంజాయిషీ ఇస్తున్నట్లంది.
"చూడండి మేడమ్! మా డ్యూటీ మేం చేయాలి. ఎఫ్. ఐ. ఆర్ రాసి సోమవారం కోర్టులో ప్రవేశపెడతాం. అప్పుడొచ్చి మీరేం చేసుకుంటారో చూసుకోండి. కానిస్టేబుల్ ! అందరి పేర్లు , ఎడ్రస్ లు . ఫోను నెంబర్లు నోట్ చేసుకుని, అందరి దగ్గరా సెల్ ఫోన్లు తీసుకోండి" ఆర్డరు జారీ చేశాడు. పెద్దలంతా కలవరపడి మొహాలు చూసుకున్నారు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.
"ప్లీజ్ కాసేపు ఆగండి. నేను కమీషనర్ గార్కి ఫోను చేస్తాను. అయన నాకు చాలా సన్నిహితుడు. ఆయనతో మాట్లాడేవరకు ప్లీజ్ కాస్త ఆగండి" ఓ పెద్ద ప్రభుత్వోద్యోగి సెల్ ఫోన్లో నెంబరు నోక్కసాగాడు.
ఇన్ స్పెక్టరు మొహం ఎర్రబడింది. 'సార్..... చూడండి. మీరు పెద్దవారు. మీ ఇన్ ఫ్లూయన్స్ ఉపయోగించి, మా డ్యూటీ మమ్మల్నీ చేయనీయకుండా అడ్డుకుందా ,మనుకోవడం సరి అయిన పని కాదు. అంతేకాదు , పిల్లల తప్పులను పరోక్షంగా మీరే ప్రోత్సహించుతున్నట్లా? కాదా? ఏం చేసినా ఫరవాలేదు మా నాన్నలు, అమ్మలు మమ్మల్ని ఆదుకుంటారన్న అభయం ఇస్తున్నారు' కోపంగా అన్నాడు.
తల్లిదండ్రులు తలలు దించుకున్నారు. 'సారీ, ఇన్ స్పెక్టర్ మీరు చెప్పిందంతా నిజమే. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఇందులో అమ్మాయిలున్నారు. వాళ్లీలాంటి కేసుల్లో ఇరుక్కుని వాళ్ళ ఫోటోలవి బయటికి వస్తే వాళ్ళకింక పెళ్ళి...." ఒక తల్లి భయం భయంగా అంది.
"ఓ అమ్మాయి - పెళ్ళిళ్ళు - ఇప్పుడు గుర్తుకోచ్చాయా.... వాళ్ళిలా అర్ధరాత్రి వరకు తిరగడం తప్పు కాదు అని వదిలేశారా. అబ్బాయిల తిరగ్గాలేనిది అమ్మాయిలు ఎందుకు తిరగుకూడదని అమ్మాయిలతో పాటు మీరు అనుకుని బయిటికి వెళ్ళనిచ్చారా! అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలకి లేని ఆంక్షలు ఎందుకనేగా ఈనాటి యువత అభిప్రాయం. అలాంటప్పుడు అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ శిక్షార్హులే గదా! తేడా వద్దనుకున్నప్పుడు, మళ్ళీ అమ్మాయిలంటూ వారి భవిష్యత్తు అంటూ ఆరాటం ఎందుకు. మా దృష్టిలో రూల్సు అతిక్రమించిన అందరూ ఒక్కటే" ఇన్ స్పెక్టర్ గంభీరంగా అన్నాడు.
అందరూ నిస్సహాయంగా మొహాలు చూసుకున్నారు. ఈగోడవ జరుగుతున్నప్పుడే చానల్ వాళ్ళకి కబురంది నలుగురైదుగురు గబాగబా కెమెరాలు పట్టుకు వచ్చారు. ఛానల్ వాళ్ళని చూడగానే అంతా కంగారు పడ్డారు. కొందరు అమ్మాయిలు మొహానికి అడ్డు పెట్టుకున్నారు. గబగబా భావన అయోమయంగా చుట్టూ చూసింది. రమ కలవరపడ్తూ కూతురి వైపు చూస్తూ "మొహం కప్పుకుని ఏడవదెం " అనుకుంది.
అదే క్షణం వరకూ ఇలాంటి దృశ్యాలు పేపర్లలో టీవీల్లో వచ్చినప్పుడు ఇలా మొహాలు చూడకుండా మొహాలకి అడ్డు పెట్టుకొనిస్తారెందుకు? ఇలాంటి వెధవల మొహాలు అందరూ చూసి గుర్తుపడితే నాన్నా ఇలాంటి వెధవ పనులు చేసే వాళ్ళు కాస్తన్నా సిగ్గుపడ్తారు. భయపడ్తారు అనుకునేది. దొంగతనాలు, అత్యాచారాలు చేసినవాళ్ళని ముసుగుల్లో చూసి, అలాంటిదిప్పుడు తను తన కూతురు మొహాన్ని దాచుకోలేదని గాబరా పడ్తోంది. తన ఆలోచనకి తనే సిగ్గుపడేట్టు కూతురు తననీ స్థితిలో పడేసినందుకు పట్టరాని కోపం వచ్చింది రమకి.
ఆఖరికి, పోలీసు కమీషనర్ ద్వారా చెప్పించి, ఆఖరి వార్నింగ్ ఇచ్చి అందరినీ వదిలేయమని, పేరెంట్స్ దగ్గర ఇలా సంతకాలు తీసుకుని వదలమని కమీషనర్ ఆదేశాలతో అంతా బయటపడ్డారు. పబ్ యజమానికి లైసెన్స్ రద్దు చేసి, జరిగిందానికి ఫేనాలిటీ కట్టాలని ఆదేశించి కేసు ముగించారు.
కారులో ఒక మాట కూడా మాట్లాడలేదు ప్రసాద్. రమ ఏదో అనబోతుంటే భార్య చెయ్యి నొక్కి వద్దన్నట్లు చూశాడు. ఆ నిశ్శబ్దం ఆమె తప్పిదాన్ని మరింతగా వేలెత్తి చూపుతున్నట్టు కారు సీటుకి జారగిలబడి కళ్ళు మూసుకుంది ఎవరి మోహం చూడలేనట్టు భావన. ఆ సమయంలో తాగివున్న కూతురితో ఏం మాట్లాడి ప్రయోజనం వుండదని ఆ తండ్రికి అర్ధమైంది. ఇంటికి వెళ్ళాక ఏం మాట్లాడకుండా ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు.
మర్నాడు ఆదివారం. ఉదయం పదకొండు గంటలకి నిద్రలేచిన కూతురిని తిరస్కారంగా చూసి, తల తిప్పుకుంది రమ. పేపరు చదువుకుంటున్న ప్రసాద్ ఓసారి కూతురి వైపు చూసి "స్నానం చేసిరా! నీతో ,మాట్లాడాలి " ప్రశాంతంగా అన్నాడు.
తండ్రి వైపు చూసి మొహం మాడ్చుకుని కాఫీ కప్పు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది.
"చూడు భావనా! ఇకపై నీవు వేరే అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని వుంటే బాగుంటుంది. ఎక్కడైనా చూసుకో" గంభీరంగా మొదలుపెట్టాడు.
తండ్రి మాటలు తను అనుకున్నట్టు తనపై మండిపడడం గాని, హితబోధలు హెచ్చరికలు గానీ లేకుండా వేరేగా మొదలవడంతో భావన అర్ధం కానట్టు తెల్లపోతూ చూసింది.
"నీపాటికి నీవు వేరే వుంటే నీవు కోరుకునే స్వేచ్చ వుంటుంది. నీవేం చేసినా అడిగేవారు, ఆంక్షలు పెట్టేవారు ఉండరు. చదువు చెప్పించాం. నీ బతుకు నీవు బతకగలిగే సంపాదన వుందిప్పుడు. ఒక అమ్మాయి తండ్రిగా నీ పెళ్ళి చేసే వరకు బాధ్యత మాది, కాదనను. ఇదివరకు రోజుల మాట అది. ఆడపిల్లలకి ఆర్ధిక స్వాతంత్ర్యం లేనప్పుడు పెళ్ళి చేసి ఆమెని భర్తకి అప్పగించే వరకు కన్నవారి బాధ్యత. ఇప్పుడూ మేము ఆ బాధ్యత నించి తప్పించుకోవాలనుకోవడం లేదు. మేం ఎన్నిసార్లు పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టినా నీవే వచ్చినవాడిని చేసుకుంటారని దాటేస్తున్నావు. నీకు పాతికేళ్ళు నిండిపోయాయి. నీ ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు నీకుందని నీ ఉద్దేశం. కాని తల్లిదండ్రులుగా మా ఇంట్లో నీవు ఉండాలంటే కొన్ని కట్టుబాట్లకి లోబడి వుండాలని మేం అనుకుంటాం. మేం యిచ్చిన స్వేచ్చ, స్వాతంత్ర్యాలను మీరు హద్దులు మీరి దుర్వినియోగ పరుస్తున్నారని మాకనిపిస్తుంది. ఆడపిల్లలూ మగపిల్లలతో సమానంగా చదవాలని , ఆర్ధిక స్వాతంత్ర్యం వుండాలని, ఓ వ్యక్తిత్వం ఏపరిస్థితులలోనైనా నిబ్బరంగా ఎదుర్కునే మనశ్రైర్యం ఆడపిల్లలకి ఉండేందుకే చదువు, ఉద్యోగం ఉండాలన్నది మా అభిమతం. స్వేచ్చ అంటే తాగుడు, పబ్ లు , పార్టీలు, అడ మగ తేడా మర్చిపోయి విచ్చలవిడితనాన్ని మేం అంగీకారించలెం. ఈ విషయంలో నీకు మాకు చాలాసార్లు వాగ్వివాదాలు జరిగాయి. నీ పద్దతి మార్చుకోలేదు."





