Home » D Kameshwari » Madhupam
తలుపు తీసిన పూర్ణ కళ్ళలో వెలుగు . "సారీ పూర్ణా! క్షమించు. నిన్నసలు గుర్తు పట్టలేదు. ఎవరో అనుకుని పలకరించలేదు. నీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను."
పూర్ణ జీవం లేని నవ్వు నవ్వింది.
"గుర్తుపట్టలేక పోవడం నీ తప్పు కాదులే , రా లోపలికి ' అంది.
చిన్న పెంకుటింట్లో ఓవైపు భాగం. రెండు చిన్న గదులు , పంచదించిన వంటిల్లు. రెండో గదిలో మంచం మీద జీవచ్చవంలా పడి ఉన్న చిక్కి శల్యమైన ఆకారం. రెండు నిమిషాలు అటు చూసి "పూర్ణా , ఇంత జరిగినా మాకెవరికి చెప్పాలనిపించాలేదా? ఇంతమందున్నాం. మేం ఎవరం సాయం చెయ్యమనుకున్నావా? ఇన్ని బాధలు పడ్డావు. నీ భర్త, నీ కొడుకు సంగతి విన్నా. నిన్న రాధిక చెప్పేవరకు నాకే సంగతులు తెలియవు పూర్ణా! నీ కష్టం తీర్చలేక పోయినా కనీసం కాస్త డబ్బు సాయామన్నా చేసేవాళ్ళం కదా" ఆవేదనగా అన్నాడు వేణు.
"ఎవరైనా ఎన్ని సార్లు సాయం చేస్తారు? దినదిన గండమైన బతుకు బతుకుతున్నాను వాడిని చూస్తూ. వాడు నడవలేని జీవచ్చవం, నేను నడిచే జీవచ్చవాన్ని బావా?" అంది. గొంతు రుద్దమయి బోట బోట కన్నీరు కారుస్తూ. "చూడు బావా! ఆ మంచంలో పడి ఈగవాలిన తోలుకోలేని స్థితిలో వాడూ, వాడ్ని చూస్తూ నేను! 'అమ్మా! నాకింత విషం ఇచ్చి పుణ్యం కట్టుకో, ఇన్ని స్లీపింగ్ పిల్స్ ఇయ్యమ్మా నీకు దండం పెడతాను' అని ఏడుస్తాడు. వాడి బాధ చూడలేక ఒక్కోసారి వాడ్ని ఈ నరకం నించి విముక్తుడిని చెయ్యాలనుకుంటాను. చూస్తూ చెయ్యలేకపోతున్నాను. ఈ నరకం పగవాళ్ళకి వద్దు" నోటికి కొంగు అడ్డు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న పూర్ణని నిస్సహాయంగా చూసి, కళ్ళు నీళ్ళతో నిండగా -
"పూర్ణా ప్లీజ్ఏడవకు. నేను ఎంత ఖర్చయినా భరిస్తాను. హైదరాబాద్ తీసికెళ్ళి వైద్యం చేయించు. ఆపరేషన్ చేస్తే బాగవుతుందేమో!"
"లాభం లేదు బావా, వెన్నుముక నుజ్జు నుజ్జు అయ్యింది. ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఉండదన్నారు డాక్టర్లు.... సర్లే నా గోల ఎప్పుడూ ఉండేదే.... పద ఆ గదిలో కూర్చో " అంది.
"మీ అమ్మాయి స్కూలు కెళ్ళిందా?"
"ఊ.... ఏది తప్పినా బతుకీడ్చాలి కదా ! నా పెన్షన్ , దాని జీతంతో బతుకీడుస్తున్నాం! సారీ వచ్చిన దగ్గిర నించీ నా కష్టాల కధే చెప్తున్నాను...." అంది నీర్జీవమైన నవ్వు నవ్వి కళ్ళు తుడుచుకుంటూ.
"చూడూ పూర్ణా! నీ దుఃఖం ఏవిధంగా తీర్చలేను గానీ కాస్త నీకు ఆధారంగా బతకడానికి ఆసరాగా ఉంటుందని మన ఇల్లు నీ కొడుకు పేర రాసింది అమ్మ. గోపాలం మావయ్య కి చెప్పి రిజిస్ట్రేషన్ చేయిస్తా. మేం వెళ్ళాక మన ఇంట్లో ఉండు, కనీసం అద్దెన్నా తగ్గుతుంది. ఇవిగో కాగితాలు, కాదనకుండా తీసుకో, ఆరోజులా నా మొహాన విసరకు ఇది అమ్మ యిచ్చింది" అన్నాడు.
పూర్ణ సూటిగా వేణు కళ్ళలోకి చూసి కాగితాలు అందుకుంటూ "ఆరోజు నా అభిమానానికి' వెల కట్టావన్న కోపం, బాధతో తీసుకోలేదు. ఈరోజు అమ్మే కాదు నువ్విచ్చినా తీసుకుంటాను . వాడి హక్కుని కాదనడానికి నేనెవరిని" అంది.
వేణు తెల్లబోతూ చూశాడు అర్ధం కానట్టు.
"వాడి వారసత్వపు హక్కుని వద్దనడానికి నేనెవరిని బావా?" వేణూ వైపు చూస్తూ మళ్ళీ అంది.
దిమ్మెరపోయాడు వేణు. నిర్ఘ్హాంతపోతూ మంచం వైపు చూశాడు. నిరుత్తరుడై పాలిపోయిన ముఖంతో చూస్తున్న వేణుని చూసి చిన్నగా తల ఊపింది పూర్ణ.
"బావా , పాతికేళ్ళు ఈ రహస్యం నాలో దాచుకున్నాను. కానీ అత్తయ్య అరనిమిషంలో పట్టేసింది. మురళిని చూడడానికి వచ్చి , చూస్తూనే 'వేణు' అంది నిర్ఘాంతపోయి. అపరాధిలా తలదించుకుని కన్నీరు పారుస్తున్న నన్ను చూసి నేనేం చెప్పకపోయినా గ్రహించింది నిలేసింది. ఒట్టేసి నిజం చెప్పించింది. ఇంత పెద్ద విషయం దాచినందుకు నిందించింది. చెల్లెలు లాంటిదన్న నన్ను ఇంతపని చేసినందుకు నిన్ను ఆవిడ క్షమించలేక తనే ఆ తప్పు చేసినట్టు విలవిల్లాడిపోయింది. పెళ్ళి చేసుకోనని నేనెందుకు ఏడ్చానో ఆవిడ కర్ధమయింది. బావా! మురళి అంతా నీ పోలికే - ఒక్కొక్క ఏడు పెరుగుతూంటే చిన్నప్పటి నించీ నిన్ను చూసిన రూపే కనపడింది. పెద్దయ్యాక మరీ స్పష్టంగా , నాన్న పోయాక ఈ ఊరు రావడం మానేశాను. ఎవరన్నా గుర్తుపడతారని" తన తప్పు లేనట్టు సంజాయిషీ ఇస్తున్న పూర్ణని నోటమాట రానట్టు చూస్తుండిపోయాడు వేణు. తలదించుకున్నాడు.
"పాతికేళ్ళ తరువాత ఈరోజు నేను చెప్పే క్షమాపణ కి అర్ధం లేదు. అయినా చెప్తున్నాను. క్షమించగలిగితే క్షమించు" చేతులు జోడించి అన్నాడు.
"పూర్తిగా నీ తప్పే కాదు బావా! నీమీద ఇష్టం, ప్రేమ, అలా జరిగితే నీవు పెళ్ళాడుతావేమోనన్న మనసులో చిన్న ఆశ. అన్నీ కలిసి నిన్ను కాదనలేదు. ఆ క్షణంలో నీ కౌగిలినించి తప్పించుకోవాలనీ అన్పించలేదు. బావా! ఒకటే అదృష్టం నా పెళ్ళి వెంటనే జరిగిపోవడంతో ఎవరికీ అనుమానం రాలేదు. చూశావా వాడికీ గడ్డాలు, జుట్టు పెంచి వదిలేశాను. ఎందుకో తెలుసా! నీ పోలిక కనపడకుండా. అత్తయ్య గుర్తుపట్టినట్టు ఎవరూ గుర్తించకూడదని.... నాపాపమే వాడికి కొట్టిందేమో!" దుఃఖం ముంచుకువచ్చింది పూర్ణకి. వేణు తల ఇంకా వాలింది. కడుపులో దేవిన భావన. "బావా, అత్తయ్య నన్ను పెళ్ళికి బలవంత పెడ్తున్నప్పుడు నిజం చెప్పాలనిపించింది. కానీ అత్తయ్య అన్న మాటలు విన్నాక అభిప్రాయం మార్చుకున్నాను. 'పూర్ణా వేణు మీద ఆశ పెట్టుకుని పెళ్ళి వద్దంటున్నావేమో వాడెం నిన్ను చేసుకోడు. నేను రెండు మూడు సార్లు అన్నా - "ఛా - దాంతో నా పెళ్ళేమిటి , రాధిక , ఎంతో పూర్ణా అంతే . అంతేకాక నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలన్నాడు . ' అంచేత ఈ పెళ్ళి కాదనకు, 'అతనంతట అతను కట్నం వద్దని చేసుకుంటానన్నాడు ' అని ఒప్పించింది. బలవంతంగా నీ జీవితంలోకి రావటం ఇష్టం లేక పెళ్ళికి ఒప్పుకున్నాను. అయన దేవుడు. నన్ను ప్రేమగా చూసుకున్నారు కాని దురదృష్టం నాది" అంటూ కళ్ళు తుడుచుకుంది.
నిర్జీవంగా లేచి బయటికి నడిచాడు వేణు. తన అపరాధాన్ని పూర్ణకి సాయం చేసి కడుక్కోవాలనుకుంటే ఆ అవకాశం అమ్మ ఇవ్వలేదు. పూర్ణ క్షమించినా అమ్మ క్షమించలేదు. అందుకే తన చేత తలకొరివి పెట్టిన్చుకోలేదు. నెల రోజుల నుంచీ అమ్మలో వచ్చిన మార్పుకి కారణం అర్ధం అయింది.
మళ్ళీ తన మొహం చూడదలచనట్టు అన్న ఇంత త్వరగా వెళ్ళిపోయింది. తోవపొడుగునా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. పాతికేళ్ళ క్రితం జరిగిన తప్పుకి ఆనాడు తప్పించుకున్నా .... ఈనాడు ఆ తప్పు మంచం మీద జీవచ్చవంలా పడున్న ఆకారం అనుక్షణం కనిపిస్తూ మనశ్శాంతిని హరిస్తోందని వేణుకి అర్ధమైంది.
***





