Home » D Kameshwari » Madhupam
పూర్ణ పుట్టింది మొదలు గౌన్లు, పరికిణి, ఒణి, చీర ఇలా తన కళ్ళముందే పెరిగింది. అందరి కంటే చిన్నది. బుజ్జి కుక్కపిల్లలా వెంట వెంట తిరిగేది. చిన్నప్పుడు దాని మీద అధారిటీ చేసి పనులు చేయించుకునే వాడు ఏడిపించేవాడు. "అత్తయ్యా! బావ చూడు' అంటూ ఏడుస్తూ ఫిర్యాదులు చేసేది. అమ్మావాళ్ళ అమ్మమ్మా, పూర్ణ ముత్తాత అన్నా చెల్లెళ్ళట. ఆ చుట్టరికంతో అయన అమ్మని 'అక్కయ్యా!" అనేవాడు. అలాగే పూర్ణ కూడా 'బావా' అంటూ వరస కలిపి పిలిచేది. కాస్త పెద్దయిన దగ్గరనించి అమ్మ వెనుక వెనక తిరిగి పనులు చేసేది. డానికి పదేళ్ళ వయసు ఉన్నప్పుడు తల్లి పొతే అమ్మే తల్లి అయ్యింది. దువ్వెన పట్టుకు వచ్చి ' అత్తయ్యా జడ వెయ్యి' అనేది. రాధికతో పాటు దాన్ని మరో ఆడపిల్ల అనుకునేది అమ్మ. పూర్ణకి తనంటే పిచ్చి అభిమానం. హీరో వర్షిప్. 'బావా' అంటూ సంబరంగా ఇది అది చెప్తుంటే కసురుకునేవాడు. చిన్నబుచ్చుకు వెళ్ళిపోయేది.
ఆ ఊర్లో హైస్కూలు చదువు అయ్యాక విజయవాడ కాలేజీలో చదవడానికి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురూ వెళ్ళిపోయారు తనూ, తమ్ముడూ, చెల్లెలు. పూర్ణ రానంది. ప్రైవేటు గా ఇంటరు, బి.ఏ చదువుతానంది. 'దానికి చదువు మీద లేదమ్మా ఎంతసేపూ నవలలు, పత్రికలు, చదువుతూ నీవెంటే కూరలు తరుగుతూ, పచ్చళ్ళు రుబ్బుతూ, పూలుకోసి మాలలు కడుతూ తిరగమంటే తిరుగుతుంది' అని వెక్కిరిస్తే పౌరుషంగా 'చూడు నీ ఇంజనీరింగ్ అయ్యేలోగా బి.ఏ. పాసవకపోతే ' అంది. 'పోవే శరత్ బాబు నవలలు, ప్రేమకధలు చదువుకుంటూ కలలు కను. అమ్మా. ఇది పల్లెటూరి అమ్మాయి. ఓ పొలం ఉన్న ఆసామికి ఇచ్చి చేస్తే సరిపోతుంది' అంటూ ఇంటర్ పూర్తయ్యి శెలవులకి వచ్చినపుడు తెగ ఏడిపించాడు తను. 'ఇలాగే ఏడిపించు. లలిత, శేఖర్ మెడలో దండ వేసేసింది చూడు ఓరోజు నేనూ అలా చేస్తాను. అప్పుడు చచ్చినట్లు నన్ను పెళ్ళాడతావు' కోపంగా అంది. 'అమ్మ బాబోయ్ మనసులో పెద్ద కోరికలే ఉన్నట్లున్నాయి. అలాంటి పప్పులు నా దగ్గిర కావు. ఆ కాలం సెంటిమెంట్లు ఇప్పుడు పనిచేయవు. అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. నేను అమెరికా వెళ్ళి, చదువయ్యాక ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళాడతా. నీలాంటి పల్లెటూరి బైతుని పెళ్ళాడతానా' కాలరెగరేసి గర్వంగా అంటూ ఏడిపించాడు తను.
'వద్దన్నవాడి వెంట పడే ఖర్మ నీకేమిటే? బంగారం లాంటి సంబంధం తెచ్చి నీ పెళ్ళి నే చేస్తాను' అమ్మ నవ్వుతూ ఓదార్చింది. అలా చిన్నప్పుడు చిలిపి తగాదాలతో ఓచోట పెరిగిన వాళ్ళు తామిద్దరూ. రాధిక లాగానే ఇంట్లో పెరిగిన పిల్ల పూర్ణ!
చెల్లెలుగా పెరిగిన పిల్ల అంటూనే చెయ్యరాని పనిచేసిన ఆరోజు ఏ భూతం ఆవహించిందో తనను! ఇంజనీరింగు అయి, పరీక్షలు రాసి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో మర్నాడు వీసాకి మద్రాసు వెళ్ళవలసి ఉండడంతో తనను వదలి అంతా పిన్ని కూతురి పెళ్ళికి వైజాగు వెళ్ళారు. తన భోజనం సంగతి పూర్ణకి అప్పజెప్పి వెళ్ళింది అమ్మ. మనసులో ఏ కోశానా అలాంటి భావం లేదు. ఏ పాడు ఆలోచనా లేదు. ఇప్పటికీ ఆరోజు ఎందుకలా జరిగిందో తనకే అర్ధం కాదు. పూర్ణ వంటింట్లో స్టౌ దగ్గిర నిలబడి ఏదో చేస్తోంది. ఊరికే వెనక నించి హటాత్తుగా వెళ్ళి దాన్ని పట్టుకుని భయ పెట్టాలని వెళ్ళి దాని నడుం చుట్టూ చేయి వేసి బిగించాడు తను. 'అ' కెవ్వున అరవబోయి వెనక్కి తిరిగిన పూర్ణ తనను ఆశ్చర్యంగా చూసింది తప్ప వదిలించుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఏకాంతం. ఇరవై రెండేళ్ళ యువరక్తం మనసులో చెడు ఆలోచన లేకపోయినా శరీరం దానిపని అది చేసుకుపోయింది. పూర్ణ తలంటు పోసుకున్న జడలోని జాజుల వాసన ఏదో మత్తు కలిగించి తన చేతులు మరింత బిగిసాయి. పూర్ణ గువ్వలా వదిగిపోయింది. ఇద్దరికీ ఏమయిందో పరిసరాలు మరిచిపోయారు. జరగరానిది జరిగాక తెలివి తెచ్చుకుని పడక గదిలోంచి పారిపోయింది పూర్ణ. భయంతో చెమటలు పట్టాయి తనకి. పూర్ణ అమ్మకి, వల్ల నాన్నకి చెపుతుందేమో .... ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపాలి? ఆ రాత్రి గదిలోంచి బయటకి రాలేదు. సీతాలు వచ్చి భోజనం చెయ్యమన్నా చెయ్యలేదు. తెల్లారి బస్సుకి వెళ్ళే ముందు రాత్రి చేసిన వేదవ పని చాలక ఎందుకు చేశాడో తెలియకుండా ఓ వెయ్యి రూపాయలు పూర్ణ కిమ్మని పనిమనిషితో పంపాడు. అంతే ఐదు నిమిషాలలో పూర్ణ విసవిసా వచ్చి కోపంగా చూసి ఆ డబ్బు తన మీద విసిరి వెళ్ళిపోయింది.
అంతే అదే ఆఖరిసారి పూర్ణని చూడ్డం. వీసా వచ్చాక, వారంరోజుల్లోనే అమెరికా ప్రయాణం ఉండడంతో మళ్ళీ వెనక్కి రాకుండా , అమ్మానాన్నా సామానుతో వచ్చి వీడ్కోలు చెప్పారు. అ తరువాత నెలరోజులకి అమ్మ ఫోను చేసి పూర్ణ పెళ్ళయిందని చెప్తే నిశ్చింతగా నిట్టూర్చాడు. తను భయపడ్డట్టు ఎవరితో పూర్ణ చెప్పనందుకు నిశ్చింత అనిపించింది.
* * * *
రాత్రంతా అలోచించి తను తీసుకున్న నిర్ణయం, ఉదయం ముగ్గురూ కూర్చుని కాఫీ తాగుతుండగా చెప్పాడు వేణు. కాస్త ఆశ్చర్యంగా చూశారు మాధవ్, రాధిక. "మొత్తం ఇల్లు, నీ వాటా అంతా ఇచ్చేయడం ఎందుకు, కావలిస్తే డబ్బు సాయం చెయ్యి" అన్నారు.
"ఈ పల్లెటూర్లో , ఈ పాత ఇల్లు నేనేం చేసుకోను. అమ్మితే మహా అయితే ఏ రెండు మూడు లక్షలోస్తుందో, డబ్బు కంటే దానికో నీడ దొరికితే మేలు. ఉండడానికి ఇల్లు ఉంటే ఆ పెన్షన్ డబ్బుల ఆసరాతో కాస్త బతకడానికి వీలుంటుంది. ఇంకా కూతురు పెళ్ళి, కొడుకు రోగం ఖర్చు..... ఇల్లన్నా ఉంటే ఆధారం ఉంటుంది గదా . ఈ రెండు మూడు లక్షలు నాకు పెద్ద అవసరం లేదు" అన్నాడు వేణు.
"తర్వాత తనే రాధికా! ఓసారి అమ్మ వీలునామా కాగితాలు తీసుకురా, గోపాలం మావయ్య కిచ్చి ఇల్లు పూర్ణ పేర రిజిష్టరు చేయించమంటాను " అన్నాడు.
రాధిక లోపల్నించి కాగితాలు తీసుకొచ్చి చదువుతూ ....' ఇదేంటన్నయ్యా , అమ్మ మళ్ళీ కొత్త వీలునామా రాసినట్లుంది. అదే ఇది. చూడు అమ్మ ఈ ఇల్లు పూర్ణ కొడుకు మురళి పేర రాసి, పూర్ణ కస్టడిలో పెట్టినట్టు రాసిందే."
వాటిని చూసి తెల్లబోయారు ముగ్గురూ. "పొలం మాధవ్ కీ, డబ్బు నగలు రాధికకీ ఆ విషయంలో మార్పు లేదు. నా పెద్దకొడుకు అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నాడు. వాడికి ఈ ఇల్లు అమ్మిన డబ్బు పెద్ద మొత్తం కాదు. కష్టాల్లో ఉన్న ఈ ఇంట్లో పెరిగిన పూర్ణకి ఆసరాగా ఉంటుందని ఇలా రాశా అని కూడా చేర్చింది. ఇది అమలు జరిగేట్టు చూడవలసిన బాధ్యత వేణుది."
మనసులో ఆశ్చర్య పడుతూనే "పోనీలే నేను చెయ్యాలనులున్నపని అమ్మే చేసింది. అమ్మ ఆలోచన సరి అయిందే" వేణు మనస్పూర్తిగానే అన్నాడు.
'అన్నయ్యా! బొత్తిగా నీకేం లేకుండా. పోనీ సగం పొలం తీసుకో...." మాధవ్ ఇబ్బందిగా అన్నాడు.
"ఫరవాలేదు మాధవ్ నీది ఇండియా సంపాదన. నాది డాలర్ల సంపాదన. అమ్మ అలా రాయకముందే నేనే ఇస్తానన్నాగా. రాధీ ఓసారి వెళ్ళి పూర్ణని , కొడుకుని చూసొద్దాం. విల్లు కాగితాలు ఇచ్చి వద్దాం. స్నానం అయ్యాక వెడదామా?"
"నేను మాధవన్నయ్యా వెళ్ళి చూసొచ్చాం. నువ్వు వెళ్ళు. ఇంట్లో సామాన్లవీ అన్నీ సర్ధించాలి గదా. బోలెడు పని ఉంది నువ్వెళ్ళిరా" అంది రాధిక.
* * * *





