Home » D Kameshwari » Madhupam
"నే వచ్చి అమ్మ విషయం మాధవతో అంటే వాడూ వచ్చాడు" అంది రాధిక.
"వంటరిగా ఇంత పెద్దింట్లో ఎందుకమ్మా? మా దగ్గరికి రా అని ఎన్నిసార్లు పిలిచాను. ఆ పట్టణంలో ఆ చిన్న ఇళ్ళల్లో నే ఉండలేనురా! నా ఇల్లు, నా మొక్కలు నా ఊరు ఇవన్నీ వదిలి నే రాలేను. నాకేం భయం? ఊరంతా పిలిస్తే పలుకుతారు. కాంతమ్మగారు వండి పెడ్తున్నారు. సీతాలు, రాజయ్య ఇంట్లో ఉంటారు. నా బతుకు ఈ ఇంట్లోనే తెల్లరిపోవాలి అనేది అమ్మ. ఎంతో ధైర్యంగా నాన్నా పోయాక అన్నీ చక్కపెట్టుకునేది" మాధవ అన్నాడు.
"ఏమిటో ఆవిడ వెళ్ళిపోయింది. తల్లి పొతే తరం పోతుందంటారు. మీ అమ్మ లేకపోతే ఇంక ఈ పల్లెటూరుకు మీరెందుకు వస్తారు? ఇల్లు, పొలం , డబ్బూ అన్ని విషయాలు చూసుకోండి. మీ నాన్న విల్లు రాసే ఉంటారు. చూసుకోండి" చిన్న మామ్మయ్య రామారావు అన్నాడు.
"నాన్నగారు రాయలేదు. అమ్మ ఇష్టానికే వదిలేశారు. అమ్మ రాసి పెట్టింది. మాతో చెప్పింది. ఇల్లు నా పేర, పొలం మాధవ్ కి, డబ్బు , నగలు రాధికకి అని చెప్పింది. మావయ్యా! సంవత్సరీకాల లోపల ఇల్లు, పొలం బేరం చూసి పెట్టు, అప్పుడు అన్నీ సెటిల్ చేసుకుంటాం' గోపాలానికి భారం అప్పజెప్పారు అన్నదమ్ములు.
* * * *
"రాధీ..... అన్ని పేమెంట్స్ అయిపోయయిగా. వంటలవాళ్ళు బ్రాహ్మలు, షామియానా వాళ్ళు, పనివాళ్ళు .... అన్నీ సెటిల్ చేశావా?" ముగ్గురూ కూర్చుని లెక్క జమా చూసుకుంటుండగా వేణు అన్నాడు.
"అన్నీ అయ్యాయి అన్నయ్యా.... ఇదిగో అన్నీ రాసి పెట్టాను."
"సీతాలు తన తోడుకి ఎవరినో తెచ్చుకుంది ఆమె కిచ్చారా? అలాగే కాంతమ్మగారికి సాయానికి వచ్చినావిడకిచ్చావా?"
"కాంతమ్మగారెవరినీ తేలేదే ....." ఆశ్చర్యంగా అంది రాధిక.
"అదేమిటి ఈ పన్నెండు రోజులు ఇంట్లో అందరికీ కాఫీలు, టిఫిన్లు వడ్డనలు అన్నీ చక్కపెడ్తూ తిరిగేది ఒకావిడ....!" వేణు ఆశ్చర్యంగా అన్నాడు.
రాధిక తెల్లబోతూ వేణు వైపు చూసి "అన్నయ్యా! అదేమిటి పూ....మన పూర్ణని గుర్తుపట్టలేదా నువ్వు?" తను పూర్ణ కదా అన్నయ్యా...." అంది.
దిమ్మెరపోయాడు వేణు. నమ్మలేనట్టు "ఏమిటీ తను పూర్ణా. అదేమిటి అలా అయిపొయింది. అసలు నేను గుర్తుపట్టలేదు. ఎవరినో కాంతమ్మగారు సాయానికి తెచ్చుకుందనుకున్నాను. అందుకే సరిగా కూడా చూడలేదు.... అయ్యో! నేను పలకరించనే లేదు. మీరన్నా చెప్పలేదు. బొద్దుగా, చలాకీగా ఇల్లంతా తనే అయి తిరిగే పూర్ణా ఇలా నలబై ఐదేళ్ళకే ముసలిదానిలా ' దిగ్బ్రాంతి నించి తేరుకోలేక అన్నాడు కలవరంగా.
"ఏంటన్నయ్యా> నువ్వు పాతికేళ్ళ క్రితం నాటి పూర్ణ గురించి మాట్లాడుతున్నావు."
"అవును, పాతికేళ్ళయింది తనని చూసి. అయినా ఇలా.... తన భర్త పిల్లలు.... అమ్మ పోయిందని చూడటానికి వచ్చిందా" విచలితుడై ఆరాటంగా అన్నాడు.
"అన్నయ్యా పాపం దాన్ని దెబ్బ మీద దెబ్బ కొడ్తున్నాడు దేవుడు. ఓ మనిషి ఎంతకని తట్టుకోగలదు? దాని బతుకులో అన్నీ కష్టాలే...." విచారంగా అంది రాధిక.
"ఏమిటి? ఏమయింది.... అసలు నాకేం తెలీదే. నేను అమెరికా వెళ్ళిన కొత్తలో పూర్ణ పెళ్ళయిందని ఓసారి చెప్పింది అమ్మ. మరోసారేప్పుడో తండ్రి పొతే పూర్ణ వచ్చిందనీ దానికిద్దరు పిల్లలనీ మరోసారి అంది. అంతకంటే నాకేం తెలీదు."
తరువాత రాధిక చెప్పింది విచలితుడై తెల్లపడిన మొహంతో విన్నాడు వేణు. "పూర్ణ మొగుడు ఈ ఊరి హెడ్మాస్టర్ బావమరిదిట. ఈఊరికి శెలవులకి వచ్చి పూర్ణని గుళ్ళో చూసి తనంతట తాను తన అక్కయ్య చేత పూర్ణ తండ్రికి కబురు పెట్టి పెళ్ళి చేసుకుంటానన్నాడట. గవర్నమెంటు ఉద్యోగం. అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో గుమస్తా. తల్లీ తండ్రి లేరు. ఉన్నది ఒక అక్క కట్నం వద్దని, గుళ్ళో పెళ్ళి సింపుల్ గా చేయమాన్నాడట. పూర్ణ తండ్రి రిటైరయ్యాడు. భార్య లేదు. తల్లిలేని పిల్ల. మంచి సంబంధం అన్ని ఒప్పుకున్నాడుట. పూర్ణ బి.ఎ. అవ్వాలి ఇప్పుడప్పుడే చేసుకోను. అని గోల పెట్టింది. అమ్మచేత పూర్ణకి చెప్పించి, ఒప్పించి, మళ్ళీ రెండు నెలలకి కానీ ముహూర్తాలు లేవని ఇరవై రోజులలో సింపుల్ గా పెళ్ళి చేశారట. అతను మంచివాడు. మంచి ఉద్యోగం, ఇద్దరు పిల్లలు పుట్టి సుఖంగానే కాపురం చేసుకుంటూంటే ఐదేళ్ళ క్రితం అతను స్కూటరు యాక్సిడెంట్ లో తలకి దెబ్బతగిలి ఎన్నర్ధం కోమాలో ఉండి పోయాడుట. ప్రావిడెంటు ఫండు లోని డబ్బంతా అతని వైద్యానికే ఖర్చయింది. ఉండడానికి ఇల్లు లేదు. భర్త పోయాక వచ్చే పెన్షన్ ఏడెనిమిది వేలే ఆధారం . కొడుకు బి.కాం. కూతురు ఇంటర్ చదువుతున్నారు. అప్పుడు దాని కష్టాలు పగవాళ్ళకి వద్దనిపించింది. వంటలు చేసి కారియర్లు సప్ల్హై చేసి, యిడ్దేన్లు చేసి ఇచ్చి, ఊరగాయలు, పొడులు , సాయంత్రాలు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి సంసారం లాక్కొచ్చిందిట. తండ్రి పోయాక మళ్ళీ ఈ ఊరు రాలేదుట. కొడుకు బి.కాం అయ్యాక బ్యాంకి పరీక్ష రాశాడు కానీ రాలేదు. ఆఖరికి ఏదో కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చి కాస్త ఊపిరి పీల్చుకునేసరికి కొడుకు ఓసారి కదులుతున్న బస్సులోంచి దిగుతూ బస్సు చక్రాల కింద బోర్లా పడ్డంతో వెన్నుముక నుజ్జు నుజ్జు అయి శాశ్వతంగా జీవచ్చవం అయి మంచం మీద ఉన్నాడు. జీవితంలో ఇంక కింద భాగం పనిచేయదని మంచంలోనే ఉండాలని డాక్టర్లు చెప్పేశారు. అప్పుడు దాని దుఃఖం ఊహించు. చేతికందిన కొడుకు జీవితాంతం మంచం మీదా........ ఇక పెళ్ళి కావాల్సిన కూతురు, ఏడెనిమిది వేల రూపాయల పెన్షను. అదే ఆధారం. కూతురు బి.ఇడీ పాసయ్యింది. ఆఖరికి ఈ ఊర్లో హైస్కూల్లో ఉద్యోగం దొరికిందట. అందుకే ఈ ఊరు వచ్చారు. ఏదో చిన్న ఇంట్లో అద్దెకి ఉంది. అమ్మ పోయాక ఈ పదిరోజులు ఎంత చాకిరి చేసిందో అది."
"ఘోరం..... ఇంత జరిగినా మనకెవరికీ తెలీదు. అమ్మైనా చెపితే ఏదన్నా సాయం చేసేవారం గదా....' బాధగా అన్నాడు వేణు.
"అమ్మ అదే గోల పెట్టింది. నెలక్రితం ఊరు వచ్చినపుడు అమ్మ దగ్గరికి వచ్చి ఎంత ఎడ్చోందోనట.... అమ్మ వెంటనే పదివేలిచ్చింది. మీరంతా పూర్ణకి ఏదన్నా సాయం చెయ్యంది అంది అమ్మ.... దాని బతుకు ఇలా అయిపోయిందని బాధపడింది అమ్మ. మనింట్లో పెరిగిన పిల్ల..... ఎలాంటి పిల్ల.... ఎలా అయింది? దానికేదన్నా చెయ్యాలి నేను అంది అమ్మ బాధపడ్తూ."
"తప్పకుండా చేస్తాను. కొడుకు వైద్యానికి డబ్బు కావాలంటే ఇస్తాను. దాంతో మాట్లాడతాను. రేపు వెళ్ళి చూస్తాను" వ్యాకులపాటుతో అన్నాడు వేణు.
* * * *
ఆ రాత్రి నిద్ర కరువైంది వేణుకి. కళ్ళ ముందు పాత పూర్ణ. ఈనాటి పూర్ణ పక్క పక్కన కనిపించి మనసంతా వేదనతో నిండింది. పూర్ణతో ఇరవై ఏళ్ళ అనుబంధం. పక్కపక్క ఇళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే శరత్ బాబు, దేవదాసు, పార్వతి, పరిణీత, లలిత, శేకర్ల లాంటిది గొప్పింటి హీరో, లేనింటి హీరోయిన్ అయిన రెండు కుటుంబాల సాన్నిహిత్యం . తను, మాధవ్, రాధిక, పూర్ణ నలుగురూ కల్సి ఓ ఇంటి పిల్లల్లాగా పెరిగారు.





