Home » D Kameshwari » Madhupam
మనసే శిక్ష
"అన్నయ్యా! అమ్మ.... అమ్మ దాటిపోయిందన్నయ్యా ' రాధిక గొంతులో దుఃఖం అట్నించి ఒక్క క్షణం మౌనం...! "ఎప్పుడూ?" అన్నాడు వేణు. హటాత్తుగా విన్న వార్తతో గుండె బరువెక్కింది.
"తెలీదన్నయ్యా, రాత్రి నిద్దర్లో ఎప్పుడు ప్రాణం పోయిందో , తెల్లారి లేచి చూస్తె తెల్సింది. అసలు నిన్నటి నించి అన్నం ముట్టలేదు. రాత్రి పాలైనా తాగలేదు."
"పోనీలే! సునాయాస మరణం.... ఎనభై రెండేళ్ళు సుఖంగా, హాయిగా బతికింది. మంచాన పడకుండా దాటిపోయింది. అమ్మ అదృష్టవంతురాలు" అన్నాడు వేణు.
"అన్నయ్య! నువ్వు వెంటనే బయలుదేరి రా అన్నయ్య...."
"చూడు రాధికా! నేను వెంటనే బయలుదేరి వచ్చినా ఎల్లుండి కి గానీ రాలేను. పెద్దావిడని ఆ ఫ్రీజరు బాక్స్ లో పెట్టడం ఎందుకు? మాధవ్ అక్కడే ఉన్నాడుగా .... కానిచ్చేయండి. నాన్న పోయినప్పుడు ఆ బాక్స్ లో పెట్టడం ఆవిడకు నచ్చలేదు., నీకు తెలుసుగా!"
"అమ్మ కూడా పదే పదే చెప్పిందన్నయ్యా.. నన్ను మాత్రం ఆ మంచు పెట్టెలో పెట్టొద్దు. మీ నాన్నగారపుదు చూశాను. కట్టేపేడులా అయిపోయారు. వేణు రెండు నెలల క్రితమే వచ్చి వెళ్ళాడు. వాడు వెంటనే రాలేడు. మాధవ్ చేత తలకొరివి పెట్టించు అని.
నేనూ, మాధవ్ దేబ్బలాడాం. ఏంటమ్మా ఆ మాటలు! అని. "మీకు తెలీదు, నాకు రోజులు దగ్గిరపడ్డాయి. నా సంగతి నాకు తెలుస్తోంది" అంటూ ఏదేదో మాట్లాడింది. నెలరోజుల నించి అమ్మలో మార్పు వచ్చినదన్నయ్యా. అన్న హితవు పోయిందంటూ పెట్టిన అన్నం సగం వదిలేసేదట! కాంతమ్మగారు అన్నారు. మనిషి చాలా డీలా పడింది."
"మరి అమ్మ ఆరోగ్యం బాగా లేదని నాకెవరూ చెప్పనేలేదే?"
"నాకేం రోగం! నిక్షేపంలా వున్నా, వాడు మొన్నే వచ్చి వెళ్ళాడు. అనవసరంగా వాడినెందుకు గాభరా పెట్టడం అంది అమ్మ."
"మరి నువ్వు , మాధవ్ ఎలా వచ్చారు? మీకు ఎవరు చెప్పారు?"
"గోపాలం మామయ్య వారం క్రితమే ఫోను చేశాడు. ఏమిటో మీ అమ్మ సంగతి బాగా లేదే. మనిషి డీలా పడిపోయింది. తిండి తగ్గిపోయింది. డాక్టరు దగ్గరికి వెడదాం అంటే రాడు అంటూ ఫోను చేస్తే వచ్చాం" అంది రాధిక.
"మరి డాక్టరు కి చూపించలేదా అమ్మని?"
"బలవంతంగా తీసికెళ్ళం. రక్తపోటు సాధారణంగానే ఉంది. మధుమేహం లేదన్నారు. కానీ ఇంత తొందరగా దాటిపోయిందని మేం ఎవరం అనుకోలేదు. సరే మాధవ్ చేత కార్యక్రమం జరిపిస్తాం. నువ్వు వీలయినంత తొందరగా రా అన్నయ్యా."
"ఇప్పుడే టిక్కెట్టుకి ప్రయత్నిస్తాను. చూడు..... చిన్నమామయ్య . పిన్ని , అత్తయ్యా అందరికీ. ఆవిడ బంధువులందరికీ కబురు పెట్టండి. మాధవ్ కి చెప్పి బ్యాంక్ నుంచి డబ్బు తీయించు... నేను వచ్చాక మిగతా ఏర్పాట్లు చేద్దాం."
"అన్నయ్యా..... వదిన , పిల్లలు రారా..."
"కష్టమమ్మా రావడం. పిల్లలకి కాలేజీ. స్కూలు, వదిన మొన్నేగా వచ్చింది. చూస్తా....! వస్తే మేం యిద్దరం వస్తాం.... జాగ్రత్త! గోపాలం మామయ్యతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చూడమను" అంటూ ఫోను పెట్టేశాడు వేణు.
* * * *
పెద్దవాళ్ళ చావు పెళ్ళితో సమానం అంటారు. ఆ పల్లెటూరి మండువా లోగిలి పన్నెండు రోజులూ బంధువులతో నిండింది. ఎనబై రెండేళ్ళ యశోదమ్మ పోయిందంటే ఊరికి పెద్దదిక్కు పోయినట్లనిపించింది అందరికి. ఆవిడ తమ్ముళ్ళీద్దరు , చెల్లెలు, ఆడపడుచు, మరిది..... వాళ్ళ పిల్లలు, పెద్దత్త, దొడ్డమ్మా అనుకుంటూ వరసలు కలిపి పిలిచే పిల్లలు మనవలు..... తిలోదకాలు, దానాలు, ధర్మాలు, సంతర్పణ కి ఊరంతా తరలి వచ్చింది. పన్నెండు రోజుల కర్మ శాస్త్రోక్తంగా జరిపించారు కొడుకులిద్దరూ. బంధు జనం, పంటలు, వడ్డనలు , పెళ్ళిల్లు లాగే సందడిగా జరిగి పోయింది.
"అక్కయ్యకి ముప్పై ఎక్కు వచ్చేవరకు పిల్లలు పుట్టలేదు. చేయని పూజలు, తిరగని పుణ్య క్షేత్రాలు లేవు. ద్వారక, మధుర అవీ తిరిగి వచ్చాక వేణు కడుపున పడ్డాడు. వెంటనే ఐదేళ్ళ లో ముగ్గురూ పుట్టారు. ఆ కృష్ణుడి దయవల్ల పిల్లలు పుట్టారని అందరికీ కృష్ణుడి పేరే పెట్టుకుంది అక్కయ్య. ఈరోజు పిల్లలు ముగ్గురూ అక్కయ్యని ఇంత గొప్పగా సాగనంపారు" రాజ్యం పిన్ని అంది సంతృప్తిగా.
'అక్కయ్య ఊర్లో ఉందంటే ఎంత అండగా ఉండేది నాకు. అక్కయ్యా! అంటూ సలహాకి , సాయానికి వచ్చేవాడిని. ఒకరోజు రాకపోతే 'ఏరా గోపాలం రాలేదేం' అంటూ ఫోను చేసేది. అక్కయ్య పోవడం నాచేయి విరిగినట్లయింది. ఒరే వేణూ! నెల రోజుల నుంచీ ఆవిడలో ఏదో తేడా వచ్చిందిరా. మనిషి ఒక్కసారిగా నీరసపడింది. మాట తగ్గింది. దిగులుగా ఉండేది."
"అవును బాబూ! నెలరోజుల నుంచి అమ్మగారి తిండి తగ్గిపోయింది. ఏంటమ్మా అంటే అన్న హితవు పోయింది కాంతమ్మగారూ! రోజులు దగ్గిర పడ్తున్నాయి కాబోలు అన్నారు" అంది వంటావిడ కాంతమ్మగారు.
"అమ్మ తెల్లారి లేచింది మొదలు మొక్కల మధ్యే తిరిగేవారు. ఈపూలు ఆ పూలు కోస్తూ పందిరి ఎక్కించిన దొండకాయలు, నాలుగు వంకాయలు, ఇలా.... ఏవో కూరలు కోస్తూ ఎందు ఆకులూ ఎరిపారేస్తూ తిరిగేవారు. అలాంటివారు ఏమిటో ఓపిక లేనట్టు వరండాలో కుర్చీలో కూర్చునే వారు. సాయంత్రం పూలు కోసి మాటలు కట్టే మనిషి, నువ్వే కట్టనే సీతాలు అనడం మొదలుపెట్టారు. ఏమయిందో అమ్మకి" సీతాలు దిగులుగా అంది.
'అక్కయ్యా! డాక్టరు దగ్గరికి వెడదాం పద అని బలవంత పెట్టాను ఒకరోజు. 'నాకేం రోగం రా. నిక్షేపంలా ఉన్నాను. నన్ను ఆస్పత్రుల చుట్టూ తిప్పకు' అని మొండి కేసింది. ముందే ఓసారి డాక్టరుకి చూపిస్తే బాగుండేదేమో!' గోపాలం కళ్ళు తుడుచుకున్నాడు.
"మేం తీసికేళ్ళాంగా, డాక్టరు ఏం లేదన్నారుగా మామయ్యా!" అంది రాధిక.
"ఇంత జరుగుతున్నా నాకెవరూ ఏం చెప్పలేదు. చెపితే కాస్త ముందే వచ్చేవాడిని గదా!' నొచ్చుకున్నాడు వేణు.
"వాడు మొన్నే వచ్చి వెళ్ళాడు. వాడ్ని అనవసరంగా గాభరా పెట్టొద్దు అంది అక్కయ్య. అందుకే పోనీ ఓసారి రాధిక అన్నా, వచ్చి చూసి వెడుతుందని డానికి చెప్పాను" గోపాలం అన్నాడు.





