Home » D Kameshwari » Geethopadesam
గమ్యం
రాత్రి తొమ్మిది దాటింది. అరగంటనుంచీ వీధిగుమ్మం దగ్గర నిలబడి వచ్చేపోయేవారిని ఆశగా చూస్తోంది సీత. 'రాముడు రాడా, నన్ను రక్షించడా?' అనే ఆశతో ఎదురుచూసే అశోకవనంలో సీత కాదు ఈ సీత! 'నాకోసం ఏ రాముడూ రానక్కరలేదు, రావణుడైనా చాలు, మగాడైతే చాలు. నాలుగు డబ్బులిచ్చేవాడైతే చాలు' అన్నట్టు. గుమ్మం ముందు ఎవరైనా కనపడితే, ఓ నవ్వు విసిరి నాలుగు అడుగులు ముందుకేసి ఆ శాల్తీ ముందుకెళ్లగానే మొహంలో నవ్వు మాయమయ్యేది. మొహం మొటమొటలాడించుకుంటూ 'ఈ దొంగనాయాళ్లందరూ పెళ్లాల కొంగట్టుకు తిరిగే పిరికినాయాళ్లైపోతున్నారు. ఎదవలు తాగి, తాగి, గుట్కాలు మింగి మింగి కొజ్జా వెధవలైపోతున్నారు' ఆమె నోట్లోంచి బూతుమాట. ఆకలికి ఎన్ని బూతులైనా వస్తాయి మరి!
అప్పటికి అరగంట ముందు బియ్యం డబ్బా పీకి, లాగినా, దులిపినా గుప్పెడు గింజలు కూడా రాలేదు. ఆ ఉన్న గింజల్నే మూడు నాలుగు గ్లాసులు నీళ్లు పోసి గంజిలా తయారుచేసి ఇంత ఉప్పేసి చదువుకుంటున్న కూతురిని పిలిచింది.
"ఇవాళన్నా అన్నం వండలేదా అమ్మా, రొట్టెన్నా చెయ్యరాదా?" కంచం చూసి గునుస్తూ అంది రేణుక.
ఉల్లిపాయ సగం కోసి సగం ముక్క కూతురు కంచం ముందు పెట్టి "ఆఁ బిరియాని వండిపెడతా. రా... ముందు ఇది తాగు, వేడిగా ఉంది. రేపు యిదీ వుంటుందో లేదో" హేళనగా నవ్వి తను కంచం ఎత్తి గంజి తాగడం మొదలుపెట్టింది. తల్లిని మింగేసేట్టు చూసి, గబగబా గంజి తాగి విసురుగా లేచి వెళ్లిపోయింది కూతురు.
కంచాలు, గిన్నెలు కడిగి, వంటిల్లనబడే ఆరడుగుల గదిని తడిగుడ్డతో తుడిచి, పెరటిగుమ్మం ముందు పెట్టిన బాల్చీలో నీళ్లతో పళ్లు తోమి పుక్కిలించింది. తొడుక్కున్న నైట్ గౌను తీసి గుమ్మంమీద వేసి రెండు చెంబులు నీళ్లు పోసుకుంది. కాగితం ముక్కలో చుట్టి చూరులో దాచిన సబ్బుముక్క తీసి ఒళ్లు రుద్దుకుంది. దండెంమీద వేలాడుతున్న పరికిణీ కట్టుకుని, తువ్వాలు కప్పుకుని, ముందు గదిలోకి వచ్చి మూలనున్న చాప, దిండు, దుప్పటి తీసుకెళ్లి వంటింట్లో వేసి "పో, పోయి పడుకో, చదివింది చాల్లే" అంది.
పదేళ్ల రేణుక తల్లివంక తిరస్కారంగా చూసింది. రోజూ అలవాటైన తంతే గనక మాట్లాడకుండా పుస్తకాలు పెట్టెమీద పెట్టి వంటింట్లోకి పోయింది.
ఇవతలినించి గడియపెట్టి పరుపు కింద పెట్టిన తెల్లచీర, గులాబీపూల తెల్ల నైలాను చీర, తెల్లజాకెట్టు తొడుక్కుని, చిన్న పౌడరు డబ్బాలో పౌడరు కాస్త వంపుకుని మొహానికి, మెడకి పాముకుంది. కాస్త పౌడరు జాకెట్లో జల్లుకుంది, అద్దం వెనక దాచిన అరిగిపోయిన లిప్ స్టిక్ తీసి వేలితో పెదాలకి పాముకుంది. జుత్తు దువ్వుకుని క్లిప్ పెట్టి అద్దంలో ఇటు తిరిగి వయ్యారంగా చూసుకుంది. పరుపుమీద దుప్పటి తీసి దులిపి వేసింది. తలగడలు సర్ది బయట గుమ్మం దగ్గరకొచ్చి నిలబడింది.
ఆఖరికి నిరీక్షణ ఫలించినట్టు ఓ స్కూటరు నెమ్మదిగా వచ్చింది. ఎవరి కోసమో చూస్తున్నట్టు అటూ ఇటూ చూస్తున్నాడు ఆ వ్యక్తి. స్కూటరు గుమ్మం దగ్గరకి రాగానే అరసెకను ఆగినట్టు కనపడింది. ఓ నవ్వు విసిరింది సీత. స్కూటరు కదిలి ముందుకు వెళ్లింది. ఆమె మొహం వాడిపోయింది. నాలుగడుగులు ముందుకెళ్లిన స్కూటరు మళ్లీ వెనక్కి వచ్చింది. సీత సంబరంగా అతడికి ఎదురెళ్లి "రండి... రండి... లోపలికి రండి" అంది.
"చూడు, నీ పేరేమిటో... నేనందుకోసం రాలేదు" అన్నాడు ఆ వ్యక్తి.
"మరెందుకొచ్చావురా? నా మొహంలో కోతులు ఆడుతున్నాయేమో చూడాలని వచ్చావా?" తిరస్కారంగా ఓ చూపు విసిరింది.
"ఇదిగో, నీవు నాతో ఒక్క గంట రాగలవా?"
"ఎక్కడికీ? ఇంట్లో చిన్నపిల్ల ఉంది. అలా నేను బయటకు రాను."
"గంటలో మళ్లీ తీసుకొచ్చి దింపేస్తా. చిన్న ఎక్స్ ట్రా వేషం వేయడానికి అర్జంటుగా రావాలి. నేను మాట్లాడుకున్న మనిషి కాలిరిగి రాలేదు. షూటింగ్ ఆగడానికి లేదు. అందుకే ఇప్పటికిప్పుడు ఓ ఆడమనిషి..." గబగబా చెబుతూ "ఐదొందలు ఇస్తా. తొందరగా వెళ్లాలి" అన్నాడు సీతను తొందరపెడుతూ.
'ఐదొందలు' అనే మాట తప్ప సీతకింకేం వినపడలేదు. అడ్డమైన ఐదుగురితో పడుకుంటే కూడా రానంత డబ్బు!
"షూటింగా? నాకేం వచ్చు నటించడానికి?"
"అదంతా మేం చూసుకుంటాం. వస్తే త్వరగా రా... లేదంటే ఇంకొకరు."
"ఇప్పుడే వస్తున్నా..." గబగబా లోపలికి వెళ్లింది. కూతురు మంచినిద్రలో ఉండడం చూసి బయటికి వచ్చి గడియ వేసి, తాళం పెట్టి స్కూటరెక్కింది.
పది నిమిషాల తర్వాత ఓ పెద్ద బంగళా ముందు స్కూటరు ఆగింది. ఆ తర్వాత ఏదో కలలో మాదిరి గబగబా అద్దం ముందు కూర్చోపెట్టి మేకప్ మొహానికి పామి, జుత్తు విరబోసి బాబ్ లా చేసి ఓ సల్వార్, కుర్తా వేసుకురమ్మన్నారు. దుస్తులు మార్చుకున్న తర్వాత ఆమెను లాక్కుపోయినట్టే కెమెరాలు, లైట్లు వెలిగే చోటుకి తీసుకుపోయి నిలబెట్టారు. చేతిలో కాగితాలు పట్టుకున్న ఒకతను వచ్చి "ఇదిగో అమ్మా, చూడు ఇప్పుడు నువ్వు ఇక్కడ సోఫాలో కూర్చుని పుస్తకం చూస్తూ వుంటావు. డోర్ బెల్ మోగుతుంది. లేచి అలా వెళ్లి తలుపుతీయాలి. గుమ్మంలో ఓ అమ్మాయి నిలబడి ఉంటుంది. 'నీవా సరితా? ఏమిటే ఇలా ఇంత రాత్రి వచ్చావు?' అని ఆశ్చర్యంగా చూస్తూ అడగాలి. ఆమె హీరోయిన్? 'నన్నీ రాత్రికి ఇక్కడ ఉండనిస్తావా?' అని అడుగుతుంది ఆరాటంగా.
'ఏమిటే? ఏమైందే? ముందు లోపలికి రా...' అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాగాలి. ఆమె లోపలికి రాగానే తలుపు వేసి ఇద్దరూ సోఫావైపు నడిచి అక్కడ కూర్చోవాలి. ఏంటి? అర్థమైందా? చేస్తావా? చెప్పాల్సిన డైలాగ్స్ గుర్తున్నాయా?" ప్రశ్నించాడు కాగితాలు పట్టుకున్నతను.
గబగబ తల ఆడించి "ఓస్... ఇంతేనా?" అంది.
"సరే అయితే, ఒకసారి చేసి చూపించు" అన్నాడు.
ఆ సీనంతా తడబాటు లేకుండా సులువుగా చేసి చూపించింది.
"గుడ్! ఇప్పుడు మళ్లీ మేం రెడీ అనగానే అలాగే చెయ్యాలి" అన్నాడు డైరెక్టర్. లైట్లు వెలిగాయి. "స్టార్ట్ కెమెరా, యాక్షన్" డైరెక్టర్ వెనకనుంచి కేక. టీవీ ముందు కూర్చొన్న డైరెక్టర్ మొహంలో తృప్తి, సంతోషం.
"ఎక్కడనుంచి పట్టుకొచ్చారీ పిట్టని? వ్యూ ఫౌండర్ లోంచి చూస్తే మంచి ఫొటోజెనిక్ ఫేస్. మొహంలో ఫీలింగ్స్ కూడా బాగా ప్రెజెంట్ చేసింది. ఇంకా రెండు సీన్లున్నాయి ఈ అమ్మాయితో. రేపు లాగించేద్దాం" అసిస్టెంట్ డైరెక్టర్ వంక చూసి అన్నాడు డైరెక్టర్.
"హీరోయిన్ మళ్లీ నెల వరకు అమెరికా నుంచి రాదు. చిన్న చిన్న టిట్ బిట్స్ రెండు రోజుల్లో లాగించెయ్యాలి. మరచిపోకుండా రేపు రమ్మను" అన్నాడు.
తర్వాత సీనులో సీత వెళ్లి ఫ్రిజ్ తీసి కూల్ డ్రింక్ తీసుకొచ్చి హీరోయిన్ కిచ్చింది. "ఇప్పుడు చెప్పు ఏమైందో?" అనే డైలాగ్ తో ఆ రెండో సీను తీసేసరికి గంటపైన పట్టింది. పన్నెండవుతుండగా 'పేకప్' చెప్పి అందరూ టకటకా మిషన్లలాగా లైట్లు, కెమెరాలు అన్నీ సర్దేశారు.
"పద నిన్ను దింపేస్తా" అన్నాడు జూనియర్ ఆర్టిస్టుల్ని సప్లై చేసే రాజేష్.
"మరి డబ్బు?" అంది సీత.





