Home » D Kameshwari » Geethopadesam
"ఇదిగో పెళ్లిచేసుకున్నావు. పార్టీ ఏది అని నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు చంపుతున్నారు. రేపు ఆదివారం వాళ్లని మన ఇంటికి పిలుస్తా. నీ పాకప్రావీణ్యమంతా చూపించు. ఇంక ఆ తరువాత సింపుల్ మీల్. అలా అని రుచీపచీ లేకుండా కాదు. చేసింది రెండు వంటలైనా రుచి అదరాలి" చెప్పి బయటికెళ్లిపోయాడు పండుబాబు.
* * *
"బాబోయ్, మీ ఆవిడ వంటలు తిన్నాక, ఇంక రేపటి నుంచీ మా మొగుళ్లు మమ్మల్ని బతకనీయరు. ఆవిణ్ణి చూడు అంటూ దెప్పిపొడుస్తారు" అంది ప్రసాద్ భార్య యామిని.
"పర్ ఫెక్ట్. వంటలు ఎంతో బాగా కుదిరాయి. ఎన్నాళ్లుగానో తినడానికి నోచుకోని భోజనం దొరకడంతో ఆ మూడు జంటలూ ఆవురావురుమని గిన్నెలు ఖాళీ చేశాయి. పండుబాబు గర్వంగా కాలరెగరేశాడు. మంచి చదువు చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆంటీ తనను మెచ్చుకోవడంతో పొంగిపోయింది శ్రీవల్లి. పైకి మాత్రం "నాదేముందిలెండి. వనత చేయడమే వచ్చు. నాకు మీలా చదువులూ, ఉద్యోగాలూ లేవుగా! ఏదో వానాకాలం చదువు నాది" మొగుడి వంక చూస్తూ అంది కావాలనే.
"వదినగారూ, మీరు తక్షణమే ఓ కేటరింగ్ ఓపెన్ చేసేయండి. ఆర్డర్లమీద ఆర్డర్లు, డాలర్ల మీద డాలర్లు వచ్చిపడతాయి. మా ఉద్యోగాలెందుకూ పనికిరావండీ మీ సంపాదన ముందు. అచ్చతెలుగు తిండికి బాచిలర్స్ మొహం వాచీ ఉన్నారు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి తెలుగువారందరూ దండం పెడుతూ ఆర్డరిస్తారు" ఊరించి చెప్పాడు వంశీ.
"అవునవును. ముందు బోణీ నాదే. ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే!" సుబ్రహ్మణ్యం అన్నాడు నవ్వి.
"హాయిగా ఆదివారం వండుకోవడం, తోముకోవడం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తాం" అంటూ తలోమాట అనేశారు. వాళ్లు అలా తలో మాట అని వెళ్లాక ఆ మాటలన్నీ వల్లీ బుర్రను తొలవడం ఆరంభించాయి.
"మతిపోయిందా? వాళ్లేదో సరదాగా అన్నారు. కేటరింగ్ అంటే తమాషా అనుకున్నావా?" పెళ్లాం మాటలు విని అరిచాడు పండు.
"ముందే పెద్ద ఎత్తున కాకుండా రోజూ ఆరేడు లంచ్ పాకెట్లు, మనం వండుకునేదే కాస్త ఎక్కువ చేస్తే చాలు. యామినిగారిని అడిగా ఆవిడ ఒక గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నంబరిస్తే మాట్లాడా. ముందు చిన్నగా ఆరంభించమంది. రోజుకో వంద డాలర్ల ఆర్డర్లతో ఆరంభించమంది."
"అప్పుడే వివరాలన్నీ సేకరించావా? ఫరవాలేదే! అమెరికా గాలి నెల్లాళ్లకే వంటబట్టి ఆరితేరిపోయావా?" హేళనగా అన్నాడు.
"చదువు లేదు, ఉద్యోగం ఎలాగూ రాదు. ఏ చిన్న ఉద్యోగం చెయ్యాలన్నా ఇల్లొదిలి బయటకెళ్లి రోజంతా కష్టపడే బదులు ఇంట్లోనే ఉండి కాస్త నా ఖర్చులకి సంపాదించుకుంటూ, ప్రతిదానికి మిమ్మల్ని అడగక్కరలేకుండా. నాకూ డబ్బవసరముంటుందిగా?" పండుబాబుకి నిర్ణయం చెప్పేసింది శ్రీవల్లి.
'పోన్లే ఏదో ఇంట్లో ఉండి వంట చేసుకుంటుందిలే, తన పాట్లు తనే పడుతుందిలే, తనని డబ్బుకోసం చంపకపోతే మాత్రం చాలు' అనుకున్నాడు పండుబాబు.
* * *
ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది, నాలుగు డబ్బులు సంపాదించుకోనీ అనుకున్న పండుబాబు ఆలోచనలన్నింటినీ ఒక్క ఏడాదిలోనే తలకిందులు చేసేసింది శ్రీవల్లి. పండు సంపాదన మించిపోయే రీతిలో 'శ్రీవల్లీ హోమ్ ఫుడ్స్ కేటరింగ్ సర్వీస్' ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోతుందనుకోలేదు పండుబాబు. పండు ఏమనడానికీ లేదు. ఒకవేళ అన్నా వినే స్టేజి దాటిపోయింది శ్రీవల్లి. ఆ విషయం గ్రహించి నోరు మూసుకున్నాడు. డబ్బు చేదుగాదు కదా!
లంచ్ ప్యాక్ లతో మొదలై, చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి ఆర్డరు తీసుకుంటూ, తనతోపాటు ఇంట్లో ఉండే అమ్మాయిని పేయింగ్ గెస్ట్ గా కుదుర్చుకుని ఇద్దరూ కలిసి ఆర్డర్లు తీసుకుంటూ ఆర్నెల్లలో మంచి తెలుగు భోజనం పెడుతున్నారు అనిపించుకుని డాలర్లు పోగుచేసుకునేలా బిజినెస్ మొదలుపెట్టారు. నార్త్ ఇండియన్ డిషెస్ కావాలన్నా కూడా సప్లయ్ చేస్తున్నారు. డిమాండ్ పెరగగానే గుజరాతీ ఆవిడతో లింకు పెట్టుకుని నార్త్ ఇండియన్ డిషెస్ ఆవిడచేత చేయిస్తూ బిజినెస్ టాక్టీస్ వంటబట్టించుకుంది శ్రీవల్లి. ఎడాపెడా ఇంగ్లీషు దంచి పారేస్తూ గడుసుతనం సంపాదించి, పక్కా బిజినెస్ ఉమన్ అవతారం ఎత్తింది.
భార్యని చూసి 'డబ్బు సంపాదనకి, చదువుకి సంబంధం లేదు' అనే విషయం గుర్తించడానికి ఏడాది పట్టింది పండుబాబుకి. ఇప్పుడు 'మిసెస్ పండు కాదు, మేడమ్ శ్రీవల్లి' అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది. రెండేళ్లలో ఒక హెల్పరల్లా అరడజనుమందయ్యారు. పక్కనున్న ఫ్లాట్ అద్దెకు తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్న పెళ్లాన్ని తనకి కావల్సిన వంట చేసిపెట్టమని అడగలేకపోతున్నాడు. తన ఆలోచన బూమ్ రాంగ్ అయిందని, శ్రీవల్లి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది అతగాడికి.
"ఇన్ని వంటలెదురుగా ఉన్నాయి, కావాల్సినవి తినండి, మీకోసం మళ్లీ వేరే వంట కుదరదని" చెప్పేసింది శ్రీవల్లి.
తెలుగువంట తప్ప తినడం ఇష్టంలేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి సమోసాలో, కచోరీలో, డోక్లాలో తింటున్నాడు. పప్పు, ముక్కలపులుసు బదులు సాంబారు, రాత్రి చపాతీలు, కుర్మా, బేల్ లు తినడానికి అలవాటు పడిపోయాడు. ఇడ్లీ, దోసెలు ఆదివారం స్పెషల్స్ అయ్యాయి. భార్యగారి మెనూలో ఉన్నవాటిల్లో ఏదో ఒకటి ఎంచుకుని ప్లేట్లలో వడ్డించుకుని తన ఇంట్లోకి తెచ్చుకుతింటాడు పండుబాబు బుద్ధిమంతుడిలా.'వంట-ఇల్లు' రెంటినీ చక్కబెట్టుకుంటుందనుకున్న భార్య 'వంటే చేస్తుందని', 'ఇల్లు చూడదని' అర్థమైపోయింది. రేపు పిల్లలు పుట్టాక నేపీలు మార్చి పాలసీసాలు కడిగి పాలు పట్టడం ఇక తన పనే అని అర్థమైపోయింది పండుబాబుకి.
(నవ్య, 31 జనవరి, 2018)
* * * *





