Home » D Kameshwari » Geethopadesam
జేబులోంచి ఐదొందలు తీసి చేతిలో పెట్టి "రేపు కూడా పనుంది. చెప్పిన టైముకి రావాలి" అన్నాడు.
ఆనందంగా, ఆరాటంగా గబగబా తలాడించింది. "ఆ మేకప్ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకురా" అని పంపాడు.
స్కూటర్ మీద ఇంటికి వస్తుంటే గాలిలో తేలిపోయినట్టుంది సీతకి. ఇల్లు రాంగానే "ఎప్పుడన్నా ఏదన్నా వేషం ఉంటే పిలవండి సార్!" వినయంగా అడిగింది సీత.
"సరే చూద్దాం... ముందు రేపు రా" అన్నాడు. రెండు రోజుల్లో వెయ్యి సంపాదన. ఆ రాత్రంతా సీతకి నిద్ర పట్టలేదు.
పొద్దుటే సందు చివర ఇడ్లీ బండినుంచి అరడజను ఇడ్లీలు, రెండు వడలు తెచ్చుకుని తల్లి, కూతురు తిని, టీ తాగారు. కూతురు మొహంలో ఆనందం చూసి :ఒక డ్రస్సు కొంటా నీకోసం" అంది మురిపెంగా కూతురునే చూస్తూ.
* * *
ఆ రాత్రితో సీత జీవితం మలుపు తిరిగింది. ఒక రోజు అనుకున్న పని రెండు రోజులైంది. సెట్లో ఉన్న సీతను మరొక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ చూసి "ఓ చిన్న రోల్ ఉంది" అని బుక్ చేసుకున్నాడు. అలా ఆ నోటా ఈ నోటా సీత గురించి విని, చూసి చిన్న చితక వేషాలు రావడం ఆరంభించాయి. పదిహేను రోజుల్లో నాలుగు వేషాలు దొరికాయి. పనినిబట్టి చేతికి మూడొందలో, ఐదొందలో రాబడి. రెండు పూటలా కడుపునిండా తిండి, ఒంటినిండా బట్ట దొరికింది తల్లీకూతుళ్లకి. రాత్రిపూట సీత ఇంటి తలుపులు బందయ్యాయి.
"అబ్బో! ఏటే నాలుగు ఎక్ స్ట్రా ఏసాలేసేసరికి మమ్మల్ని ఎల్లగొడుతున్నావు. సినీస్టారుననుకుంటున్నావా? తలుపు తీయి..." తాగొచ్చి తలుపులు బాదుతూ, తిడుతూ, బూతులు మాట్లాడుతూ అరిచేవాళ్లు, అరిచి అరిచి "దొంగముండ, పెద్ద పతివ్రత ఏసాలేస్తోంది. సూద్దాం ఈ భాగోతం ఎన్నాళ్లో?" అని శాపాలు పెట్టి వెళ్లేవారు.
ఇవన్నీ చూసి అందరికంటే ఎక్కువగా సంతోషించిందెవరంటే సీత కూతురు రేణుక. రోజూ రాత్రయ్యేసరికి చీకట్లో వంటగదిలో పడుకునే అవస్థ తప్పిందని రేణుక సంబరం. తల్లి చేసే పని పూర్తిగా అర్థం కాకపోయినా అడ్డమైన మగాళ్లు ఇంటికి రావడం తగ్గిపోయింది. అమ్మతోపాటు మంచంమీద పడుకుని, రెండు పూటలా అన్నం తిని, రెండు మంచి బట్టలు కొనుక్కున్నందుకు సంబరపడిపోతూ తల్లి పట్ల విముఖత తగ్గి మనసారా మాట్లాడుతోంది.
పాతికేళ్లు నిండని సీతకి మనసు, శరీరం స్పందన కోల్పోయి పదేళ్లు పైనే అయింది. అనుభూతులకు దూరమైన మనసు, ఆర్థిక అవసరాలకి అలవాటుపడి మొద్దుబారిన శరీరం... బతుకులో ఏం మిగిలింది అనుకోడానికి కూడా ఇష్టపడదు ఆమె. కళ్లెదుట కూతురు రూపంలో తన తప్పు కనిపిస్తుంటే, చేసిన ఆ తప్పుకి ఆ బిడ్డను పెంచడమే ఒక శిక్షగా మారడం, ఆ బిడ్డను పెంచడం కోసం ఈ రొంపిలోకి దిగడం తప్ప మరో మార్గం లేకపోవడం, 'కావాల్సిందే తనకి... తన బతుకిలా కాక ఇంకెలా ఉంటుంది?' అనుకోవడం కూడా మానేసింది సీత.
'కన్నవాళ్ల ఉసురు తనకు తగలకుండా ఎలా ఉంటుంది? హాయిగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పదహారేళ్ల వయసులో మైమరచిపోయి, కళ్లు మసకలు కమ్మి, ప్రేమని నమ్ముకుని గడప దాటినా ఆడపిల్లల కథలన్నీ ఒకేలా ఉంటాయని ఎందరు రాశారో, ఎందరు చూశారో, ఎందరు చెప్పారో! అయినా బుద్ధిరాదు. రాత ఇలా వున్నప్పుడు కళ్లు మూసుకుపోక ఏమవుతుంది? ముద్దు, మురిపాల మూన్నాళ్ల ముచ్చట్లు పూర్తయ్యాక మాయమైపోయిన ప్రేమికుడు... కడుపులో పెరిగే బిడ్డ, ఆకలంటే ఎలా ఉంటుందో తెలియని అయినింటి ఆడపిల్లని ఆ ఆకలన్నది ఏ స్థితికి దిగజారుస్తుందో స్వయంగా అనుభవించి పాఠం నేర్చుకున్న నాలాంటి అమ్మాయిల కథలు ఇంతే!
'తన కూతురికి తన వారసత్వం రాకూడదు.' ప్రతి తల్లీ అనుకునే మాటే సీతా అనుకుంటోంది. ఆ పరిస్థితి రాకుండా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో మాత్రం తెలియదు సీతకి. ఆ కోరికే విత్తనంలా నాటుకుంది ఆమె మనసులో. కానీ దాన్ని ఎలా మొలకెత్తించాలో, ఆ మొలక మొక్కగా మారితే ఏం పోసి పెంచి పోషించాలో తెలియదు సీతకి.
ఇప్పటికి, ఇన్నాళ్లకి ఆ విత్తు చిన్న మొలక రూపం దాల్చింది. కాస్త పెంచి పెద్ద చెయ్యవచ్చన్న ఆశ చిగురుటాకులు వేసింది.
సీత కోసం ముగ్గురు నలుగురు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్, కాంట్రాక్టర్స్ రావడం, పోవడం, తారీఖులు రాసుకోవడం, ఉదయం కూతురికింత వండిపెట్టి, రోజంతా షూటింగులతో బిజీ అయి రాత్రిళ్లు ఇంటికి చేరడం... ఇదీ సీత దినచర్య. తల్లి ఇచ్చిన తాళం చెవిని పక్కింటి మామ్మ దగ్గర తీసుకుని ఇంట్లో ఒంటరిగా వుండటానికి అలవాటు పడింది రేణుక.
కాస్త డబ్బు చేతిలో పడగానే ఆ కొంప మరీ దరిద్రం అనిపించింది సీతకి. పక్కనున్న కాలనీలో చవకలో చిన్న అపార్టుమెంట్ లోకి మారింది. మంచం, కుర్చీలు, ఫ్యాన్ లాంటి అవసరాలన్నీ సమకూరడం మొదలైంది. "సినిమావాళ్లు వచ్చినప్పుడు కూర్చోపెట్టొద్దూ... పక్కమీద ఎలా కూర్చుంటారు మరి! కట్టుకోడానికి నాలుగు చీరలుండద్దూ మరి!"
తిండి ఒంటబట్టి అందం మెరుగుపడింది. బుగ్గలకి మెరుపొచ్చింది. శరీరానికి నాజూకుదనం వచ్చింది. స్టైలు మారింది. డబ్బుంటే ఏం చెయ్యచ్చో అవన్నీ ఒక్కొక్కటి దగ్గరకి చేరసాగాయి. బతుకు గాడిని పడిందన్న సంతోషం ఏడాదన్నా నిండక ముందే, నీవెవరో, నీ గతం ఏమిటో మరచిపోనిస్తామా అన్నట్టు ప్రొద్దున్నే తొమ్మిది గంటల వేళ రాజేష్ సీత ఇంటి తలుపు తట్టాడు.
సీత అడగకముందే "రేపు షూటింగ్ క్యాన్సిలైందని చెప్పడానికి వచ్చాను. పాపం అనవసరంగా వస్తావని" అని నవ్వి లోపలికి తొంగిచూశాడు. "ఇంట్లో ఎవరుంటారు? ఒక్కర్తివేనా? ఇంత దూరం వచ్చినందుకు ఇన్ని టీ నీళ్లన్నా పోయవా?" అడిగాడు చనువుగా.





