Home » yerramsetti sai » Kanthi Kiranalu
"నీకో సంగతి చెప్పనా?" అంది ఆమె భుజంమీద చేయివేస్తూ.
"ఏమిటది?" కుతూహలంగా అడిగింది కృష్ణకుమారి.
"మీ అన్నయ్య నన్ను వదిలేశాడు!" అంది స్వరూప తేలికగా.
"ఛీ. అదేమిటి?" ఆశ్చర్యపోతూ అందామె.
"నేను మంచిదాన్ని కాదని తెలిసిందట..." తలొంచుకుని అంది స్వరూప.
"ఛీ! ఏం మాటలవి?" నమ్మశక్యం కాక అంది కృష్ణకుమారి.
"నిజమే చెప్తున్నాను కృష్ణా! ఇన్ని రోజులూ నీకు చెప్పలేక ఊరుకున్నాను. ఇక ఎంతో కాలం నిన్ను మభ్యపెట్టటం ఇష్టం లేకపోయింది. పెళ్ళిరోజు రాత్రే నాకీ విషయం చెప్పాడు మీ అన్నయ్య ఇష్టం లేని వాడితో సంసారం చేయడం నాకుమాత్రం ఇష్టమా ఏమిటి? సరేనన్నాను. అంతే. కథ అక్కడితో అంతమయింది..."
కృష్ణకుమారి చాలా సేపటివరకూ అలాగే నుంచుని స్వరూప వంక చూస్తూండిపోయింది. ఆమెకింకా స్వరూప చెప్పిన మాటలు నమ్మబుద్ధి కావడంలేదు.
స్వరూప ఇంట్లో ఏదో పని చూసుకొని చాలాసేపటి తర్వాత హాల్లో కొచ్చేసరికి కృష్ణకుమారి ఇంకా అక్కడే బొమ్మలా కదలకుండా నిలబడిపోయింది.
"ఇంకా ఇక్కడే ఉన్నావా నేను మంచిదాన్ని కాదని తెలిసికూడా మీ ఇంటికి పారిపోలేదేం?" నవ్వుతూ అంది స్వరూప.
"స్వరూపా!"
"ఏమిటి?"
"నువ్వు చెప్పిందంతా నిజమేనా?"
"భలేదానివేలే! ఇలాంటి విషయాల్లోనా అబద్దాలు చెప్పడం."
"మరి ఈ విషయం నువ్వింత తేలిగ్గా ఎలా తీసుకున్నావ్?"
"ఇది మరీ బావుంది ఏడుస్తూ కూర్చోమంటావా?"
"ఊహుఁ! నేననేది అదికాదు." ఇంకేం మాట్లాడాలో తెలీక ఆగిపోయింది కృష్ణకుమారి.
"మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి?" తనే అడిగింది కృష్ణకుమారి.
"ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది...."
మరికొద్దిసేపు నుంచుని "నేను వెళ్తాను స్వరూపా. నాకేమిటో జ్వరం వచ్చినట్లుంది." అని వెళ్ళిపోయింది కృష్ణ కుమారి.
నాలుగయిదు రోజులవరకూ ఆమె జాడేలేదు.
ఓ రోజు హఠాత్తుగా స్వరూప గదిలోకొచ్చింది. పడుకొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకొంటున్నదల్లా ఆమెను చూసి లేచి కూర్చుంది స్వరూప.
"వారం రోజుల్నుంచి ఎక్కడ మాయమయిపోయావ్?" నవ్వుతూ అడిగింది స్వరూప.
"ఎక్కడికీ పోలేదు. నేనిప్పుడు నీతో బోలెడు విషయాలు మాట్లాడ్డాని కొచ్చాను..." ఆమె పక్కనే మంచం మీద కూర్చుంటూ అంది కృష్ణకుమారి.
"నువ్వేం మాట్లాడదామనుకొంటున్నావో నాకు తెలుసు" తన చేతివేళ్ళ వంక చూసుకుంటూ అంది స్వరూప.
"ఏం మాట్లాడాలనుకొంటున్నాను?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"పెళ్ళికి ముందు నిజంగా నువ్వెవరినైనా ప్రేమించావా అని అడగాలనుకొంటున్నావ్?" కృష్ణకుమారి తెల్లబోయింది.
"ఈ వారం రోజుల్నుంచీ నువ్ ఇంట్లో కూర్చుని చేసిన పనేమిటో కూడా నాకు తెలుసు. మీ అన్నయ్యకు ఉత్తరం రాసి ఉమ్తావ్ కోపంగా. అందుకతను సమాధానంగా కావాలంటే స్వరూప నడుగు, ఈ విషయాలన్నీ నిజమేనని ఆమె వప్పుకుంటుంది' అని జవాబురాసి ఉంటాడు ఆ ఉత్తరం చదవగానే నువ్విక్కడికొచ్చావు." నవ్వుతూ అంది స్వరూప.
"అంటే నేను చేసే ప్రతి పనీ కనిపెడుతూనే ఉన్నావన్న మాట." తనూ నవ్వేస్తూ అంది కృష్ణకుమారి.
"ఇందులో కనిపెట్టాల్సినంత గొప్పేంలేదు. నీ పరిస్థితిలో ఉన్న వారెవరయినా చేసేపని అదే!"
"సరే! పోనీ ఇప్పుడు చెప్పు ఆ విషయం నిజమేనా?"
"అంటే మీ అన్నయ్య మాటలు నీకు నమ్మకం లేదా?"
"ఇలాంటి విషయాలు నేను ఎవ్వరు చెప్పినా నమ్మను. నా కళ్ళతో నయినా చూడాలి! లేదా ఆ వ్యక్తినయినా అడిగి తెలుసుకోవాలి!"
"చాలా మంచిపద్దతి! అందరికీ ఈ మాత్రం బుద్ధిఉంటే మనకి ఇన్ని సమస్యలు-ఇన్ని ఇబ్బందులు-ఉండక పోను!"
"నా కెందుకో నమ్మకం ఉంది స్వరూపా! నిన్ను అన్నయ్య తప్పుగా అర్ధం చేసుకున్నాడు!" బాధ ఆమె గొంతులో తొణికిసలాడింది.
స్వరూప మాట్లాడలేదు!
గత స్మృతులు ఆమెను చుట్టుముట్టేసినయ్!
11
సెకండియర్ లో ఉండగా తను కొన్ని పుస్తకాలు చదివింది. అవి ఓ విధమయిన ఆవేదనని కలుగజేసినయ్! అంతవరకూ స్త్రీ సమస్యలంటే కేవలం 'కట్నం ఇచ్చి పెళ్ళాడటం' ఒక్కటే అనుకొంటూ వచ్చింది. ఆ తరువాత స్త్రీకి లేని సమస్య లేదనిపించింది.
ఆ ఆలోచనలు-ఆ ఆవేశం లేడీస్ క్లబ్ వారు నిర్వహించిన "నేటి స్త్రీ" అన్న డిబేటింగ్ లో తనను మాట్లాడించిప్రధమ బహుమతి గెలుచుకొనేట్లు చేసినయ్. ఏమీ తోచక ఆ మీటింగ్ కొచ్చిన ప్రసాద్ కి తనంటే ఇష్టం అప్పుడు మొదలయింది. తరువాత అతనే చెప్పాడా విషయం. అతనే కాదు! మగాడి నిరంకుశత్వం గురించి అద్భుతంగా మాటాడిందని అందరూ మెచ్చుకొన్నారు.
వేసవికాలం సెలవు లొచ్చినయ్.
అప్పుడే ప్రసాద్ తో పరిచయం.
సెలవులో వచ్చాడతను.
తెల్లవారుజామున తను ఇంటి బయట ముగ్గువేస్తోంది మసక చీకట్లు ఇంకా అలుముకొనే ఉన్నాయ్.
ఇంటిముందు రిక్షా ఆగిన చప్పుడయింది.
తలెత్తి చూచింది తను.
తనవంకే చూస్తూ రిక్షా దిగాడు ప్రసాద్! అవే చూపులు. తనను తనని కాకుండా చేసినయ్! విపరీతమయిన ఆకర్షణ ఉందా కళ్ళల్లో.
"సత్యనారాయణ గారుండేది ఇక్కడేనా?" నవ్వుతూ అడిగాడతను. ఎంత అందంగా ఉందానవ్వు!
"ఆ పక్కిల్లే..."
"థాంక్యూ వెరీమచ్!"
మళ్ళీ అదే చూపు! అదే నవ్వు!
మిలటరీ డ్రస్సూ-ఆఫీసరనడానికి నిదర్శనంగా భుజాల మీద మూడు నక్షత్రాలూ-నడకలో ఆ హుందాతనం అన్నీ తనను ముగ్ధురాలిని చేసినయ్.





