Home » yerramsetti sai » Kanthi Kiranalu
"ఉండండి! నేనూ వస్తానంతవరకూ" అన్నాడు తనూలేస్తూ.
"ఊహుఁ వద్దు ఇప్పటికే బోలెడాలస్యం అయింది" అక్కడినుంచి త్వరత్వరగా నడవసాగింది.
"శాంతిగారూ మాట" వెనుకనుంచి అతనంటున్న మాటలు వినిపించుకోకుండానే వడివడిగా నడిచిందామె.
శ్రీపతి నివ్వెరపోయి అక్కడే నుంచుండిపోయాడు.
9
డియర్ సరూ,
ఎన్నాళ్ళనుంచో నీకు ఉత్తరం రాయాలని ప్రయత్నం. కానీ ఇప్పటి వరకూ సాధ్యపడలేదు. ఏ పని చేయడానికయినా అసలు మనసు మనసులో ఉంటేగా? ఇక్కడ జరిగిన గొడవలేమీ నీకు తెలియవనుకొంటాను.
అమ్మా నాన్నా, నన్ను ఎవడో ఒకడికిచ్చి పెళ్ళి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్నీ విఫలమయినాయి.
"మీ అమ్మాయి నడవడి మంచిదికాదని తెలిసింది. అందుచేత మీ సంబంధం వదులుకొంటున్నాము" అని పెళ్ళి వారి దగ్గర్నుంచి వచ్చే ఉత్తరాలు చూసి అమ్మా, నాన్న పూర్తిగా నిరుత్సాహపడిపోయారు. ఇద్దరికీ గుండెల్లో ఇదే దిగులు. వాళ్ళకి నేనో సమస్య అయిపోయాను. అదీగాక ఈ మధ్య ఇంకో భయంకూడా పట్టుకొంది.
నాకు వివాహం కాకపోతే చేల్లెకికూడా కాదని ఎవరు అన్నారుట! అంతే ఆ రోజు నుంచీ సరిగ్గా భోజనం కూడా చేయడం మానేశారు.
మొగపిల్లలు లేరన్న దిగులు-ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో అన్న భయం-ఈ పరిస్థితుల్లో-ఆ ఇంట్లో నేనెలా బ్రతుకుతున్నానో నాకే తెలియని పరిస్థితి. ప్రసాద్ ని తలచుకోకుండా ఉంటే ఇంతమందికి మనక్లేశ కలిగేది కాదుగదా అతనిని ప్రేమించకపోతే నా జీవితంతోపాటు వాళ్ళ జీవితాలు ముడిపడేవికాదుగదా.
సరే ఇదంతా ఎందుకుగానీ, కొద్దిరోజులక్రితం మీ అందగాడు తటస్థపడ్డాడు. వైజాగ్ నుంచి, మా ఇంటిపక్కనే ఉన్న-వాళ్ళ చిన్నమ్మ గారింటికొచ్చాడు. ఆమె కూతురు కృష్ణకుమారి నాకు స్నేహితురాలయింది. (వాళ్ళూ కొత్తగా ఈఊరికి ట్రాన్స్ ఫరులో వచ్చారు.) కృష్ణకుమారే అతనిని నాకు పరిచయం చేసింది. మర్యాదకోసం అతను పనిగట్టుకుని పలకరించినప్పుడల్లా క్లుప్తంగానయినా మాట్లాడక తప్పలేదు. అది తప్పయిపోయింది.
అతగాడికి నేను చాలా అందంగా కనబడ్డానుట! అందుకని వెంటనే ప్రేమించేశాడు వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చాడు. వాళ్ళ చిన్నమ్మని మా ఇంటికి రాయబారం పంపించాడు.
మా అమ్మా, నాన్నల పరిస్థితి ముందే రాశాను. నాకిక పెళ్ళి కాదనే వాళ్ళు ఒక నిశ్చయానికొచ్చారు. ఆ సమయంలో వాళ్ళంతట వాళ్ళే నన్ను పెళ్ళాడతామని వస్తే ఆ అవకాశం ఎలా వదులుకుంటారు?
వెంటనే మరొక్క మాటకూడా మాట్లాడకుండా వప్పుకొన్నారు. నన్నూ ఏమీ మాట్లాడవద్దని నిర్భందించారు.
నేను వప్పుకోలేదు! నా 'పాతకథ' తెలీక అతను వివాహం చేసుకోడానికి ముందుకొచ్చాడని నాకు తెలుసు. వివాహం తరువాత ఆ విషయం బయటపడితే ఆ జీవితం ఎలా తయారవుతుందో కూడా నేను ముందే ఊహించాను. ఆ విషయం అతనితో చెప్తాననీ, అప్పటికీ అతను వివాహం చేసుకోడానికి సిద్ద పడితే నేను అభ్యంతరం చెప్పననీ అన్నాను.
కానీ వాళ్ళు వినలేదు. ఈ సంబంధంపోతే మరో సంబంధం రావడం కల్ల అనీ- ఎలాగోలా వివాహం అయితే తర్వాత వాటంతటవే అన్నీ సర్దుకు పోతాయనీ వాళ్ళ విశ్వాసం! వాళ్ళకి భయపడలేదు. కాని మా అమ్మ కన్నీళ్ళకి ఓడిపోయాను. అతను ఆ రోజు "మన వివాహం- నీకిష్టమేనా?" అని అడిగినప్పుడు మౌనంగా తలూపి అక్కడి నుంచి వచ్చేశాను.
వివాహం జరిగింది.
నేననుకొన్నదంతా కూడా జరిగింది. కానీ విచిత్రంగా జరిగింది. అతనికి నా విషయం తెలిసిందట! అదీ పెళ్ళికి ముందే ఎవరో చెప్పారుట! అయినాగాని నన్ను వివాహం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అతనిని విశాల హృదయం, వగైరా అనుకోకు! అదేమీకాదు! అది ప్రతీకారమంట! నేనతనిని మోసగించానుట. కనుక మరొకర్ని మోసగించకుండా నన్ను పెళ్ళి చేసుకొని, వదిలేయాలని నిర్ణయించాడట! నోటికొచ్చినట్లు మాట్లాడి, వివాహమయిన మర్నాడే వాళ్ళంతా వెళ్ళిపోయారు.
అంటే నా పేరిప్పుడు 'భర్త వదిలేసిన స్త్రీ' అన్న మాట!
ఇప్పుడు, ఇక్కడ నా పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అమ్మా, నాన్నలకు మరో కొత్త సమస్య.
ఇన్ని గొడవలమధ్య నీకు ఉత్తరమెలా రాయను? అందుకే ఇంత కాలం పట్టింది. నా మనసు గట్టిపర్చుకోటానికి ఇన్ని రోజులయింది.
ఇప్పుడు నువ్వు నాకు చెయ్యాల్సిన సహాయం ఒకటుంది. అదేమిటంటే నాకో ఉద్యోగం సంపాదించి పెట్టటం.
నాకోడిగ్రీ ఏడ్చిందికదా! ఆ డిగ్రీ కనీసం ఏ చిన్న పిల్లలస్కూల్లోనో పంతులమ్మ ఉద్యోగం సంపాదించి పెట్ట లేదా!
ఏ సంగతీ నువ్వు వెంటనే ఉత్తరం రాస్తే-అక్కడి కొచ్చేస్తాను!
ఇంక ఉండనా మరి!
నీ స్వరూప.
ఉత్తరం పూర్తిచేసి కవర్లో ఉంచి సరోజ ఆఫీసు అడ్రస్ కి పోస్టు చేసింది స్వరూప.
ఆ మర్నాటి నుంచే జవాబెప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూడసాగింది.
ఆ ఊళ్ళో మరొక్క క్షణం కూడా ఉండడానికి మనసొప్పటం లేదు. అదీగాక తన కాళ్ళమీద తను నిలబడాలన్న కోర్కె ఎక్కువయిపోయింది. ఎంతకాలమిలా తల్లి దండ్రులమీద ఆధారపడి ఉంటుంది? ఎక్కడో పెద్దసిటీలో తనని ఎవరూ పట్టించుకోని చోట-ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ-తన జీవితం తను గడపాలి!
ఎవరడ్డుపడ్డా, ఎవరూ కాదన్నా, ఈ నిర్ణయం అమలుజరగాల్సిందే! ముందు జాగ్రత్త కోసం తల్లిదండ్రులకు సరోజ ఉత్తరం సంగతి చెప్పలేదు స్వరూప!
10
మర్నాడు కృష్ణకుమారి వచ్చిందామె దగ్గరకు. వివాహమయిన తర్వాత వారిమధ్య స్నేహం మరింత అధిక మయింది.
"అన్నయ్య దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చిందా స్వరూపా?" అడిగింది నవ్వుతూ.
"ఊహుఁ!"
"ఎందుకని రాయలేదు? ఒకవేళ పెద్దమ్మకి వంట్లో బావుండలేదేమో!" ఆమె దగ్గర ఇంకా అసలు సంగతి దాచి ఉంచాలనిపించలేదు స్వరూపకి.





