Home » yerramsetti sai » Kanthi Kiranalu
అతను పక్కింటివేపు నడిచాడు.
తను లోపలకు వెళ్ళిపోయింది.
కాని అతన్ని ఎంతోసేపు తిరిగిచూడకుండా గడపడం సాధ్యం కాలేదు. ఏదో పని కల్పించుకొని వాకిట్లోకి ఉండుండి వెళుతూనే గడిపింది. కాని అతను ఇంట్లోంచి బయటకే రాలేదు.
సాయంత్రం మామూలుగా తను డాబామీదచదువు కొంటూ కూర్చుంది.
"హలో..." అన్న అతని గొంతు వినేవరకూ అతను పక్కింటి డాబామీద కొచ్చినట్లు తెలీనే తెలీదు.
తను దిగ్గున లేచి నుంచుంది.
అతను పలకరించింది తననేనా? ఎంత ధైర్యం?
అతనివేపు ప్రశ్నార్ధకంగా చూసింది.
అదే చూపతనిధి-అదే నవ్వు-
ఇద్దరి మధ్యలో సరిహద్దులా పిట్టగోడ ఆ గోడమీద చేతులుంచి వంగి నుంచున్నాడతను.
"ఏం చదువుతున్నారు మీరు?"
ఓహో కథ చాలాదూరం వచ్చిందే. ఏం చదువుతే ఇతని కెందుకో? ఇదో నటన. మాట్లాడటానికి- మాటలు పెంచుకోడానికి ఇదో దోవ.
"ఎందుకు?" కావాలనే మొండిగా, కోపం అభినయిస్తూ ప్రశ్నించింది తను.
"జస్ట్-క్యూరియాసిటీ!..." నవ్వుతూనే అన్నాడతను.
"ఫైనలియర్ బి.ఏ..."
"అయ్ సీ..."
తను వెనక్కు తిరిగి మెట్లవేపు నడువబోయింది.
"చూడండి!..." మంత్రంలా అనిపించింది.
టక్కున ఆగిపోయింది.
"ఏమిటి?"
"చదువుకోడానికొచ్చి వెళుతున్నా రెందుకు? నేనో దయ్యంలా కనబడుతున్నానా ఏమిటీ?"
తను నిర్లక్ష్యంగా మెట్లు దిగబోయింది.
"మీకంత అభ్యంతరమయితే..... పోనీ నేను డాబా దిగిపోతాను."
"ఎందుకు లెండి? నేనింట్లో చదువుకొంటాను."
"నోనో! దయచేసి వెళ్ళకండి...." టకటక తనే మెట్లు దిగి మాయమైపోయాడతను.
తరువాత చీకటిపడేవరకూ చదవడానికి ప్రయత్నించింది గాని ఒక్క అక్షరం కూడా ఉచ్చరించలేకపోయింది.
అతని చూపు-నవ్వు వేటాడుతున్నయ్.
ఎందుకో నమ్మకం ఏర్పడింది. ఇతను అందరిలాంటి మొగాడు కాదు! ప్రతి ఆడపిల్లా కలలు కనే "మోడల్ మగాడు."
ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు.
ఉదయం లేచేసరికి బాగా తెల్లారిపోయింది. హడాఉడిగా ఇంటిపనుల్లో లీనమయిపోయింది తను.
మధ్యాహ్నం తన గదిలో టేబుల్ ముందు కూర్చుని ఏవో పుస్తకాలు చదువుకొంటూంటే పక్కింటి కిటికీదగ్గర అలికిడయింది.
తలెత్తి చూసేసరికి కిటికీదగ్గర నుంచుని తనవంకే చూస్తూ కనిపించాడతను.
అక్కడినుంచి లేవబోయి మళ్ళీ అక్కడే కూర్చుండి పోయింది తను!
అవును! ఎందుకులేవాలి? మొగాడికి ఆడదెందుకు భయపడాలి? ఎందుకు దూరంగా తొలగాలి.
"మీ దగ్గరేమయినా నవలుంటే ఇస్తారూ?" అతని గొంతు వినిపించింది.
"ఉహూ! ఏమీలేవు" నిర్లక్ష్యంగా అంది తను!
"పోనీ మీ తెలుగు నాన్ డిటైల్ పుస్తకమయినా ఉందా?"
"ఊహుఁ! ఫస్టియర్ లోనే దానవసరం తీరిపోయింది"
"బాడ్ లక్! ఈ ఊళ్ళో నాకేం తోచటంలేదంటే నమ్మండి. చాలా బోర్ కొట్టేస్తోంది!" తను మాట్లాడలేదు. తనకేమీ సంబంధం లేనట్లే ఏదో రాస్తూ కూర్చుంది.
"డిగ్రీ చదువుతుండికూడా మీరు మొగాదితో మాట్లాడ్డానికి జంకుతారెందుకు?" నవ్వుతూ అడిగాడతను.
తనకి కోపం ముంచుకొచ్చింది.
"నాకేం భయంలేదు చూడ్డానికి!" అంది రోషంగా.
"అవున్లెండి! భయముంటే నిన్న రాత్రి లేడీస్ క్లబ్ లో అలా మగాళ్ళమీద విరుచుకుపడరుగా!" తను మాట్లాడలేదు.
"అయితే నాతో మాట్లాడడం మీకు అయిష్టమన్నమాట!" నవ్వుతూనే తిరిగి అన్నాడతను.
"అన్నీ మీరే అంటున్నారు" అంది నవ్వేస్తూ.
మర్నాడు తను సీతతో కొత్తగా రిలీజాయిన ఓ సినిమా కేల్లెసరికి హాలుదగ్గర కనిపించాడతను. ఆ ప్రాంతమంతా నజంతో క్రిక్కిరిసిపోయింది.
తనను చూడగానే త్వరత్రవగా దగ్గరికొచ్చాడు.
"మీరూ సినిమాకొచ్చారన్నమాట!" అన్నాడు నవ్వుతూ.
సీత తనవంకా, అతనివంకా ఆశ్చర్యంగా చూస్తోంది.
తనకు అతనలా పలకరించడం-సీత ఎదుట-కొంచెం గర్వం కలుగజేసినా, సీత ఏమనుకొంటుందో అని భయపడింది.
"అవును" అని "పదవే సీతా! క్యూలో నుంచుందాం" అంటూ ముందుకు నడవబోయింది.
"ఆ క్యూలో నిలబడితే టిక్కెట్టు దొరుకుతుందనేనా? నవ్వుతూ అన్నాడతను.
తనకూ తెలుసా విషయం! ఎట్టి పరిస్థితుల్లోనూ తమకి టిక్కెట్లు దొరకవు. ఇంటికి తిరిగి వెళ్ళాల్సిందే! ఒకవేళ అతనేమయినా టిక్కెట్లు ఇప్పించగలడేమో.
"దొరకకపోతే - హాయిగా ఇంటికి వెళతాం! పది రూపాయలు ఖర్చు తప్పిపోతుంది-" నవ్వుతూ అంది తను.
అతను జనంలో కలిసిపోయాడు.
చివరకు టిక్కెట్లు దొరకనేలేదు.
ఇంటికి తిరిగొస్తూంటే "ఎవరే అతను?" అంటూ అడిగింది సీత.
"పక్కింటి అబ్బాయ్."
"నీకో పక్కింటి అబ్బాయున్నట్టు నాకెప్పుడూ చెప్పలేదేం మరి."
"రెండురోజుల క్రితంవరకూ నాకుమాత్రం తెలిసేడిస్తేగా!"
"అంటే-మొన్నే పుట్టాడా?" నవ్వాపుకొంటూ అడిగింది సీత.
"అవును మిలటరీ ఆఫీసరట. సెలవులో వచ్చాడు."
"పెళ్ళీ గిళ్ళి అవలేదన్నమాట."
"గిళ్ళీ సంగతేమో తెలియదు గాని, పెళ్ళిమాత్రం కాలేదుట."
"ఉట్టి స్వార్ధపరుడులాగున్నాడు! మనకి టిక్కెట్టు దొరకదని తెలిసికూడా తనదారిన తను దర్జాగా సినిమాకి పోయాడు."
"పోతేపోనీ-మనకెందుకు?"
"అంటే అతనిమీద మనకేమీ ఇంట్రెస్ట్ లేదంటావ్?"
"నాకు లేదు-నీ సంగతి నాకు తెలీదు!"
ఇక ఉండలేక నవ్వేసింది సీత.
"ఏమయినాఉంటె పక్కింటి అమ్మాయివి నీకుండాలి మధ్యలో నాగొడవెందుకూ?"
సీత వాళ్ళింటిదగ్గరకొచ్చారిద్దరూ.
"నేను వెళతానిక" ఇంటిముందు ఆగిపోతూ అంది తను.
"అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తావు? కాసేపుసరదాగా కూర్చుని మాట్లాడుకొందాం రా!"
"నీకూ నాకూ ఏం మాటలు-అదీ చీకటిలో-నేను వెళతాను" నవ్వుతూ అని ఇంటివేపు బయల్దేరింది.
గేటుదగ్గరే నుంచుని కనిపించాడు ప్రసాద్. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. సినిమాకెళ్ళాడనుకొంటోంది తనింకా.
"మీకు టిక్కెట్లు దొరకవని నేను ముందే చెప్పాను కదా" నవ్వుతూ అన్నాడతను.
"చాలా థాంక్సు మీ జోస్యానికి."





