Home » D Kameshwari » Teeram Cherina Naava
వరండాలో వాలుకుర్చీలో పడుకుని పేపరు చదువుతున్న కిషోర్ బండి ఆగగానే అందుకోసమే ఎదురుచూస్తున్నవాడిలా చటుక్కున లేచి మెట్లుదిగి బండిదగ్గిరికి వచ్చేసాడు... "వచ్చారా ... రండి. రండి" అన్నాడు ఆధారంగా ఆహ్వానిస్తూ-బండి దిగడానికి అవస్థపడుతూన్న వాణికి చటుక్కున చేయి అందించాడు కిషోర్ నవ్వుతూ.
అతని చేయి అందుకుని సిగ్గుపడుతూ దిగింది వాణి.
వాణి ముస్తాబుని ఆశ్చర్యంగా చూశాడు కిషోర్.
అతని చూపులలో ఆశ్చర్యం, మెచ్చుకోలుచూసి వాణి సిగ్గుతో మొహం తిప్పుకుంది ఇబ్బందిగా.
బండి ఆగిన చప్పుడికి యింట్లోంచి కిషోర్ తల్లి రుక్మిణి-చెల్లెలు రేణుక బయటికి వచ్చారు. "అమ్మాయిని లోపలికి తీసుకు రాకుండా గుమ్మంలోనే నిలబెట్టి ఏమిటిరా ఆ మాటలు-రా అమ్మా లోపలికి"- అంది ఆవిడ అభిమానంగా.
రేణు ముందుకువచ్చి వాణి చెయ్యిపట్టుకుని స్నేహపూర్వకంగా చూస్తూ "అన్నయ్యా యింక నీపని అయిపోయింది నీ వెళ్ళు అవతలకి" అంది కొంటెగా నవ్వి వాణిని లోపలికి తీసుకెడ్తూ.
"వాణిగారూ-నాకంటే ఎక్కువ చదివిందని దీనికెంత లెక్క అనుకున్నారు- మాట్లాడితే బి.ఎస్సీ నంటుంది-సంతకం చేసినా రేణూ బి.ఎస్సీ అని రాసుకుంటుంది" అన్నాడు కిషోర్ చెల్లెలిని ఆట పట్టిస్తూ.
రేణు ముసిముసి నవ్వులు నవ్వింది. "నీకెందుకంత అసూయ. నిన్నెవడన్నా చదివి ప్యాసవద్దన్నా-మెట్రిక్ మూడుసార్లు డింకీ కొట్టించావు" వెక్కిరించింది.
"అబ్బబ్బ-ఏమిట్రా మీ యిద్దరిగోల. ఆ అమ్మాయిని అలా నిలబెట్టి యిద్దరూ దెబ్బలాటకు దిగారు." రుక్మిణి మందలించింది.
కిషోర్, రేణు యిద్దరూ నవ్వుతూ హాలులోకి తీసికెళ్ళారు వాణిని.
వాణికి ఆ అన్నా చెల్లెళ్ళవాదన ముచ్చటగా అన్పించింది. ఆ పల్లెటూర్లో కిషోర్ చెల్లెలు అంత చదువుకున్న దాయి వుంటుందని. రేణుక రుక్మిణిల కట్టుబొట్టు ఆధునికంగా వుండడం ఆశ్చర్యాన్నే కల్గించింది.
మధ్యహాలులో పేముసోఫాసెట్టు, రేడియో, పుస్తకాల రేక్-గోడలకి రెండు మంచి పెయింటింగులు, కిటికీలకి పరదాలు .... పెద్ద ఆడంబరంగా లేకపోయినా బీదరికపు ఛాయలు, పొలం దున్నుకునే రైతు యిల్లులా మట్టుకు లేదు అన్పించింది. రేణు కిషోర్ ల అల్లరి కొంటెతనం చూస్తే సరదా అనిపించింది.
"అబ్బబ్బ -ఏమిట్రా మీ వాదన యింక చాలు ఊరుకోండి. రా అమ్మా వాణీ - అనసూయమ్మగారు ఎలా వుంది- రాజారావు ఎప్పుడొస్తాడు వూరినించి-నీవు చాలా బాగా పాడతావటగదా. కిషోర్ చెప్పాడు నిన్న పాడావని-" రుక్మిణి ఆప్యాయంగా వాణితో కబుర్లు మొదలుపెట్టింది.
"బాగా ఏమిటమ్మా-అద్భుతం- వినితీరాల్సిన పాట. నా పుణ్యంకొద్ది నేను వినగలిగాను" కిషోర్ ఆవేశంగా అన్నాడు.
"పోవోయ్ నీవేనేమిటి, యివాళ మేం వింటాం" అంది రేణు మధ్యలో అడ్డుతూ.
"మా కిషోర్ కి పాపం పాటలంటే ఎంత పిచ్చో..."రుక్మిణి అభిమానంగా అంది.
"చదువెలాగో వంటబట్టలేదు. వాడికి సంగీతమన్నా చెప్పించాల్సిందమ్మా" రేణు కొంటెగా అంది.
"ఆ....ఆడపిల్లవు నీవు నేర్చుకున్నావు యింక వాడికి చెప్పించాల్సిందే...."
"దానికి సంగీతం చెప్పించక పుణ్యం కట్టుకున్నావు లేకపోతే ఊర్లో గాడిదలన్నీ యింటిమీద పడితే కొట్టలేక చచ్చేవాడిని-"కిషోర్ ఉడికించాడు - రేణుక లేచి అన్నని కొట్టబోయింది.
"ఇదమ్మా వరస - ఒక్క క్షణం యిద్దరికీ పడదు. వాదించు కుంటూ దెబ్బలాడుకుంటూ ఏడిపించుకుంటారు చిన్నపిల్లల్లాగా, ఎక్కడైనా యిలా చూశావా-" రుక్మిణి ఆప్యాయంగా యిద్దరివంక చూస్తూ వాణితో అంది.
"మాట్లాడుతూండండి-భోజనం ఏర్పాటు చేస్తాను-" అంటూ రుక్మిణి లోపలికి వెళ్ళింది.
"మిమ్మల్ని చూస్తుంటే చాలా సరదాగా వుంది-ఈ నాలుగు రోజుల నించి వంటరిగా వుండి ఎంత బోర్ కొట్టిందో నిన్న మీరు వచ్చాక కాస్త ఊసుపోయింది - ఇవాళ సరే సరి", వాణి సంతోషంగా అంది.
"థేంక్స్- మా కంపెనీ మీకు నచ్చినందుకు-మీరు వంటరిగా వున్నారనే యివాళ యిలా ప్రోగ్రాం వేశాను-మీకోసమేకదా యిందులో నా స్వార్ధమూ వుంది. మరో సారి పాట వినాలని..." కిషోర్ అన్నాడు.
"అబ్బ అన్నయ్య యింత పొగుడుతున్నాడంటే మీరు నిజంగానే బాగా పాడ్తారన్న మాట. ఏదీ భోజనాలు చేసే లోపల మచ్చు చూప కూడదూ-" రేణు అంది.
"ఆవిడ్ని కాస్త రెస్టు తీసుకోనీ- అలా కూర్చోపోతే వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయకూడదూ-" అన్నాడు కిషోర్.
"ఏం, ఏకాంతం కావాలా ఏమిటి నన్ను తరుముతున్నావు- ఏమండోయి వాణిగారూ, మా అన్నయ్యని నమ్మకండి వాడు చాలా ప్రమాదస్థుడు. మనుషులని మెస్మరిజం చేసేస్తాడు-మనుసులు మార్చేస్తాడు."
వాణి మొహం సిగ్గుతో కందింది.
కిషోర్ మొహంకూడా ఎర్రబడింది-"షటప్, ఏమిటా వాగుడు అర్ధం పర్ధం లేకుండా" కసిరాడు కోపంగా.
అన్న మొహంలో కోపంచూసి రేణుక నాలిక కొరుక్కుని "సారీ..... మరిచిపోయాను - మీరు వాగ్ధత్తలయి పోయారుగదా - అందులో రాజారావుగారికి..." అంది చిలిపిగా.





