Home » D Kameshwari » Teeram Cherina Naava
కిషోర్ ముందు తేరుకుని గట్టిగా చప్పట్లుకొట్టాడు. "మిమ్మల్ని అభినందించడానికి మాటలు రావడంలేదు నాకు" అన్నాడు. మితిమీరిన సంతోషపారవశ్యంతో అతని కళ్ళు చెమర్చాయి.
"వాణీ ఎంత బాగా పాడావమ్మా! నీవు పాడతావంటే ఏదో అనుకున్నానుగాని యింతలా పాడగలవనుకోలేదు. నే నెప్పుడూ యిలాంటి గొంతు, వినలేదు. మా జన్మలు తరించి పోయినట్లయిందమ్మా" అనసూయమ్మ డగ్గుత్తికతో అంది.
"రెండుగంటలు- రెండు నిమిషాలలా తెలియకుండా గడచిపోయాయి. ఇలా మీరెంతసేపు పాడినా వినాలనే వుంటుంది మాకు, ఈసారి వీణ తెస్తా వీణతో కల్సి పాడాలి మీరు. మీరిలా పాడుతానంటే రోజూ పనిపాట మంకు కూర్చుని వింటాను" అన్నాడు కిషోర్.
ఆ రోజు సాయంత్రంవరకు కిషోర్ అక్కడే వుండిపోయాడు. కిషోర్ వున్నంతసేపూ సందడిగా గడిచిపోయింది వాణికి. అతను సాయంత్రం కాగానే వెళ్ళడానికి తయారవగానే ఏదో బెంగగా అన్పించింది వాణికి.
"రేపు రాకూడదూ మీకేం పని లేకపోతే, ఇవాళ మాదిరి రాకూడదూ..." అంది ఆశగా.
కిషోర్ ఒక్కక్షణం ఆలోచించి..... "పోనీ రేపు మీరే మా యింటికి రాకూడదూ- మా వూరు-మా తోట చూపిస్తాను. మా తోట చూసారంటే మరి వెళ్ళనంటారు. రేపు పదిగంటలవేళ వచ్చారంటే సాయంత్రం దిగబెట్టేస్తాను బండిలో..."
వాణి చిన్నపిల్లలా సంబరంగా "వస్తాను... తోట అంత బాగుంటుందా? నాకిలా పల్లెటూరిలో పొలాలు, తోటలు చూడడం ఎంత సరదానో" అంది. అంతలోనే సందేహంగా .... "కాని.....మీ పెద్దమ్మగారు వప్పుకుంటారా పంపిస్తారా..." అంది అప్పుడే దిగులుపడ్తూ.
"అడుగుదాం-పెద్దమ్మగారిని నేను వప్పిస్తా...." అన్నాడు కిషోర్.
ఇద్దరూ మేడమీదకి వెళ్ళారు.
"పెద్దమ్మగారూ, మీరు ఊ అంటానంటే ఒకటి అడుగుతాను. కాదనరుగదా "అన్నాడు కిషోర్ చనువుగా.
"ఏమిటిరా.....చెప్పకుండా ముందే ఊ అనాలా...అంత పిచ్చిదాన్ని రా" అభిమానంగా అంది. "ఏమిటో చెప్పు-నీవు అడిగింది కాదన్నానా ఎప్పుడన్నా"
"ఏంలేదు- రేపు .... మీ కోడలమ్మ గారినీ మా వూరు తీసుకెళ్ళి తోటలు, పొలాలు చూపిద్దామని-ఆవిడ ఎప్పుడూ చూడలేదుట...." నసిగాడు.
"అనసూయమ్మ వాణివంక చూసింది. వాణి కంగారుగా తల తిప్పుకొంది.
"వరేయ్-రాజా రాజాకి తెలిస్తే.....వద్దురా బాబూ ఎందుకొచ్చిన గొడవ" అనసూయమ్మ అయిష్టంగా అంది.
"ఎలా తెలుస్తుంది-లేరుగా-మనం చెపితేగదా-మరేం ఫరవాలేదు పెద్దమ్మగారూ-ఉదయం పదిగంటలకి వస్తే మళ్ళీ సాయంకాలం దిగపెట్టేస్తాను-" వాణి ఆరాటంగా చూసింది.
"మీ యిష్టం మరి-రాజా ఏమంటాడోనని భయంగాని లేకపోతే నాకేం యిబ్బంది. పాపం ఆ అమ్మాయి వంటరిగా తోచక యిబ్బంది పడ్తూంది. వాణీ గౌరమ్మని-తోడు తీసుకుని వెళ్ళు. చీకటి పడేలోగా తిరిగిరావాలి సుమా, కిషోర్. పనివాళ్ళతో రాజాదగ్గిర నోరు జారద్దని చెప్పు...."
కిషోర్, వాణిల మొహాలు ప్రసన్నమయ్యాయి-యిద్దరూ కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. "మరి నేను వెళ్ళొస్తా....ఉదయం పదిగంటలకి తయారుగా వుండండి-" అంటూ వాణికి చెప్పి వెళ్ళిపోయాడు.
* * * *
ఆ మర్నాడు ఉదయం వాణి చకచక పనులు పూర్తి చేసుకుని తొమ్మిదిగంటలకల్లా తయారైపోయింది. ముస్తాబయి వచ్చిన వాణిని చూసి అనసూయమ్మ 'ఇంకాస్త మంచిచీర కట్టుకో అమ్మా, యీ యింటిగాబోయే కోడలివిగదా అంతా ఏదన్నా అనుకుంటారు.' అంది ఆవిడ వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి- ఆ మాటకి వాణి మొహం వాడిపోయింది. వాణికి మంచి చీరలు లేవేమో అన్నది చప్పున స్ఫురించింది అనసూయమ్మగారికి.
వెంటనే సీతమ్మని పిలిపించి పద్మావతి చీరల దొంతర లోంచి ఖరీదైన ఓ చీర తెప్పించింది. వాణి వద్దంటున్నా, యిష్టంలేకపోయినా ఆ చీరెను వాణికి కట్టబెట్టింది. చీరకట్టుకుని, తలలో కనకాంబర మాలతో వచ్చిన వాణిని చూసి సంతృప్తిగా తల ఆడించింది. "చక్కగా వున్నావు-ఎంతమార్పు వచ్చింది నీలో-" అంటూ అనసూయమ్మ వాణి చేతులకి వున్న మట్టిగాజులని, బోసిగావున్న మెడని చూసి 'సీతమ్మా-ఆ బీరువాతీసి నా నగలపెట్టె తీసుకురా-"అంది.
"అయ్యో - వద్దండీ- యిప్పుడు అవన్నీ ఎందుకు, పెళ్ళవలేదుగా వద్దండీ" అనసూయమ్మ వాణి మాటలు వినలేదు. తన నగలపెట్టెతీసి రెండు పేటల మంచి ముత్యాల దండ మెడలోవేసి, ఆ గాజులు తీయించి ముత్యాలగాజులు చేతికి వేసింది. ముత్యాలదుద్ధులూ పెట్టింది.
"అప్పుడే పెళ్ళికళ వచ్చేసిందమ్మగారూ-" అంది సీతమ్మ. వాణి సిగ్గుపడింది.
అనసూయమ్మ సంతృప్తిగా "ఆడపిల్లకి బట్టలు నగలే కళ మరి, యిప్పుడు చూసుకో అద్దంలో" అంది నవ్వుతూ.
"బండి వచ్చిందమ్మగారూ." మాలి వచ్చి చెప్పాడు.
"సరే వెళ్ళు-సాయింత్రం తొందరగా వచ్చేయి అట్టే ఆలస్యం చెయ్యకుండా, ముత్యాలు వస్తూందిగా నీతో-" అంది అనసూయమ్మ.
వాణి తల ఊపి బయటికి వచ్చింది.
* * * *
మరో ముప్పావు గంటలో బండి కిషోర్ యింటిముందు ఆగింది. అది డాబా యిల్లు- ముందు విశాలంగా వున్న వరండా-యింటిముందు కంచెలతో కట్టిన ఆవరణలో శ్రద్దగా పెంచిన రకరకాల పూలమొక్కలున్నాయి.





