Home » D Kameshwari » Teeram Cherina Naava
వాణి యిబ్బందిగా కూర్చుంది- రేణు చాలా చిలిపిగా, చలాకీగా మాట్లాడడం నచ్చింది కాని యిలా మాట్లాడుతూంటే సిగ్గో మొహమాటమో తెలియని భావానికి లోనయింది- కిషోర్ అది గుర్తించాడు.
"మీరు దాని మాటలు పట్టించుకోకండి-అది వాగుడు కాయి. ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు."
గోలగోలగా ఆ అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూంటే వాణి సరదాగా వింటోంది.
"రండర్రా మీ యిల్లు బంగారం కానూ - ఆ వచ్చిన అమ్మాయితో మాట్లాడడంలేదు, మంచిలేదు చెడ్డలేదు మీ వాదనే సరిపోతూంది ఆ అమ్మాయి విసుగెత్తి పారిపోతూంది -లేచిరండి భోజనాలకి-" రుక్మిణివచ్చి కసిరింది.
"అవునవును, టూమచ్ అయితే వాణిగారింక మా మొహం చూడరు ఏయ్- నీవింక నాతో మాట్లాడవద్దు-పదండి వాణిగారూ భోంచేద్దాం- మనిద్దరం జట్టు-" అంటూ రేణుక వాణి చేయిపట్టి లేవదీసుకెళ్ళింది.
కిషోర్ నవ్వుతూ వెంబడించాడు.
భోజనాల గదిలో డైనింగ్ టేబిల్ కాకపోయినా మామూలు కాస్త పెద్దటేబిల్ మీద ప్లాస్టిక్ గుడ్డ వేసి వుంది-నాలుగు గాడ్రెజ్ కుర్చీలున్నాయి. 'మీరిక్కడా-'అంటూ రేణు తనపక్కన కూర్చోబెట్టింది వాణిని-ఎదురుగా కిషోర్ కూర్చున్నాడు.
"మీరూ రండి" అంది వాణి రుక్మిణితో.
"రా అమ్మా వడ్డించడానికి ఏముంది రోజులా టేబిల్ మీద పెట్టేయ్, వాణిగారేగా" అన్నాడు కిషోర్.
నాలుగో కంచంలోకూడా వడ్డించే కూర్చుంది రుక్మిణి.
"అబ్బో- పల్లెటూరయినా మీరు డైనింగ్ టేబిల్స్ అవీ వాడుతున్నారే" అంది వాణి చనువుగా.
పల్లెటూరయితే మేము మనుష్యులం కామేమిటండోయ్ మీ పట్నం వాసనలు మాదాకా వచ్చాయి. యింతకీ యీమాత్రందానికి పట్నం పల్లె ఏముంది ఎవరి సదుపాయం వారిది" అన్నాడు కిషోర్.
"మా అన్న అంటే చదువు సంధ్యలేని పల్లెటూరి బైతుకానీ, నేను లేనుటండీ, శలవలకి వచ్చినప్పుడల్లా పట్నంలో బైతుకానీ, నేను లేనుటండీ, శలవలకి వచ్చినప్పుడల్లా పట్నంలో చూసినవన్నీ నేర్చుకొచ్చి అమలులోపెట్టడానికి-" అంది రేణు అన్నని కవ్విస్తూ.
రుక్మిణమ్మ నవ్వింది. "వాడు పట్టుపట్టి వీల్లేదని దాన్ని పంపి చదివిస్తే యీ రోజు చూడమ్మా వాడినే పల్లెటూరి బైతనేవరకు వచ్చింది-"
అన్నాచెల్లెళ్ళిద్దరూ వాదించుకుమ్తూనే వాణిని యిది తిను అది తిను అని బలవంతంపెడ్తూ, వాణి వద్దన్నా యిద్దరూ చెరోవైపునించి ఆమె కంచంలో తామే వడ్డించసాగారు.
"బాబోయ్! నేనేమన్నా మనిషినా మానునా-" అంది గోల పెడ్తూ వాణి.
వాణి అవస్థను చూసి "వరేయ్ మీ యిద్దరూ వూరుకోండి. ఆ అమ్మాయికి ఏం కావాలో నేను చూస్తాను. కాసేపు నోరు కట్టిపెట్టి సావకాశంగా ఆ అమ్మాయిని తిననిస్తారా?" రుక్మిణి కాస్త గట్టిగా మందలించగానే యిద్దరూ గప్ చిప్ అయ్యారు.
"ఏమిటండీ యిన్ని రకాలు చేసారు? అనవసరంగా మీకు శ్రమ యిచ్చాను. మామూలుగా వండాల్సింది" అంది వాణి.
"ఏదమ్మా ఏం చేశాను, మొదటిసారి వచ్చావు కాస్త తీపి చేశాను. అదిగో మరి ఆ పాయసం వదిలేయకు, ఈ రెండు పెరుగు గారెలు తినాల్సిందే" రుక్మిణి అభిమానంగా, ఆప్యాయంగా వడ్డిస్తూ అంది.
వారి అభిమానాన్ని కాదనలేక ఎక్కువే తింది వాణి. ఆ యింట్లో ఆ చిన్న సంసారం, వారిమధ్య వున్న అనుబంధం, అనురాగం వాణికెంతో నచ్చింది.
వీళ్ళమధ్య కూర్చుంటే- యీ ముచ్చటయిన చిన్న సంసారంలో తనూ ఒకరయివుంటే ఎంత బాగుండేది అన్పించింది ఆ క్షణంలో వాణికి.
"అరె- హఠాత్తుగా ఏమిటలా మూడీగా అయిపోయారు? మా కంపెనీ బోర్ కొట్టి ఎలా పారిపోవడం వీళ్ళ మధ్యనిమ్చి అని ఆలోచిస్తున్నారా ఏమిటి?" రేణు హాస్యంగా అంది.
"ఛా-ఛా...అదికాదు. నిజం చెప్పమన్నారా, మీ కంపెనీ సాయంత్రంవరకే అనుకుంటే బాధనిపిస్తూంది. నిజంగా మీలో నేనూ ఒకరైతే ఎంత బాగుండేది అనుకుంటున్నాను మీ ఆదరాభిమానాలు చూశాక" వాణి గొంతులో నిజంగానే బాధ విన్పించింది.
"అరే ఎలాగ? చక్కగా మీరు మగవారయివుంటే నేను పెళ్ళాడేసి యింటల్లుడిని చేసేసేదాన్ని. పోనీ మా అన్నయ్యకి చేసేసి వదినగా చేసుకుందామంటే కొంప మునిగినట్లు రాజారావుగారితో పెండ్లి నిర్ణయం అయిపోవాలా పోనీ చిన్న నాటకం ఆడేది ఆఖరి క్షణంలో సినిమాలల్లో లాగా ఆ రాజారావుగారిని స్టోరురూములో కట్టిపారేసి అన్నయ్యని పెళ్ళిపీటలమీద కూర్చోపెట్టేస్తే ... ఎలా వుంది ఐడియా?..." రేణు జోక్ చేసింది.
ఆ మాటలకి వాణి మొహం సిగ్గుతో ఎర్రబడి పోయింది. చటుక్కున కిషోర్ వంక చూసింది. ఇద్దరి చూపులూ కల్సుకున్నాయి.
కిషోర్ తత్తరపడి చూపులు మరల్చుకుని ఎర్రబడ్డ మొహంతో "అమ్మా, ఆ రేణుని రెండు తగలనియ్యి నోటి కోచ్సినట్లు మాట్లాడకుండా" అన్నాడు గంభీరంగా.
రుక్మిణి "రేణూ! ఏమిటా మాటలు? హాస్యానికన్నా హద్దూపద్దూ వుండాలి" మందలించింది. "వాణీ, ఏమనుకోకు, దాని మాటలు అలాగే వుంటాయి."
కిషోర్ కోపంగా కళ్ళెర్రచేసి చెల్లెలివంక చూశాడు.
అన్నగారి కళ్ళల్లో కోపం నిజమైనదిగా గుర్తించి రేణు లెంపలు వేసుకుంటూ యింక అననట్టు ఏక్షన్ చేసింది. అది వాణి కంటబడకపోలేదు- మనసులో నవ్వుకుంది.
భోజనాలముందునించి అంతా లేచారు. రుక్మిణి వంటిల్లు సర్దుకుంటూంది. చెక్కపొడి అందించింది రేణు "మా నాన్నగారు" అని చెప్పి ఒక ఫోటో చూపింది రేణు.





