Home » D Kameshwari » Madhupam
"తమ్ముడు ఎలా వస్తాడే . యిదెం బొమ్మా కొనివ్వడానికి ...." నవ్వింది కీర్తన.
"ఏం నీ పొట్టలోంచే గదా వస్తారు పాపాయిలు. టీవిలో చూశాగా . ఓ పాప వాళ్ళమ్మ పొట్ట చేత్తో పట్టుకుచూసింది. తరువాత పాపాయిని అమ్మ వళ్ళో పడుకో బెట్టింది. తరువాత పాపాయిని అమ్మ వళ్ళో పడుకోబెట్టింది వాళ్ళమ్మ" కీర్తన నిస్సహాయంగా చూసింది.
"పాపాయిలు వుత్తినే అలా పొట్టలోంచి వచ్చేయరు. డాడీలు లేకుండా పాపాయిలు రారు" శృతి ఆశ్చర్యంగా అర్ధం కానట్టు చూసింది. "సరే, అయితే ఇంకో దాడిని తీసుకురా...." అంది.
"బాగుంది. చాలా బాగుందీ నీ వరస. తల్లీ ఇంకో దాడి నాకు మొగుడవ్వచ్చు గాని నీకు దాడి కాలేరే. ఎలా చెప్పాలే నీకు." కీర్తన మనసులో విసుక్కుంది.
"శృతి అదంతా జరిగే పని కాదు. ఊరికే పిచ్చి మాటలు మాట్లాడకు."
"అప్పుడే .... డాడీ ఉన్నప్పుడే ఇంకో పాపాయిని తేవల్సింది. ఈపాటికి చక్కగా నాతో ఆడుకునేదిగా ..... అప్పుడెందుకు ఊరుకున్నావు.... అందరికీ ఇద్దరు ముగ్గురు పిల్లలు.."
"సరే, ఈ ఉద్యోగాలతో ఒంటరిగా ఒక పాపను పెంచేసరికి తాతలు దిగి వచ్చారు. ఇంకో పిల్ల కూడానా.... ఇదివరకు ఆడవాళ్ళకి ఉద్యోగాలవి ఉండేవి కావు. పిల్లల్ని కని సావకాశంగా పెంచేవారు. ఇప్పుడాడవాళ్ళకి ఉద్యోగాలు చేస్తూ పిల్లలని పెంచడం కష్టం అవుతుంది....' కీర్తన సంజాయిషీ ఇచ్చింది.
"ఉద్యోగం మానేయాల్సింది " తప్పు నీదే అన్నట్టు అంది.
అవును ఉద్యోగం మానేసి తిక్క మొగుడితో కాపురం చేసి ఇంకో పిల్లను కనుంటే తన పాట్లు, తన గతి ఏమయ్యేది. స్వాభిమానం చంపుకుని ఆరేళ్ళు గడిపింది. మారతాడన్న భ్రమతో, ఓ రెండేళ్ళు పిల్లలు కనే సౌలభ్యమే కుదరలేదు. జీవితంలో స్థిరపడడానికే టైము పట్టింది. కావాలనుకున్నా ఓ ఏడాది పట్టింది గర్బం రావడానికి. పురుడు, చంటిపిల్ల, చాకిరి, భర్త సహకారం లేక ఎంత నరకం చవిచూసింది. ఉద్యోగంలో చేరాల్సిన సమయం. పిల్లని క్రెస్ట్ ;లో ఉంచడం, తీసుకురావడం , పని.... పని.... ఎంత చేసినా తృప్తి లేని భర్త..... ఆ సాధింపు ....ఆ కోపాలు.... ప్రాణం విసిగెత్తి ఓర్పు ఆఖరి మెట్టుకు చేరాక నాలుగేళ్ళ పాపతో ఇండియా వచ్చేసింది. భర్తకు విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని ఓ కొలిక్కి తీసుకు వచ్చేవరకు అమ్మా, నాన్న సహాయం ఉండబట్టి నిలదొక్కుకుంది. మళ్ళీ కొత్త ఉద్యోగం, కొత్త చోటు, పల్లెటూరి నించి తెచ్చుకున్న పనమ్మాయి సీతాలు సాయంతో పాపని పెంచుకుంటూ వంటరి అయినా కనీసం ప్రశాంతంగా బతకగల్గింది గత రెండేళ్ళ నించి. ఇప్పుడు పాపకి కాస్త జ్ఞానం వచ్చి చుట్టూ ఉన్న పిల్లలని చూసి తెలుసుకుని వేసే ప్రశ్నలకి జవాబివ్వడం ఎంత కష్టం అయింది. పాప పెద్దయ్యాక ఎలాగో తండ్రి ప్రస్తావన వచ్చి అడుగుతుందని తెలుసు గానీ, ఇంత చిన్నప్పుడే ఇలా నిలేస్తుందని ఎదురు చూడలేదు. నీకెలా చెప్పాలే ఎలా చెపితే అర్ధం అవుతుంది ....కీర్తన విలవిల్లాడింది.
శృతి ఈ మధ్యన చాలా మూడీగా తయారయింది. మాటలు తగ్గించేసింది. బొమ్మలతో ఆడుకోడం మానేసింది. స్కూలు, హోమ్ వర్క్ చేసుకుని టీ.వి. ముందు కూర్చుంటుంది. పలకరిస్తే పది మాటలకి ఓ మాట జవాబు చెప్తుంది. టీవి చూడకపోతే లాప్ టాప్ లో చూసిన దృశ్యాలే చూస్తుంది. తల్లి మీద అలిగినట్లు. ఇదివరకులా స్కూలు సంగతులు , టీవీలో చూసిన దృశ్యాలు ఏ విషయం మాట్లాడడం లేదు. "శృతి ఏమిటలా వున్నావు?" ఎన్ని సార్లడిగినా జవాబివ్వ కుండా పెద్ద కళ్ళని మరింత పెద్ద విచేసి తల్లిని మింగేసినట్టు చూస్తుంది. మరీ గట్టిగా ఓ రోజు అడిగితె "ఎలా వుండాలి మరి. నాకెవరున్నారు ఆడుకోడానికి. మాట్లాడటానికి నీవు ఆఫీసు నుంచి రాత్రి అయ్యాక వస్తావు. అప్పుడు నాకు నిద్ర వస్తుంటుంది. ఇంట్లో సీతాలు, వంట అవ్వతో ఏం మాట్లాడాలి . ఏ గేమ్స్ అడుకోవాలన్నా ఎవరూ లేరు" అరిచింది.
నిజమే ఆ అపార్ట్ మెంట్స్ లో శృతి యీడు పిల్లలు ఎవరూ లేరు. కాలేజీ పిల్లలు, లేకపోతే మరీ చిన్నపిల్లలు, ఉద్యోగం చేసే అమ్మాయిలు, మూడొంతులు రిటైరైన ముసలివారు.
"పక్కింటి స్వీటీ అక్క దగ్గరికి కాసేపు వెళ్ళొచ్చు గదా" స్వీటీ ఇంజనీరింగ్ చదువుతున్నా అప్పుడప్పుడు స్వీటితో మాట్లాడుతుంది.
"తానెప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటుంది వెళ్ళి ఏం చెయ్యాలి."
"బాగుంది వరుస, నన్నేం చెయ్యమంటావు. ఇప్పుడందరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ. మనకి మనమే కాలక్షేపం వెతుక్కోవాలి. కీర్తనకి శృతి వంటరితనం అర్ధం అవుతున్నా ఏం చెయ్యగలదు?" ఆ సి.డి చూపించి తప్పు చేశానా అనిపించింది.
* * * *
'శృతి నీకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలా, చెల్లెలు కావాలా?" ఓరోజు ఆఫీసు నుంచి వచ్చి, తనతో మాట్లాడకుండా అలక సాగిస్తున్న శృతిని పక్కన కూర్చో పెట్టుకుని అడిగింది.
శృతి కళ్ళలో మెరుపు. తల్లి కడుపు వైపు చూసి "నిజంగా పాపాయి వస్తుందా' ఆశగా తల్లి పొట్ట మీద చెయ్యి వేసింది. కీర్తన నవ్వి 'చెప్పు మరి తమ్ముడా, చెల్లెలా?"
శృతి ఓ క్షణం అలోచించి 'చెల్లి వద్దు - తమ్ముడయితే రాఖి కట్టవచ్చు , ఆడపిల్లని నేను ఉన్నానుగా. తమ్ముడే కావాలి , ఎప్పుడొస్తాడు తమ్ముడు' ఆరాటంగా అడిగింది.
"వస్తాడు, అడిగిన వెంటనే రారు పాపాయిలు . టైము పడ్తుంది."
"నిజంగా అంటున్నావా. ప్రామిస్" అంది. కూతురి చేతిలో చేయి వేసి "ప్రామిస్ , మరింక నీవు సంతోషంగా వుండాలి మరి. తమ్ముడోచ్చాక నీవు బాగా చూసుకోవాలి. ఆడించాలి. నేను ఇంట్లో లేనప్పుడు సీతాలు సాయంతో నీవే చూసుకోవాలి."
"ఓ. ఎస్ . అన్నీ నేనే చేస్తా. పాలు పడ్తా, బొమ్మలన్నీ యిచ్చేసి ఆడిస్తా. రాఖి కడ్తాను." సంబరంగా అంది. కూతురి ముఖంలో అనందం చూశాక తన నిర్ణయం సరి అయినదే ననిపించింది కీర్తనకి.
* * * *
ఆర్నెల్లు తరువాత .....ఓ ఆదివారం ఉదయం కారులో వెళ్ళి ఓ మూడేళ్ళ బాబుని వెంట పెట్టుకు వచ్చింది కీర్తన. శృతి సంభ్రమంగా చూసి ...."చిన్న పాపాయి కదా. ఇంత పెద్ద బాబా! నీవు ఒళ్ళో పడుకోపెట్టుకుని వస్తావనుకున్నాను" అంది ఆశ్చర్యంగా.
"నీతో వెంటనే ఆడుకుంటాడని పెద్ద బాబుని తెచ్చాను. నిన్ను ఇప్పుడే అక్క అంటాడు. నీతో ఇప్పుడే ఆడుకుంటాడు చక్కగా.... రా... ఇలారా ...." అంటూ శృతిని పక్కన కూర్చోపెట్టుకుని బాబు చెయ్యి చేతిలో పెట్టింది. బితుకుబితుకుమని , కొత్త చోటుని చూసి "అమ్మా ముద్దుగా ఉన్నాడు కాదమ్మా- బాగున్నాడు కాని సన్నగా ఉన్నాడు. అమ్మో ఎంత పెద్ద జుత్తో .....' అంది సంబరంగా.
"మనింటికి వచ్చాడుగా . మనం బాగా చూసుకుంటే చక్కగా బొద్దుగా ముద్దుగా తయారవుతాడు . సరే మరి మంచి పేరు పెట్టు మరి...."
'చిన్న కృష్ణుడిలా ఉన్నాడు. వంశీ .... అందామా" అంది శృతి. 'ఆ.... మంచిపేరు అలాగే పిలుద్దాం" రా మరి ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాబుతో మాట్లాడు. "శృతి అపురూపంగా బాబుని ఒళ్ళో పెట్టుకుని 'వంశీ , నీ పేరు బాగుందా . నన్ను అక్కా అను' అంటూ బాబుతో మాటల్లో పడిపోయింది. ఆకళ్ళలో మెరుపు. అనందం చూసి కీర్తన నిశ్చింతగా నిట్టూర్చింది.
"శృతి , సారీ రా, నీకు ఆ చెట్లు, చామలు, పూలు పళ్ళ తోటలు , ఆవు దూడలు ఉడతలు, చిలకల పక్షి గూళ్ళు, చిలక కొరికిన జామ పండ్లు రుచి..... కజిన్స్ తో ఆదుకునేందుకు ఎవరిని తెచ్చి ఇవ్వలేను. మేం గడిపిన మా బాల్యాన్ని మీకివ్వలేని మమ్మల్ని క్షమించమ్మా" అనుకుంది . నీకీయగల్గింది ఇంతే తల్లీ!
***





