Home » D Kameshwari » Geethopadesam
"బాబోయ్, ఇవన్నీ పిండివంటలు. నాకెలా వస్తాయి? ఏదో మామూలు రోజువారివి..." పండుబాబుగారి నల్లబడిన మొహం ఎరుపురంగులోకి మారింది.
"పోనీ పాఠోళి, ఉల్లిపాయ పులుసు, కొబ్బరి మామిడి పచ్చడి, కందిపచ్చడి, ఇంగువేసిన పచ్చి పెసరపచ్చడి, పనసపొట్టు కూర..."
పెళ్లికూతురు బిక్కమొహం వేసింది.
"ఏమిటీ, ఇవేం రావా? మరి వంట వచ్చా అంటే వచ్చని అబద్ధం చెపుతావా?" కోపంతో మాట వణికింది.
"వంట అంటే మామూలు వంటనుకున్నా" ధైర్యంగానే అనేసింది.
ఒక్కక్షణం నిరుత్తరుడైపోయాడు పండుబాబు. "మోసం, దగా!" అన్నాడు కోపంగా. అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్లిపోయాడు. పెళ్లికూతురు బిక్కమొహం వేసింది.
హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలోంచి విసురుగా రావడం చూసి గాభరాగా లేచి కూర్చుంది. "ఏమిట్రా నాన్నా, ఇలా బయటికి వచ్చావు? ఏం కావాలి?" అంది ఆరాటంగా.
"మామ్మా! మోసం, దగా. అన్నీ అబద్ధాలు చెప్పారు మామ్మా! వంట వచ్చని అబద్ధం చెప్పింది. ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది. ఇప్పుడడిగితే ఏదో రోజూ చేసే వంట కాస్త వచ్చు అంటోంది" కోపంతో పండుబాబు మాటలు తడబడ్డాయి.
"ఒరేయ్ నాన్నా! తప్పురా, అలా శోభనం గదిలోంచి బయటకు రాకూడదు. రేపు మాట్లాడదాం. లోపలికెళ్లు ముందు."
"నేను వెళ్లను. నాతో అబద్ధాలు చెప్పింది. నాకొద్దీ పెళ్లి, పొమ్మను తనని."
"ఒరేయ్! పిచ్చిగానీ ఎక్కిందా? పెళ్లంటే ఏమిటనుకున్నావ్? ఆట అనుకున్నావా? అంత సులువుగా తెగిపోయే బంధం కాదు. ముందు లోపలికి వెళ్లు. వంటకేం భాగ్యం! ఓ నెల్లాళ్లు ఇక్కడే అట్టిపెట్టి వెళ్లు. అన్నీ నేర్పి పంపిస్తా. ముందు నువ్వు లోపలికెళ్లు" గదమాయించింది మామ్మ.
"నేను వెళ్లను. అన్నీ నేర్పి పంపించు. అప్పుడే శోభనం!" మొండిగా అని సోఫాలో పడుకుండిపోయాడు.
తరువాత ఎంత గోల జరగాలో అంతా జరిగింది. తల్లీ, తండ్రి తల వాచేట్టు చివాట్లు పెట్టారు. అత్తగారు, మామగారు వచ్చి మొత్తుకున్నారు. అ"అదేమన్నా వంటలక్కా? అన్ని వంటలూ రావడానికి. నెమ్మదిగా ఒక్కొక్కటే అదే నేర్చుకుంటుంది. దానికోసం కాపురం చెయ్యవా?" నిలేశాడు మామగారు.
"ముందే అడిగా. దానికోసమే తక్కువ చదువుకున్న పిల్లని చేసుకున్నా. లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకునేవాడిని. డబ్బు అయినా వచ్చేది" దబాయించి తెగేసి చెప్పాడు. అంతా కలిసి నచ్చచెప్పి ఆఖరికి అందరూ కలిసి ఓ నిర్ణయం చేశారు, రెండు నెలల్లో అమ్మాయికి వంటలన్నీ నేర్పి పంపేట్టు.
"సరే, ఈలోగా వీసా, టిక్కెట్లు ఏర్పాటు చేస్తా. అప్పుడే కాపురం" అంటూ అమెరికా వెళ్లిపోయాడు పండుబాబు.
"వీడి తిండిగోల ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఇంత తిండియావ ఏమిటి వీడికి?" తల మొత్తుకుంది వసుమతి. అత్తగారి వంక గుర్రుగా చూసింది.
"ఏమిటే ఆ చూపు! నన్ను మింగేసేట్టు" అరిచింది మామ్మగారు.
"మిమ్మల్ని కాక ఇంకెవరిని అనాలి? చిన్నప్పటినుంచీ వాడికి ఇవన్నీ నేర్పింది మీరు కాదూ..."
"ఆపండి, మీ ఇద్దరూ. అమ్మా, వాడికి కావాల్సినట్టు ఈ రెండు నెలల్లో ఆ అమ్మాయికి అన్నీ నేర్పించు. ఆ బాధ్యత నీదే!" అని తల్లికి చెప్పి, "అలాగే ఆ అమ్మాయికి కాస్త ఇంగ్లీషు కూడా మాట్లాడటం నేర్పు. నీవల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేర్చు. మళ్లీ అమెరికా వెళ్లాక అక్కడ కష్టం అవుతుంది లేకపోతే" అన్నాడు భార్యతో పండుబాబు తండ్రి.
* * *
రెండు నెలల్లో పాకప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డమీద కాలు మోపింది శ్రీవల్లి. పైకి మామూలుగానే ఉన్నా, శోభనంనాడు మొగుడు చేసిన అవమానం మరచిపోలేదు. 'ఏదో అమెరికా అని సహించాను కానీ, లేకపోతేనా?' అనుకుంది మనసులో. పంతంపట్టి మామ్మగారిదగ్గర, అత్తగారి దగ్గర, యూట్యూబ్ లోనూ, అన్ని ఛానల్స్ లోనూ వచ్చే వంటలన్నీ చూడడమే శ్రీవల్లికి దినచర్యగా మారిపోయింది ఆ రెండు నెలలూ.
కొత్తకాపురంలో మొదటిసారి భార్య చేతివంట తిన్నాక పండుబాబు మొహం వికసించింది. "గుడ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు" అనేశాడు. నవ్వు మొహంలేని భార్యని చూసి "సారీ వల్లీ! కోపం వచ్చిందా? అలా అనకపోతే నువ్వు ఇవాళ ఇంత బాగా వండేదానివా? నీకు వంట రాకపోతే రోజూ మన మధ్య గొడవలు వచ్చేవి. కానీ ఇప్పుడింక..." అంటూ భార్యని చుట్టేసి కౌగిలిలోకి లాక్కున్నాడు పండుబాబు.
రోజూ తన పాకప్రావీణ్యంతో ఎడాపెడా వంటలు, పిండివంటలు, రకరకాల రుచులు చూపించేసి భర్తగారి పొగడ్తలు, అభిమానం, ప్రేమ అన్నీ పొందేసి నెలరోజులకల్లా మొగుడిని కొంగున కట్టేసుకుంది శ్రీవల్లి. నాలుగేళ్లుగా మిస్సైన రుచులన్నింటినీ నెలరోజులపాటు తనివితీరా ఆస్వాదించి తృప్తిగా బ్రేవ్ మని తేన్చేసరికి, శరీరం ఓ రెండు కేజీలు పెరిగి, పర్సు చిక్కిపోయింది. చిక్కిన పర్సు చూసి బెంబేలెత్తిపోయి "ఏమిటీ? సరుకులన్నీ అయిపోయాయా? అప్పుడే! మూణ్ణెల్లకి సరిపడా కొని పడేశానుగదా!" అన్నాడు.
"రెండు పూటలా స్వీట్ లు, హాట్లు, రెండు కూరలు, నాలుగు పచ్చళ్లు, ఆరు పప్పులు తింటే అయిపోవా డియర్ హజ్బెండ్"! అంది గోముగా శ్రీవల్లి.
"ఇదిగో ఇంక చాలు, రోజూ ఇలా తింటే ఇల్లు, ఒళ్లు గుల్లవుతుంది. రోజూ ఇన్ని చెయ్యాలంటే నీకూ ఓపిక ఉండాలిగా! ఇంక మామూలు వంట వండు."
"నా మాటకేంలెండి. వంట చెయ్యడానికేగా నేనున్నాను" అదను చూసి దెబ్బ కొట్టింది శ్రీవల్లి.





