Home » yerramsetti sai » Kanthi Kiranalu
ఆమె ఇంటికి చేరుకొనేసరికి అయిదున్నర దాటిపోయింది.
అప్పుడే సృజన్ బాబుకూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు.
"ఇవాళ ఆలస్యమయినట్లుంది నీకు?" అన్నాడు శాంతితో.
"అవును..." అంది క్లుప్తంగా.
ఎందుకాలస్యం అయిందో, చెప్పాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయింది. ఎంచేతో తనూ, శ్రీపతీ కలుసుకోవటం-హోటల్లో కాఫీ తీసుకోవటం - రహస్యంగానే ఉండిపోతే బావుండు ననిపించింది.
శ్రీపతి మాటలు ఆమె చెవుల్లో ఇంకా వినబడుతూనే ఉన్నాయ్!
"మీతో మాట్లాడటం చాలా ఇష్టం నాకు!" అనడంలో అర్ధం ఏమిటో? ఒకవేళ.....ఒకవేళ అతనికి తన మీద ఏమయినా....అభిప్రాయం ఉందా?
భయం వేసింది శాంతికి! ఏమిటి పిచ్చి ఆలోచనలు? అతనికీ తనకీ ఏమిటి సంబంధం? తను తన భవిష్యత్తుని మలచుకోడానికి ప్రయత్నం చేస్తోంది. మధ్యలో ఈ అపశ్రుతులెందుకు?
బలవంతంగా ఆలోచనలు ఆపి సృజన్ బాబుతో ఏవేవో విషయాలు మాట్లాడుతూ కూర్చుందామె.
మరో వారంరోజులవరకూ ఆమెకు శ్రీపతి కనిపించనే లేదు. ఓ రోజు సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికొచ్చేసరికి సృజన్ బాబుతో మాట్లాడుతూ హాల్లో కూర్చుని కనిపించాడు. తనని చూడగానే 'నమస్తే' అన్నాడు వినయంగా. అయితే అతని కంఠంలో అదివరకటి గౌరవభావం లేదు. చనువుగా పలుకరించినట్లుంది.
ప్రతి నమస్కారంచేసి లోపలకు వెళ్ళిపోయింది శాంతి, ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్! శ్రీపతి ఒకవేళ ఆరోజు తామిద్దరూ కలుసుకొని హోటల్ కెళ్ళిన సంగతి సృజన్ బాబుకి చెబుతాడేమో! చెప్తే తను చాలా ఇబ్బంది కరమైన పరిస్థితుల్లో పడిపోతుంది. సృజన్ బాబు దగ్గర తనకు ఎంత చిన్నతనంగా ఉంటుంది.
కొద్దిసేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు! అతను వెళ్ళాక గుండెల మీదనుంచి బరువు దించినట్లు అనిపించిందామెకి.
వారం రోజులు గడిచిపోయినయ్!
రోజూ కాలేజినుంచి ఇంటికొచ్చేటప్పుడు అతనికోసం వెతుకుతూ నడవడం అలవాటయిపోయింది శాంతికి.
ఒకరోజు దూరంగా వస్తున్న ఓ వ్యక్తినిచూసి అతనే అనుకొని సంబర పడిపోయింది. తీరా దగ్గరకొచ్చాక అతను శ్రీపతి కాదని తెలుసుకొని నిరాశ పడిపోయింది. అయినా అతని కోసం తనెందుకు ఎదురు చూస్తుందో ఆమెకే అర్ధం కాలేదు.
ఆ రోజు కాలేజీ వదలి బయటికొస్తుంటే రోడ్డుపక్కనే నుంచుని కనిపించాడతను. ఎంచేతో అతన్ని చూడగానే సంతోషంతో గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.
"మీ కోసమే ఎదురు చూస్తున్నాను..." అన్నాడు నవ్వుతూ.
"ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగింది శాంతి.
"కాసేపు సరదాగా మీతో మాట్లాడొచ్చని..."
శాంతి మాట్లాడలేదు నవ్వి ఊరుకుంది.
"పదండి! అలా వెళ్దాం!"
ఇద్దరూ పక్కపక్కనే నడువసాగేరు. ఇప్పుడతనితో కలిసి నడవాలంటే అదివరకిలా సిగ్గనిపించడం లేదు.
సరాసరి పబ్లిక్ గార్డెనులోకి దారితీశాడతను ఇద్దరు ఓ మూలగా కూర్చున్నారు.
"నాలుగయిదు రోజులుగా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది శాంతిగారూ" అన్నాడు కొద్ది నిమిషాలాగి.
ప్రశ్నార్ధకంగా అతనివంక చూసింది శాంతి. "ఎందుకని?"
"మా అక్కయ్యతో గొడవొచ్చి పడింది! ఆమె బాంబేలో ఉంటోంది. మా బావగారు అక్కడ సెంట్రల్ గవర్నమెంటులో ఉద్యోగం చేస్తారు వాళ్ళకి వివాహమయి రెండేళ్ళవుతోంది. ఈ రెండేళ్ళలోనూ ఇద్దరూ పోట్లాడుకొని ఇది అయిదోసారి ఆమె మా యింటికొచ్చేయడం! ఈసారి ఏకంగా తెగతెంపులు చేసుకొని వచ్చేసిందట! విడాకులు తీసుకొంటానని పట్టుపట్టింది. అమ్మా, నాన్నగారూ, నేనూ, మా చెల్లాయిలూ ఎంత నచ్చచెప్పినా వినడంలేదు. ఏం చేయడానికీ తోచక సతమతమయిపోతున్నా మనుకోండి!" అన్నాడతను భారంగా.
శాంతి ఆశ్చర్యపోయింది అతనింటి విషయాలు తన కెందుకు చెప్తున్నాడో ఆమెకు అర్ధంకాలేదు.
"ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా?" ఆమె వంక చూస్తూ అడిగాడతను.
జవాబుగా శాంతి నవ్వి ఊరుకొంది.
"నాకెందుకో మీరు ఎంతో ఆత్మీయురాలిలా కనిపించారు. అందుకే మీతో ఇంతచనువుగా ఉండేంత ధైర్యం కూడా కలిగింది, ఒకోసారి చూడండి! ముక్కు మొగం తెలీకపోయినా ఒకో మనిషినిచూస్తే చిరపరచితునిలా కనిపిస్తారు!"
శాంతి వేలితో గడ్డిమీద గళ్ళు గీయసాగింది. అతని మాటలు వింటూంటే తమాషాగా ఉంది.
"నా విషయాలన్నీ మీతో చెప్పకుంటే గాని మనశ్శాంతి ఉండదని అనిపించింది శాంతిగారూ!"
కొద్ది క్షణాల తర్వాత తిరిగి అన్నాడతను.
"అందుకే మిమ్మల్ని వెదుక్కొంటూ వచ్చేను మీరేమీ అన్యధా భావించడం లేదుగదా?"
"అలాంటిదేం లేదులెండి" నవ్వుతూ అందామె.
"మనం ఆరోజు కలుసుకొన్న విషయం మీరు సృజన్ తో చెప్పారా?" అడిగాడతను ఆత్రుతగా.
"అవును!" అబద్దమాడింది శాంతి నవ్వాపుకొంటూ.
"అరె! ఎంతపని చేశారు? మీరు చెప్పరనుకొని నేనూ చెప్పలేదు! ఇప్పుడు నాగురించి వాడేమనుకొంటాడు" కలవరంతో అన్నాడు శ్రీపతి.
"ఏమనుకొంటాడు?" అడిగింది శాంతి.
"భలేవారే మీరు! మా చెల్లాయితో షికార్లుకొట్టి ఆ సంగతి నా దగ్గర దాస్తాడా? అననుకోడూ?"
"నిజమేకదా అది!" నవ్వేస్తూ అందామె.
"ఇది మరీ బావుంది" చిరుకోపంతో అన్నాడతను.
"మరేం భయపడకండి నేనూ చెప్పలేదు..."
"అంటే అప్పుడే నన్ను వేళాకోళం పట్టించేస్తున్నారన్న మాట."
ఆ మాటకు సన్తి సిగ్గుపడిపోయింది. ఏదో తీయని అనుభూతి ఆమెకు చక్కలిగిలి కలిగించింది.
ఇంతకూ తను ఇతని కెందుకింత చనువిస్తోంది? ఎందుకు ఇతనితో ఈ గార్డెన్ కి వచ్చింది? పరిచయం ఎందుకు పెంచుకొంటోంది? ఒకవేళ తనకు తెలీకుండానే అతను తనని ఆకర్షించాడా?
గుండెలు ఝల్లు,మన్నాయి శాంతికి.
తనది ముగిసిన జీవితం! అతనిది ప్రారంభం కాని జీవితం. ఈ రెంటికీ ఎలాసాపత్యం కుదురుతుంది?
"నేనిక వెళతాను!" చటుక్కున లేచి నిలబడింది శాంతి.
శ్రీపతి ఆశ్చర్యపోయాడు.





