Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
"ఇంతకూ ఏమిటిలా హఠాత్తుగా వచ్చేశారు? కొంచెం ముందే చెప్పివస్తూండండి! సాధారణంగా బయట తలుపు చప్పుడవగానే నేను వెనుక తలుపు తీసుకుని అయిదారు కిలోమీటర్లు పరుగెత్తు కెళ్ళిపోతాను. మళ్ళా అయిదారు గంటల తర్వాతగాని ఇల్లు చేరుకోను!"
"మరిమేము ఇందాక తలుపుకొట్టినప్పుడు వెళ్ళలేదేం?"
"ఇంతకుముందే రెండుసార్లు వెళ్ళి ఇప్పుడే ఇంటికి చేరుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పరుగెత్తాలంటే కొంచెం అద్దకం వేసింది. అందుకని రిస్క్ తీసుకుని అటక ఎక్కేశాను. నిజం చెప్తున్నాను. అటక చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. కొంతమంది అప్పులాళ్ళు ఎంత తెలివిమీరి పోయారంటే సరాసరి ఇంట్లో కొచ్చేసి అటక మీదెక్కి వెతుకుతున్నారు. రెండుసార్లు దొరికిపోయానలా! అలా దొరికిపోయినప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందిలే!"
"సంగతేమిటంటే మన రంగారెడ్డి ఇల్లుకట్టాలని అనుకుంటున్నాడు! నీ అనుభవాలేమిటో చెపితే- దానిని బట్టి-" చెప్పాడు జనార్ధన్.
బాబు రంగారెడ్డి వేపు చూశాడు జాలిగా.
"ఏం గురూజీ! మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును! ఏం"
"అహహ- ఏం లేదు! పీస్ ఫుల్ గా ఉండే మీ జీవితం కాస్తా ఊపిరి తిరగానంత పనితో నిండిపోతుంది ఇల్లుకట్టడం మొదలయిందంటే ఇప్పుడున్న సంతోషం ఉండదు. ఆకలి వేయదు. నిద్రరాదు! నేను కంటినిండా నిద్రపోయి పదిహేను రోజులు అయింది."
రంగారెడ్డి మరింత నిరుత్సాహపడిపోయాడు.
"అయినా గానీ మనం బయటపడకూడదు. ఎందుకో తెలుసా?
అందరం ఆత్రంగా అతనివేపు చూశాం.
"ఎందుకంటే- మనసులో ఎంతో సెక్యూరిటీ ఫీలవుతాం! మనదేశంలాంటి దిక్కుమాలిన దేశంలో గవర్నమెంట్ సర్వెంట్స్ కి ఆ ఫీలింగ్ చాలా అవసరం. మీకు తెలీదేమో! మా ఆఫీస్ లో సీనియర్ క్లర్క్ గా పనిచేసిన మూర్తి గారి గతేమయింది? రిటైరవగానే గవర్నమెంట్ క్వార్టర్స్ ఖాళీ చేయించేశారు. దాంతో తక్కువ అద్దెవున్న ఇంటికోసం తిరిగి తిరిగి చివరకు ఆ ఎండకు వడకొట్టి చచ్చిపోయాడు. అదీగాక ఇంకో ముఖ్యమయిన విషయం ఒకటుంది. అదేమిటంటే మనం మన సొంతింట్లో ఉంటున్నాం అనే ఫీలింగ్! ఆహా౧ ఎన్ని బాధలయినా పడనీ! నాకెంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఈ ఇల్లసలు పూర్తవనీ, అవకపోనీ- నేను అటకమీదేకాపురం ఉండనీ! అయినా పర్లేదు! నా ఇల్లు ఆహా! ఎంత అద్భుతమయిన ఫీలింగో మీకు తెలీదు మీరు గవర్నమెంట్ కాలనీలో ఉన్నారు గనుక మీకా ఫీలింగు తెలీదు కానీ నాలాగా అద్దె ఇళ్ళల్లో కొంతకాలం గడిపినోడికి తెలుస్తుంది."
వాళ్ళావిడ అందరికీ మంచినీళ్ళు తెచ్చిచ్చింది.
"సారీ అన్నయ్యగారూ! మేము కాఫీ, టీ తాగటం మానేశాం- ఇల్లు కట్టిన దగ్గర్నుంచీ! ఏదో మనకు వీలయినంత పొదుపు మనం చేయాలి కదా!" అందామె దిగులుగా.
"అవునవును! తప్పదు మరి!" అన్నాడు శాయిరామ్ భయంగా.
మేమందరం లేచి బయటకు నడవబోతుండగా ఓవ్యక్తి స్కూటర్ మీద వచ్చి ఇంటి ముందు ఆగాడు. మాతోబాటు బయటకు రాబోతున్న బాబు అతనిని చూడగానే చెంగునవెనకకు గెంతి పెరటి తలుపు తీసుకొని మెరుపులా పారిపోయాడు.
"ఉన్నాడా?" ఆ వ్యక్తి మమ్మల్ని అడిగాడు.
"లేడు! అందుకే మేము వెళ్ళిపోతున్నాం" అన్నాడు శాయిరామ్ చప్పున.
"నీ యవ్వ. నాబాకీ సంగతేమోగానీ వసూల్జేయటానికి పెట్రోలుకీ దానికీ డబుల్ అయేట్లుంది థూ" అనుకుంటూ వెళ్ళిపోయాడతను.
మేము రింగ్ రోడ్ దగ్గరకొచ్చేసరికి కనకయ్య పాన్ డబ్బా దగ్గర నిలబడి "నమస్తే సార్" అంటూ గట్టిగా అరిచాడు.
దాంతో స్కూటర్లు ఆపక తప్పలేదు.
ఎందుకంటే కనకయ్య అందరికీ బాగా తెలుసు. అతను రిజిస్ట్రార్ ఆఫీస్ లో ప్యూన్. మా కాలనీలో కొంతకాలం ఉన్న తర్వాత బంజారాహిల్స్ లో ఓ అందమయిన మేడ కట్టుకుని వెళ్ళిపోయాడు.
"ఏమిటి కనకయ్యా! ఇటుపక్క వచ్చావేమిటి?" అడిగాడు రంగారెడ్డి.
ఈ ఏరియాలో ఎనిమిది పోర్షన్ లతో ఇల్లుకట్టానీమధ్యే! అద్దె వసూలు చేసుకోటానికి వచ్చాను- అన్నాడు బెన్సన్ అండ్ హెడ్జస్ సిగరెట్ పాకెట్ తీసి ఓ సిగరెట్ వెలిగించుకుని మాకూ ఒకటి ఆఫర్ చేస్తూ. మా కాలనీ వాళ్ళందరం విల్స్ సిగరెట్ తాగటమే ఓ లగ్జరీగా భావిస్తుంటాం! అలాంటిది అతను ఆ ఫారిన్ సిగరెట్స్ ఆఫర్ చేసేసరికి ఆశగా, హాపీగా తలోసిగరెట్ తీసుకుని కాల్చసాగాం.
"అద్దె ఎంత వస్తుంది- ఎనిమిది పోర్షన్లకూ?" అడిగాడు శాయిరామ్ కుతూహలంగా.
"ఎంత సార్? చాలా తక్కువ! మొత్తం ఎనిమిదివేలారొందలకంటే ఒక్కపైసా కూడా ఎక్కువ రాదు"
మాగుండెలవిశిపోయాయ్. నెలకు ఎనిమిదివేలారొందలు ఇంటి అద్దె కింద వస్తుందా? మేము రిటైరయేప్పుడు కూడా మాకంత జీతం రాదు. మా అందరికీ పాన్ డబ్బాలో నుంచే కూల్ డ్రింక్స్ ఇప్పించాడతను. ఇంత డబ్బు తగలేసి మా అందరికీ కూల్ డ్రింక్స్ తాగించాలని ఎక్కడుంది? కేవలం మా మీద అభిమానంతోనే కదా!
"పాపం మనాడికి లిఫ్ట్ ఇద్దాం- మన స్కూటర్ మీద" అన్నాడు గోపాల్రావ్ జాలిగా.
"అవునవును- పాపం! అంత ఖర్చుపెట్టి కూల్ డ్రింక్స్ కూడా తాగించాడు. ఆ డబ్బుపెడితే బస్ లోనయినా వెళ్లిపోయేవాడు" అన్నాడు జనార్ధన్.
"అవ్ కనకయ్యా! నా స్కూటర్ వెనుక కూర్చో! లిఫ్ట్ ఇస్తాను" అన్నాడు యాదగిరి.
కనకయ్య చిరునవ్వు నవ్వాడు.
వద్దు సార్! మీ దయవల్ల మొన్నే కారు కొన్నాను- వస్తాన్సార్! మళ్ళీ కలుస్తా" అంటూ పక్కనే పార్క్ చేసి ఉన్న మారుతీ కార్లో కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
కొద్ది క్షణాలవరకూ మాకెవరికీ మాట రాలేదు. నిశ్శబ్దంగా స్కూటర్స్ స్టార్ట్ చేసుకుని కాలనీ చేరుకున్నాం.
"హు! ఆఫ్టరాల్ రిజిష్ట్రారాఫీస్ లో ఫ్యూన్, ఎనిమిదిపోర్షన్లున్న ఇల్లుకట్టగా లేంది నేనెందుకు కట్టలేను? కట్టేస్తా" అన్నాడు రంగారెడ్డి ఆవేశంగా.
"అవును! కట్టగలవ్" అన్నాడు శాయిరామ్.
"కాకపోతే ఇల్లుకట్టడానికి ఎక్కడయినా లోన్ సంపాదించాలి. హౌసింగ్ లోన్ ఎక్కడ దొరుకుతుంది?"
"స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు లోన్స్ అనేవి ఇవ్వటం మానేశారట" చెప్పాడు గోపాల్రావ్.
అలాంటి మాట చెప్పినందుకు మాకతనిమీద వళ్ళు మండిపోయింది.
"ఎందుకు ఇవ్వటం లేదు?" ఉక్రోషంగా అడిగాడు రంగారెడ్డి.
"ఎన్.టి.ఆర్. ప్రభుత్వమయ్యా! ఈ ప్రభుత్వంలో ఏ డిపార్ట్ మెంట్ కీ, ఫండ్స్ ఉండవ్!" వెటకారంగా అన్నాడు శాయిరామ్.
"అవ్! నేను గవర్నమెంట్ లైబ్రరీ మెంబర్ గదా! మొన్న యండమూరి లేటెస్ట్ నవల రక్తాభిషేకం గురించి లైబ్రరీ వాళ్ళ నడిగా! అందరూ నన్నో పాగల్ గాన్ని చూసినట్లు చూసి నగిన్రు! సంగతేమంటే ఎన్.టి.ఆర్. కొలువులో కెక్కుతూనే తెలుగోండ్లకు పుస్తకాలు కొనేది బంద్ చేసిండంట! దీని దిక్కుకెళ్ళి అయిదేండ్ల నుంచి లైబ్రరీల ఎక్క పుస్తకం లేదు-" మండిపడుతూ అన్నాడు యాదగిరి.
"నాకూ అదే అర్థంకావటం లేదు. లైబ్రరీల కోసం మనం మున్సిపాలిటీలకు పన్ను కడుతున్నాం! అది ఆపటానికి ఎన్.టి.ఆర్. ఎవరు?" తనూ తిరగబడ్డాడు జనార్ధన్.
"పుస్తకాల్సంగతి అట్లా ఉండనీండి. రిక్రూట్ మెంట్ బాన్ అంట! మా అన్నయ్య కొడుక్కి ఎన్టీఆర్ వచ్చిన దగ్గర్నుంచి ఇంటర్ వ్యూలు కూడా లేవు. కాంగ్రెసోళ్ళ పరిపాలనలో కనీసం ఎగ్జామినేషన్స్, ఇంటర్ వ్యూలయినా వస్తూండేవి!" గోపాల్రావ్ అన్నాడు.





