Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
అయినా ఈ గవర్నమెంట్ లోన్ ఎందుగ్గానీ- హెచ్.డి.ఎఫ్.సి.వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు గదా! అక్కడి కెళ్తే సరి!" సలహా ఇచ్చాడు చంద్రకాంత్.
రంగారెడ్డి మొఖంలో కల వచ్చేసింది.
"ఆ! ఇస్తారా? ఎక్కడ ఆ ఆఫీసు?"
"బషీర్ బాగ్ లో ఉంది! రేపు వెళ్దాం"
ఆ రాత్రే రెండింటికి రంగారెడ్డి ఇంట్లో నుంచి కేకలు వినబడితే పరుగుతో వెళ్ళాను. వాళ్ళావిడ అప్పటికే నిద్రకళ్ళతో అక్కడ మూగిన కాలనీవాళ్ళకు సంగతి వివరిస్తోంది.
"మరేం లేదు, ఆయనకు కలొచ్చింది! ఇల్లంతా కటాక ఎన్టీఆర్ వచ్చి పడగొడుతున్నాట్ట!"
రంగారెడ్డి ఇల్లు కట్టనీ కట్టకపోనీ గానీ- అతను ముందు ఓ ఇంటిస్థలానికి ఓనరయాడంటే నిజంగా ఓ చిన్నసైజు నవాబు అయినట్లు మా కనిపించసాగింది.
ఆ తరువాత మా అందరికీ నిద్రపట్టడం మానేసింది.
అంటే అది జెలసీ వల్ల కాదు. కాలనీలోని భార్యామణులందరూ మగాళ్ళను నిద్రపోనీయకుండా సాధింపు మొదలు పెట్టారన్నమాట.
"నిద్రకేం లోటు లేదు కదా! మీరేమో రోజూ ఈపాడు కార్పొరేషన్ రోడ్లమీద ఆఫీసులకెళ్ళి వస్తుంటే ఏరోజు కారోజు తిరిగి ఇంటికొస్తారో లేదోనని మేము హడలి ఛస్తున్నాం. సడెన్ గా మీకేమయినా జరిగితే మాకు ఉంటానికో గూడయినా లేకపోతే ఎలా?" అని అంటూండేవారు.
వాళ్ళలా అంటున్న కొద్దీ మాకు సైకొలాజికల్ గా భయం పెరిగిపోసాగింది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసుల చేతగానితనం వల్ల హైద్రాబాద్ లో ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో మేము చూస్తూనే ఉన్నాం. లారీలు బస్ స్టాప్ లో స్కూలుకెళ్ళడానికి నిలబడ్డ స్కూల్ పిల్లల మీద కెక్కేయటం, రోడ్డు పక్కనే ఉన్న రిక్షాల్నీ అందులో ఉన్న మనుష్యుల్నీ దున్నేయటం, ఆటోవాళ్ళకు ఆత్మహత్యలు చేసుకోవాలనిపించి నప్పుడల్లా ప్రయాణీకుల్ని ఎక్కించుకుని శరవేగంతో ఆటో నడిపి పల్టీలు కొట్టించేయడం, హైదరాబాద్ గూండాలకు ప్రభుత్వ సారా ఎక్కువయి నప్పుడల్లా కత్తులు తీసుకుని రోడ్డున పోయేవారి నందరినీ కత్తులతో పొడిచి పారేసి డాన్స్ చేయటం ఇలా ఎన్నో విధాల పౌరులను అంతంచేసే సరికొత్త విధానాలు ప్రభుత్వం రూపొందిస్తోంది కదా!
"ఈ పరిస్థితుల్లో మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటే బావుంటుంది" అన్నాడు శాయిరామ్ ఉత్సాహంగా. ఈ విధంగానయినా మీటింగ్ ఏర్పాటు చేసి మైక్ ముందు విన్యాసాలు జరపాలని అతని ప్లాన్! అయితే ఈ విషయం మాకందరికీ తెలియటం వల్ల మేము అతని మాటలు కొట్టి పారేశాం. అయినా శాయిరామ్ అంత తేలిగ్గా పట్టు సడలించే రకం కాదు.
ఆడాళ్ళందరికీ 'సొంతిళ్ళు- సొంత స్థలం' అంటూ ఏవేవో ఆశలుపెట్టి వాళ్ళ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేయించేశాడు. ఇక గత్యంతరం లేక ఆదివారం నాడు మహాభారత్ టీవీ సీరియల్ అయ్యాక మేము కూడా సమావేశానికి చేరుకోక తప్పలేదు.
శాయిరామ్ అప్పటికే మైక్ ముందు నిలబడి ఆదిమానవుల కాలం నుంచీ మనిషి దశల వారీగా 'ఇల్లు'అనేదానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తోంది వివరిస్తున్నాడు. మధ్యమధ్యలో కాలనీ గేయ రచయిత 'ఇల్లు' అనే శీర్షికతో గేయాలు- ఛాన్స్ దొరికి నప్పుడల్లా వినిపిస్తున్నాడు.
ఆఖర్లో "మీ అందరికీ సొంతింటి స్థలాలు కావాలనే అనుకుంటున్నారా?" అని ప్రశ్నించాడు శాయిరామ్.
"కావాలీ కావాలీ" అని అరిచారందరూ.
"ఆ కార్యక్రమం చూడ్డానికి కమిటీకే అధికారం ఇద్దాం" అన్నాడు బగారా బైగన్ వెంకట్రావ్. మిగతా వాళ్ళంతా అతని సూచనను సపోర్ట్ చేశారు.
"ముందు మన కాలనీవాళ్ళకు ఏ ఏరియాలో స్థలాలు కావాలో నిర్ణయిస్తే బాగుంటుంది" అన్నాడు రంగారెడ్డి.
"అబిడ్స్" అని అరిచారు కొంతమంది. మరికొంతమంది మెహిదీపట్నం అన్నారు. ఇంకొంత మంది 'చిక్కడపల్లి' అంటూ అరిచారు. ఇలా వాళ్ళు చదివిన పేర్లన్నీ విన్నాక రంగారెడ్డి లేచి నిలబడ్డాడు మళ్ళీ.
"సోదర సోదరీ మణులారా, అబిడ్స్ లోనూ గండిపేటల్లోనూ ఉండాలను కోడానికి మనమేం రాష్ట్ర్ర ముఖ్యమంత్రులం కాదు! వ్యాపారస్తులం అంతకన్నా కాదు. కనీసం మనం గూండాలమయినా, గవర్నమెంట్ స్థలాలు ఉచితంగా ఆక్రమించే వాళ్ళం. మనలాంటి మిడిల్ క్లాస్ పక్షులు సిటీలో ఉండటం అసాధ్యం. నగర శివార్లలో అయితేనే మన ఆర్ధికస్థోమతకి తగ్గ స్థలాలు దొరుకుతాయి. కనుక మీరిలా గొంతెమ్మ కోర్కెలు కోరటం మానేయాలి!" అన్నాడు హేళనగా.

"అయితే ఆ గొడవంతా కూడా మీరే చూసుకోండి" అంటూ అరిచారు కొంతమంది.
ఆ రోజునుంచీ మేము స్థలాల కోసం వేట ప్రారంభించాం! బాంబే హైవేలో ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోనూ, విజయవాడ హైవేలో ముప్పయ్ కిలోమీటర్లల దూరం లోనూ, నాగార్జునసాగర్ రోడ్డుమీద పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ, ప్లాట్లు ఉన్నట్లు పేపర్లలో ప్రకటనలు చూశాం.
"ముందు బాంబే హైవే సైడ్ చూడటం మంచిది. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్నీ అటే ఉన్నాయి గనుక మన పిల్లలకు ఉద్యోగాలు అవీ దొరకాలంటే అటే ఉండాలి" అన్నాడు శాయిరామ్. ఆ మాట కరక్టేనని అందరూ ఒప్పుకున్నారు.
దాంతో ఓ ఆదివారం ఆ ప్లాట్లు అమ్మే ఆఫీస్ కి చేరుకున్నాం. ప్లాట్లు చూపించడానికి పదిహేను మంది పట్టే మెటడార్ వాన్ లో ముప్పయ్ మందిని ఇరికించి తీసుకెళ్ళారు వాళ్ళు.
మెయిన్ రోడ్ నుంచి అయిదారు కిలోమీటర్లు కొండ మీదా గుట్టల మీదా నడిచాక ఇళ్ళస్థలాలు ఉన్నాయ్.
చుట్టూ కనుచూపు మేర ఒక్కపిట్ట కూడా కనిపించటం లేదు.
ఈలోగా ఆ ప్లాట్ల డీలర్ ఓ స్పీకర్ తీసుకుని మమ్మల్నందరినీ ఉద్దేశించి మాట్లాడసాగాడు.
"సోదరులారా! ఈ కాలనీ పేరు గోల్డ్ హిల్ కాలనీ! ఈ కాలనీలో ప్లాట్లు తీసుకుంటే మీ భవిష్యత్తు బంగారపు కొండగా మారుతుందన్న నమ్మకంతో ఈ పేరుపెట్టాము. ఈ కాలనీకి నాలుగు వేపులా నాలుగు అద్భుతమయిన ప్రాజెక్ట్ ళు రూపుదిద్దు కోబోతున్నాయ్. భవిష్యత్తులో సౌత్ బోర్డర్ లో మన పార్లమెంట్ సమావేశాలు, సౌత్ లో జరపాలనే ఉద్దేశంతో పార్లమెంట్ భవనాలు కట్టే ప్రపోజల్ ఉంది. నార్త్ సైడ్ ఎయిర్ పోర్ట్ రెండువేల ఎకరాల్లో కడుతున్నారు."
మేము ఉలిక్కిపడ్డాం.
"ఎయిర్ పోర్ట్ ఇక్కడ కడుతున్నారా?" అడిగాడు గోపాల్రావ్ ఆశ్చర్యంగా.
"అవును!"
"ఎందుకు? బేగంపేటలో ఉందికదా?"
"అది చాలటం లేదు. ఇంకో వంద బోయింగ్ విమానాలకు మొన్నే ఆర్డర్ చేశారు. అవి వచ్చాయంటే వాటి పార్కింగ్ కి ప్లేస్ వుండదు. మెయిన్ రోడ్ పక్కన పార్క్ చేయడానికి కార్పొరేషన్ వాళ్ళు వప్పుకోవటం లేదట. అందుకని వాటి పార్కింగ్ కోసం ఇక్కడ ఇంకో ఏరోడ్రమ్ కడుతున్నారు."
గోపాల్రావ్ కి అతని మాటల మీద నమ్మకం కలగలేదు.
"అలాంటి ప్రపోజల్ ఏమయినా వుంటే ముందు నాకు తెలుస్తుంది కదా! మా న్యూస్ పేపర్ వాళ్లకు తెలీందేముంటుంది?" అన్నాడు అనుమానంగా.
"ఆ ఇన్ పర్మేషన్ మాకు సీక్రెట్ దొరికింది- ఇకపోతే ఈస్ట్ సైడ్ న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ వస్తోంది".
"అదేమిటీ? మౌలాలీ దగ్గర ఒకటుందిగా?"
అతను కలవరపడ్డాడు.





