Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
ఇల్లు కట్టిచూడు

ప్రపంచ తెలుగు మహాసభలకు ఎలాగయినా వెళ్ళాలని అందరం దానితాలూకూ సీక్రెట్ ఇన్ ఫర్మేషన్ లాగే ప్రయత్నంలో ఉన్నాం.
"కాంగ్రెస్ వాళ్ళను పట్టుకుంటే చాలా తేలిగ్గా వెళ్ళిపోవచ్చు" అన్నాడు జనార్ధన్.
"కానీ వాళ్ళను ఎలాపట్టుకోవటం?" అడిగాను నేను.
ఆ ప్రశ్నకు అందరూ గొల్లున నవ్వారు. నన్నో వెర్రివెంగళాయిని చూసినట్టు కూడా చూశారు.
"రాజకీయ నాయకుల్ని ఎలా పట్టుకోవాలో తెలీదా! భలేవాడివయ్యా నువ్వు! ప్రపంచంలో అతితేలికయిన విషయం అదే"
ఆ విషయం గురించి డిస్కషన్ పూర్తయిపోయాక రంగారెడ్డి అసలు విషయం ప్రస్తావించాడు.
"ఆ మధ్య మా అమ్మమ్మ చనిపోయిన విషయం మీకందరికీ తెలుసుకదా! ఇప్పుడు ఆమెతాలూకూ ఇంటిస్థలం ఒకటి నాకు సంక్రమించింది. అదెక్కడుందో, ఏమిటో ఇంకా వివరాలు తెలీవు. సరే- హైద్రాబాద్ లో స్థలం దొరకటమే మనలాంటి వాళ్ళకు అపురూపమయిన విషయం గనుక అక్కడ ఇల్లు కడదామని మా ఆవిడ గొడవచేస్తోంది."
మాకందరికీ హఠాత్తుగా రంగారెడ్డి మీద ఈర్ష్య కలిగింది.
రాజధానిలో స్థలం దొరకటం, ఇల్లుకట్టడం ఒక్క చీఫ్ మినిష్టర్ కీ మిగతా మంత్రులకీ తప్ప మరెవరికీ సాధ్యంకాదని మా అనుమానం.
ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వ రూల్సేమీ వర్తించవు గనుక.
ఏదేమయినా మా అందరికీ సొంత ఇల్లు లేకుండా వుండటం కంటే మాలో ఒక్కడికయినా ఇల్లు వుండటం మంచిదే అనిపించింది కాసేపయ్యాక.
"ఇంక ఆలోచనెందుకు కట్టిపారెయ్" అన్నాడు శాయిరామ్.
"కానీ అది అంతతేలిక్కాదని విన్నాను. మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఇల్లు కట్టిన వాడెవడయినా వుంటే వాడిసలహా అడుగుదాం" అన్నాడు గోపాల్రావ్.
"దాన్దేముందీ? బాబు వున్నాడు కదా! రీసెంట్ గానే ఇల్లు కట్టాడు. పదండి! అతని దగ్గరకెళదాం" అన్నాడు జనార్ధన్.
అందరం బాబు ఇల్లు వెతుకుతూ బయలుదేరాం. అరగంట సేపట్లో మా స్కూటర్లు నగరం బయట కొచ్చేసినాయి. వనస్థలిపురం కూడా దాటిపోయేసరికి మాకు ఓపికపోయింది.
"ఇంకెంత దూరం వెళ్ళాలి?" అడిగాడు గోపాల్రావ్.
"ఆ!- ఎంత? ఇంకో నాలుగు కిలోమీటర్లు! చాలా దగ్గర"
మరోరెండు కిలోమీటర్ల దూరంవెళ్ళాక మెయిన్ రోడ్ నుంచి పక్కకు తిరిగాం. అదో మట్టిరోడ్డు.! అంతాగుట్టలూ, రాళ్ళూ, చెట్లూ తప్పితే ఇంకేమి కనిపించటం లేదక్కడ.
మరో కిలోమీటర్ దూరం తర్వాత మట్టిరోడ్డు కూడా ఆగిపోయింది. ఓ సన్నని కాలి త్రోవ మాత్రం కనబడుతోంది.
"ఇంకెక్కడ?" అడిగాడు యాదగిరి ఆగిపోయి.
"అదిగో! ఆ చెట్టుచాటున సగం కట్టినిల్లు కనిపించటంలేదూ? అదే మనోడిల్లు"
అందరం అదిరిపడ్డాం.
"ఏమిటి. ఇంత మారుమూల ఇరుగుపొరుగూ లేకుండా ఒక్కడే కాపురముంటున్నాడా?" ఆశ్చర్యంగా అడిగాడు శాయిరామ్.
"ఇది మారుమూలేమిటి? బాగా డిమాండ్ వున్న ప్లేస్.అయినా మనాడింటికి కిలోమీటర్ దూరంలో ఇంకొకతనుకూడా ఇల్లు మొదలుపెట్టాడట! ఇంక సందడికేం తక్కువని!"
అందరం బాబు ఇంటికి చేరుకున్నాం.
కాంక్రీట్ పిల్లర్స్ తో కట్టాడది. ఉత్తి స్తంభాలూ, పైన కాంక్రీట్ శ్లాబ్ మాత్రం లేసివుంది. రెండుగదులకు మాత్రం వున్నాయ్. మిగతాగదులన్నీ ఓపెన్ గానే వున్నాయ్. దగ్గరకు వేసివున్న గది తలుపు తట్టాడు జనార్ధన్.
లోపల దభేల్ మన్న చప్పుడూ దానివెనుకే పరుగెడుతున్న అడుగుల చప్పుడూ వినిపించింది. మాకు ఏమీ అర్థంకాలేదు.
"బాబూ!" మళ్ళీ తలుపు తట్టాడు జనార్ధన్.
ఈసారి మళ్ళీ పరుగు చప్పుడు వినిపించింది. ఆ తరువాత రెండునిముషాలకు వాళ్ళావిడ తలుపు కొంచెంగా తీసి అడ్డం నిలబడింది.
"ఆయన ఊళ్ళోలేరండీ. విశాఖపట్నం వెళ్ళారు ఆఫీస్ పనిమీద. ఇంకో వారం రోజులవుతుంది తిరిగిరావటానికి-" అంటూ జనార్ధన్ నీ, మమ్మల్ని చూసి చిరునవ్వుతో తలుపు తెరిచింది.
"మీరా అన్నయ్యా! రండి! ఇంకెవరో అనుకున్నాను" అంది. అందరం బిలబిలమంటూ లోపలకు నడిచాం.
ఆ గదిలో కుర్చీలు, టీపాయ్, టీ.వీ, ప్లవర్ వాజ్ అంతా బాగానే వుంది. కాకపోతే గోడలకింకా రంగువేయలేదు.
"వైజాగ్ ఎప్పుడు వెళ్ళాడు? నిన్న సాయంత్రం కూడా కనిపించాడు గానీ నాతో ఏమీ చెప్పలేదే" అన్నాడు జనార్ధన్.
ఆమె జవాబు చెప్పటానికి సిగ్గుపడింది.
"నిజానికి ఆయన వైజాగ్ వెళ్ళలేదన్నయ్యా! ఇంట్లోనే ఉన్నారు కానీ- అంటూ లోపలి గది అటకవేపు చూస్తూ" ఏవండీ! దిగండి! మనకాలనీవాళ్ళే వచ్చారు" అంది.
డబ్బాలూ, అట్టపెట్టెలూ అన్నీ పక్కకుతోసుకుంటూ అటకమీదనుంచి కిందకు దిగాడు బాబు. మొఖం, బట్టలూ అంతా దుమ్ము అంటుకుపోయి భయంకరంగా కనిపించసాగాడు.
మాకు కొద్దిక్షణాలవరకూ నోటమాట రాలేదు.
టవల్ తో మొఖం తుడుచుకుంటూవచ్చి కుర్చీలో కూర్చున్నాడు బాబు.
"మరేం లేదు. అప్పులాళ్ళేమో అనుకుని అటక మీదెక్కాను' చిరునవ్వుతో చెప్పాడతను.
"అప్పులాళ్ళేమిటి?" ఆత్రుతగా అడిగాడు రంగారెడ్డి.
"అదే! ఇల్లుకట్టాను కదా! అంచేత కొద్దిరోజులు కొంచెం యిలా అప్పులవాళ్ళనుంచి తప్పించుకోక తప్పదులే!"
"కొద్దిరోజులంటే ఎన్నాళ్ళు?"
"ఆ! మహా అయితే అయిదారేళ్ళు. అప్పులిచ్చేవాళ్ళు మొదటి అయిదారు సంవత్సరాలే మహా దూకుడుగా వుంటారు. తర్వాత వాళ్ళ పవర్ కొంచెం తగ్గిపోతుంది. అప్పుడు ఎదుటపడినా ఏం ఫర్లేదు. కాసేపు గొణిగిపోతారు. అదే మరో అయిదేళ్ళు బాకీ తీర్చలేదనుకోండి. అప్పుడు ఆ గొణగడం కూడా వుండదట. మనం కనబడితేచాలు భోరునేడుస్తూ కాసేపు మనవెంటపడతారట. మనం అదేం చూడనట్లు, వాడి ఏడుపుతో మనకేమీ సంబంధంలేనట్లూ వెళ్ళిపోవాలట. మనకాలనీలో ఉండే బోస్ చెప్పాడివన్నీ. వాడు ఇల్లుకట్టి చాలా కాలం అయిపోయింది కదా?" రంగారెడ్డి కొంచెం నిరుత్సాహపడినట్లు మాకనిపించింది.





