Home » D Kameshwari » Teeram Cherina Naava
వాణి వంక జాలిగా చూసి నిట్టూర్పు బలవంతాన అణుచుకున్నాడు కిషోర్. ఏం చెప్పాలో అర్ధంకాలేదు.... "కాని, అంతా నిశ్చయం అయ్యాక.....పెళ్ళి మరో నెలలో పెట్టుకుని యిప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం! కొన్ని విషయాలు తెలుసుకాకపోతే మనశ్శాంతన్నా మిగులుతుంది....అయినా ఎవరూ చెప్పగలరు. ఎవరి అదృష్టం ఎలా వుంటుందో...." కిషోర్ నచ్చచెప్పే ధోరణిలో మాట్లాడసాగాడు.
"మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గిర-ఏమీ లేకపోతే చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు- ప్లీజ్ చెప్పరా"- సూటిగా అడిగింది కిషోర్ మొహం తిప్పుకున్నాడు.
"పోని...యిది చెప్పండి- పద్మావతిగారు నిజంగా చనిపోలేదా? ఆవిడ వెళ్ళిపోయారా యిక్కడనించి, యిదన్నా చెప్పండి" ఆశగా అడిగింది.
కిషోర్ చురుకుగా చూశాడు- "ఆవిడ చనిపోయిందని చెప్పారా రాజారావుగారు"
"అలా స్పష్టంగా చెప్పలేదు-నాకు రెండో పెళ్ళి, మొదటి భార్యలేదు అంటే సహజంగా ఎవరన్నా చనిపోయిందనేగా అనుకుంటారు!"
కిషోర్ మరింత యిబ్బందిగా చూశాడు- "ప్లీజ్, యిలాంటి విషయాలు మీరు అడగడం నేను చెప్పడం బాగుండదనిచెప్పలేదు- మరొకరి వ్యక్తిగత విషయాల గురించి మంచిగా అయితే ఫరవాలేదు గాని చెడుగా ఎలా చెప్పను చెప్పండి-యింతకీ మీకు తెల్సుకోవాలంటే వీళ్ళని వాళ్ళని కాక డైరెక్టుగా ఆయననే అడగరాదా-అది మంచిపద్దతి" కిషోర్ అన్నాడు.
వాణి కిషోర్ సంస్కారాన్ని మనసులో మెచ్చుకోకుండా వుండలేక పోయింది. ఒక్కక్షణం ఆలోచించి పెదవి విరిచి...... "ప్చ్-మీరన్నట్టు యిప్పుడింక తెల్సుకుని ప్రయోజనం ఏం వుంది- తెల్సుకుని బాధపడేకంటే తెలియకుండా వుండడమే మంచిదేమో లెండి- నాలాంటి వారికి పెళ్ళి కావడమే గొప్ప - అందులో యీ మాత్రం సంబంధం రావడం యింకా గొప్ప- యిది చేతులారా వదులుకుని నష్టపోవడంకంటే- ఆ పెళ్ళేదో చేసుకుని కష్టమో, నష్టమో భరించడం నయం అనుకుంటాను" వాణి నిస్పృహగా అంది.
"మీరేమిటి అంత నిరాశగా మాట్లాడుతున్నారు. మీ గొంతు, మీ పాట విన్న ఏ మగాడన్నా మిమ్మల్ని పొందడం వరం అనుకుంటాడు. అలాంటిది మీరసలు యిలా ఈ రెండో పెళ్ళికి ఎలా వప్పుకున్నారోనని ఆశ్చర్యపోతున్నాను.....డబ్బు ఒకటే జీవితానికి, ఆనందానికి ప్రధానం అనుకున్నారా?" ఆవేశంగా అన్నాడు కిషోర్-అతని మాటలకి విస్తుపోతూ చూసింది వాణి-నమ్మశక్యం కాని విషయం విన్నట్టు.
"పాపం మీరీ పల్లెటూరిలో వుండిపోయి బయటి ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలియదు కాబోలు- హు-పాట చూసి పెళ్ళాడే మగాళ్ళు మీరన్నట్టుగా వుంటే యిన్నాళ్ళు యిలా సంగీత పాఠాలు చెప్పుకుంటూ రోజులెందుకు గడుపుతాను- యిప్పుడిలా రెండోపెళ్ళి సంబంధం కుదరడమే అదృష్టం అనేస్థితికి ఎందుకు వస్తాను-నాలాంటి మధ్యతరగతి సంసారాల్లో ఆడపిల్లలు ఎందరు ఈనాడు అవివాహితలుగా మిగిలిపోతున్నారో మీకు తెలియదు. కారణం డబ్బు- ఆ డబ్బుంటే అందచందాలతో పనిలేదు. చదువు వుండనీండి, సంగీతం వుండనీండి, అందం వుండనీండి వీటన్నింటిని వెనక్కి తోసి ముందు నిలబడేది ఐశ్వర్యం. ఇదంతా అతిశయోక్తి కాదు. కఠిన సత్యాలు" వాణి ఆవేశంగా అంది.
"అఫ్ కోర్స్- మీరన్నది నిజమే. కాని అందరూ అలాగే అని జనరలైజ్ చేయకండి, వాణిగారూ....నిజం చెప్పండి. మీరీ పెళ్ళి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా?"
"ఇష్టా యిష్టాల ప్రసక్తి నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి లేదు కిషోర్ గారూ.....రాజారావుగారిని చూస్తూంటే నాకేదో భయం తప్ప కాబోయే భర్త అన్న అభిమానం, అనురాగం, సహజంగా కలగవలసిన భావాలు ఏమి కలగడం లేదు" బేలగా చూస్తూ, సిగ్గువిడిచి ఆప్తుడితో చెప్పుకున్నట్లు అంది వాణి. వాణి మొహంలో బేలతనానికి కరిగిపోయాడు కిషోర్. ఎంత అమాయకురాలు? నేనేం అవుతానని నా కిలా మనసువిప్పి చెప్పుకుంటుంది. ఇలాంటి అమాయకురాలికా రాజారావులాంటి భర్త అనుకున్నాడు దిగులుగా కిషోర్.
"పదండి చాలాసేపయింది-లోపలికి వెడదాం...చూడండి వాణిగారూ! ఇక్కడ మీకేం కావలసినా ఎప్పుడు ఎలాంటి సహాయం కావల్సినా మీ ఆప్తుడిగా భావించినన్నడగండి. మీకెప్పుడన్నా ఏదన్నా చెప్పాలంటే మాలితోగాని, రాఘవులితోగాని చెబితే చాలు వాళ్ళు నాకు కబురందిస్తారు. నేనూ వస్తూ పోతూంటాను తరచు- మీరేం దిగులుపడకండి- అన్నీ సర్దుకుంటాయి" అన్నాడు కిషోర్ ఓదార్పుగా. వాణి తల ఊపింది.
ఆ పూట అందరి భోజనాలు అయ్యాక మేడమీద అనసూయమ్మ గదిలో వాణి రెండుగంటలపాటు శ్రోతలందరిని మైమరపించేటట్టు పాటలు పాడింది. పనివాళ్ళందరూ క్రింద కూర్చున్నారు. కిషోర్ ఒక కుర్చీలో, వాణి ఒక సోఫాలో, అనసూయమ్మ మంచం మీద తలగడలని అనుకుని కూర్చుంది. ఆ రెండుగంటలు కూర్చున్న వాళ్ళందరూ చుట్టు పరిసరాలని మరచిపోయి మంత్రించినట్లు కదలడం కూడా మరిచిపోయి ఆ గానాసుధలో మునిగి తేలిపోయారు. కిషోర్ అరమోడ్పు కన్నులతో అదో రకం పారవశ్యంలో మునిగిపోయాడు. ఏదో అద్బుతశక్తి అతన్ని వశపరుచుకున్నట్టు అతని మనసు ఏ లోకంలోనో తేలియాడుతున్నట్టు అతని బాహ్యస్మృతి కోల్పోయినట్లు.... అలా వాణివంక కన్నార్పకుండా చూస్తూండిపోయాడు.
వాణి మూడు కృతులు రాగం, తానం, పల్లవితో సహా యథావిధిగా పాడింది రెండుగంటలు- వాణి పాట ఆపింది అన్న సంగతి గుర్తుపట్టలేనట్టు యింకా పాట వింటున్న అనుభూతిలో మునిగి అలాగే వుండిపోయారు అందరూ.





