Home » D Kameshwari » Madhupam
ఏమిటే రోజంతా పిచ్చెక్కినట్టు చెట్లు, పుట్టలు, పిల్లులు, ఆవులు గేదెలు ఫోటోలు తీస్తున్నావు . మాటామంతి లేదు కెమెరా పట్టుకు తిరుగుతున్నావు" అమ్మమ్మ కేకేలేసింది. "ఉండు అమ్మామ్మ, పాప పడుకుంది. ఇవన్నీ ఎందుకు తీస్తున్నానో తెలుసా, పాప పెద్దయ్యాక అమ్మమ్మగారి ఊరు ఈ ఇల్లు, తోటలు అవి చూపిచద్డా."
'అంటే, ఫొటోలే చూపిస్తావా, మళ్ళీ రానే రావేమిటి , లేకపోతే మళ్ళీ నీవు వచ్చేసరికి మేం ఉండమనా...." అమ్మమ్మ అలక.
"ఏమో మళ్ళీ ఎప్పుడవుతుందో , ఇండియా వచ్చినా , ఈ ఊరు వచ్చే వీలుంటుందో లేదో..."
"ఏమో తల్లీ ఈ అమెరికాలు ఉద్యోగాలు, మొహాలు చూసుకోడమే అపురూపం అయిపోతుంది. ఏదో కూతురును చూపించాలనేనా ఈ ముసలి వాళ్ళ దగ్గరికి వచ్చావు. అంతే చాలు." అప్పుడే నిద్రలేచిన మునిమనువరాలిని ఆప్యాయంగా లేపి ఎత్తుకుంది. "పాప చూశావా, ఎంత సేపు నిద్రపోయిందో ..... పిల్లాలకి నీళ్ళు , పాలేనే బలం. చక్కగా నూనె మర్దనా చేసి, నలుగు పెట్టి వేడివేడి నీళ్ళు పోస్తే వాళ్ళకి వళ్ళు నొప్పులు అని లేకుండా, తేలికగా ఉండి వళ్ళరాగకుండా పడుకునేవారు. ఇదివరకు పిల్లలు - మీరేదో బేసిన్ లో నీళ్ళలో గిన్నె కడిగినట్టు సబ్బు పామి తొలిచేస్తున్నారు."
నిజమే ఆ మాట! అమ్మమ్మ స్టూలు వేసుకూర్చుని, వెంకటమ్మ కాళ్ళ మీద పాపని పడుకోబెట్టి నూనెతో పామి పామి మాలిష్ చేసి, నలుగు పిండితో నలుగుపెట్టి , వేడివేడి నీళ్ళు పొట్ట మీద ఒక బాల్చీడు, వీపు మీద ఒక బాల్చీడు రుద్దిరుద్ది పోయించింది. అలవాటు లేక పాపా గోలు గొలున ఏడుస్తుంటే 'అమ్మమ్మ ప్లీజ్ పాప ఏడుస్తుంది. అలా గట్టిగా రుద్దద్దు. బాబోయ్ అంత వేడి నీళ్ళు వద్దు" అని గోలపెడ్తుంటే " - 'ఉండవే తల్లీ నీ కూతురికేం కాదు. ఆ పూచి నాది" అంటూ స్నానం చేయించి, సాంబ్రాణి పోగావేసి, పౌడరద్ది పల్చటి గౌను వేస్తె చేతుల్లోనే సొమ్మసిల్లినట్టు నిద్రపోయింది. ఆపడుకోవడం, పడుకోవడం మూడు గంటలు పడుకుంది. లేచాక నవ్వుతూ చేతిలో వ్రాలిపోయింది. ఎంత ఫ్రెష్ గా ఉందొ, ఎంత కమ్మని వాసనేస్తుందీ - ఆకలి మీద సీసాడు పాలు గటగట తాగేసింది. సీసాడు పాలు మూడు సార్లు బలవంతంగా తాగేది రోజూ. పాపని ఎత్తుకున్న అమ్మమ్మ తాతగారిని ఫోటోలు తీసింది.
"నిజమే అమ్మామ్మ పాప ఆవురావురుమని పాలన్నీ తాగేసింది. ఎప్పుడూ లేదిలా." కమ్మని వాసనోస్తున్న కూతురిని ముద్దు పెట్టుకుంటూ అంది.
"ఒక్క వారం రోజులుండు . నీ కూతురిని బంతిలా చేసి పంపిస్తాను." రెండు రోజులనుకున్నది ఐదురోజులుండిపోయింది. వచ్చిన చుట్టాలందరి ఫోటోలు తీసింది. ఈరోజు పాపకి అవన్నీ చూపిస్తోంటే పాతస్మృతులు పైకి వచ్చాయి. అమ్మమ్మ అన్నట్టే మళ్ళీ ఇంకా ఆ ఊరే వెళ్ళలేదు. తరువాత ఎనార్దానికే తాతగారు కూర్చున్న వారు కూర్చున్నట్లే పోయారు. మరో ఏడాదికి అమ్మామ్మ మామయ్యలు అమెరికా నించి వచ్చి ఇల్లు అమ్మి అంతా డబ్బులు పంచుకు వెళ్ళిపోయారు. ఫొటోలే మిగిలాయి.
* * * *
తరువాత శృతి తీరికున్నప్పుడల్లా లాప్ టాప్ పెట్టుకుని ఆ సిడి చూస్తూ మురిసిపోయేది. చూసినప్పుడల్లా ఒకో ప్రశ్న - ఒకో సందేహం.
"మమ్మీ మీ చిన్నప్పుడులా ఇప్పుడెందుకూ మీరంతా కలవడం లేదు. శలవులకి రావచ్చు గదా. అందరం అమ్మమ్మగారింటికి వెళ్ళచ్చు గదా!"
"ఎలా కుదురుతుంది. మా అక్క అన్న అమెరికా నించి రావాలంటే బోలెడు ఖర్చు. వాళ్ళ పిల్లలకి శలవులు, వీళ్ళ ఉద్యోగాలకి శలవులు దొరకాలి కదా. అంత దూరం నించి రావాలంటే ఎంత ఖర్చు."
"అమెరికాలో ఎందుకు ఉండడం. మనలా ఇండియా వచ్చేయచ్చు కదా."
"మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు . ఇండియాలో అంత డబ్బులివ్వరని రారు. ఎవరూ...."
"మరి మనం ఎందుకు వచ్చేశాం?"
"మన సంగతి వేరు. నేనోక్కర్తినే నిన్ను చూసుకోలేక వచ్చేశాను. అక్కడ పనివాళ్ళు దొరకరు గదా. ఇక్కడ మంచి ఉద్యోగం దొరికింది. అందుకు వచ్చేశాను."
"మరి డాడీ వుండేవారు గదా, డాడీని నీవు వదిలి వచ్చేశావు - మరి డాడీ మనతో ఎందుకు రాలేదు ?"..... ఇదివరకు రెండు మూడు సార్లు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగింది.
"ఆయనక్కడ ఉద్యోగం వదలడానికి ఇష్టం లేక రాలేదు" ముభావంగా అని, లాప్ టాప్ ఇంకో దృశ్యం వైపు చూపిస్తూ 'చూశారా ఇది మీ మామయ్య పెళ్ళి ఫోటో. హాస్టన్ లో ఉంటాడు కదా మురళి అన్నయ్య..... రెండేళ్ళ క్రితం ఇండియా వచ్చాడు గదా. వాడి పెళ్ళి . వనజ అంటీ చూశావా. పెళ్ళి కూతురు గదా ఎన్ని నగలు పెట్టుకుందో. ఇదిగో ఇది వడ్డాణం. వంకీలు.... యివన్నీ నాకు మా అమ్మ చేయించింది. నీకిచ్చేస్తాను నీ పెళ్ళికి...." మాట మార్చి చెపుతుంటే ఏడేళ్ళ శృతి మొహంలో సంతోషం - సిగ్గు.
ఇండియా వచ్చిన ఈ రెండేళ్ళ;లో శృతి చాలా తెల్సుకుంది. శృతి పెద్దదవుతుంది. స్కూలు పిల్లలు, టీవి సీరియల్స్ ..... ఇంట్లో వంటామే నర్సమ్మ , పనిమనిషి సీతాలుతో మాట్లాడి తెలుగు బాగా నేర్చింది. "మా ఫ్రెండ్సందరికి డాడీలు, మమ్మీలు కల్సి ఉన్నారు. నాకే డాడీ లేరు..... డాడీని వచ్చేయమను మమ్మీ" ఓరోజు స్కూలు నించి వచ్చి అలిగి కూర్చుంది." అయన రారమ్మా- ఎన్నోసార్లు చెప్పా నీకు' కీర్తన విసుగ్గా అంది. "అయితే మనమే వెడదాం."
"అదీ కుదరదు.... శృతి నీవు చిన్నపిల్లవు. నీకిప్పుడు నేను చెప్పినా అర్ధం కాదు."
"నాకన్నీ తెలుసు. నీవు అబద్దాలు చెప్తున్నావు. డాడీ నీవు డైవోర్సు తీసుకున్నారు గదూ."
మా ఫ్రెండ్సు అన్నారు. మీ మమ్మీ నీవు వంటరిగా ఉన్నారంటే మమ్మీ డాడీ విడిపోయారన్న మాట. లేకపోతే ఈ రెండేళ్ళలో మీ డాడీ ఒక్కసారన్నా వచ్చారా - నీతో మాట్లాడారా అనడిగారు ..... నీవు నాదగ్గర ఎందుకు దాస్తావు ఇదంతా" నిలదీసింది.
ఈకాలం పిల్లలకి చాలా తెలివి తేటలున్నాయి. మంచి ఎక్స్ పోజర్ ఉంది. అన్ని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. ఇలాంటి పిల్లాలకి నిజం చెప్పడం నయం అనుకుంది కీర్తన. 'సరే - నీవిప్పుడు కాస్త పెద్దయ్యావు . నీకిన్నీ తెల్సు అన్నావు గదా. అవును డాడీ నేను డైవోర్సు తీసుకున్నాం. అయన ఇంక మన దగ్గరికి రారు."
"ఎందుకు / డైవోర్సు ఎందుకు తీసుకున్నారు?"
"మా ఇద్దరికీ పడలేదు. రోజూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఎందుకు కల్సి బతకడం?"
"అంటే డాడి నిన్ను తిట్టారా?" కొట్టారా?" మరో ప్రశ్న.
"కొట్టడం, తిట్టడం కాదు. మనసులు కలవకపోతే ఒకరినొకరు సాధించుకుంటూ ఎడమొహంగా బతకడం కుదరదు" కాస్త కఠినంగా అంది.
"సాధించడం అంటే..... నీవు .....నన్ను పాలు తాగు అని కేకలేస్తావు. ఈషూస్ అక్కడ ఎందుకు పడేశావు అని తిడ్తావు . టి.వి. అస్తమాను చూడద్దని కేకలు వేస్తావు . షాంపు చేసుకో, పళ్ళు బాగా బ్రష్ చేసుకో అంటూ ప్రతి డానికి వెంటపడి సాధిస్తూనే ఉంటావు గదా. మరినన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఓ రోజు....." సూటిగా కళ్ళలోకి చూసి అంది. కీర్తన తెల్లపోయి చూసింది. "అయితే నేనూ ఇంట్లోంచి వెళ్ళిపోవాలా.... నీ చిన్నప్పుడు అమ్మమ్మ తాతగారు కోపం వచ్చి కేకలు వేస్తె ఇల్లు వదిలి వెళ్ళిపోయావా....." నిలేసినట్టు అడిగింది. ఆ ధోరణికి విస్తుపోయింది కీర్తన, ఏడేళ్ళ పిల్ల ఎలా అడుగుతుంది. కోపంతో మొహం ఎర్రబడింది. 'శృతి ....ఏమిటా పెద్దమాటలు. పిల్లలు పిల్లల్లా ఉండాలి. నేను చెప్పినా నీకర్ధం కాదు.'
'చెప్పు.... అర్ధం అయ్యేట్టు చెపితే వింటాను" శృతి రెట్టించింది.
"చూడు తల్లీ పిల్లలు, తండ్రి..... ఈ సంబంధాలు వేరు. భార్యాభర్తల సంబంధం వేరు."
"ఎందుకు వేరు . నేను ఏం చేసినా ఊరుకుంటావు. మీ అమ్మా నాన్నా కేకలేసినా సాహిస్తావూ. మరి డాడీ దగ్గర అలా ఉండవచ్చు గదా. డైవర్సు ఎందుకు తీసుకోడం" కీర్తన నిస్సహాయంగా చూసింది. ఎలా చెప్పి కూతుర్ని నమ్మించాలో అర్ధం కాలేదు.
"డాడీకి సారీ చెప్పి పిలు. వస్తారు" పంతంగా అంది.
"శృతి నీకు చెపితే అర్ధం చేసుకోవు. అయన మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఇంక ఆయనకి నాకు ఏ సంబంధం లేదు" నిష్కర్షగా అంది.
శృతి హతాశురాలైనట్టు చూసింది. తల్లి వంక కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది.
మరో రోజు రాఖిపౌర్ణమి - టీ.వి.లో అన్నలకి చెల్లెళ్ళు రాఖి కట్టడం చూసింది. "పోనీ సరే డాడీ రారు. నేనోక్కర్తినే ఉన్నాను. నాకు ఓ తమ్ముడు కావాలి. తెచ్చి ఇవ్వు ఆడుకుంటాను. రాఖి కడ్తాను. నా బొమ్మలన్నీ ఇస్తాను. మేం ఇద్దరం కలిసి గేములాడుకుంటాం. నాకు ఎవరూ లేరు. బోరు కొడ్తుంది. చిన్నప్పుడు నీకు నీ బ్రదర్స్ ఉన్నారు. మీరంతా సరదాగా ఆడుకునే వారు . నాకోద్డా మరి..." సూటిగా అడిగింది.





