Home » D Kameshwari » Geethopadesam
"అది సరే, మరి 'వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో' అంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో?" తండ్రి మళ్లీ అడిగాడు.
"అందుకే ఎక్కువ చదువుకోకుండా బి.ఏ., బి.కాం. చదివిన మధ్యతరగతి అమ్మాయి అయితే అమెరికా కాపురం అని చెప్పగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది" నమ్మకంగా అన్నాడు పండుబాబు.
నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది శ్రీవల్లి. కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నట్టు ఆన్ లైన్ లో మేట్రిమోనియల్ కాలమ్ లో ప్రకటన ఇవ్వడమేమిటి, పదిహేనుమంది పోస్టు చేయడం, సంప్రదింపులు, కుటుంబ వివరాలు చూడ్డాలూ, జాతకాలు తిరగేయడాలూ పూర్తయ్యాక, అబ్బాయి షరతులకి ఒప్పుకున్నవాళ్ల ఫోటోలు చూసి అందులోంచి ముగ్గురిని సెలెక్టు చేసుకుని, ఇద్దరిని రిజెక్ట్ చేశాడు. శ్రీవల్లిని ఎంచుకున్నాడు పండు ఉరఫ్ చైతన్య.
పెళ్లిచూపుల్లో అబ్బాయిని, అమ్మాయిని వేరే గదిలో కూర్చుని మాట్లాడుకోమంటే అబ్బాయిగారు అడిగిన మొదటి ప్రశ్న 'నా ప్రకటనలో పాయింట్లు చదివావా? నా ఇష్టం అంటూ ఉద్యోగం చేయకూడదు, వంట చేసుకుంటూ ఇల్లు చూసుకుంటే చాలు" అని అడిగేశాడు.
అమ్మాయి గబగబా తల ఊపేసింది. 'నా బొంద! బికాం ఫెయిల్ కి అమెరికాలో ఉద్యోగం ఎవడిస్తాడు? పాడు ఉద్యోగం నాకెందుకు? అమెరికా ఎగిరిపోయి, ఎంజాయ్ చేస్తూ తనవాళ్లందరి దగ్గరా అమ్మో! శ్రీవల్లి ఎంత అదృష్టవంతురాలో, అమెరికా సంబంధం వచ్చింది అని గొప్పగా అనిపించుకోవాలి' అని ఆ అమ్మాయి ఆరాటం.
అసలు తనకింత అదృష్టం పడుతుందని అనుకుందా? "ఆ బీకాం అన్నా కంప్లీట్ చేయవే, లేకపోతే పెళ్లెలా అవుతుందే నీ మొహంమండా!" అని తల్లి తిట్టిపోసేది. చదువు లేదని అప్పటికి ఆరు సంబంధాలు తప్పిపోయాయి. అందం ఏదో సో, సో. ఫ్యామిలీ అంతకంటే సో, సో. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఉక్కిరిబిక్కిరైపోతోంది శ్రీవల్లి. "అవునూ, అబ్బాయివాళ్లిచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంటావార్పూ వచ్చిన అమ్మాయన్నారు. దీని మొహం దీనికేం వంటొచ్చే?" ఆ తండ్రి సందేహంగా అన్నాడు.
"ఎందుకు రాదు? బంగాళాదుంపలు వేయిస్తా, పప్పు చేస్తా, చారు వచ్చు, మొన్న పులుసు వండేగా! అమ్మకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను చేయలేదా?" గబగబా అనేసింది శ్రీవల్లి.
"ఏడిశావు, నోరు మూసుకో. వంట అంటే నాలుగు బంగాళాదుంపలో, అరటికాయలో వేయించడమేమిటి? ఆ అబ్బాయి అడిగితే వచ్చు అని చెప్పు. ఇలా వాగకు. ఈలోగా ఐదారు రకాలు గబగబా నేర్పిస్తా" కూతురికి హితబోధ చేసింది తల్లి.
"వంట చెయ్యడం వచ్చు గదా, నాకు తెలుగు వంటలు నచ్చుతాయి. అక్కడ అమెరికాలో నాలుగేళ్లుగా తిండికి మొహం వాచిపోయినట్లయింది. ఏదో ఇండియన్ రెస్టారెంట్లలో ఇడ్లీ, సాంబారు, దోసెలాంటివి దొరుకుతాయి గానీ, మన అచ్చతెలుగు వంటలు దొరకవు. అందుకే అడుగుతున్నా ప్రత్యేకంగా" అడిగాడు.
శ్రీవల్లి మొహంలో రంగులు మారినా అది కనపడకుండా నవ్వేసి తల ఊపింది.
పెళ్లికొడుకూ తల ఊపేశాడు. నెల రోజులు సెలవు మీద వచ్చాడు. పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలి. మళ్లీ మళ్లీ రాలేడు. వారం రోజుల్లో ముహూర్తం. పెళ్లికొడుకు తల్లిదండ్రులు మాత్రం సంతోషంగా లేరు. పెళ్లికూతురు చూడడానికి ఫరవాలేదు. పెద్ద చదువులు చదివి, ఉద్యోగం చేయకుండా, అదీ మామూలు కుటుంబంలోంచి వచ్చి, మామూలు చదువులు చదివిన పిల్లని కోడలుగా చేసుకోవడంతో నలుగురిలో చిన్నతనంగా ఫీలయ్యారు. కొడుకు నిర్ణయాన్ని మార్చలేక ఆఖరికి ఎవరికెవరు రాసిపెట్టి ఉన్నారో అనుకుని సర్దుకున్నారు.
* * *
"నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా?" శోభనం రాత్రి అన్నాడు పండుబాబు.
"మంచి చదువు, ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయిని కాకుండా నిన్నే కోరి చేసుకున్నది దేనికో తెలుసా?" అడిగాడు.
కళ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది శ్రీవల్లి.
"నాకు చిన్నప్పటినుంచీ మంచి మంచి రుచులతో తెలుగు భోజనం తినడం ఇష్టం. మా మామ్మ చేతివంట నన్నలా తయారుచేసింది. ఇప్పుడు ఇంక నీవు నాకు కావల్సినట్టు, నే చెప్పినట్టు 'అన్నీ' చేసిపెట్టాలి తెలుసా? అందుకే వంట వచ్చిన అమ్మాయి కావాలనుకున్నా."
"అన్నీ అంటే?" మనసులో భయపడుతూ అడిగింది శ్రీవల్లి.
"చూడు... మన తెలుగు వంటల ప్రత్యేకత తెలుసా? ఒక్క వంకాయనే పదీ పదిహేను రకాలుగా వండుకోవచ్చు. అందరూ ఇంత అల్లం, వెల్లుల్లి, టమోటాలు వేసేస్తున్నారు అన్ని కూరల్లో. ఒకటే రుచితో ఏడుస్తున్నాయి ఇప్పటి వంటలు. వంకాయ గుత్తికూర, పచ్చికారం, వంకాయ ముద్ద, ఉల్లికారం, పచ్చిపులుసూ యిలా రకాలు..."
శోభనం రోజు మంచంమీద కూర్చుని వంకాయకూర గురించి మాట్లాడుతున్న మొగుణ్ణి ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకుని "నాకూ వంటొచ్చు గానీ ఇన్నేసి రకాలు రావు"; అనేసింది. పెళ్లైపోయింది, ఇప్పుడింక దాపరికం ఎందుకని.
"ఏంటీ రావా? మరి వంటొచ్చు అన్నావుగా?" పండుబాబు మొహం కళ తప్పింది.
"ఏదో రోజువారీ వంటలు..."
"అంటే బొబ్బట్లు రావా, పులిహోర చేయడం వచ్చా, దూదుల్లా పెరుగు గారెలు చెయ్యలేవా? కరకరలాడే అల్లంగారెలు రావా? చక్కటి బియ్యం పరమాన్నం, చక్రపొంగలి, మెత్తటి అప్పాలు... ఇవన్నీ వచ్చా?"





