Home » yerramsetti sai » Kanthi Kiranalu
సృజన్ బాబు సంగతి ఆమెకు బాగా తెలుసు. అతని నోటి వెంబడి అబద్దమనేది రాదు. అదీ ఇలాంటి విషయాల్లో అబద్దం అసలు చెప్పడు. బాగా తెలిసుండబట్టే- ఈ విషయం బయటపెట్టాడు.
ఆ తరువాత ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. రాధమ్మ ఆలోచనలు పరిపరివిధాల సాగిపోతున్నాయ్. కొడుకుచేసిన పనిని ఏమాత్రం హర్షించలేకపోతూందామె. నీతిలేనిపిల్లని ఏలుకోమని తనూచెప్పదు. కాని ఆ అమ్మాయి విషయం పెళ్ళికి ముందే తెలిసినప్పుడు, వివాహం చేసుకోకుండానే తిరిగివచ్చేస్తే ఎంతో గౌరవంగా ఉండేది ఇప్పుడీ పెళ్ళి ఆ అమ్మాయితోపాటు తమకీ సగుభాటే కోడలు గురించి నలుగురికీ తనిప్పుడు ఏమని చెప్పగలదు? ఇప్పటికే ఆమె నెందుకు తీసుకురాలేదని అందరూ అడుగుతున్నారు.
గడియారం రెండుగంటలు కొట్టింది.
"అమ్మా." పిలిచాడు సురేంద్ర.
"ఊఁ." దిగులుగా అతనివంక చూసింది రాధమ్మ.
"తప్పో-ఒప్పో జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందంతా ఒక పీడకల అని మర్చిపోదామమ్మా ఇంక పడుకో నువ్వు. ఇప్పటికే బోలెడు పొద్దెక్కిపోయింది" లేచి నుంచుంటూ అన్నాడతను.
రాధమ్మ తనుకూడా లేచి పక్కమీదకు చేరుకొంది గుడ్డిగా వెలుగుతోన్న నైట్ లైటు కాంతిలో ఆమెకు ఎదురుగ్గా భర్త ఫోటో కనిపించింది.
అప్రయత్నంగా ఆమె కళ్ళు చెమ్మగిల్లినయ్.
8
మర్నాడే సృజన్ బాబు శాంతిని తీసుకొని గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజి చేరుకొన్నాడు. ప్రిన్స్ పాల్ తో మాట్లాడి ఫార్మశీ లో సీటుకోసం అప్లికేషన్ పెట్టించాడు. ఆ రోజే శాంతిబయల్దేరి తమ ఊరు చేరుకుంది. పాలిటెక్నిక్ లో చేరడానికి నిర్ణయించుకొన్నట్లు తల్లిదండ్రులకు చెప్పగానే వాళ్ళు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యేరు. కూతురిభవిష్యత్తు ఎలా వుంటుందో అన్న భయం చాలావరకూ తొలగిపోయింది. చదువుకొని, ఏదో ఒక ఉద్యోగం చేస్తూంటే పాతజ్ఞాపకాలేమీ ఆమెని బాధించవు! మామూలు మనిషనవడానికి అంతకంటే మంచిమార్గం మరోటిలేదు. నాలుగయిదు రోజులు అక్కడ గడిపి తిరిగి హైద్రాబాద్ చేరుకొందామె.
అనుకొన్నట్లుగానే ఫార్మశీలో సీటు దొరికిందామెకి.
చేరిన రెండోరోజే సాయింత్రం క్లాసులు ముగిశాక నాంపల్లి వేపు నడుస్తోంటే శ్రీపతి యెదురయ్యాడామెకి.
"నమస్తే!" అన్నాడు నవ్వుతూ.
"నమస్తే!" అంది శాంతి బిడియంగా, రోడ్డుమీద అతనితో మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉంది. అంతా తమనే చూస్తున్నారేమోనని అనుమానం.
"నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు పాలిటెక్నిక్ లో చేరడం!" అన్నాడు అభినందిస్తూ.
"ఇదంతా మీ చలవే..." అంది శాంతి చిరునవ్వుతో.
"పదండి! ఆ హోటల్లో కొంచెం కాఫీ-ఫలహారా లేమయినా సేవిద్దాం!" అన్నాడు.
"ఊహు, వద్దండీ, నాకిప్పుడేమీ తీసుకోవాలని లేదు...." బెదురుగా అందామె.
"మరేం ఫరవాలేదు! కనీసం కాఫీ అయినా తాగవచ్చు పదండి!" ఆమె జవాబుకోసం యెదుర్చూడకుండా హోటల్ వేపు నడుస్తూ అన్నాడతను.
అతన్ని అనుసరించక తప్పలేదు శాంతికి.
ఇద్దరూ ఫామిలీ రూమ్ లో కూర్చున్నారు.
ఆమె వద్దంటున్నా వినకుండ స్వీటూ, హాటూ ఆర్డర్ చేశాడతను.
"మీరు నా సలహా పాటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి! మన దేశంలో స్త్రీ సమస్యలన్నిటికీ కారణం స్త్రీలు చదువుకోకపోవడమే! చదువు లేకపోవడం మూలాన ఒకరిమీద ఆధారపడటం జరుగుతోంది. ఆధారపడ్డంత కాలం ఆ స్థితిగతులు మారవు! కట్నం సమస్యకు కూడా ప్రధానకారణం అదే!" కొద్ది ఆవేశంతో అన్నాడతను.
అతను చెప్పిందంతా నిజమే అనిపించింది శాంతికి.
స్త్రీల గురించి ఇంత తెలివిగా -ఇంత విపులంగా యెవ్వరూ చెప్పలేదింతవరకూ! స్త్రీలు ముందుకొస్తూంటే హేళన చేసే చాలామంది స్త్రీ పురుషుల్ని తమ ఊళ్ళోనే చూసింద. భర్తపోయిన మొదట్లో తన దుఃఖంలో తనుంటే- తన మనసు మరింత వికలమయిపోయే మాటలు మాట్లాడేవాళ్ళు అందరూ! వాళ్ళ అభిప్రాయం-స్త్రీ జీవితం అక్కడితో ముగిసిపోయినట్లే అని! తనూ వాళ్ళ ప్రభావానికి లొంగిపోతున్న సమయంలో సృజన్ అన్నయ్యవచ్చి రక్షించాడు. తనని ఆ ఊరునుంచి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ మామూలు మనిషిని చేశాడు.
ఇక్కడ తోటివారిని హేళనచేయడంగానీ- వాళ్ళ గురించి పట్టించుకొనేవారుగానీ లేరు! ఎవరిత్రోవ వారిదే!
ఆమె భర్త గురించిన స్మృతులు మదిలో కదిలేసరికి శాంతి చలించిపోయింది. కళ్ళ వెంబడి నీళ్ళుతిరిగినయ్. ఆయన తననెంత ప్రేమగా చూసుకొనేవారు. ఆ రోజులెంత మధురంగా ఉండేవి.
తనేదో ఉత్సాహంగా మాట్లాడుకుపోతున్న వాడల్లా శాంతి అదోలా ఉండటం చూసి ఠక్కున ఆగిపోయాడు శ్రీపతి.
"శాంతిగారూ!" అన్నాడు నెమ్మదిగా.
శాంతి చటుక్కున తేరుకుని అతనివంక తెచ్చిపెట్టుకొన్న చిరునవ్వుతో చూసింది.
విషాదంగా ఉన్నా, చిరునవ్వుతో ఉన్నా చెదరని ఆమె అందంచూసి చలించిపోయాడతను.
ఇంత అందమైన అమ్మాయి తనకింతవరకూ తటస్థపడ లేదా? లేక ఈ క్షణంలో శాంతి అందం అలా అనిపిస్తోందా?"
"మీ రేదో ఆలోచిస్తున్నట్లున్నారుకదా?" అడిగాడామెని.
"అవును!" అబద్దమాడలేకపోయింది శాంతి. ఎందుకో అబద్దం చెప్పబుద్ధి కాలేదు.
"దేన్ని గురించి ఆలోచిస్తున్నారో చెప్పడానికి అభ్యంతరమా?"
"పోనీండి! ఇప్పుడాగొడవంతా ఎందుకు?" నవ్వేస్తూ అందామె.
శ్రీపతి మనోహరంగా నవ్వుతున్న శాంతిని చూసి పరవశించిపోయాడు కొద్దిక్షణాలపాటు తదేకంగా ఆమెవంకే చూస్తూండిపోయాడు.
"ఇంక వెళదామా?" వాచి చూసుకొంటూ అంది శాంతి.
ఇద్దరు బయటికొచ్చారు.
"మరి...నేనిక ఉంటాను!" బస్ స్టాప్ వరకూ వచ్చి ఆగిపోతూ అన్నాడతను.
తలూపింది శాంతి.
"అప్పుడప్పుడు కలుస్తుండండి! మీతో మాట్లాడటం చాలా ఇష్టం నాకు!" అన్నాడు నెమ్మదిగా.
నవ్వి ఊరుకొంది శాంతి.
అతను వెళ్ళిపోయాడు.





