Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
ఇన్ స్పెక్టర్ ఓ క్షణం ఆలోచించాడు.
"మాకు మీ వేషాలన్నీ తెలుసు. మీ కాలనీ వాళ్ళందరూ కలిసి ఆమెతో అలా అబద్ధాలు చెప్పిస్తున్నారు. నిజానికి తన భర్త ఎంత దుర్మార్గుడైందీ ఆమెకు బాగా తెలుసు. మీరందరూ ఇంక అక్కడి నుండి వెళ్ళకపోతే మా సాక్ష్యాలను బెదిరింపుల ద్వారా లొంగదీసుకుంటున్నారన్న ఆరోపణ మీద అరెస్టు చేయాల్సి వస్తుంది" అన్నాడు కసిగా.
మాకు మతిపోయినట్లయింది.
"ఆల్ రైట్? నేనిప్పుడే బెయిల్ ఎరేంజ్ చేస్తాను" అన్నాడు గోపాల్రావ్.
ఇన్ స్పెక్టర్ హేళనగా నవ్వాడు.
"డౌరీ హరాస్ మెంట్ కేసులకు బెయిల్ ఇవ్వరు. అదీగాక యిది ఎటెంప్ట్ టు మర్డర్ కేస్ కిందకూడా బుక్ చేస్తున్నాం. ఈ రెండూ గాక రాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కిందకూడా రిజిష్టర్ చేసుకున్నాం. మీ తాతలు దిగి రావాలి మీ వాడిని విడిపించుకోవాలంటే."
మాకేం చేయడానికీ తోచలేదు.
శశిరేఖ ఏడుపు ప్రారంభించింది.
'అయ్యో! మా ఆయన్ను వీళ్ళు చంపేస్తారేమోనండీ! ఏం చేయాలండీ" అంటూ ఏడవడం మొదలుపెట్టేసరికి ఇన్ స్పెక్టర్ కానిస్టేబుల్స్ ని పిలిచాడు.
"వీళ్ళందరినీ బయటకు గెంటేయండి!"
కానిస్టేబుల్స్ లాఠీలతో మా అందరినీ బయటకు తోసేశారు.
వళ్ళు మండిపోయి అందరం బయట నినాదాలు ప్రారంభించాం.
"పోలీస్ జులుమ్ డౌన్ డౌన్"
"దొంగ కేసులు డౌన్ డౌన్"
"పోలీసు గూండాయిజం డౌన్ డౌన్"
ఇలా ఓ పావుగంట చేశాక నలుగురు కానిస్టేబుల్స్ వచ్చి గాలిలోకి తుపాకులు పేల్చారు. మన పోలీసులు గాలిలోకి తుపాకులు పేలిస్తే జరిగిందేమిటో మనందరికీ తెలుసు. నేలమీద వున్న వారికే బుల్లెట్స్ తగుల్తాయ్.
అంచేత అందరం పరుగెత్తుకుంటూ కాలనీ కొచ్చిపడ్డాం.
అప్పటికప్పుడు ఈ పరిస్థితిని చర్చించడానికి శాయిరామ్ మీటింగ్ పెట్టాడు.
"వెంటనే హోమ్ మినిస్టర్ దగ్గరకు ఊరేగింపు జరుపుదాం" అన్నాడు గోపాల్రావ్.
"హోమ్ మినిస్టర్లు ఇలాంటివి పట్టించుకోరు. పోలీస్ కమిషనర్ దగ్గర కెళ్ళటం మంచిది" అన్నాడు జనార్ధన్.
"లేకుంటే డిజిపిని కల్సుకుందాం" అన్నాడు యాదగిరి.
కొంతమంది మాత్రం బయల్దేరి ఆటోల్లో డిజిపిగారి దగ్గరికెళ్ళాం. అప్పుడె నక్సలైట్స్ ఏదో ఊళ్ళో ఓ పోలీస్ ని అరెస్ట్ చేసినట్లు వార్త అందటం చేత డిజిపిగారు హడావుడిగా ఆఫీస్ వదలి హోమ్ మినిస్టర్ దగ్గరకు వెళ్ళిపోయారు. పోలీస్ కమీషనర్ ఎన్టీఆర్ తో పాటు విశ్వామిత్ర షూటింగ్ ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళారని తెలిసి తిరిగి కాలనీకి చేరుకున్నాం.
అందరం దిగాలుపడి కూర్చున్నాం.
చంద్రకాంత్ భార్య అందరి మధ్య కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
"ఊరుకోమ్మా ఇంకేం చేస్తాం! పిల్లల్ని పెట్టుకుని ఇక ముందు జీవితం ఎలా గడపాలో చూసుకో. లాకప్ లోకి పోయినోడు కాటికి పోయినోడూ యింక తిరిగిరారు" అంటోంది, ఓ ముసలమ్మ.
హఠాత్తుగా మా వాళ్ళలో సంచలనం కనిపించింది.
"పోలీస్ వస్తున్నాడు" అన్నారెవరో.
అందరం లేచి నిలబడ్డాం భయంగా.
పోలీస్ కానిస్టేబుల్ తిన్నగా మా దగ్గరకొచ్చాడు.
"ఏమిటి సంగతి" అడిగాడు శాయిరామ్.
"మీ కాలనీ ప్రెసిడెంటెవళ్ళు?" అడిగాడతను.
"నేను" అన్నాడు గోపాల్రావ్.
"మీతో జర మాట్లాడాలి!"
నేను, గోపాల్రావ్, యాదగిరి కానిస్టేబుల్ తో పాటు స్టేజి వెనక్కి నడిచాం.
"సంగతేమంటే మా ఇన్ స్పెక్టర్ సాబ్ లేడా? షానా దిల్దార్ మడిసి భాయ్. మా పోలీస్ కానూన్ దిక్కుకెళ్ళి మీ కాలనీ వాళ్ళందరూ గిట్ల పరిషానవుతున్రని, నన్ను పంపించిండన్నట్లు!"
"అలాగా! ఏమంటాడాయన?" అడిగాడు శాయిరామ్ ఆశగా. "మావాళ్ళను వదిలేస్తాడా?"
"అవ్! ఆ విషయం గురించే మాట్లానికి మీ దగ్గరకొచ్చినా. చెప్పినగదా మా ఇన్ స్పెక్టర్ సాబ్ బలే దిల్దార్ మనిషి!"
"చాలా సంతోషం" అన్నాడు గోపాల్రావ్. "ఎప్పుడు వదులుతున్నారు వాళ్ళను?"
"గిప్పుడంటే గిప్పుడే."
యాదగిరి ఆనందానికి హద్దులేదు.
"నేన్జెప్పలేదువయ్యా! పోలీసోండ్లలో గూడా మహానుభావులుంటరు" అన్నాడతను.
"ఇంకా ఆలస్యం ఏమిటి మరి? స్టేషన్ కెళ్దామా?" అడిగాడు శాయిరామ్.
"పైసల్దీసుకు రాండ్రి! వెళ్దాం" నెమ్మదిగా అన్నాడు కానిస్టేబుల్.
అందరం ఉలిక్కిపడ్డాం.
"పైసలా? ఏం పైసలు?" ఆశ్చర్యంగా అడిగాడు యాదగిరి.
"అదే భాయ్, జెప్పిన గదా! ఇన్ స్పెక్టర్ సాబ్ దిల్దార్ మనిషి. ఇదే ఇంకోళ్ళుంటే నాలుగువేలు కమాయిస్తుండె గానీ మా ఇన్ స్పెక్టర్ సాబ్ పైసల మనిషి కాదు. ఇజ్జత్ తోటి నౌఖరీ చేయాల్నంటాడు."
మాకు అప్పటికి అర్ధమైంది.
"ఎంత ఇవ్వాలి?" అడిగాడు శాయిరామ్ పాలిపోయిన ముఖంతో.
"చాలా తక్కువ భయ్యా ఒక్క వెయ్యి రూపాయల్జాళు! అది గూడా మన కాలనీ వాండ్లని కన్సెషన్ ఇచ్చిండన్నట్లు, లేకుంటే మీకు ఎరుకలేందేమున్నది? ఒక్కసారి ఎఫ్ ఐర్ ల గిట్ట రాసిన్రంటే జాలు! పదివేలు పడాల్సిందే! జెప్పినా కదా! మా ఇన్ స్పెక్టర్ సాబ్ దిల్దార్ మనిషి!"
"ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తాం" అన్నాడు శాయిరామ్.
"ఏం పర్లేదు- పది నిముషాలు టైమ్ తీస్కోండ్రి! జెప్పినా గదా! మా ఇన్ స్పెక్టర్ సాబ్ దిల్దార్ మనిషి!"
అందరం డిస్కస్ చేసుకుని, పాముల్తోనయినా చెలగాటాలాడొచ్చు గానీ పోలీసులతో వేళాకోళాలాడగూడదని నిర్ణయించుకుని అప్పటికప్పుడే అందరం కలసి వెయ్యి రూపాయలు పోగుచేసి కానిస్టేబుల్ కిచ్చాము.
కానిస్టేబుల్ ప్రేమగా మా భుజం మీద చేతులేశాడు.
"ప్రజలు, పోలీసులు కలిసి గిట్ల పన్జేయాలే! ఇగో- ఒక్క విషయం జెప్తున్నా- ఇను- మన దోస్తాన మంచిగున్నది. నువ్ గానీ మీ కాలనీలనో ఇంకెవళ్ళయినా గానీ మర్డర్లు, కిడ్నాప్ ళు, భార్యలను కిర్సనాయిలు పోసి కాల్చుడుళు- ఏమైనా జేయండి! మీ మీద ఈగవాలకుండ నేన్జూసుకుంట! ఏమంటున్నా! జరన్ని పైసలు ఖర్చు జేయాల! గంతనే-' మేమేమీ మాట్లాడలేదు. వెంటనే రంగారెడ్డి, చంద్రకాంత్ ళు కాలనీ కొచ్చేశారు.
ఆ తరువాత గంటలోపలే చంద్రకాంత్ తో పాటు అందరం ఆటో బ్రోకర్స్ దగ్గరకెళ్ళి అతని స్కూటర్ అమ్మి పారేసి హాపీగా ఇంటికి చేరుకున్నాం.
* * * * *





