Home » D Kameshwari » Madhupam
ఆపాత మధురం
ఓ ఆదివారం నాలుగు గంటల వేళ తోచలేదని బయటికి తీసికెళ్ళమని మారాం చేస్తున్న కూతురికి ఇదిగో నీకు మంచి సినిమా కన్నా బాగుండేది. చూపిస్తాను అంటూ లాప్ టాప్ అన్ చేసింది కీర్తన. బోర్లా పాడుకుని గడ్డానికి చేతులాన్చీ చూస్తున్న శృతి కళ్ళు ఆనందంగా, విభ్రమంగా చూస్తూ "మమ్మీ మమ్మీ చూడు చూడు ఆ పిట్ట పిల్లలు నోళ్ళు ఎలా తెరిచాయో. పిట్ట చూడు నోట్లో ఎలా పెడుతుందో అన్నం." కొమ్మకి వేల్లాడుతున్న గిజిగాడి గూడు లో బంగారుపిట్ట పిల్లలు నోళ్ళు తెరచుకునుంటే రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతూ నోట్లో ఆహారం పెడ్తున్న అదృశ్యం వింతగా చూస్తూ అరిచింది.
"పిట్ట పిల్ల ఏమిటే , బలే పేరు పెట్టావు " కీర్తన నవ్వింది.
"మరేం అనాలి. పిట్ట కదా, దాని పిల్ల కదా.... 'పెద్ద కళ్ళని తిప్పుతూ ఆ కళ్ళ మీద పడిన జుత్తుని తోసుకుంటూ ప్రశ్నార్ధకంగా చూసింది."
"పిచ్చుక పిల్ల అంటాం. పక్షి పిల్ల అనాలా, పక్షి కూన అనాలా....."తల్లే సందేహంలో పడింది.
"అమ్మా చూడు ....చూడు.... ఆ నెస్ట్ .... కాకి పిల్లలు.... ఎంత క్యూట్ గా ఉన్నాయో." మరో దృశ్యం - మరో కేక - ఆనందం ఆశ్చర్యం.
"మమ్మీ చూడు చూడు.... ఏమిటివి?" ఉడతలు చూపిస్తూ అడిగింది.
"స్య్విరల్స్ .... ఉడతలు అంటారు." సపోటా చెట్టు మీద చెంగు చెంగున కొమ్మల మీంచి దుముకుతూ పక్వానికి వచ్చిన కాయలు ముందు కాళ్ళతో పట్టుకు కొరుకుతూ "మమ్మీ ....మనం తిన్నట్టే తింటుంది చూడు....' సంబరంగా అంది. కూతురు ఆశ్చర్యానందాలు చూస్తుంటే చిన్నప్పుడు సపోటా చెప్పు కొమ్మల మధ్య ఎలుకల బోను పెట్టి ఉడతలని పట్టుకుని కాసేపు ఆనందించి, ఆడి, విడిచిపెట్టేస్తే తుర్రుమని పారిపోవడం .... ఇప్పటి పిల్లలు ఈ దృశ్యాలు ఎలా చూస్తారు....?"
"మమ్మీ .... నాకో ఉడుతనివ్వవు .... ఆడుకుంటాను ...." ఆశగా అడిగింది.
"వద్దమ్మా వాటిని పట్టుకుని బోనులో పెట్టకూడదు . పాపం వస్తుంది..." అంటూ రామదాసు చిలకలని పట్టుకుని బంధించిన కధ చెప్పింది.... శృతి కళ్ళలో కాస్త నిరాశ....
"మమ్మీ .... చూడు ఆ పారాట్ జామకాయని ఎర్రముక్కుతో ఎలా కొరుకుతుందో మరో దృశ్యం! మరో ఆశ్చర్యం. చిలక చిలక కొరికిన పండ్లు తెల్లారి కింద పడితే ఏరుకుని గౌనుతో తుడుచుకు తినడం .... చిన్నతనంలో ఎన్ని ముచ్చట్లో...
"అమ్మా .... ఆవు పిల్లచూడు అమ్మ దగ్గిర ఎలా పాలు తాగుతుందో .... అమ్మా అలా పొడుస్తుందేమిటి, ఆవు అమ్మకి నొప్పెట్టదూ....?' ఆవు దూడ పొదుగు కుమ్మి కుమ్మి పాలు తాగుతున్న దృశ్యం చూసి శృతి అంది.
'అమ్మలకి నొప్పెత్తదమ్మా ....నీవు నా కడుపులో వుండగా ఎలా తన్నే దానివో తెలుసా" నవ్వింది కీర్తన .... "బాగా నొప్పెట్టేదా అమ్మా..... సారీ అమ్మా....' శృతి బాధపడ్తూ అంది. "ఛా.... అదేం లేదు.... అందరూ కడుపులో ఉండగా అలాగా తిరుగుతూ తంతారు. అది నొప్పెట్టదూ. అమ్మలు అసలు బాధపడరు. సంతోషిస్తారు' అంది. శృతి దృష్టి మళ్ళీ లాప్ టాప్ మీదకి మళ్ళింది. ఆవుదూడ పాలు తాగి పెరడంతా చెంగుచెంగున గెంతుతూ ఉంది. మరో దృశ్యం. పిల్లి వసారాలో పడుకుంటే నాలుగు పిల్లలు తల్లి మీద నించి గెంతుతూ, వాళ్ళలో అవి పోట్లాడుకుంటూ ఆడుకుంటున్నాయి.
"మమ్మీ.... పిల్లి పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడు....' వాటిని పట్టుకోడాని కన్నట్టు చేయి చాపింది ..... లాప్ టాప్ వైపు.
పెరటి నిండా విరబూసిన బంతిపూలు.... రంగురంగులలో వాటిమీద సీతాకోకచిలకలు ... మరో చోట .... రంగు రంగుల చామంతులు,..
"ఇంత మంచి గార్డేనుండేదా అమ్మా మీ ఇంట్లో ...." పూలని స్క్రీన్ మీద తాకుతూ అడిగింది . వీధి వైపంతా పూల ,మొక్కలు -పెరట్లో మామిడి, పనస, సపోటా, జామ ఎన్ని చెట్లుండేవో మా అమ్మమ్మ గారింట్లో ....పిల్లలం అందరూ శలవులకో వెళ్ళినప్పుడు చెట్లమీదే వుండేవారం. ఎన్ని రకాల ఆటలో....." అంది కీర్తన పాత రోజులు తల్చుకుంటూ పారవశ్యంగా .... శృతి తల్లి వంక చూస్తూ....' మరి మన అమ్మమ్మ గారింటికి శలవులకి ఎవరూ రారు . ఎందుకు ఇప్పుడు?"
"ఎవరున్నారు మా అక్క అన్నయ్య ఇద్దరూ అమెరికాలో ఉంటారు. అంతదూరం నించి ప్రతి శలవులకి రాలేరుగా .... వచ్చినా ఇప్పుడు అమ్మమ్మగారింట్లో పెరడు తోట ఎక్కడున్నాయి. ఇల్లు, అమ్మేసి అపార్ట్ మెంట్స్ కి వెళ్ళిపోయారు చేసుకోలేక. ఇద్దరూ ముసలివాళ్ళయిపోయారు గదా. అప్పుడు మా అమ్మమ్మకి ఆరుగురు పిల్లలు. దొడ్డమ్మలు, పిన్నులు, మామయ్యలు.... అందరూ శలవులకి పిల్లలతో వచ్చేవారు ఆ రోజుల్లోలా ఇప్పుడెలా ఉంటాయి.."
శృతి కళ్ళలో అసూయ....." ఎంత బాగుండేదో కదా. అందరూ వచ్చి సరదాగా పిల్లలు ఆడుకోవడం..... మీరంతా ఎంత లక్కీ..... నాకే ఎవరూ లేరు ఆడుకోడానికి" కినుకగా అంది. 'అమ్మమ్మగారిల్లు ఎందుకమ్మేశారు మేం పిల్లలం ఆడుకోడానికి లేకుండా' నిలేసింది . అసలు.... చెట్లు లేకుండా మన అపార్ట్ మెంట్స్ ఎందుకు కట్టారు.'
"ఏం చేస్తారు తల్లీ!.... జనం ఎక్కువయితే ఉండడానికి చోటేలేక ఇల్లు కూల్చేసి ఆ చోటులో ఏభై ఇళ్ళు కడుతున్నారు. ఇంక చెట్లకి చోటేది.'
"మరి ఆ ఉడతలు, చిలకలు, పిట్టలు అవి ఎక్కడున్నాయి. అవెక్కడికి పోయాయి?"
"చెట్లున్నచోటు వెతుక్కుంటూ పల్లెటూళ్ళకి, లేకపోతే అడవులకి పోయి ఉంటాయి. పిచికలు లాంటివి ఇంటి చూరులో గూడు కట్టేవి.... ఇప్పుడసలు అవన్నీ కనపడడమే లేదు. అంతరించిపోయాయి కాబోలు ."
'అమ్మ మనం కూడా ఏదన్నా పల్లెటూరు వెళ్ళిపోదామా?" ఆశగా అడిగింది.
"ఎలా వెడతాం. నీకు మంచి స్కూలు - నాకు ఆఫీసు అన్నీ చిన్న ఊర్లలో వుండవు. ఈసారి ఏదన్నా శలవులకి ఎక్కడికన్నా తీసికేడతాలే.' ఊరడింపుగా అంది. "ప్రామిస్" అంది. కూతురు చేయి ప్రేమగా నొక్కి 'ప్రామిస్' అంది కీర్తన.
నిజంగా ఎంత మంచిదయింది. పాప నెత్తుకుని అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు వీడియో కెమేరాతో షూట్ చేసింది. పాప పెద్దదయితే తన తాతగారిల్లు పల్లెటూరు ఎలా ఉంటాయో చూపాలని, ఇప్పుడింక ఈతరం పిల్లలు ఆవు దూడలని ఉడతలని , పక్షులని, పొలాలని, చెట్లు చేనులను అన్నీ సీడీల్లో చూసి ఆనందించాల్సిందే మరి.





