Home » yerramsetti sai » Kanthi Kiranalu
కాంటీన్ లోనుంచి బయటికొచ్చి ఆఫీస్ లో తన సీటు వేపు నడిచాడతను. ఆ సాయంత్రం ఆఫీసునుంచి బయటపడి బస్టాఫ్ దగ్గర నిలబడిపోయాడు. ఎక్కడికెళ్ళాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. వెంటనే ఇంటికిమాత్రం వెళ్ళాలనిపించటం లేదు. తల్లి, చెల్లెలు-మావయ్య-అందరూ తన కోసం ఎదుర్చూస్తుంటారు. తను స్వరూపను అక్కడే అదిలేసి రావాలనడానికి కారణం అడగలేకపోయినా, వాళ్ళమనసుల్లో అనుక్షణం అదేప్రశ్న మ్రోగుతుంది. బస్ వచ్చి ఆగింది. అదెక్కడి కెళుతుందో, యెక్కడినుంచి వస్తుందో అదేమీ చూడలేదు. ఫుట్ బోర్డ్ మీద నించున్నాడు. చాలా రష్ గా ఉంది. లోపలకు వెళ్ళడానికి కూడా స్థలంలేదు.
మరో పదినిమిషాల తర్వాత అప్ లాండ్స్ చేరుకొందది. అక్కడదిగి వెనక్కు నడవడం ప్రారంభించాం. చాలా సేపటికి బీచికి చేరుకొని ఓచోట కూర్చుండిపోయాడు ప్రశాంతంగా ఉందక్కడ. సముద్రపు హోరుతప్పితే మరే గొడవాలేదు. సమీపంలోనే విదేశీ నౌకలు రెండు హుందాగా నుంచున్నాయ్-అతనికి స్వరూపగుర్తుకొచ్చింది ఆమె గుర్తుకురాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి తను. మనసులోంచి పూర్తిగా చెరిపివేయాలి.
మాధురిని తలచుకొన్నాడతను. మాధురి గురించి బలవంతంగా ఆలోచించసాగాడు. మాధురి అందంగా ఉంటుంది చక్కగా మాట్లాడుతుంది! చలాకీగా, హుషారుగా ఉంటుంది. అంతే! ఆ తరువాత అతని ఆలోచనలు ఆగిపోతున్నాయ్.
తిరిగి స్వరూప గురించిన ఆలోచనలు-
ఇప్పుడేం చేస్తుంటుందో? ఈ పాటికి జరిగినదంతా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఉంటుంది. వాళ్ళు బాధపడి ఉంటారు తనూ ఏడ్చే ఉంటుంది. అంతే కావాలి! వాళ్ళకి జరగాల్సిన శాస్తే అది!
ఉహుఁలాభంలేదు! మళ్ళీ స్వరూపగురించే ఆలోచిస్తున్నాడు తను! లేచి దగ్గరేవున్న కాంటీన్ లోకి నడిచాడతను! టేబుల్స్ అన్నీ ఇంచుమించుగా ఖాళీగానే ఉన్నయ్! ఓ టేబుల్ దగ్గర మాత్రం ఓ యువతీ యువకుడూ కూర్చుని ఆనందంగా మాట్లాడుకొంటున్నారు.
మూలగా వున్న ఓ టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడతను.
సర్వర్ వచ్చాడు.
"ఐస్ క్రీమ్ తీసుకురా!"
వాడు వెళ్ళిపోయాడు.
మరోసారి ఆ జంటవంక చూశాడు సురేంద్ర. వాళ్ళ నెక్కడో చూసినట్లు అనిపించింది. ఎక్కడో, ఎంత ప్రయత్నించినా గుర్తుకి రాలేదు. ఆ యువతికీ, స్వరూపకీ కొంచెం పోలికలున్నట్లు అనిపించిందతనికి. ఆమెకూడా వివాహానికి ముందు మరోడితో ఇలాగే విహారాలు సాగించి ఉంటుంది! ఇలాగే ప్రియుడితో కబుర్లుచెపుతూ, వాడి కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ, వాడి కౌగిట్లో నలుగుతూ-హెల్!
ఎదురుగ్గా ఉన్న 'అయిస్ క్రీమ్' తినబుద్ధి కాలేదతనికి లేచి బిల్లు చెల్లించి బయటకు నడిచాడు. నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరుకొనేసరికి పదిదాటింది టైము. అంతవరకూ అతనికోసమే ఆదుర్దాతో ఎదుర్చూస్తూ బయటే కూర్చున్న రాధమ్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకొంది. బట్టలు మార్చుకొనేలోగానే "పద! భోజనం వడ్డించాను!" అంది హడావుడిగా అక్కడికొస్తూ.
సురేంద్ర ఎలాగోలా భోజనం అయిందనిపించి చేయి కడుక్కున్నాడు.
రాధమ్మ ఇదంతా గమనిస్తూనే ఉంది. ఆమెకుకూడా మానసికంగా శాంతి లేకుండా పోయింది. స్వరూపగురించి అతనేం చెప్తాడో, ఎప్పుడు చెప్తాడో అన్న ఆత్రుత క్షణక్షణానికీ పెరిగిపోతోంది.
"ఎక్కడికెళ్ళావ్, ఇంత సేపూ?" అడిగిందామె అతని వెనుకే హాల్లోకొస్తూ.
"అలా-బీచ్ వేపు వెళ్ళానే!" కుర్చీలో కూర్చుంటూ అన్నాడతను.
తలుపు కానుకొని దిగాలుపడి నుంచున్న తల్లిని చూస్తే అతనికి జాలివేసింది. ఆమె మనసులో ఏముందో తనకు తెలుసు! తను చేస్తోన్న పనులకు అర్ధం వెతకడం కోసం సతమతమవుతోంది.
"అమ్మా!"
తలెత్తి చూసింది రాధమ్మ.
"ఇలా రామ్మా! ఇక్కడ కూర్చో!"
మౌనంగా నడిచి అతని కెదురుగ్గా ఉన్న కుర్చీలో కూర్చుందామె.
ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదతనికి. చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు.
గడియారం పన్నెండు గంటలు కొట్టింది.
"స్వరూపకీ, మనకీ ఇక ఎలాంటి సంబంధమూ లేదమ్మా." ఆమె చూపుల్ని ఎదుర్కోకుండా మరో వేపుకి చూస్తూ అన్నాడతను.
రాధమ్మ త్రుళ్ళిపడింది. గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్! "ఇంత ఘోరానికి కారణం ఏమిటి?" ఆమె నోట్లోంచి మాట పెగలటం లేదు.
"పెళ్ళి ముందురోజు రాత్రి, స్వరూప ప్రవర్తన మంచిదికాదని తెలిసిందమ్మా! ఎవడితోనో ప్రేమకలాపాలు సాగించి, ఇప్పుడు నన్ను చేసుకుంది. అలాంటి నీతిలేనిదాన్ని వెనుకా ముందూ చూసుకోకుండా, ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకోవడం నాదే పొరపాటు..." తొందరగా మాట్లాడాడతను.
"మరి.....ఆరోజు రాత్రే నాకీ సంగతి ఎందుకు చెప్పలేదు? పెళ్ళి జరగకుండా చూసేవాళ్ళంకదా!" ఆవేదన నిండిన గొంతుతో అందామె.
"ఊహుఁ! కావాలనే తెలిసికూడా ఈ వివాహం చేసుకున్నానమ్మా! ఎందుకో తెలుసా? స్వరూపకు తగిన శాస్తి చేయాలని! ఇంకెవ్వరినీ-ఇలా మోసం చేయకుండా జీవితమంతా 'మొగుడొదిలేసిన ఆడది'అన్న పేరుతో కుళ్ళి చావాలని ఇలా చేశాను!..." ఉద్వేగంతో అన్నాడతను.
రాధమ్మ తెల్లబోయింది.
తన కొడుకు యెంత పట్టుదలగలవాడో ఆమెకు బాగా తెలుసు చిన్నప్పటినుంచీ యెన్నో సందర్భాలలో అతనిలోని పట్టుదలను చూసింది. ఎవరయినా ఒక్క మాటంటే పడేవాడు కాదు. ఓసారి తను సురేంద్రను ఏదో విషయంలో గట్టిగా మందలించింది. అంతే! అలా మందలించినందుకు కొన్ని రోజులు అన్నం, నీళ్ళు ముట్టుకోకుండా గడిపాడు. తరువాత తనేయెంతో బ్రతిమాలి, తను అలామందలించటం తప్పేనని, ఇక ముందు ఎలాంటి మందలించటం చేయనని ఒప్పుకున్నాక అప్పుడుగాని భోజనం చేయలేదు.
ఇలాంటివెన్నో సంఘటనలు రాను రాను పెద్దవుతున్న కొద్దీ అతనిపట్టుదల పెరిగిందేగాని తరగలేదు. మొదట ఓ ఎరువుల కంపెనీలో వచ్చిన ఉద్యోగాన్ని ఆఫీసరేదో అనవసరంగా వాగాడని రాజీనామా చేశాడు ఆఖరికి ఆ ఆఫీసరు పొరబాటయిందని క్షమార్పణ చెప్పుకున్నా తిరిగి అక్కడికి వెళ్ళలేదు.
"నీకా విషయం ఎవరుచెప్పారు?" అడిగింది రాధమ్మ.
"ఎవరో చెప్తే నేనూనమ్మేవాడిని కాదమ్మా సృజన్ బాబు చెప్పాడు. వాడు అదే వూళ్ళో చదివాడుగదా స్వరూప సంగతంతా బాగా తెలుసట." రాధమ్మ మరింకేమీ మాట్లాడలేకపోయింది.





