Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
మర్నాటి సాయంత్రం వరకూ ట్రీట్ మెంటేమీ ప్రారంభించక పోయేసరికి డిశ్చార్జ్ అడిగి తీసుకుని ఇంటికి చేరుకున్నాం.
హాస్పిటల్లో తలకువేసిన బాండేజ్ మార్పించడానికి మర్నాడు ఇంకో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాం అందరం కలసి.
గోపాల్రావుకీ ఆ డాక్టర్ కీ స్నేహం ఉండటం వల్ల అతను ట్రీట్ మెంట్ ఇవ్వడానికి అంగీకరించాడు.
"అయితే మీరంతా ఓ ప్రామిస్ చేయాలి" అడిగాడు మా అందరి ముఖాలవైపు చూస్తూ.
"ఏమిటిది?" అడిగాడు గోపాల్రావు.
"ఇది స్కూటర్ యాక్సిడెంట్ కాదు అని చెప్పాలందరూ! ఏదీ ఓ రిహార్సల్ వేయండి"
నేను అయోమయంగా శాయిరామ్ వైపూ రంగారెడ్డి వైపూ చూశాను.
"రిహార్సలేమిటి సార్! మాకు వివరంగా చెపితే"
"అదేనండీ! అందరూ గట్టిగా చెప్పండోసారి! ఇది స్కూటర్ యాక్సిడెంట్ కాదు"
అందరం గట్టిగా చెప్పాం. "ఇది స్కూటర్ యాక్సిడెంట్ కాదు"
"ఆమెను రోడ్ మీద ఒక వీధి ఆవు పొడవటం వల్ల దెబ్బలు తగిలినవి!"
"ఆమెను రోడ్ మీద ఒక వీధి ఆవు పొడవటం వల్ల దెబ్బలు తగిలినవి!" అందరం చెప్పాం.
"వెరీగుడ్! మిమ్మల్ని పోలీసులొచ్చి అడిగినప్పుడు ఇదే చెప్పాలి వారికి. అర్ధమయిందా?"
"అయింది డాక్టర్!"
అతను శశిరేఖకు వైద్యం చేశాక ఇంటికి చేరుకున్నాం.
ఆ సాయంత్రం అందరం కాలనీ వేదిక దగ్గర కూర్చుని ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటుంటే పోలీస్ వాన్ ఒకటి వచ్చి మా ఎదురుగ్గా ఆగింది.
అందులో నుంచి బిలబిలమంటూ పోలీసులు దిగి మా దగ్గరకొచ్చి తుపాకులు తీసుకుని మాకు గురిపెట్టారు. ఇన్ స్పెక్టర్ పిస్టల్ తీసుకుని మా దగ్గరకొచ్చాడు. ఎందుకైనా మంచిదని అందరం చేతులెత్తేశాం.
"ఇక్కడ చంద్రకాంత్ ఎవరు?" అడిగాడతను.
"నేను" అన్నాడు చంద్రకాంత్ తెల్లబోతూ.
"వాన్ ఎక్కు! యూ ఆర్ అండర్ అరెస్ట్."
"ఎందుకూ?"
"నీ భార్యను స్కూటర్ మీద నుండి పడేసినందుకు?"
"పడేయమేంటండీ? అది యాక్సిడెంట్ కదా?"
"ఏదైనా అవనీ. ముందు స్టేషన్ కు పద."
చంద్రకాంత్ కు భయం వేసినట్లుంది. మావైపు చూశాడు సపోర్టు కోసం.
"ఏమిటండీ? ఏం జరిగిందసలు? వాటీజ్ ది ప్రాబ్లమ్" అడిగాడు రంగారెడ్డి కల్పించుకుంటూ.
"వీడ్ని కూడా లోపల వేసేయండి" కానిస్టేబుల్స్ తో చెప్పాడతను.
కానిస్టేబుల్స్ అతన్నీ, చంద్రకాంత్ నీ లాఠీలతో తోసుకుంటూ వాన్ లో ఎక్కించేశారు.
"సంగతేమిటి చెప్పమంటే మరీ ఇంత దౌర్జన్యమా? ఎవరు కల్పించుకుంటే వాళ్ళను వాన్ ఎక్కించేస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా?" కోపంగా అరిచాడు గోపాల్రావ్.
"వాడిని కూడా వేసెయ్యండి"
గోపాల్రావ్ ని కానిస్టేబుల్స్ ఈడ్వబోతుంటే తన ప్రెస్ ఎక్రిడిషన్ కార్డ్ చూపించాడు.
దాంతో షాక్ కొట్టినట్లు అతనిని వదిలేశారు పోలీసులు.
"జర్నలిస్ట్ అని చెప్పరేం?" అని గొణుక్కుంటూ వాన్ ఎక్కేశారు. వాన్ స్టార్టయింది. మేమంతా అరుస్తూ వెనుక పరుగెత్తాం కానీ లాభం లేకపోయింది.
"సంగతేమిటో కనుక్కుందాం పదండి" అన్నాడు గోపాల్రావ్.
వెంటనే శాయిరామ్ విజృంభించి కాలనీ వాళ్ళందరినీ పది నిముషాల్లో పోగు చేసుకొచ్చాడు.
అందరం పోలీస్ స్టేషన్ చేరుకున్నాం.
బయటే కానిస్టేబుల్స్ మాకు తుపాకులు గురిపెట్టారు.
"ఎవడైతే లోపలికొచ్చాడో జాగ్రత్థ౧ కాల్చిపారేస్తాం" అరిచాడు ఒక కానిస్టేబుల్.
"మేము యుద్ధం చెయ్యడానికి కాదయ్యా వచ్చింది. మావాడిని ఎందుకరెస్ట్ చేశారో మీ ఇన్ స్పెక్టర్ ని కనుక్కోడానికొచ్చాము" చెప్పాడు గోపాల్రావ్.
"అయితే ఎవరైనా ఒకరిద్దరు లోపలకు రండి. మిగతా వాళ్ళంతా అక్కడే దూరంగా నిలబడాలి."
నేనూ, గోపాల్రావ్, చంద్రకాంత్ భార్య శశిరేఖ, యాదగిరి లోపలకు నడిచాం.
ఇన్ స్పెక్టర్ మావంక కోపంగా చూశాడు.
"ఏమిటి, అందరినీ వేనకేసుకుని వచ్చి దాడి చేద్దామనుకుంటున్నారా?" అడిగాడతను.
"అది కాదండి. మా వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కారణం ఏమిటో తెలుసు కుందామని" చెప్పాడు గోపాల్రావ్.
"కారణం ఏమిటేమిటయ్యా! మీకు తెలీదా కారణం?"
"తెలీద్సార్!"
"స్కూటర్ యాక్సిడెంట్ చేసి వాళ్ళావిడను కింద పడేశాడు. అర్ధమైందా."
"అయింది గాని అది కేవలం యాక్సిడెంట్ అని తెలిసినా అతన్నెందుకు అరెస్ట్ చేసినట్లు?"
"యాక్సిడెంట్ అని ఎవరంటారు?"
"మేమందరం అంటాం" కోపంగా అన్నాడు యాదగిరి.
"నేనట్లా అనను."
"మీరేమంటారు?"
"కావాలనే యాక్సిడెంట్ చేశాడంటాను"
మేము ఆశ్చర్యపోయాం.
"కావాలనే యాక్సిడెంట్ చేయటమా?" ఆశ్చర్యంగా అడిగాను నేను.
"అవను" ఖండితంగా అన్నాడు ఇన్ స్పెక్టర్.
"హౌ రిడిక్యులస్?" అన్నాడు గోపాల్రావ్ నావేపు తిరిగి.
"చాలా రిడిక్యులస్?" అన్నాడు యాదగిరి.
"యూ కెన్ గో నౌ" అన్నాడు ఇన్ స్పెక్టర్ మండిపడుతూ.
"చూడండి ఇన్ స్పెక్టర్ గారూ! కావాలని సొంత భార్యను ఎవడైనా యాక్సిడెంట్ చేసి కిందపడేస్తాడా" అడిగాడు గోపాల్రావ్. అందరం నవ్వాం.
"తప్పకుండా పడేస్తాడు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"ఎందుకు పడేస్తాడండీ? అలా లాజిక్ లేకుండా మాట్లాడతారేం?" నేనడిగాను ఉక్రోషంగా.
"లాజిక్ ఎందుకు లేదు? చాలా వుంది."
"ఏమిటది?"
"వరకట్నాల విషయంలో ఆమెను వేధించి వుంటాడు. అందుకని ఆమెను చంపేయటానికి ఈ కొత్త పద్ధతి ప్రయోగించాడని మా అనుమానం."
ఆ మాట వింటూనే శశిరేఖ ఫక్కున నవ్వింది.
"ఏమిటి? ఆయన వరకట్న అడగటమా? ఏడ్చినట్లుంది. నన్ను కావాలని ఒక్క పైసా కట్నం అడగకుండా మ్యారేజ్ చేసుకున్నారాయన. అక్కడితో ఆగక మా నాన్నగారు పోయేసరికి తనే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి మా తమ్ముళ్ళకు చదువు కూడా చెప్పించారు. ఆయనకున్న పొలం కాస్త అమ్మేసి మా వాళ్ళ కోసమే ఖర్చు చేశారు" అందామె ఏకధాటిగా.
ఇన్ స్పెక్టర్ ముఖం మాడిపోయింది.
"ఇప్పుడేమంటారు? ఇప్పటికైనా మా వాళ్ళను వదిలేస్తారా?" అడిగాడు గోపాల్రావ్.





