Home » yerramsetti sai » Kanthi Kiranalu
స్వరూప కళ్ళు వెంబడి నీళ్ళు తిరిగినయ్.
"నీలాంటి పశువుల్తో గౌరవంగా మాట్లాడటం నాదీ తప్పే! ఒక్క విషయం గుర్తుంచుకో! నేను చాలా మొండి దాన్ని! ధైర్యవంతురాలిని కూడా! నువ్ కాదన్నంత మాత్రాన అధోగతి పాలవుతాననుకొంటున్నావ్! నాకలాంటి భయమేమీ లేదు! నా చదువే నన్ను పోషించగలదు, ఎవరినీ యాచించకుండా గడపగలను___" రోషంగా అందామె.
సురేంద్ర కొంచెం తగ్గాడు. ఆమె అంత ధైర్యంగా తెగించి అలా మాట్లాడగలదని అనుకోలేదు! అసలు ఆడపిల్లలలో ఇంత తెగింపు ఉంటుందని ఊహించలేదు.
"అవున్లే నీకు భయమెందుకు? ఎవడ్నో వలలో వేసుకొని రోజులు గడపగలవ్__" అనేసి కంచంలో చెయ్యి కడిగేసి ఆ గడిలోనుమ్చి బయటికెళ్ళిపోయాడతను. స్వరూపకి విపరీతమయిన కోపం వచ్చింది. కానీ బలవంతంగా అణచుకొని ఊరుకుండిపోయింది. మరికొద్దిసేపట్లో సురేంద్రా, అతని తల్లీ, చెల్లెలు మరి ఒకరిద్దరు బంధువులు అంతా కలిసి బస్ స్టాండ్ కి బయల్దేరారు. తన తల్లీ తండ్రీ బయటివరకూ వెళ్ళి దీనమైన మోఖలతో తిరిగి వచ్చారు.
వాళ్ళు వెళ్ళేప్పుడయినా స్వరూపను తీసుకెళ్ళే విషయమ ప్రస్తావించకపోవడం వారికి మనస్తాపం కలుగచేసింది.
కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా స్వరూప దగ్గర కొచ్చింది ఆమె తల్లి.
"వెళ్ళేప్పుడు అతను నీతో ఏం చెప్పాడమ్మా?" ఆత్రుతగా అడిగింది.
స్వరూపకి తల్లి మనసులోని దిగులు అర్ధమయిపోయింది. ఆమెదగ్గరనిజాన్ని దాచి మరి కొంతకాలం బాధించడం అవివేకం అనిపించింది.
స్వరూప మౌనంగా ఉండటం చూచి మళ్ళీ అడిగిందామె "నిన్నెప్పుడు తీసుకెళతారో చెప్పారా?"
"నన్నింకెప్పుడూ తీసుకెళ్ళరమ్మా! నన్నొదిలేశారట..." తలొంచుకుని అంది స్వరూప.
ఆమె తల్లి ఉక్కిరిబిక్కిరయిపోయింది మొఖం పూర్తిగా పాలిపోయింది.
"వదిలేశారా?" తడబడుతూ అడిగింది.
"అవునమ్మా! నేనూ, ప్రసాద్ ప్రేమించుకున్న విషయం వాళ్ళకు తెలిసిపోయింది."
ఆమె తల్లి అక్కడే కుప్పలా కూలిపోయింది.
7
"మీ ఆవిడనెప్పుడు చూపిస్తావ్ మాకు?" ఆ రోజు ఆఫీస్ కొచ్చిన సురేంద్ర చుట్టూ మూగారు మిగతా స్టాఫ్!
"చూపిస్తాను! తొందరపడకండి!" నువ్వు తెచ్చుకుంటూ అన్నాడు సురేంద్ర.
"ఎప్పుడు?"
"కొద్దిరోజులుపోయాక..."
"అంటే పార్టీ ఇవ్వాల్సొస్తుందని అప్పటి వరకూ ఆపుతున్నావా?"
"నో...నో! అదికాదు!"
"కానప్పుడు రేపు సండే మమ్మల్నందరినీ మీ ఇంటికి పిలవొచ్చుగా!"
"టీపార్టీ వేస్ట్ కాదులే! మేమందరం ప్రెజెంటేషన్లు తీసుకొస్తాం!"
సురేంద్ర సందిగ్ధంలో పడిపోయాడు. ఏం చెప్పాలో తెలీటం లేదు.
"అది కాదు! మా మిసెస్ ని తీసుకురాలేదు!" అన్నాడు నెమ్మదిగా.
"తీసుకురాలేదా? అదేమిటి?"
"మా మామగారికి వంట్లో బావుండలేదు. అందుకని అక్కడే వదలివచ్చాను. ఆయనకీ వంట్లో స్వస్థత చేకూరగానే వస్తుంది. అప్పుడు తప్పకుండా పార్టీ ఎరేంజ్ చేస్తాను. లేదా-మీ ఆవిడని చూడకపోయినా ఫరవాలేదు అంటే రేపే ఆఫీస్ లో పార్టీ ఇచ్చేస్తాను."
"వద్దులే! మీ ఆవిడొచ్చాకే ఇద్దూగాని...."
"ఎన్ని రోజులవుతుందో ఏమో! అంతవరకూ మిమ్మల్ని వూరించడం ఎందుకు రేపే ఆఫీస్ లో ఎరేంజ్ చేస్తాను ఏమండీ రామారావ్ గారూ!"
తలొంచుకుని ఫైల్ చూస్తున్న హెడ్ క్లర్క్ రామా రావ్ నవ్వాడు.
"సరే అలాగే కానీ...."
అంతా ఎవరిసీట్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తేలిగ్గా గాలి పీల్చాడు సురేంద్ర.
సమయానికి ఏదో ఒక అబద్దం చెప్పి తప్పించుకున్నాడు రేపు స్వీటూ, హాటుతో ఒక పార్టీ ఇచ్చేస్తే-అంతే తరువాత ఎవ్వరూ తన భార్య గురించి మాట్లాడబోరు! ఆ చరిత్ర మాసిపోతుంది. తనగురించి పట్టించుకునేవారే ఉండరు.
మధ్యాహ్నం లంచ్ టైములో అందరితోపాటు కాంటీన్ కి వెళ్ళకుండా సీట్లోనే ఏదో పని చేసుకొంటున్నట్లు నటించాడతను. నలుగురిలోకెళ్తే తన పెళ్ళిగురించి ప్రస్తావనవస్తుందేమోనని భయంగా వుంది. అసలా విషయం మాట్లాడాలంటేనే ప్రాణంమీదికొస్తుంది తనకి.
"హల్లో..." మాధురి అతని టేబుల్ దగ్గరకొస్తూ పలుకరింపుగా అంది.
"హలో, మాధురిగారూ! బావున్నారా?"
"ఓ! పెళ్ళయింది కదాని ఆకలివేయడం లేదనుకుంటాను మీకు! లంచ్ కెళ్ళకుండా కూర్చున్నారు" నవ్వుతూ అందామె.
"ఊహుఁ! అదేం కాదులెండి! ఈ ఫైలుసంగతేదో తేల్చుకొనేవరకూ సీట్లోంచి లేవకూడదనుకున్నాను..."
"అయిపోయిందామరి?"
"ఇప్పుడే పూర్తయింది! మీరు కాంటీన్ కేనా?"
"అవును!"
"పదండి! నేనూ వస్తున్నాను..." తనూ లేస్తూ అన్నాడతను. ఇద్దరూ కాంటీన్ వేపు నడిచారు. మాధురి ముఫ్ఫై అయిదేళ్ళుంటాయ్! ఇంక అవివాహితగానే ఉంది కారణం ఆఫీసులో యెవరికీ తెలీదు. మగాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటుంది. కాని, అదే ఆఫీసులో మరో సెక్షన్ లో పనిచేసే ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడాలంటేనే చిరాకు.
కాఫీ తాగుతుండగా మాధురి అడిగింది "మీ శ్రీమతి ఏం చదువుకొన్నారు?" సురేంద్రకి మళ్ళీ విసుగు పుట్టుకొచ్చింది! కాని అదేమీ తెలీనీకుండా___
"బి...ఏ..." అన్నాడు క్లుప్తంగా.
మాధురి నవ్వింది.
నవ్వినప్పుడు ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆ సంగతి ఆమెకూ తెలుసు! అంచేత ఎప్పుడూ నవ్వులు చిందిస్తూనే ఉంటుంది.
"మరి హనీమూన్-గినీమూన్ ఏమీ లేదా?"
"అబ్బే! అలాంటిదేమీలేదు!"
"హౌ క్రూయెల్ యూఆర్! అదేగనక నేనే అయినట్లయితే యెట్లా తీసుకెళ్ళవో చూసేదాన్ని..."
సురేంద్ర నవ్వి వూరుకున్నాడు.
"మీ మిసెస్ ని తీసుకురాలేదటగా?"
"అవును-వాళ్ళ ఫాదర్ కి వంట్లో బావుండకపోతేనూ..."
"అయ్ సీ..."
ఇద్దరూ కాఫీలు తాగడం పూర్తయింది.
"మరి-మీ పెళ్ళి ఎప్పుడూ?" అని అడుగుదామనుకుని, బావుండదేమోనని వూరుకుండిపోయాడు సురేంద్ర.
"పదండి!" లేచి నుంచుంటూ అంది మాధురి.





