Home » yerramsetti sai » Nirbhay Nagar Colony
ఆ మాట వినడంతోనే ఆమె కెవ్వున కేకవేసి లేచి బెడ్ మీద నుంచి కిందకు దూకేసింది.
"బాబోయ్... ఇది గవర్నమెంట్ హాస్పిటలా? అమ్మో- నేనిక్కడుండను? పదండి వెళ్ళిపోదాం" అంది భయంతో వణికిపోతూ.
మేమంతా ఆమెను బలవంతంగా బెడ్ మీద కూర్చోబెట్టాం మళ్లీ.
"ఏం ఫర్లేదు చెల్లమ్మా! మేమంతా ఉన్నాం కదా! రెండురోజులు ఎలాగోలా కళ్ళు మూసుకుంటే చాలు. ఇంటికెళ్ళిపోవచ్చు" సర్ది చెప్పాడు రంగారెడ్డి.
ఆమె భోరున ఏడ్చేయటం ప్రారంభించింది.
"నేను మీకేం ద్రోహం చేశానని నన్నిలా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారండి... నేను కాపురానికొచ్చిన దగ్గర్నుంచీ నాకోసం ఒక్క చీరైనా కొనిపెట్టమని పేచీపెట్టలేదే! ఆ పాడు నవల అచ్చవాలంటే ఆ ఎడిటర్ కి మందు కొట్టించాలని డబ్బంతా నాశనం చేస్తున్నా పల్లెత్తుమాట అనలేదే? రచయితల కాన్ఫరెన్స్ లని బెంగుళూరు, వైజాగు వెళ్ళివస్తుంటే నేనూ వస్తానని నోరువిప్పి అడగలేదే. ఆ అడ్డమయిన రేషన్ షాపు క్యూల్లోనూ, కిర్సనాయిలు క్యూల్లోనూ, మంచినీళ్ళ క్యూల్లోనూ గంటల తరబడి నిలబడ్డానుగాని మీ గవర్నమెంట్ ని వొక్కసారయినా తిట్టలేదే! ఎందుకండీ! ఎందుకిలా అన్యాయం చేశారు నన్ను!"
ఆమె ఏడుపుకి ఇద్దరు నర్సులు, ఓ అరడజను మంది పేషెంట్లు వచ్చి మూగారు మా చుట్టూ.
"ఏమయింది? ఎడ్మిట్ అయి గంటేగా అయ్యింది! అప్పుడే చంపేశారా?" ఆశ్చర్యంగా అడిగిందో పేషెంట్.
ఆమె పక్కనున్న పేషెంట్ ఆమెను కసురుకున్నాడు.
"ఏమిటా తెలివితక్కువ వాగుడు? ఎడ్మిట్ అయిన గంటకే ఎలా చంపుతారు? డాక్టర్లు వచ్చి చూడ్డానికే వారం రోజులు పడుతుంది. ఆ తరువాత వారం రోజులుగ్గాని ట్రీట్ మెంట్ కోసం ఏర్పాట్లు ప్రారంభించరు. ట్రీట్ మెంట్ మొదలుపెట్టాక కదా ఆమె చనిపోయేది?"
ఆమె భయంగా తలూపింది.
"అందరూ తప్పుకోండి" బొంగురుగొంతు కేక వినపడి మేము ఉలిక్కిపడి పక్కకు జరిగాము.
ఓ లావుపాటి పోలీస్ కానిస్టేబుల్ మమ్మల్ని ఇంకొంచెం పక్కకు నెట్టి బెడ్ దగ్గరకొచ్చి చంద్రకాంత్ భార్య ఫైపు చూశాడు. వెంటనే ఓ పుస్తకం పెన్నూ తీసుకున్నాడు.
"నీ పేరేంది" అడిగాడామెని.
"శశిరేఖ!"
"నీ భర్త పేరేంటి?"
"చంద్రకాంత్"
"ఏడుంటారు మీరు?"
"నిర్భయ్ నగర్ కాలనీ!"
అతను ఓ క్షణం ఆలోచించాడు.
"నిర్భయ్ నగర్ కాలనీయా? గంటే మీ కాలనీకి పోలీస్ స్టేషన్ కావాలని అర్జీలు పెట్టి తీరా పెట్టినంక పోలీస్ స్టేషన్ తీసేయాల్నని కిరికిరి చేసింది మీ కాలనీవోళ్ళేకదూ?"
"అవును"
అతను మళ్ళీ రాసుకోబోయి ఆమె వైపు చూశాడు.
"నీకు సదవను రాయను వచ్చా!"
"వచ్చు"
"అయితే నువ్వే రాసివ్వు?" అంటూ ఆ పుస్తకంలో కాగితం ఆమెకి ఇచ్చాడతను. శశిరేఖతో పాటు, మేమందరం కూడా ఆశ్చర్యపోయాం.
"ఏం రాసివ్వాలి?" అడిగాడు చంద్రకాంత్ అతనిని.
అతను చంద్రకాంత్ వేపు చిరాకుగా చూశాడు.
"నువ్వెవళు?"
"నా పేరు చంద్రకాంత్!"
"నేను పేషెంట్ తోటి మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావ్?"
"ఆమె నాభార్య"
హఠాత్తుగా కానిస్టేబుల్ మొఖంలోకి కళ వచ్చేసింది.
"గట్లనా? నువ్వేనా ఈమెను స్కూటర్ మీదకెళ్ళి కిందకు దూకింది?"
చంద్రకాంత్ గాబరాపడ్డాడు ఆ ప్రశ్నకు.
"స్కూటర్ మీద నుంచి స్లిప్ అయి పడిపోయింది"
"గప్పుడు స్కూటర్ ఎవరు డ్రైవ్ చేస్తుండె?"
"నేనే"
"నీకు లైసెన్స్ గిట్టా వుందా?"
"వుంది!"
"ఉన్నదా అంటే ఉంది అని సమాధానం ఇయ్యకు- తీసి చూపించాలె!"
చంద్రకాంత్ తన పర్స్ లో నుంచి డ్రయివింగ్ లైసెన్స్ తీసి అతని కిచ్చాడు.
అంతా ఓసారి చెక్ చేసి అది తిరిగి ఇచ్చేశాడతను.
"నీలాంటోళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ గిట్ట ఇచ్చినందుకు ఆర్డీవోని లోపట జేయాలి!" అంటూ శశిరేఖ వేపు చూశారు మళ్ళీ.
"అగో-గట్ల కూసున్నావు? రాయమని జెప్పలే?"
"ఏమి రాయాలి?" అడిగిందామె.
"గవర్నమెంట్ దవాఖానా కొచ్చినోండ్లు ఇంకేం రాస్తరమ్మా! ఇంత కూడా ఎరుకలేదా? డయ్యింగ్ డిక్లరేషన్ రాయలె! సమాజైనాది?"
"ఏమిటి? డయ్యింగ్ డిక్లరేషనా?" ఆశ్చర్యంగా అడిగాడు రంగారెడ్డి.
కానిస్టేబుల్ కి ఒళ్ళు మండిపోయింది. రంగారెడ్డి వేపు కోపంగా తిరిగాడు.
"నువ్వెవళ్ళు?"
"రంగారెడ్డి!"
"రంగారెడ్డంటే ఎవళ్ళు? హజార్ రంగారెడ్లున్నారు శహర్ ల!"
"ఈయన మా కాలనీ కమిటీ సెక్రట్రీవయా! జర మంచిగ మాట్లాడు" ఎదురుతిరిగాడు యాదగిరి.
"ఏయ్? నువ్వెవళ్ళు?" కాగితం తీసి రాసుకోడానికి సిద్ధపడ్డాడు కానిస్టేబుల్.
"నా పేరు యాదగిరి"
"నీయబ్బ పేర్జెప్పు!"
"ఎందుకు జెప్పాలె? నేనేం దొంగతనం జేసినానా, మర్డర్లు జేసినానా-"
"గట్లనా? గిప్పుడే ఎరుకవుతాది బిడ్డా! గిప్పుడే ఎరుకవుతాది" అంటూ మళ్ళీ శశిరేఖ వేపు తిరిగాడు.
"ఏమాయెనమ్మ! రాసినావా? డైయింగ్ డిక్లరేషన్ అంటే తెలీదా? సచ్చేముందు సావు ఎట్ల మీదికొచ్చిందో రాసెడిదన్నమాట"
"అంటే నేను చచ్చిపోతానా? గాబరాగా అడిగిందామె.
"పాగల్ మనిషిలాగున్నావేమమ్మా! సర్కార్ దవాఖానా కొచ్చినోండ్లు తిరిగ ఇండ్లకు బోతారు?"
"ఇదిగో కానిస్టేబుల్ గారూ! కొంచెం మర్యాదగా మాట్లాడండి! ఆమెకు ఏం పెద్ద దెబ్బ తగిలిందని - డైయింగ్ డిక్లరేషన్ ఇమ్మంటున్నారు? ఇంకోసారలా అడిగారంటే నేనూరుకోను- ఆ?" కోపంగా అన్నాడు చంద్రకాంత్.
కానిస్టేబుల్ మా అందరివేపూ మండిపడుతూ చూశాడు.
"ఇగో- ఈ ఫాల్తూ కిరికిరంతా నాకెందుగ్గాని- నువ్వెట్ట పడినావో, ఎవళ్ళు పడేసిన్రో కాయితం మీద రాసివ్వు! తర్వాత నువ్వు సచ్చినా బతికినా గాని మాక్కిరిక్కిరుండది!"
ఆమె నాలుగులైన్లు రాసి సంతకం చేసి ఇచ్చింది.
వేరే ఇంకో కాగితం మీద కూడా ఆమె సంతకం తీసుకుని వెళ్ళిపోయాడతను.





